నా జుట్టు బాగా పొడవుగా ఉంటుంది. అయితే ప్రతి ఏడాది వర్షాకాలం రాగానే అది బాగా పొడిబారిపోతోంది. చుండ్రు వల్ల తలంతా దురదగా కూడా ఉంటోంది. వర్షాకాలంలో కూడా నా జుట్టు బాగుండాలంటే ఏం చేయాలో దయచేసి సూచించండి.– ఎమ్. ఉదయలక్ష్మి, కాకినాడ
మీ జుట్టు పొడిబారడం అనే సమస్యకు మీ జీవనశైలి, ఆహారపు అలవాట్లు, మీరు జుట్టుకు రోజువారీ వాడే ఉత్పాదనలు (హెయిర్ ప్రోడక్ట్స్) వంటి అంశాలు కారణమవుతాయి. మీరు రోజూ తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు, ఐరన్ పాళ్లు తగ్గడం వల్ల జుట్టు పొడిబారే ప్రమాదం ఉంది. అలాగే వాతావరణంలో తేమ తగ్గినప్పుడు కూడా జుట్టు పొడిబారుతుంది. అంతేకాదు... అది తేలిగ్గా విరిగిపోయేలా (బ్రిటిల్‌గా) కూడా మారుతుంది. ఇలా అనేక అంశాలు మీ సమస్యకు కారణమవుతుంటాయి. మీ విషయానికి వస్తే మొదట మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు మీ జీవనశైలిని ఆరోగ్యకరమైన రీతిలో మార్పులు చేసుకోవడం, ప్రోటీన్, ఐరన్ పుష్కలంగా దొరికేలా మీ ఆహారంలో మార్పులు చేసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేగాక మీరు మెడికేటెడ్ షాంపూ వాడటం మంచిది. మీ మాడు (స్కాల్ప్)తో పాటు మీ జుట్టు కండిషన్‌ను బట్టి మీరు వాడాల్సిన షాంపూను సూచించడం జరుగుతుంది. మీకు చుండ్రు కూడా ఉందంటున్నారు కాబట్టి... డాక్టర్ సూచించిన యాంటీడాండ్రఫ్ లోషన్ కూడా వాడాల్సి ఉంటుంది. చుండ్రుకు చికిత్స చేయకపోతే జుట్టు రాలిపోవడం అనే సమస్య అదేపనిగా కొనసాగుతూనే ఉంటుంది. అందుకే పైన సూచించిన జాగ్రత్తలు పాటించడంతో పాటు ఒకసారి డాక్టర్‌ను సంప్రదించండి.
చర్మం పొడిబారకుండా ఉండాలంటే...?
నాది బాగా పొడి చర్మం. నా చర్మం గురించి నేను చాలా శ్రద్ధ తీసుకుంటాను. కొద్దిరోజుల్లో నేను పైచదువుల కోసం కెనడాకు వెళ్లబోతున్నాను. అక్కడి వాతావరణానికి నా చర్మంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలియదు. నా చర్మం పాడవ్వకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?– సునయన, హైదరాబాద్
కెనడా వంటిచోట్ల వాతావరణం బాగా చల్లగా ఉంటుంది. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే చర్మం మరింత పొడిబారిపోయే ప్రమాదం ఉంది. సాధారణ సబ్బులు చర్మాన్ని మరింత పొడిబారేలా చేస్తాయి. కాబట్టి మీరు స్నానానికి స్కిన్ పీహెచ్ బ్యాలెన్స్ చేసే మెడికేటెడ్ సబ్బును వాడటం మంచిది. అలాగే మీరు మెడికేటెడ్ మాయిష్చరైజర్ వాడటం కూడా వాడాల్సి ఉంటుంది. దీనివల్ల మీ చర్మం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. ఇలాంటి కొన్ని జాగ్రత్తలతో మీరు మీ చర్మసౌందర్యాన్ని కాపాడుకోవచ్చు.
అమ్మాయికి మొటిమలు వస్తున్నాయి
మా అమ్మాయి వయసు 15 ఏళ్లు. ఆమెకు మొటిమలు వస్తున్నాయి. అవి పెరగకుండా ఉండేందుకు ఏమైనా జాగ్రత్తలు ఉంటే చెప్పగలరు.– పద్మ, నిజామాబాద్
టీనేజీలో హార్మోన్ల ప్రభావం వల్ల మొటిమలు రావడం చాలా సాధారణం. కానీ తగిన జాగ్రత్తలు తీసుకుంటే మొటిమల తీవ్రతను తగ్గించవచ్చు. మొదటగా... ముఖం కడుక్కోడానికి సబ్బు కాకుండా, నాన్‌సోప్ బేస్‌డ్ క్లెన్సర్స్ వాడితే మంచిది. అలా చేయడం వల్ల చర్మం పీహెచ్ బ్యాలన్స్ అయ్యి, నూనె గ్రంథులు సరైన విధంగా పనిచేస్తాయి. ముఖం పైన ఏవైనా క్రీమ్స్‌గానీ లేదా ఇతర ఉత్పాదనలు (ప్రోడక్ట్స్)గానీ వాడే అలవాటు ఉంటే, అవి తప్పనిసరిగా నాన్–కామెడోజెనిక్ అని లేబుల్ చేసినవే వాడాలి. కొంతమందిలో హై గ్లైసిమిక్ ఇండెక్స్ (చక్కెరను తొందరగా విడుదల చేసే పిండిపదార్థాలు) కలిగిన పదార్థాలు తినడం వల్ల కూడా మొటిమలు ఎక్కువగా వస్తాయి. వాటికి దూరంగా ఉండటం లేదా వీలైనంత తక్కువగా తీసుకోవడం మంచిది. ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మొటిమల తీవ్రతను చాలా వరకు తగ్గించవచ్చు. అంతేకాదు... వాటి కారణంగా వచ్చే మచ్చలు (స్కారింగ్), పిగ్మెంటేషన్‌ని కూడా అదుపు చేయవచ్చు.
చుండ్రు ఎందుకు వస్తుంది?
నా వయసు 30 ఏళ్లు. నాకు జుట్టు నుంచి చుండ్రు విపరీతంగా రాలుతోంది. దాంతో నలుగురిలోకి వెళ్లడం చాలా ఇబ్బందిగా ఉంటోంది. యాంటీ–డాండ్రఫ్ షాంపూలు వాడుతున్నప్పటికీ ప్రయోజనం కనబడటం లేదు. అసలు డాండ్రఫ్ ఎందుకు వస్తుంది? దాన్ని తగ్గించడం ఎలా?– ప్రసాద్, సికింద్రాబాద్
చుండ్రు (డాండ్రఫ్) రావడానికి చాలా కారణాలు ఉంటాయి. సాధారణంగా చర్మంపై గల మలస్సేజియా అనే సూక్ష్మజీవి కారణంగా చర్మంపై రియాక్షన్ వచ్చి డాండ్రఫ్ వస్తుంటుంది. శరీరంలో నూనె గ్రంథులు (ఆయిల్ గ్లాండ్స్) ఎక్కువగా ఉండే చోట చుండ్రు ఎక్కువగా వస్తుంది. ఉదాహరణకు చర్మం (స్కాల్ప్), వీపుభాగం, ముఖం వంటి చోట్ల ఎక్కువగా వస్తుంటుంది. ఇలా శరీరం రియాక్ట్ అవ్వడానికి ఒత్తిడి (స్ట్రెస్), ఆహారపు అలవాట్లు, జీవనశైలి విధానాల వంటివి ముఖ్య కారణాలు. ఉప్పునీరు ఉపయోగించడం, కఠినమైన రసాయనాలు ఉన్న ఉత్పాదనలు వాడటం కూడా డాండ్రఫ్ పెరగడానికి కారణమవుతుంది. మీరు ఒకసారి డాక్టర్‌ను (చర్మవ్యాధి నిపుణులను) సంప్రదించండి. వారు మీకు తగిన / సరిపడే యాంటీ–ఫంగల్ లోషన్స్‌తో తగిన చికిత్సను సూచిస్తారు.డాక్టర్ సుభాషిణి జయం, కన్సల్టెంట్ మెడికల్ కాస్మటాలజిస్ట్,
ఎన్‌ఛాంట్ మెడికల్ కాస్మటాలజీ క్లినిక్, శ్రీనగర్‌కాలనీ, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment