face creem
-
రూ.50 వేలు పెట్టి ఆ క్రీమ్ కొన్నాను.. సీక్రెట్ రివీల్ చేసిన టబు
సాధారణంగా హీరో హీరోయిన్లు తన గ్లామర్ రహస్యాన్ని బయటపెట్టరు. అందంగా ఉండేందుకు రకరకలా ఫేస్ క్రీములను వాడుతుంటారు. కానీ వాటిని గోప్యంగా ఉంచుతారు. అయితే సీనియర్ హీరోయిన్ టబు మాత్రం తన అందానికి సంబంధించిన ఓ సీక్రెట్‌ని అభిమానులతో పంచుకుంది. అందంగా ఉండేందుకు తాను ఒక్కసారి రూ.50 వేలు పెట్టి ఫేస్ క్రీమ్ కొన్నానని, ఆ తర్వాత ఇంకెప్పుడు ఫేస్ క్రీమ్ వాడలేదని చెప్పుకొచ్చింది. ఇటీవల ఆమె ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా మీ అందం వెనుక ఉన్న రహస్యం ఏంటని ప్రశ్నించిన యాంకర్‌కు పైవిధంగా సమాధానం చెప్పింది. ‘ఓసారి నా మెకప్ ఆర్టిస్ట్ ‘మీ అందానికి రహస్యం ఏంటి?’అని నన్ను ప్రశ్నించింది. అప్పుడు నేను ఏ సీక్రెట్ లేదని చెప్పాను. అయితే కొన్నాళ్ల తర్వాత నాకు ఓ ఫేస్‌క్రీమ్ కొనమని సలహా ఇచ్చింది. దాని ఖరీదు రూ.50 వేలు. ఒక్కసారి మాత్రమే దానిని కొనుగోలు చేశా. ఆ తర్వాత ఎప్పుడూ ఆ క్రీమ్‌ని వాడలేదు. అందంగా ఉండేందుకు నేను ప్రత్యేకంగా ఎలాంటి క్రీములు గానీ, ఫేస్ వాష్‌లు గానీ చేయించను’అని టబు చెప్పుకొచ్చింది. కాగా,ఇటీవల బాలీవుడ్ మూవీ భూల్ భులయ్య-2తో మంచి హిట్‌ని తన ఖాతాలో వేసుకున్న టబు.. ప్రస్తుతం అజయ్ దేవ్‌గణ్‌తో కలిసి ‘దృశ్యం-2’లో నటిస్తోంది. -
చక్కటి చుక్కలా
ముఖ సౌందర్యానికి ఫేస్ క్రీమ్స్, లోషన్స్.. ఇలా చాలానే కొంటుంటారు మగువలు. కానీ మృదువైన మోము కోసం వాటికంటే ముఖ్యంగా.. సహజసిద్ధమైన చిట్కాలను పాటించడమే మంచిదంటున్నారు నిపుణులు. మచ్చలు, మొటిమలు శాశ్వతంగా తొలగిపోవాలంటే ఇంటిపట్టున సిద్ధం చేసుకున్న సౌందర్యలేపనాలను వాడాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం? ఇలా ప్రయత్నించండి. కావల్సినవి: క్లీనప్ : బాదం పాలు – 1 టీ స్పూన్, తేనె – అర టీ స్పూన్ స్క్రబ్ : బియ్యప్పిండి – 2 టీ స్పూన్లు, టమాటా గుజ్జు – 2 టీ స్పూన్లు మాస్క్: తులసి గుజ్జు – 2 టీ స్పూన్లు, చిక్కటి పాలు – 1 టీ స్పూన్, గంధం – 1 టీ స్పూన్ తయారీ: ముందుగా బాదం పాలు, తేనె ఒక చిన్న బౌల్లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు బియ్యప్పిండి, టమాటా గుజ్జు ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని ఇంచుమించు ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు తులసి ఆకుల గుజ్జు, చిక్కటి పాలు, గంధం బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. -
ఆకర్షణీయమైన అందం
సహజసిద్ధమైన చిట్కాలను ఫాలో అయితే.. ఫేస్ క్రీమ్స్, లోషన్స్‌తో పనిలేదంటున్నారు నిపుణులు. ముఖంపైన మచ్చలు, మొటిమలు కనిపించకుండా ఉండేందుకు కెమికల్స్‌తో తయారుచేసిన మార్కెట్ ప్రొడక్ట్స్‌తో పనిలేదంటున్నారు. మరైతే సహజసిద్ధమైన చిట్కాలతో వచ్చే ఫలితాలను మీరూ ప్రయత్నించండి. కావాల్సినవి : క్లీనప్ : టమాటా గుజ్జు – 1 టేబుల్ స్పూన్, గడ్డపెరుగు – అర టీ స్పూన్ స్క్రబ్ : ఓట్స్ – 1 టీ స్పూన్, కీరదోస గుజ్జు – 2 టీ స్పూన్లు మాస్క్: యాపిల్ గుజ్జు – 3 టీ స్పూన్లు, చిక్కటి పాలు – అర టీ స్పూన్, తేనె – అర టీ స్పూన్, పసుపు – చిటికెడు తయారీ : ముందుగా టమాటా గుజ్జు, గడ్డపెరుగు ఒక చిన్న బౌల్లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఓట్స్, కీరదోస గుజ్జు ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని ఇంచుమించు ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు యాపిల్ గుజ్జు, చిక్కటి పాలు, పసుపు, తేనె కలిపి గుజ్జులా చేసుకుని ముఖానికి అప్లై చేసుకోవాలి. తర్వాత ఇరవై నిమిషాల పాటు ఆరనిచ్చి.. గోరువెచ్చని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. -
మచ్చలేని అందం!
మార్కెట్లో దొరికే ఫేస్ క్రీమ్స్ కేవలం ఆయా సమయాల్లో మాత్రమే మెరుపునిస్తాయి. ముఖాన్ని అందహీనంగా మార్చే.. మచ్చలు, మొటిమలు శాశ్వతంగా తొలగిపోవాలంటే సహజసిద్ధమైన సౌందర్యలేపనాలను వాడాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం? ఇలా ప్రయత్నించండి. కావల్సినవి : క్లీనప్ : కొబ్బరి పాలు – ఒకటిన్నర టీ స్పూన్, కీరదోస జ్యూస్ – ఒకటిన్నర టీ స్పూన్, తేనె – అర టీ స్పూన్ స్క్రబ్ : పెసరపిండి – 2 టీ స్పూన్లు, గడ్డ పెరుగు – ఒకటిన్నర టీ స్పూన్లు మాస్క్: క్యారెట్ గుజ్జు – 3 టీ స్పూన్లు, కిస్మిస్ గుజ్జు – 1 టీ స్పూన్, చిక్కటి పాలు – ఒకటిన్నర టీ స్పూన్ తయారీ : ముందుగా కొబ్బరి పాలు, కీరదోస జ్యూస్, తేనె ఒక చిన్న బౌల్లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు పెసరపిండి, గడ్డ పెరుగు ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని ఇంచుమించు ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు క్యారెట్ గుజ్జు, కిస్మిస్ గుజ్జు, చిక్కటి పాలు బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. -
ఎవర్గ్రీన్ చిట్కాలు
మచ్చలు, మొటిమలు లేని మోముకోసం చాలా ప్రయత్నిస్తుంటారు మగువలు. రకరకాల ఫేస్ క్రీమ్స్, లోషన్స్ వాడేందుకు సిద్ధమవుతుంటారు. అయితే వాటి వల్ల శాశ్వత పరిష్కారం లభించడం కష్టమే. అలాంటి వారి కోసమే ఈ సహజసిద్ధమైన చిట్కాలు. అయితే ఫేస్‌ప్యాక్ వేసుకునే ముందు క్లీనప్ చేసుకుని, స్క్రబ్ చేసుకుని, ఆవిరి పట్టించుకోవడం తప్పనిసరి. కాస్త సమయం పట్టినా ఇవన్నీ చేస్తేనే ఈ కాలుష్యబారినపడిన మీ చర్మం తిరిగి కాంతివంతంగా మెరుస్తుంది. మరింకెందుకు ఆలస్యం ఇలా ప్రయత్నించండి. కావల్సినవి : క్లీనప్ : పెరుగు మీగడ – పావు టీ స్పూన్, నిమ్మరసం – పావు టీ స్పూన్, యాపిల్ జ్యూస్ – 1 టీ స్పూన్ స్క్రబ్ : చిక్కటిపాలు – 2 టీ స్పూన్లు, క్యారెట్ గుజ్జు – 2 టీ స్పూన్లు, ఓట్స్ – 2 టీ స్పూన్లు మాస్క్ : కలబంద గుజ్జు –అర టీ స్పూన్, యాపిల్ గుజ్జు – 2 టీ స్పూన్లు, కొబ్బరి పాలు– అర టీ స్పూన్ తయారీ : ముందుగా పెరుగు మీగడ, నిమ్మరసం, యాపిల్ జ్యూస్ ఒక బౌల్లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు లేదా మూడు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు చిక్కటిపాలు, క్యారెట్ గుజు ్జ, ఓట్స్ ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని మూడు లేదా ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పాలు, కలబంద గుజ్జు, యాపిల్ గుజ్జు ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, పదిహేను నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. -
ఉన్న రంగే బంగారం
మార్కెటింగ్ స్కిల్స్ మనిషి మైండ్‌సెట్‌ని సమూలంగా మార్చేస్తాయి. ఉప్పు పండించే రైతు తన గోనెసంచిలోని ఉప్పు పారబోసి జలజలరాలే ప్యాకెట్ ఉప్పు కొనేటట్లు చేస్తాయి. మామిడి రైతు తన తోటలోని పండ్లను పక్కకు తోసేసి బాటిల్లో నిల్వ చేసిన జ్యూస్ తాగి ‘తాజా’ మామిడి రుచి అని లొట్టలేసేటట్లు చేస్తాయి. ఇక ఫెయిర్‌నెస్ క్రీమ్లైతే మనిషిలో స్వతహాగా, సహజంగా ఉన్న ఆత్మవిశ్వాసాన్ని సమూలంగా పెకలించి పారేస్తాయి. వాటిని రాసుకుని అద్దంలో చూసుకుంటూ ‘ఆ క్రీమ్లే ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేస్తాయన్నంతగా, ఉద్యోగం తెచ్చి పెడతాయన్నంతగా’ సూడో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునేలాగానూ చేస్తాయి. వాటిని రాసుకుంటే స్పోర్ట్స్‌లో చాంపియన్ అయిపోవచ్చన్నంతగా భ్రమింపచేస్తాయి. నిజానికి స్పోర్ట్స్ పర్సన్ ఎవరూ ఈ భ్రమకు లోనుకారు కానీ యాడ్ చూసి సాధారణ అమ్మాయిలు మనసు పారేసుకుంటున్నారు. చాప కింద నీరులా సమాజం మీద ఫెయిర్‌నెస్ క్రీములు చేస్తున్న దాడి అంతా ఇంతా కాదు. రౌడీమూకల నుంచి వెయ్యికళ్లతో కాపు కాచి ఆడపిల్లల్ని కాపాడుకోవచ్చేమో కానీ, ఫెయిర్‌నెస్ క్రీముల నుంచి కాపాడుకోవడం తల్లిదండ్రుల వల్ల కావడం లేదు. అందుకే మహారాష్ట్రలో ప్రభుత్వమే రంగంలోకి దిగింది. ఈ క్రీమ్‌ల తయారీ మీద ప్రత్యేక నిఘా పెట్టాలని మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కేంద్రానికి తెలియచేసింది. నగరాలు, పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా అన్ని చోట్లా అవసరానికి మించినన్ని క్రీమ్‌లు దొరుకుతున్నాయిప్పుడు. దుకాణాలకెళ్లి పది రూపాయలు పెట్టి ఒక ట్యూబ్ కొనేస్తున్నారు అమ్మాయిలు. వాటిని వాడటం వల్ల ఎదురయ్యే సమస్యల గురించి వాళ్లకు తెలియదు, చెప్పేవాళ్లు ఉండరు. కొనరాదే తల్లీ! డ్రగ్ అండ్ కాస్మటిక్ రూల్స్, 1945 ప్రకారం కేంద్రప్రభుత్వం షెడ్యూల్ హెచ్ కేటగిరీ ప్రకారం ఫెయిర్‌నెస్ క్రీముల్లో 14 రకాల స్టెరాయిడ్స్‌కు అనుమతిచ్చింది. ఆ తర్వాత కాలక్రమేణా మరికొన్ని రకాలకు అనుమతిస్తూ వచ్చింది. డ్రగ్ అడ్వైజరీ బోర్డు సూచనల మేరకే ఈ నిర్ణయం జరిగింది. అలాగే షెడ్యూల్ హెచ్... ఈ క్రీములను డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మరాదనే నిబంధన కూడా పెట్టింది. ఇప్పుడు అనుమతి ఉన్నవి లేనివీ తేడా తెలుసుకోలేనంతగా కలగాపులగమైపోయాయి క్రీములు. పైగా అవి మార్కెట్లో ‘అమ్మేది మేము కొనేది మీరు. మధ్యలో డాక్టర్ చెప్పేదేముంది?’ అన్నంతగా రాజ్యమేలుతున్నాయి. క్రీమ్ పేరులో స్పెల్లింగ్ తెలియని పిల్లలు కూడా ఆ క్రీమ్‌లను వాడేస్తున్నారు. చాలాచోట్ల ప్రజాదరణ పొందిన క్రీమ్ పేరును కొద్దిగా మార్చి అదే ఉచ్ఛారణనిచ్చే నకిలీలు ఉంటున్నాయి. ఇంగ్లిష్ బాగా తెలియకపోతే వాటిని గుర్తించడమూ కష్టమే. అలాంటి వాళ్లకు ఆ క్రీముల తయారీలో ఏమేం వాడారో తెలుసుకోవడం సాధ్యమయ్యే పని ఏ మాత్రం కాదు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మహారాష్ట్ర వేసిన ముందడుగు ఇది. ప్రభుత్వాలు ఎన్ని అడుగులు వేసినా సరే, వాటిని అమ్మరాదని వ్యాపారుల్లో, కొనరాదని ఆడపిల్లల్లో చైతన్యం వచ్చినప్పుడే నష్టనివారణ జరుగుతుంది. ఆ చైతన్యం వచ్చినప్పుడే అమ్మాయిల మీద క్రీముల హానికారక దాడికి కళ్లెం పడినట్లు. అయినా అందానికి నిర్వచనం ఏమిటి? తెల్లదనంలోనే అందం ఉందనేటట్లు సమాజాన్ని ట్యూన్ చేసిందెవరు? ‘అసలైన అందం మెండైన ఆత్మవిశ్వాసంలోనే ఉంటుంది, మేనిరంగులో కాదు’ అని కొత్తగా ట్యూన్ చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ల మీదనే ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఫెయిర్‌నెస్ క్రీములను చర్మాన్ని తెల్లబరుస్తాయనే నమ్మకంతో వాడుతుంటారు. నిజానికి ఈ క్రీమ్‌లు ఏం చేస్తున్నాయంటే... అనేక చర్మ సమస్యలకు కారణమవుతున్నాయి. హార్మోన్ సమస్యలకూ కారణమవుతుంటాయి. క్రీముల్లో ఉండే బెక్లామెథాసోన్, బీటామెథాసోన్, డిసోనైడ్ వంటి స్టెరాయిడ్స్ చర్మం ద్వారా దేహంలోకి ఇంకుతాయి. వీటి కారణంగా చర్మం పిగ్మెంటేషన్ (మంగు)కు గురవుతుంది. వీటి వాడకం ఎక్కువయ్యే కొద్దీ... చర్మం పలుచబారడం, మంటగా అనిపించడం, మొటిమలు, కొద్దిపాటి ఎండలోకి వెళ్లినా భరించలేకపోవడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని డాక్టర్ కిరణ్ నబర్ చెప్తున్నారు. – మంజీర -
బ్యూటీ క్రీమ్
గులాబీలు పన్నీటి రూపంలోనే కాదు క్రీమ్గానూ సౌందర్యాన్ని ఇనుమడింపచేస్తాయి. ఈ క్రీమ్‌ను ఇంట్లోనే చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం!నాలుగు టేబుల్స్పూన్ల ఆలివ్ ఆయిల్, బాగా వాసన ఉన్న గులాబీ రెక్కలు రెండు గుప్పెళ్లు, శుభ్రపరిచిన తేనెమైనం ఒక టేబుల్‌స్పూన్, వర్షం నీరు కాని శుభ్రమైన నీరు కానితీసుకోవాలి.ఆలివ్ ఆయిల్‌ను మరిగే స్థాయి వరకు వేడి చేసి అందులో గులాబీ రెక్కలను వేయాలి. దీనిని గాలి దూరని సీసాలో భద్రపరిచి సుమారు వారం రోజులు ఉంచాలి. అప్పటికి గులాబీలసుగంధం నూనెలో కలుస్తుంది. వడపోసి రెక్కలను వేరు చేయాలి. తేనె మైనాన్ని(హనీ వ్యాక్స్) ఒక పాత్రలోకి తీసుకుని కరిగే వరకు వేడి చేసి ఈ నూనెలో కలిపి చల్లారనివ్వాలి. చివరగాఅవసరాన్ని బట్టి ఒకటి – రెండు టీ స్పూన్ల నీటిని కలిపి భద్రపరుచుకోవాలి. ఆలివ్ ఆయిల్‌కు బదులుగా స్వచ్ఛమైన కొబ్బరి నూనె లేదా మరేదైనా నూనెను కూడా వాడుకోవచ్చు. దీనిని ఒకసారి తయారు చేసుకుని నాలుగు నెలలపాటు వాడుకోవచ్చు. -
ఫేషియల్ క్రీమ్స్‌పై దిమ్మతిరిగే షాకింగ్ న్యూస్!
సాక్షి, ముంబై: ప్రముఖ బ్రాండ్స్‌కు సంబంధించిన ఫేషియల్ క్రీమ్స్‌పై షాకింగ్ స్టడీ ఒకటి వెలుగులోకి వచ్చింది. పాపులర్ బ్రాండ్ ఫేషియల్ క్రీమ్స్ వల్ల క్యాన్సర్ వ్యాధికి గురికావడంతోపాటు ఒక్కోసారి ప్రాణాపాయం కూడా ఉంటుందని తాజా అధ్యయనం తేల్చింది. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (IIEST) పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశాలు తేలాయి. ఇలాంటి ఫేషియల్ క్రీముల వల్ల త్వరిత ఫలితాలు వచ్చినప్పటికీ, దీర్ఘకాలికంగా ప్రమాదకరమైనవని ఈ స్టడీ హెచ్చరించింది. ఈ క్రీమ్స్‌లో నానోసిస్డ్ కణాలతో చురుకైన సూక్ష్మ కార్బన్‌ను కనుగొన్నామని అధ్యయనం తెలిపింది. ముఖ్యంగా ప్రముఖ బ్రాండ్ల యాడ్స్ లో చెప్పినట్టుగా యాక్టివేటెడ్ కార్బన్ చర్మానికి తీవ్రమైన హాని కలిగింస్తుందనీ, మరణం కూడా సంభవించవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. చాలా ఫేస్ క్రీముల్లో క్యాన్సర్ కారక అంశాలు ఉన్నాయని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన కెమిస్ట్రీ ప్రొఫసర్ సవ్యసాచి సర్కార్ తెలిపారు. చర్మానికి హాని కలిగించే రియాక్టివ్ ఆక్సిజన్ జాతులు (ROS) ఉత్పత్తి చేసేందుకు గాలిలో ఆక్సిజన్ ద్వారా ఆర్జీవో లు యాక్టివేట్ అవుతాయి. దీనివల్ల సాధారణంగా వచ్చే దురద, ఎలర్జీ, డ్రై స్కిన్, పింపుల్స్, ఫోటో సెన్సిటివిటీ లాంటి సైడ్ఎఫెక్ట్స్ తోపాటు ఆర్జీవో తగినంత పరిమాణంలో ఉంటే మరింత ప్రమాదమని తెలిపింది. ఆర్జీవో విషపూరిత ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు, శాస్త్రవేత్తలు మానవ చర్మపు కణాలను 200-వాట్ల వెలుతురులో 12 గంటలపాటు పరిశోధించారు. ఈ ఫేస్ క్రీములలో క్రియాశీల సూక్ష్మ కార్బన్, హై సైటోటాక్సిక్ ప్రభావాన్ని కలిగి ఉన్న ఆర్జీవో గ్రాఫేన్ పదార్థాలను ఉంటాయని, ఆర్జీవో ప్రత్యేక కణాలపై "సైటోటాక్సిక్" ప్రభావాన్ని కలిగి ఉంటుందని పరిశోధకులు కనుగొన్నారు. సూక్ష్మ కార్బన్లో ఉండే ఆర్జీవో నిద్రాణంగా ఉంటుంది, కానీ సాధారణ కాంతిలో, గాలిలో ఆక్సిజెన్ ద్వారా విషపూరితమైన సూపర్ ఆక్సైడ్ ఆనియన్గా మారుతుంది. ఇది కాన్సర్ కారకమని, జీవ కణాలు, సాధారణ ముఖ కణాలను తక్షణమే మార్పు చేసినా దీర్ఘకాంలలో వాటిని తీవ్రంగా నష్టపరిచే ప్రభావాన్ని కలిగి ఉంటుందని పరిశోధకులు తేల్చారు. ఆర్జీవో లాంటి నాన్కార్బన్ ను వాడొద్దని ఫేస్ క్రీమ్ తయారీదారులకు సూచించారు. "అప్లైడ్ నానోసైన్స్" జర్నల్ లో ఈ అధ్యయనం ప్రచురితమైంది. ఈ అధ్యయనం కోసం కేంద్ర ప్రభుత్వ విభాగం సైన్స్ అండ్ టెక్నాలజీకి నిధులు సమకూర్చింది. -
రామ్‌దేవ్ అంటే జనానికి కుళ్లు
న్యూఢిల్లీ: 'బొక్కల పొడి తింటే మనిషి బలంగా తయారవుతాడనుకుంటే దాన్ని తినడంలో తప్పేముంది? దేశానికి మేలు చేసే అలాంటి ఉత్పత్తులు తయారుచేస్తోన్న రామ్ దేవ్ గొప్పవాడు అనడంలో తప్పేముంది? అయినా జనం రామ్ దేవ్ పేరు చెబితే కుళ్లుకుంటారు. ఎందుకంటే ఆయన అత్యున్నత విజయాలు సాధించిన వ్యక్తి గనుక' ఈ మాటలు ఏ బీజేపీ నేతలో, ఆర్ఎస్ఎస్ వాదులో అనేదుంటే అసలిది వార్తకానేకాకపోయేది. అవును. ఒకప్పుడు రామ్ దేవ్ పేరు చెబితే అంతెత్తు ఎగిరపడ్డ బిహారీ నేత, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్.. యోగా గురు విషయంలో ఇప్పుడు పూర్తిగా మారుమనసు పొందారు. ప్రతిఫలంగా రామ్ దేవ్ లాలూ ముఖానికి క్రీమ్ రాశారు. బుధవారం ఉదయం ఢిల్లీలోని రామ్ దేవ్ నివాసంలో ఈ దృశ్యాలు కనిపించాయి. ఏం పనిమీద వచ్చారో తెలియదుకాదీ, ఆర్జేడీ చీఫ్ లాలూ యాదవ్ ఈ రోజు ఉదయాన్నే యోగా గురు రామ్ దేవ్ ఇంటికి వచ్చారు. సహజంగానే లాలూ చుట్టూ తచ్చాడే మీడియా మైకులతో సహా ఇద్దరినీ పలకరించింది. రామ్‌దేవ్ సైలెంట్ గానే ఉన్నారు. లాలూ మాత్రం తనదైన శైలిలో .. 'ఆయన (రామ్ దేవ్) ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది. పతంజలి ప్రాడక్ట్స్ మీద ఎవరెవరో ఏదేదో మాట్లాడుతుంటారు. నేనే మంటానంటే.. బొక్కలు తినడం ఆరోగ్యానికి మంచిదైతే, అలా చెయ్యడంలో తప్పేముంది? ఇదంతా ఆయన ఎదుగుదల గురించే. జనం రామ్ దేవ్ పేరుచెబితే కుళ్లుకునేది ఇందుకే' అంటూ యోగాగురును ఆకాశానికి ఎత్తేశారు లాలూ. ఈ సందర్భంగా రామ్ దేవ్ తాను రూపొందించిన ఫేస్ క్రీమ్ ను లాలూ ముఖానికి రాశారు. దీంతో అనధికారికంగా లాలూ రామ్ దేవ్ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ అయినట్లయింది. 'ఇప్పటికే ఫుల్ గ్లామరస్ గా కనిపించే లాలూ ఇకపై మరింత గ్లామరస్ గా కనిపిస్తే చూడటం మనవల్ల అయ్యేపనేనా?' అని అనుకున్నారట అక్కడే ఉన్న ఇంకొందరు! ఏది ఏమైనా నచ్చితే కీర్తించడం, నచ్చకుంటే మోహమాటం లేకుండా నిందించడం ఒక్క లాలూకే చెల్లింది. గతంలో లాలూ.. రామ్ దేవ్ ను పెట్టుబడిదారునిగా, ఫక్తు వ్యాపారవేత్త అభివర్ణించిన సంగతి తెలిసిందే. రామ్ దేవ్ ఉత్పత్తుల్లో ఎముకల చూర్ణం కలుస్తుందని వార్తలు వచ్చినప్పుడు కూడా లాలూ వాటిని ఖండించిన విషయం విదితమే.