ఎక్కువ మొత్తంలో సరుకులు కొనుగోలు చేస్తే మార్కెట్ ధరకంటే రూపాయో, రెండు రూపాయలో తగ్గించడం సహజం. అదే భారీ మొత్తంలో ఏడాది పాటు కొనుగోలు చేస్తే ఇంకా తగ్గించడం వ్యాపార లక్షణం. అదే టెండర్ల ప్రక్రియలో ఎవరు తక్కువ ధరకు ఇస్తే వారి వద్దే కొంటాం. అయితే గిరిజన సహకారం సంఘం (జీసీసీ) ఆధ్వర్యంలో ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాలకు పప్పులు, కాస్మోటిక్స్, కూరగాయలు సరఫరా చేయడానికి వేసిన టెండర్లు భిన్నంగా ఉన్నాయి. టెండర్ల విధానానికి విరుద్ధంగా ధరలు కొండెక్కి కూర్చున్నాయి. నాలుగు రోజుల కిందట ఐటీడీఏలో జరిగిన టెండర్ల ప్రక్రియలో వ్యాపారులు సిండికేట్‌గా మారడంతో ఈ పరిస్థితి నెలకుందనే విమర్శలు వస్తున్నాయి.
సీతంపేట:సీతంపేట సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) పరిధిలో 44 గిరిజన సంక్షేమ ఆశ్రమఉన్నత పాఠశాలలు, మూడు వసతిగృహాలు, 22 పోస్ట్‌మెట్రిక్ వసతిగృహాలు, ఒక కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్, మూడు గురుకుల కళాశాలలు, నాలుగు గురుకుల పాఠశాలలు, మూడు కేజీబీవీలు, రెండు మినీ గురుకులాలున్నాయి. వీటిలో 18,850 మంది గిరిజన విద్యార్థినీ విద్యార్థులు చదువుతున్నారు. వీరి మెనూకు అవసరమైన సరుకులన్నీ (కూరగాయలు తప్ప) జీసీసీ ద్వారా సరఫరా చేయాలి. గిరిజన సంక్షేమశాఖ ద్వారా నిధులు వచ్చిన వెంటనే మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాదికి జీసీసీకి చెల్లిస్తుంటారు. అయితే మెనూకు అవసరమైన వస్తువలను టెండర్ ప్రక్రియ ద్వారా జీసీసీ కొనుగోలు చేసి సరఫరా చేస్తుంది. ప్రతీ ఏటా విద్యాసంవత్సరం ఆరంభంలో ఈ తంతు జరుగుతుంది. గతేడాది టెండర్లు వేయకుండానే విజయనగరం జిల్లాలోని టెండర్ ధరలను ఇక్కడ అమలు చేశారు. అయితే టెండర్లప్పుడు ఒక క్వాలిటీ సరుకులను చూపించి అనంతరం సరఫరా చేసినప్పుడు నాశిరకం సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. కందిపప్పు వంటి ముఖ్యమైన సరుకులు ఇలానే వసతిగృహాలకు గతంలో సరఫరా చేశారు. అప్పట్లో రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖాధికారులు కూడా హాస్టళ్లను సందర్శించినపుడు నాణ్యత లేని కందిపప్పును, ఇతర వస్తువులను తిరస్కరించాలని ఆదేశించారు.
ప్రస్తుతం టెండర్‌దారులు కోట్ చేసిన ధరలిలా ఉన్నాయి.
జీసీసీ వేసిన టెండర్లలో వ్యాపారులు కోట్ చేసిన ధరలు పరిశీలిస్తే.. కందిపప్పు కిలో రూ. 155కు కోట్ చేశారు. ప్రస్తుతం మండుతున్న ధరల్లోనే కిలో కందిపప్పు రూ.150 ఉంది. అయినా రూ.5 ఎక్కువగా టెండర్ వేయడం గమనార్హం. నెల రోజుల క్రితమైతే కిలో రూ. 108 ఉండేది. ఇప్పుడు టెండర్‌దారులు రూ.155 కోట్ చేయడం అనుమానాలకు తావిస్తోంది. కారంపొడి కిలో ప్యాకెట్ మార్కెట్లో రూ. 140 లోపు ఉండగా టెండర్ దారులు రూ. 142కి ఖరారు చేశారు. రిన్ సబ్సు రూ.4.55 పైసలు, డాబర్ కొబ్బరి, సంతూర్ సబ్బు చిన్నది మార్కెట్లో రూ.5 ఉండగా కేవలం 50 పైసలు మాత్రమే తగ్గించారు. అదే డిపార్ట్‌మెంట్ మార్కెట్‌లో ఒక్కటి కొనుగోలు చేస్తేనే రూపాయి వరకు తగ్గిస్తారు. టెండర్‌దారులు రూ.4.50 పైసలకు కోట్ చేశారు. పది రూపాయల టూత్ పేస్ట్ రూ.8.50 ధర ఖరారయ్యింది. నూనె రూ.23.75 పైసలు, (వంద గ్రాములు), లీటర్ పామాయిల్ ప్యాకెట్ రూ.47, పెసరపప్పు కిలో రూ. 102, గుడ్‌మిల్క్ ప్యాకెట్ రూ.39, బన్సీ రవ్వ రూ. 23.75, బటాణీ రూ.33.25 పైసలకు సరఫరా చేసేలా టెండర్‌దారులు కోట్ చేశారు. దీనిలో ఒకటి, రెండు వస్తువులు తప్పితే మిగతా వస్తువులన్నీ అధికధరలకు ఉండడం గమనార్హం.
అరువుపై ఇస్తున్నారు కాబట్టి తప్పదు: మోహన్‌రావు,జీసీసీ డీఎం
ఈ విషయాన్ని జీసీసీ డివిజనల్ మేనేజరు మోహన్‌రావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా.. అరువుపై సరుకులను సరఫరా చేస్తారు కాబట్టి ఈ ధరలు కేటాయించడం తప్పడం లేదన్నారు. గిరిజన సంక్షేమశాఖ ద్వారా బిల్లులు ఎప్పటికో అవుతాయన్నారు. గతేడాది బిల్లులు ఇంతవరకు టెండర్‌దారులకు చెల్లించలేదని చెప్పారు.
ఇదో రకం టెండర్!
Published Fri, Sep 4 2015 12:16 AM | Last Updated on Sun, Sep 3 2017 8:41 AM
Advertisement