ఉన్న రంగే బంగారం | special story to face creerm | Sakshi
Sakshi News home page

ఉన్న రంగే బంగారం

Published Fri, Apr 20 2018 12:38 AM | Last Updated on Fri, May 25 2018 2:29 PM

special story to face creerm - Sakshi

మార్కెటింగ్‌ స్కిల్స్‌ మనిషి మైండ్‌సెట్‌ని సమూలంగా మార్చేస్తాయి. ఉప్పు పండించే రైతు తన గోనెసంచిలోని ఉప్పు పారబోసి జలజలరాలే ప్యాకెట్‌ ఉప్పు కొనేటట్లు చేస్తాయి. మామిడి రైతు తన తోటలోని పండ్లను పక్కకు తోసేసి బాటిల్‌లో నిల్వ చేసిన జ్యూస్‌ తాగి ‘తాజా’ మామిడి రుచి అని లొట్టలేసేటట్లు చేస్తాయి. ఇక ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌లైతే మనిషిలో స్వతహాగా, సహజంగా ఉన్న ఆత్మవిశ్వాసాన్ని సమూలంగా పెకలించి పారేస్తాయి. వాటిని రాసుకుని అద్దంలో చూసుకుంటూ ‘ఆ క్రీమ్‌లే ఇంటర్వ్యూలో సెలెక్ట్‌ చేస్తాయన్నంతగా, ఉద్యోగం తెచ్చి పెడతాయన్నంతగా’ సూడో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునేలాగానూ చేస్తాయి. వాటిని రాసుకుంటే స్పోర్ట్స్‌లో చాంపియన్‌ అయిపోవచ్చన్నంతగా భ్రమింపచేస్తాయి. నిజానికి స్పోర్ట్స్‌ పర్సన్‌ ఎవరూ ఈ భ్రమకు లోనుకారు కానీ యాడ్‌ చూసి సాధారణ అమ్మాయిలు మనసు పారేసుకుంటున్నారు.

చాప కింద నీరులా  
సమాజం మీద ఫెయిర్‌నెస్‌ క్రీములు చేస్తున్న దాడి అంతా ఇంతా కాదు. రౌడీమూకల నుంచి వెయ్యికళ్లతో కాపు కాచి ఆడపిల్లల్ని కాపాడుకోవచ్చేమో కానీ, ఫెయిర్‌నెస్‌ క్రీముల నుంచి కాపాడుకోవడం తల్లిదండ్రుల వల్ల కావడం లేదు. అందుకే మహారాష్ట్రలో ప్రభుత్వమే రంగంలోకి దిగింది. ఈ క్రీమ్‌ల తయారీ మీద ప్రత్యేక నిఘా పెట్టాలని మహారాష్ట్ర ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌ కేంద్రానికి తెలియచేసింది. నగరాలు, పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా అన్ని చోట్లా అవసరానికి మించినన్ని క్రీమ్‌లు దొరుకుతున్నాయిప్పుడు. దుకాణాలకెళ్లి పది రూపాయలు పెట్టి ఒక ట్యూబ్‌ కొనేస్తున్నారు అమ్మాయిలు. వాటిని వాడటం వల్ల ఎదురయ్యే సమస్యల గురించి వాళ్లకు తెలియదు, చెప్పేవాళ్లు ఉండరు. 

కొనరాదే తల్లీ!
డ్రగ్‌ అండ్‌ కాస్మటిక్‌ రూల్స్, 1945 ప్రకారం కేంద్రప్రభుత్వం షెడ్యూల్‌ హెచ్‌ కేటగిరీ ప్రకారం ఫెయిర్‌నెస్‌ క్రీముల్లో 14 రకాల స్టెరాయిడ్స్‌కు అనుమతిచ్చింది. ఆ తర్వాత కాలక్రమేణా మరికొన్ని రకాలకు అనుమతిస్తూ వచ్చింది. డ్రగ్‌ అడ్వైజరీ బోర్డు సూచనల మేరకే ఈ నిర్ణయం జరిగింది. అలాగే షెడ్యూల్‌ హెచ్‌... ఈ క్రీములను డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌ లేకుండా అమ్మరాదనే నిబంధన కూడా పెట్టింది. ఇప్పుడు అనుమతి ఉన్నవి లేనివీ తేడా తెలుసుకోలేనంతగా కలగాపులగమైపోయాయి క్రీములు. పైగా అవి మార్కెట్‌లో ‘అమ్మేది మేము కొనేది మీరు. మధ్యలో డాక్టర్‌ చెప్పేదేముంది?’ అన్నంతగా రాజ్యమేలుతున్నాయి. క్రీమ్‌ పేరులో స్పెల్లింగ్‌ తెలియని పిల్లలు కూడా ఆ క్రీమ్‌లను వాడేస్తున్నారు. చాలాచోట్ల ప్రజాదరణ పొందిన క్రీమ్‌ పేరును కొద్దిగా మార్చి అదే ఉచ్ఛారణనిచ్చే నకిలీలు ఉంటున్నాయి. ఇంగ్లిష్‌ బాగా తెలియకపోతే వాటిని గుర్తించడమూ కష్టమే. అలాంటి వాళ్లకు ఆ క్రీముల తయారీలో ఏమేం వాడారో తెలుసుకోవడం సాధ్యమయ్యే పని ఏ మాత్రం కాదు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మహారాష్ట్ర వేసిన ముందడుగు ఇది. ప్రభుత్వాలు ఎన్ని అడుగులు వేసినా సరే, వాటిని అమ్మరాదని వ్యాపారుల్లో, కొనరాదని ఆడపిల్లల్లో చైతన్యం వచ్చినప్పుడే నష్టనివారణ జరుగుతుంది. ఆ చైతన్యం వచ్చినప్పుడే అమ్మాయిల మీద క్రీముల హానికారక దాడికి కళ్లెం పడినట్లు. అయినా అందానికి నిర్వచనం ఏమిటి? తెల్లదనంలోనే అందం ఉందనేటట్లు సమాజాన్ని ట్యూన్‌ చేసిందెవరు? ‘అసలైన అందం మెండైన ఆత్మవిశ్వాసంలోనే ఉంటుంది, మేనిరంగులో కాదు’ అని కొత్తగా ట్యూన్‌ చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ల మీదనే ఉంటుంది.

సైడ్‌ ఎఫెక్ట్స్‌
ఫెయిర్‌నెస్‌ క్రీములను చర్మాన్ని తెల్లబరుస్తాయనే నమ్మకంతో వాడుతుంటారు. నిజానికి ఈ క్రీమ్‌లు ఏం చేస్తున్నాయంటే... అనేక చర్మ సమస్యలకు కారణమవుతున్నాయి. హార్మోన్‌ సమస్యలకూ కారణమవుతుంటాయి. క్రీముల్లో ఉండే బెక్లామెథాసోన్, బీటామెథాసోన్, డిసోనైడ్‌ వంటి స్టెరాయిడ్స్‌ చర్మం ద్వారా దేహంలోకి ఇంకుతాయి. వీటి కారణంగా చర్మం పిగ్మెంటేషన్‌ (మంగు)కు గురవుతుంది. వీటి వాడకం ఎక్కువయ్యే కొద్దీ... చర్మం పలుచబారడం, మంటగా అనిపించడం, మొటిమలు, కొద్దిపాటి ఎండలోకి వెళ్లినా భరించలేకపోవడం వంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తాయని డాక్టర్‌ కిరణ్‌ నబర్‌ చెప్తున్నారు. 
– మంజీర

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement