మరణశిక్ష నుంచి ఎట్టకేలకు విముక్తి | Filipino death row prisoner to return home after 15 years | Sakshi
Sakshi News home page

మరణశిక్ష నుంచి ఎట్టకేలకు విముక్తి

Published Thu, Dec 19 2024 6:25 AM | Last Updated on Thu, Dec 19 2024 6:25 AM

Filipino death row prisoner to return home after 15 years

ఇండోనేసియా నుంచి ఫిలిప్పీన్స్‌కు తిరిగొచ్చిన మహిళ

క్షమాభిక్ష కోసం ఎదురుచూస్తున్న అమాయకురాలు

మనీలా: డ్రగ్స్‌ తరలించారన్న ఆరోపణలపై అరెస్టయి గత 15 సంవత్సరాలుగా జైళ్లో మగ్గిపోతున్న అమాయక ఫిలిప్పీన్స్‌ మహిళకు ఎట్టకేలకు ఇండోనేసియా జైలు నుంచి తాత్కాలిక విముక్తి లభించింది. ఇండోనేసియా, ఫిలిప్పీన్స్‌ దేశాలు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఇకపై ఆమె జీవితకాల జైలు శిక్షను ఇండోనేసియాకు బదులు సొంతదేశం ఫిలిప్పీన్స్‌లోని మహిళల కారాగా రంలో అనుభవించనుంది. 

ఇండోనేసియా విధించిన శిక్ష ప్రకారం 2015 ఏడాదిలోనే ఫిలిప్పీన్స్‌ పోలీసుల తుపాకీ గుళ్లకు బలికావాల్సిన మేరీ జేన్‌ వెలోసో అనూహ్యంగా ఆ దారుణ శిక్ష అమలు నుంచి తప్పించుకున్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో తనకు క్షమాభిక్ష పెట్టాలని త్వరలో దేశాధ్యక్షుడిని వేడుకుంటానని 39 ఏళ్ల మేరీ చెప్పారు. బుధవారం ఉదయం ఆమె ఇండోనేసియా నుంచి బయల్దేరి స్వదేశం ఫిలిప్పీన్స్‌లోని మనీలా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. తమ తల్లి రాకతో ఇద్దరు కుమారులు, మేరీ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. 

ఎనిమిది మందిపై బుల్లెట్ల వర్షం
2010లో బతుకుదెరువు కోసం పనిమనిషిగా ఇండోనేసియాలో అడుగుపెట్టిన ఆమెను ఎయిర్‌పోర్ట్‌లోనే పోలీసులు అరెస్ట్‌చేశారు. వెంట తెచ్చిన సూట్‌కేసులో 2.6 కేజీల నిషేధిత హెరాయిన్‌ మాదకద్రవ్యం ఉండటంతో ఆమెపై కఠిన డ్రగ్స్‌ ట్రాఫికింగ్‌ చట్టాలు మోపి మరణశిక్ష విధించారు. ఆ సూట్‌కేసుతో తనకేం సంబంధం లేదని, ఇండోనేసియాలో ఇంటి పనిమనిషిగా పని కుదిర్చిన ఏజెంట్‌ మారియా క్రిస్టినా సెర్గీ ఆ సూట్‌కేసు ఇచ్చాడని, అందులో ఏముందో తనకు నిజంగా తెలీ దని ఆమె ఎంత మొత్తుకున్నా పోలీసులు వినలేదు.

 ఐదే ళ్ల తర్వాత షూట్‌ చేసి చంపేయాలని తీర్పు వెలువడింది. అక్రమంగా డ్రగ్స్‌ తెచ్చారంటూ మేరీసహా ఆస్ట్రే లియా, బ్రెజిల్, ఫ్రాన్స్, ఘనా, నైజీరియాలకు చెందిన మొత్తం తొమ్మిది మందిని 2015 ఏడాదిలో ఒక ద్వీపకారాగారానికి తీసుకెళ్లారు. మేరీ తప్ప మిగతా ఎనిమిది మందిపై ఫైరింగ్‌ స్క్వాడ్‌ పోలీసులు తుపాకీ గుళ్ల వర్షం కురిపించి చంపేశారు. ఈమెను కూడా చంపేసేవారే.

 కానీ ఈమెను ఇండోనేసియాకు పంపిన ఏజెంట్‌ సెర్గీ కేవలం రెండ్రోజుల ముందు ఫిలిప్పీన్స్‌లో అరెస్టవడం, తానే ఆమెకు ఆ సూట్‌కేసు ఇచ్చి పంపాన ని ఒప్పుకోవడంతో ఈమె శిక్ష అమలు ఆఖరి నిమిషంలో ఆగిపోయింది. అయితే ఎవరు తెచ్చినా డ్రగ్స్‌ తమ భూభాగానికి తేవడం మాత్రం నేరమే కాబట్టి ఈమెను నిర్దోషిగా వదిలేది లేదని ఇండోనేసియా కరాఖండీగా చెప్పింది. దీంతో మేరీ విడుదలకు ఫిలిప్పీన్స్‌లో పెద్ద ఉద్యమమే మొదలైంది. చివరకు ఫిలిప్పీన్స్‌ ప్రభుత్వం చొరవ తీసుకుని ఖైదీల బదిలీ ఒప్పందం చేసుకుంది. మేరీ మిగతా శిక్షాకాలం సొంత దేశంలో అనుభవించేలా డీల్‌ కుదిరింది. ఈ ఒప్పందం మేరకు ఆమెను ఇండోనేసియా బుధవారం వదిలేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement