market price
-
అప్పుడు అమ్మక.. ఇప్పుడు అమ్ముకోలేక
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు తుమ్మిడే వెంకన్న. కుము రం భీం జిల్లా దహేగంకు చెందిన ఈయన పత్తి సాగు చేశాడు. ధర పెరుగుతుందనే ఆశతో ఇంట్లో 50 క్వింటాళ్ళ వరకు నిల్వ చేశాడు. ఆరు నెలల పాటు ఎదురుచూసినా పెరగకపోవడంతో క్వింటాల్ రూ.7,500 చొప్పున 20 క్వింటాళ్లు అమ్మేశాడు. మరో 30 క్వింటాళ్ళు ఇంట్లోనే నిల్వ ఉంది. అయితే ఎక్కువ రోజులు కావడంతో పురుగులు వస్తున్నాయని, పత్తి పాడైపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తక్కువ ధరకు అమ్మలేక, ఇంట్లో నిల్వ చేయలేక ఇబ్బంది పడుతున్నాడు. సాక్షి, హైదరాబాద్: గత ఏడాది పత్తికి పలికిన ధర రైతుల్ని ఊరించింది. దీంతో ఈ ఏడాది పండించిన పంటను చాలామంది రైతులు అమ్మకుండా రాబోయే రోజుల్లో మంచి ధర పలుకుతుందనే ఆశతో వివిధ రకాలుగా నిల్వ చేశారు. కొందరు దళారుల మాట నమ్మి అమ్మలేదు. మరికొందరు సొంతంగానే వేచి చూడాలని నిర్ణయించుకున్నారు. కొందరు క్వింటాళ్ల కొద్దీ పత్తి ని ఇళ్లలోనే దాచుకున్నారు. ఎలుకలు, పురుగులు, దుర్వాసన సమస్యను ఎదుర్కొంటూ నెలల తరబడి ఎదురుచూశారు. కానీ ధర పెరగలేదు సరికదా.. సీజన్ మొదట్లో ఉన్న ధర కూడా క్రమంగా తగ్గిపోయింది. దీంతో పత్తిని నిల్వ చేసిన రైతులు పంటను మరింత కాలం నిల్వ చేయలేక, అలాగని అమ్ముకోలేక లబోదిబోమంటున్నారు. చెడిపోయిన 20 శాతం పత్తి రాష్ట్రంలో గత ఏడాది 46 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేస్తే.. ఈ ఏడాది 50 లక్షల ఎకరాల్లో పండించారు. మొత్తం 28.41 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. ఇందులో ప్రైవేటు సంస్థలు 9.86 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా, కొంతమంది పత్తి రైతులు మహారాష్ట్రలో 5.50 లక్షల మెట్రిక్ టన్నుల వరకు అమ్ముకున్నారు. దాదాపు సగం పత్తిని రైతులు భవిష్యత్తులో మంచి ధర వస్తుందనే ఆశతో దాచిపెట్టారు. అయితే వారి ఆశ అడియాసే అయ్యింది. ప్రస్తుతం అమ్మకుండా నిల్వ ఉన్న 14 లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల పత్తిలో 20 శాతం మేర నల్లబడి, చెడిపోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. తెలుపు నుంచి నలుపులోకి.. పత్తిని నిల్వ చేసేందుకు కొందరు గోడౌన్లు అద్దెకు తీసుకుంటే మరికొందరు సొంత ఇళ్లల్లో దాచారు. కొందరు ఆరు బయటే కల్లాల్లో టార్పాలిన్ కవర్ల కింద కప్పిపెట్టారు. అయితే అమ్మకుండా ఎక్కువరోజులు కావడంతో పత్తి నుంచి వివిధ రకాల పురుగులు బయటకొస్తున్నాయి. ఎలుకల బెడదా పెరిగింది. ముఖ్యంగా ఇళ్లల్లో దాచినవారికి ఇబ్బందులెదురవుతున్నాయి. ఇల్లంతా ఒక రకమైన దుర్వాసన కూడా వ్యాపిస్తోందని రైతులు చెబుతున్నారు. మరోవైపు ఆరుబయట వర్షాలు, ఎండల తాకిడితో పత్తి రంగు నల్లగా మారుతోంది. పత్తికి సరైన ఉష్ణోగ్రత ఉండాలి. అప్పుడే తెలుపు రంగు దెబ్బతినకుండా ఉంటుంది. అలాంటి పత్తికే మార్కెట్లో మంచి ధర పలుకుతుంది. కానీ దిగుబడి వచ్చిన తర్వాత మూడు నెలలుగా నిల్వ చేయడంతో సరైన ఉష్ణోగ్రత లేక నల్లగా మారిపోతోంది. పత్తి గింజల నుంచి బంక లాంటిది బయటకొస్తోంది. ఈ పరిస్థితుల్లో కొందరు పొరుగు రాష్ట్రాల్లో అమ్ముకునేందుకు ప్రయత్ని స్తున్నారు. కానీ అక్కడికి రవాణా, దళారులకు కమీషన్, ఇతరత్రా ఖర్చులు కలిపితే క్వింటాల్‌కు రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు వ్యయమయ్యే పరిస్థితి ఉంది. అయినా రాష్ట్ర సరిహద్దులో ఉన్న రైతులు అక్కడే అమ్మేందుకు ఇష్టపడుతున్నారు. మరొకొందరు మాత్రం ప్రస్తుతం ఉన్న ధరకే అమ్ముకుంటున్నారు. పెరుగుతున్న వడ్డీ భారం ఒక్కో రైతు ఎకరానికి రూ.25 వేల వరకు పత్తి సాగు కోసం ఖర్చు చేశాడు. కొందరు అప్పులు చేసి మరీ పంట వేశారు. సకాలంలో అమ్ముకుంటే అప్పు తీరిపోయేది. మిత్తి డబ్బులు కూడా మిగిలేవి. కానీ ప్రస్తుతం వడ్డీ భారం రోజురోజుకూ పెరిగిపోతోంది. కొందరు వడ్డీ వ్యాపారులు అప్పు తీర్చాలంటూ తీవ్రంగా వత్తిడి చేస్తున్నారు. దీంతో కొందరు కొత్త అప్పులు చేసి పాత అప్పులు తీరుస్తున్నట్టు తెలుస్తోంది. కొందరు ఇంట్లో ఉన్న బంగారం అమ్మి లేదా తాకట్టు పెట్టి అప్పులు తీరుస్తున్నట్లు సమాచారం. -
Hyderabad: భూం ధాం!.. రూ. 12 వేల కోట్ల నుంచి 15 వేల కోట్లు లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ సమీకరణపై దృష్టి సారించింది. ఇప్పటికే కోకాపేట, ఖానామెట్ ప్రాంతాల్లో భూములను విక్రయించి, రూ.కోట్లు సేకరించిన ప్రభుత్వం మరోసారి భూముల వేలానికి శివారు జిల్లాలను ఎంచుకుంది. రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 25.01 ఎకరాల భూములను విక్రయించాలని నిర్ణయించింది. మొత్తం 1,21,060 చదరపు గజాల వేలంతో సుమారు రూ.15 వేల కోట్లు సమీకరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అత్యధికంగా రంగారెడ్డిలో 11.3 ఎకరాలలో 54,692 గజాలను వేలం వేయనుంది. వీటిలో కోకాపేట, గండిపేట, పుప్పాలగూడ, నల్లగండ్ల వంటి హాట్ లొకేషన్సే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈసారి కొత్తగా వరంగల్ జాతీయ రహదారిలోనూ ప్రభుత్వ స్థలాలను వేలంలో పెట్టింది.. ఘట్కేసర్లోని కొర్రెములలో 2662 చదరపు గజాలను వేలం వేయనుంది. కుత్బుల్లాపూర్ మండలంలోని సూరారం, బౌరంపేట ప్రాంతాల్లోనూ స్థలాలను అమ్మనుంది. ఈసారి భూముల వేలం జాబితాలో వాలంతరీ, వీడీఓ, టూరిజం భూములు కూడా ఉండడం విశేషం, గతంలో ఈ భూములను ఐటీ హబ్‌కు కేటాయించాలని నిర్ణయించిన సర్కారు..తాజాగా వేలంలో పెట్టడం గమనార్హం. వేలంలో అత్యల్పంగా మేడ్చల్ జిల్లాలో బౌరంపేటలో 302 గజాలు, అత్యధికంగా పుప్పాలగూడలో 9,680 గజాల స్థలాన్ని వేలం వేయనున్నారు. తాజా వేలంలో 2 వేల గజాల కంటే ఎక్కువ ఉన్న ప్లాట్లే ఎక్కువగా ఉన్నాయి. జనవరి 16న రిజి్రస్టేషన్‌కు ఆఖరు గడు వు, 18న వేలం ఉంటుందని హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ప్రకటించింది. చదవండి: తగ్గిన స్థిరాస్తి లావాదేవీలు..!.. పెరిగిన ధరలు...రిజిస్ట్రేషన్ చార్జీలు మార్కెట్ రేటు రెండింతలు.. వేలంలో ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే మార్కెట్ రేటు రెట్టింపుగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అంచనా వేసిన రూ.15 వేల కోట్ల ఆదాయ సమీకరణ సులువు అవుతుందని స్థిరాస్తి నిపుణులు అంచనా వేస్తున్నారు. పైగా కోకాపేట, మంచిరేవుల, గండిపేట, నల్లగండ్ల వంటి ఐటీ, సంపన్నులుండే ప్రాంతంలో స్థలాల వేలం ఉండటంతో స్థానిక డెవలపర్లతో పాటు ఇతర రాష్ట్ర కంపెనీలు కూడా వేలంలో పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పుప్పాలగూడ, మంచిరేవుల ప్రాంతంలో గజానికి రూ.60 వేలుగా ప్రభుత్వం నిర్ధారించగా.. ప్రస్తుతం మార్కెట్ విలువ అక్కడ సుమారు రూ.లక్షపైనే పలుకుతుందని స్థిరాస్తి నిపుణులు అంచనా వేస్తున్నారు. గతంలో కోకాపేట, ఖానామెట్‌లో భూములను వేలం వేసినప్పుడు గజం రూ.1.50 లక్షలు పలకడంతో.. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ప్రారంభ ధరే రూ.1.50 లక్షలుగా నిర్ధారించారని ఓ డెవలపర్ తెలిపారు. కోకాపేట కంటే నల్లగండ్లలో నిర్ధారించిన ధర ఎక్కువగా ఉందంటే ఆయా ప్రాంతం వాణిజ్య అవసరాలకు అనుగుణంగా ఉండటమే కారణమని అభిప్రాయపడ్డారు. ఘట్కేసర్ ప్రాంతంలో గజానికి రూ.20 వేలు కనీస ధరగా నిర్దేశించగా.. ఆయా ప్రాంతంలో అభివృద్ధి నేపథ్యంలో ఈ ధర ఎంతవరకు పలుకుతుందనేది ఆసక్తిగా మారింది. -
మార్కెట్ ధరకే ఏపీఐఐసీకి భూమి!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ)కి ప్రభుత్వ భూములను ఉచితంగా కేటాయించడం సమంజసం కాదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ అభిప్రాయపడ్డారు. పారిశ్రామిక సంస్థలకు భూములను అమ్ముకునే ఏపీఐఐసీకి ప్రభుత్వం భూములను ఉచితంగా ఇవ్వాల్సిన అవసరం ఏమిటని ఆయన రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు. సోమవారం సమీక్ష సందర్భంగా ఈ విషయం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. రెవెన్యూ శాఖకు చెందిన భూమిని ఉచితంగా ఏపీఐఐసీకి ఎందుకు కేటాయించాలి? ఎప్పటి నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చింది? అని దినేష్‌కుమార్ వాకబు చేశారు. గతంలో మార్కెట్ ధరకు కేటాయించే విధానం ఉండేదని, ప్రభుత్వ భూములను బేసిక్ ధరకు కేటాయించే పద్ధతి తర్వాత వచ్చిందని అధికారులు వివరించారు. ‘ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ భూములను బేసిక్ ధరకు కాకుండా ఉచితంగానే కేటాయించాలని ఏపీఐఐసీ కోరింది. దీనిని ఆమోదిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందని’ రెవెన్యూ అధికారులు వివరించారు. నివేదిక సిద్ధం చేయండి ఏపీఐఐసీకి భూముల కేటాయింపునకు గతంలో ఉన్న జీవోలు, తర్వాత వచ్చిన జీవోలు, ప్రస్తుతం అమల్లో ఉన్న విధానంపై సమగ్ర నివేదిక రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. ఏవిధానం మంచిది? ఇందుకు ప్రామాణికాలేమిటి? అనే వివరాలతో పాటు జీవో కాపీలను కూడా జత చేసి నివేదిక రూపొందించి సమర్పించాలని సీఎస్ ఆదేశించారు. దీనిపై సమీక్షించి ఏపీఐఐసీకి మార్కెట్ ధరకే భూములు కేటాయించడం సమంజసంగా ఉంటుందనే అభిప్రాయంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉన్నారు. అయితే ఆయన తీసుకునే నిర్ణయం అంతిమం కాదు. సీఎస్ ఈ మేరకు ప్రభుత్వానికి సిఫార్సు చేయవచ్చని, తుది నిర్ణయం మాత్రం కేబినెట్‌దే అవుతుందని ఒక అధికారి తెలిపారు. -
కంది కొనుగోళ్లలో దళారులకు చెక్
మోర్తాడ్(బాల్కొండ) : కంది కొనుగోళ్లలో దళారుల దగాకు చెక్ పెట్టింది తాళ్లరాంపూర్ సహకార సంఘం. వ్యాపారుల బారిన పడకుండా రైతులకు మద్దతు ధర చెల్లిస్తూ ఇప్పటికే నాలుగు వేల సంచులను కొనుగోలు చేసింది. కందికి రూ.5,450 చొప్పున మద్దతు ధర చెల్లిస్తూ రైతులకు భరోసా కల్పిస్తోంది. వాస్తవానికి బయట మార్కెట్లో దళారులు క్వింటాల్‌కు రూ.4 వేల నుంచి రూ.4,200 వరకు మాత్రమే ధర చెల్లిస్తూ రైతులను మోసగిస్తున్నారు. అయితే, తాళ్ల రాంపూర్‌లో కంది కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంతో రైతులకు మద్దతు ధర లభిస్తోంది. మోర్తాడ్, ఏర్గట్ల, మెండోర మండలాలకు సంబంధించిన తాళ్ల రాంపూర్ కొనుగోలు కేంద్రంలోనే పంట ఉత్పత్తులు విక్రయించి మద్దతు ధర పొందుతున్నారు. పది రోజుల కింద ఇక్కడ కొనుగోలు కేంద్రం ప్రారంభం కాగా, ఇప్పటివరకు నాలుగు వేల సంచుల కందులను కొనుగోలు చేశారు. కందులు విక్రయించిన రైతులకు వారం రోజుల్లోనే సొమ్ము చెల్లించే ఏర్పాట్లు చేశారు. దీంతో ఈ ప్రాంత రైతులు తాము పండించిన కందులను మంచి ధర పొందేందుకు అవకాశం ఏర్పడింది. కొనుగోలు కేంద్రాన్ని మరిన్ని రోజులు కొనసాగిస్తామని, రైతులు నాణ్యమైన కందులను తీసుకవచ్చి మద్దతు ధర పొందాలని సొసైటీ చైర్మన్ సోమ చిన్న గంగారెడ్డి ‘సాక్షి’తో చెప్పారు. రైతుల ప్రయోజనాలు కాపాడటమే తమ లక్ష్యమని తెలిపారు. -
పసిడి మరింత పైకి
న్యూఢిల్లీ : అంతర్జాతీయంగా సానుకూల సెంటిమెంటుతో పసిడి ధరలు వరుసగా అయిదోవారం పరుగులు తీశాయి. న్యూయార్క్ కమోడిటీ ఎక్సే్ఛంజీ ఫ్యూచర్స్ మార్కెట్లో ఫిబ్రవరి కాంట్రాక్టుకి సంబంధించి ఔన్సు (31.1 గ్రాములు) బంగారం ధర డాలర్ల దగ్గర 0.7 శాతం పెరిగి 1,331.70 డాలర్ల వద్ద ముగిసింది. డిసెంబర్ నాటి కనిష్ట స్థాయిల నుంచి పసిడి రేట్లు ఇప్పటిదాకా 6.6 శాతం పైగా పెరిగాయి. అమెరికా డాలరు బలహీనంగా ఉంటుండటం.. సమీప భవిష్యత్‌లో బంగారం రేట్లు మరింత పెరగడానికి కారణం కాగలవని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. రేటు 1,300 డాలర్ల పైనే కొనసాగినన్ని రోజులు బంగారానికి బులిష్‌గానే ఉండగలదని పేర్కొన్నారు. పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు క్రమంగా ద్రవ్యపరపతి విధానాన్ని కఠినతరం చేస్తున్న నేపథ్యంలో అమెరికా డాలర్ బేరిష్‌గానే ఉండొచ్చన్నది నిపుణుల మాట. డాలర్‌తో పోలిస్తే మిగతా దేశాల కరెన్సీలు మరింత పెరిగే అవకాశం ఉంది. సమీప భవిష్యత్‌లో సెప్టెంబర్ నాటి 1,357 డాలర్ల గరిష్ట స్థాయి తదుపరి కీలక నిరోధంగా ఉండగలదని నిపుణుల అంచనా. ఒకవేళ అది దాటేస్తే 2016 జూలైలో నమోదైన 1,375 డాలర్ల స్థాయికి చేరొచ్చు. సీజనల్ అంశాల కారణంగా త్వరలో బంగారం 1,400 డాలర్ల స్థాయికి కూడా చేరొచ్చన్నది మరికొందరి అభిప్రాయం. దేశీయంగా ఏడువారాల గరిష్టానికి.. ఆభరణాల సంస్థల కొనుగోళ్లు కారణంగా దేశీయంగాను పసిడి ధరలు మెరుగుపడ్డాయి. న్యూఢిల్లీలో 7వారాల గరిష్ట స్థాయికి పెరిగాయి. మేలిమి బంగా రం 10 గ్రాముల ధర రూ. 300 మేర పెరిగి రూ. 30,750 వద్ద, ఆభరణాల బంగారం రేటు కూడా రూ. 300 పెరిగి రూ. 30,600 వద్ద క్లోజయ్యాయి. -
దూసుకుపోతున్న వర్జీనియా మార్కెట్
ఆశాజనకంగా పొగాకు ధరలు కిలో సగటు ధర రూ.173 సాగుకు సన్నద్ధమవుతున్న రైతులు దేవరపల్లి: వర్జీనియా పొగాకు మార్కెట్ ఆశాజనకంగా ఉంది. అధికారులు, రైతులు ఊహకు అందని విధంగా పొగాకు ధరలు పలుకుతున్నాయి. దాదాపు నెల రోజులుగా మార్కెట్ పుంజుకుంది. సోమవారం జిల్లాలోని వేలం కేంద్రాల్లో కిలో గరిష్ట ధర రూ.190, సగటు ధర రూ.173.70 లభించింది. ఈ ఏడాది మార్చి 15న ప్రారంభమైన కొనుగోళ్లు జూలై వరకు మందకొడిగా జరిగాయి. గిట్టుబాటు ధర రాక రైతులు పంటను అమ్ముకోవడానికి ఆసక్తిచూపలేదు. రోజుకు 200కు మించి బేళ్లు వేలానికి రాకపోవడంతో అధికారులు కూడా అయోమయంలో పడ్డారు. కొంతకాలం టేడర్లు కూడా సిండికేట్‌గా మారి ధర విషయంలో సీలింగ్ వి«ధించడంతో రైతులు వేలాన్ని నిలుపుదల చేశారు. గిట్టుబాటు ధర కోసం రైతులు ఢిల్లీ వెళ్లి కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖకు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. అనంతరం ఆగస్టు నుంచి మార్కెట్లో ధర పెరుగుతూ వచింది. అప్పటి వరకు కొనుగోలుకు ముందుకు రాని కంపెనీలు కూడా వేలంలో పాల్గొన్నాయి. పొగాకు అమ్మేందుకు రైతులు ముందుకు వచ్చారు. రోజుకు 1000 నుంచి 1300 బేళ్ల వరకూ రైతులు తీసుకొచ్చారు. 14 నుంచి కొనుగోళ్లు పునఃప్రారంభం జిల్లాలోని ఐదు వేలం కేంద్రాల పరిధిలో 201617 సంవత్సరానికి పొగాకు బోర్డు 41 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తికి అనుమతిచ్చింది. బ్యారన్‌కు 30 క్వింటాళ్లకు మించి పండించడానికి అవకాశం లేదని పేర్కొంది. బ్యారన్ రిజిస్ట్రేషన్లు కూడా చేసింది. అయితే ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో పాటు కొందరు రైతులు అనుమతికి మించి విస్తీర్ణంలో పంట వేశారు. దీంతో అదనంగా సుమారు 3 మిలియన్ కిలోల వరకు పండినట్లు అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులు అంచనా వేశారు. 36 మిలియన్ కిలోలు కొనుగోలు చేసిన అనంతరం ఈ నెల ఒకటో తేదీ నుంచి 13 వరకు నిలిపివేశారు. అదనపు పొగాకు కొనుగోలుకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ బ్యారన్‌కు 300 కిలోలు వరకు, కిలోకు రూ.2 కమీషన్, 7.5 శాతం రుసుంతో కొనుగోలుకు అనుమతి ఇచ్చింది. దీంతో ఈ నెల 14 నుంచి ఐదు వేలం కేంద్రాల్లో కొనుగోళ్లు పునఃప్రారంభమయ్యాయి. అయితే మీడియం గ్రేడులకు తక్కువ ధర పలుకుతుందని రైతులు వాపోతున్నారు. లెమన్, ఆరంజ్ కలర్ పొగాకుకు మంచి ధర లభిస్తుందని రైతులు వివరించారు. వేలం కేంద్రాల్లో పరిస్థితి ఇది దేవరపల్లి వేలం కేంద్రంలో 6.8 మిలియన్ కిలోలు ఉత్పత్తికి అనుమతివ్వగా ఇప్పటికి 6.5 మిలియన్ కిలోలు విక్రయించారు. మరో 4 లక్షల కిలోల పొగాకు రైతుల వద్ద ఉంది. గోపాలపురం వేలం కేంద్రంలో 7.1 మిలియన్ కిలోలు ఉత్పత్తికి అనుమతి ఉండగా ఇప్పటికి 6.7 మిలియన్ కిలోలు విక్రయించారు. మరో 5 లక్షల కిలోలు రైతులు వద్ద ఉంది. కొయ్యలగూడెం వేలం కేంద్రంలో 1.5 మిలియన్ కిలోలు, జంగారెడ్డిగూడెం1, 2 వేలం కేంద్రాల్లో సుమారు మూడు మిలియన్ కిలోలు రైతుల వద్ద ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దేవరపల్లి, గోపాలపురం వేలం కేంద్రాల్లో ఈ నెల 25న కొనుగోళ్లు ముగుస్తుండగా, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం వేలం కేంద్రాల్లో అక్టోబర్ 15 వరకు కొనుగోళ్లు జరగనున్నట్లు సమాచారం. 25న పొగాకు వేలం ముగింపు ఈ నెల 25న దేవరపల్లి, గోపాలపురం వేలం కేంద్రాల్లో పొగాకు వేలం ముగుస్తుంది. రెండు వేలం కేంద్రాల్లో సుమారు 9 లక్షల కిలోలు రైతులు అమ్ముకోవాల్సి ఉంది. కిలో సగటు ధర రూ.173.70 లభించింది. రోజుకు లక్ష కిలోలు వరకు పొగాకు వేలం జరుగుతోంది. ఎం.హనుమంతరావు, వేలం నిర్వహణాధికారి, దేవరపల్లి టి.తల్పసాయి, వేలం నిర్వహణాధికారి, గోపాలపురం -
కంటితుడుపే!
-
కంటితుడుపే!
మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద మిర్చి కొనుగోలుకు కేంద్రం అంగీకారం - అడిగింది క్వింటాల్‌కు రూ. 7,000 - కేంద్రం అంగీకరించింది రూ. 5,000 - 3.3 లక్షల క్వింటాళ్ల కొనుగోలుకే పరిమితి - తక్కువ ధర నిర్ణయించడంపై రాష్ట్రం అసంతృప్తి - కేంద్ర నిర్ణయాన్ని అంగీకరించాలా? బోనస్ ఇవ్వాలా?.. అధికారుల తర్జనభర్జన - ఈ నెల 2 నుంచి 31 వరకు కొనుగోళ్లు - రైతుల వద్ద ఇంకా 30 లక్షల టన్నులున్నట్లు మార్కెటింగ్ శాఖ అంచనా సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: రాష్ట్రంలో మిర్చి రైతుల కష్టాలు కేంద్రం కంటికి కనిపించడం లేదు. ధర పతనమై గగ్గోలు పెడుతున్న రైతులకు కంటితుడుపు చర్యగా క్వింటాల్‌కు రూ.5 వేల ధర ప్రకటించి చేతులు దులుపుకొంది. మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం ద్వారా కొనుగోళ్లు చేయనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు వివరాలను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్, కేంద్ర సమాచార శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు బుధవారం ఢిల్లీలో వెల్లడించారు. తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలు.. ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా రైతుల నుంచి, రైతు సంస్థల నుంచి, కోఆపరేటివ్ మార్కెట్ల నుంచి మిర్చిని క్వింటాలుకు రూ.5 వేలు చెల్లించి కొనుగోలు చేస్తాయని చెప్పారు. తెలంగాణలో 33,700 టన్నులు, ఏపీలో 88,300 టన్నుల మిర్చిని సేకరిస్తారని, ఈ కొనుగోలు ద్వారా నష్టం వచ్చినట్టయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 చొప్పున భరిస్తాయని తెలిపారు. ఈ పథకం కింద ఈ నెల 2వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కొనుగోళ్లు చేయాలని పేర్కొన్నారు. అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. తెలంగాణ ప్రభుత్వం రూ.7 వేలు ఇవ్వాలని కోరితే.. కేంద్రం కేవలం రూ.5 వేలు ఇస్తూ నిర్ణయం తీసుకోవడంపై ప్రభుత్వ వర్గాలు పెదవి విరుస్తున్నాయి. మిర్చిని రూ.4–5 వేల మధ్య దళారులు కొనుగోలు చేస్తున్నందునే రూ.7 వేలకు కొనుగోలు చేయాలంటూ కేంద్రానికి విన్నవించామని, కానీ కేంద్రం కూడా దళారుల మాదిరే వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్రం నిర్ణయించిన ధర, పరిమితి వల్ల మళ్లీ మిర్చి మంటలు చెలరేగుతాయని అంటున్నారు. అమలు చేద్దామా? బోనస్ ఇద్దామా? రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ద్వారా కేవలం 33,700 టన్నుల (3.3 లక్షల క్వింటాళ్లు) మిర్చి మాత్రమే కొనుగోలు చేయాలంటూ కేంద్రం పరిమితి విధించింది. కొనుగోలు పన్ను, గోదాముల చార్జీలు, ప్యాకింగ్ మెటీరియల్, లోడింగ్, అన్లోడింగ్ ఇతరత్రా చార్జీలు కలిపి క్వింటాలుకు రూ.1,250గా నిర్ణయించారు. రైతుల నుంచి ప్రభుత్వ సంస్థల ద్వారా అంటే సహకార సంఘాలు, రైతు సంస్థలే చేయాలి. దళారులను దూరం పెట్టాలి. సేకరించిన మిర్చి నిల్వలను బహిరంగ మార్కెట్లో విక్రయించుకోవాలి. రైతులకు చెల్లింపులను డిజిటల్ లేదా నగదు రహిత లావాదేవీల ద్వారానే చేయాలని కేంద్రం సూచించింది. కేంద్రం రూ.5 వేలే ప్రకటించడంపై రాష్ట్ర సర్కారు అసంతృప్తితో ఉంది. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా అధికారులతో సమావేశమై నిర్ణయం తీసుకుంటారని సమాచారం. కేంద్రం నిర్ణయాన్ని అమలు చేయాలా? లేక తామే క్వింటాలుకు రూ.1500 బోనస్ ఇచ్చి రైతులను ఆదుకోవాలా అన్న తర్జనభర్జనలో అధికారులున్నారు. కొనాల్సింది ఇంకా 30 లక్షల క్వింటాళ్లు రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపు 30 లక్షల క్వింటాళ్ల మిర్చిని రైతులు అమ్మేశారు. ఇంకా 30 లక్షల క్వింటాళ్లు రైతుల వద్ద ఉందని మార్కెటింగ్ శాఖ అంచనా వేసింది. ధాన్యం, కందులు, మొక్కజొన్న తదితర పంటల కొనుగోలుకు కేంద్రం 100 శాతం అనుమతి ఇచ్చింది. కానీ మిర్చి కొనుగోలు వద్దకు వచ్చేసరికి మార్కెట్‌కు వచ్చిన వాటిల్లో కేవలం 10 శాతం మాత్రమే అనుమతిచ్చింది. ఇంకా 30 లక్షల క్వింటాళ్లు రైతుల వద్ద ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం 3.3 లక్షల క్వింటాళ్లకే అనుమతి ఇచ్చింది. మిగిలిన 26.70 లక్షల క్వింటాళ్ల మిర్చి సంగతేంటని అధికారులు ప్రశ్నిస్తున్నారు. రోజుకు లక్ష క్వింటాళ్లు మార్కెట్‌కు వస్తోంది. కేంద్రం అనుమతించిన ప్రకారం మూడు రోజుల్లోనే కొనుగోళ్లు పూర్తవుతాయి. ప్రస్తుతం శీతల గిడ్డంగులు లేని పరిస్థితుల్లో నష్టం ఎక్కువగా ఉండే అవకాశముంది. కానీ కేంద్రం మొత్తం నష్టాన్ని 25 శాతానికి కుదించినందున అందులో సగం మాత్రమే భరించేందుకు ముందుకొచ్చింది. అంటే ఇచ్చిన అనుమతికి అయ్యే ఖర్చు రూ. 212 కోట్లలో కేంద్రం వాటా రూ.26 కోట్లు మాత్రమే. మిగిలినదంతా రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అంటున్నారు. ఇది కూడా కేవలం 3.3 లక్షల క్వింటాళ్లకే. మిగిలిన 26.70 లక్షల క్వింటాళ్లకు మరో రూ.1,800 కోట్లు వర్కింగ్ కేపిటల్ అవసరం. దీనికి కేంద్రం బాధ్యత లేదంటున్నారు. 30 నుంచి 50 శాతం వరకు నష్టం అనుకున్నా.. రూ.600 కోట్ల నుంచి రూ.వెయ్యి కోట్ల వరకు నష్టం వచ్చే అవకాశముంది. నిల్వ చేసుకునే సదుపాయం కూడా లేదు. కాబట్టి ఎక్కువగా నష్టం వచ్చే అవకాశం ఉందని మార్కెటింగ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
కంది సాగుపై.. నజర్
♦ మొదటి సారిగా ముందుకొచ్చిన సంస్థ ♦ కొన్నవాటిని విత్తనాలుగా ఇచ్చి ♦ సాగు పెంచేందుకు చర్యలు ♦ క్షేత్రస్థాయిలో నిల్వలపై సర్వే ♦ వ్యవసాయ శాఖ డెరైక్టర్‌కు ప్రతిపాదనలు ♦ కందుల కొనుగోలుకు వ్యవసాయ శాఖ యోచన! పప్పు ధాన్యాల సాగు గణనీయంగా తగ్గింది. దీంతో ధరలు ఆకాశన్నంటుతున్నాయి. సామాన్యులు వాటిని కొనలేని పరిస్థితి నెలకొంది. వీటన్నింటికీ చెక్ పెట్టడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. వ్యవసాయ శాఖ ద్వారా కందులు కొనుగోలు చేసి వాటిని రైతులకు విత్తనాలుగా అమ్మి పప్పు ధాన్యాల సాగు పెంచడానికి నిర్ణయించింది. దీనిలో భాగంగానే మొదటిసారి వ్యవసాయ శాఖ ద్వారా కందుల కొనుగోలు చేసే ఆలోచనలో ఉంది. తాండూరు కందులు రుచిలో మేటిగా ఉండడంతో వీటిని ముందుగా కొనుగోలు చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. తాండూరు: మొట్టమొదటి సారిగా కందుల కొనుగోలుకు వ్యవసాయ శాఖ సన్నద్ధమవుతోంది. మార్కెట్ ధరకే రైతుల నుంచి కందులు కొనుగోలు చేయాలని భావిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా కందుల సేకరణకు వ్యవసాయ శాఖ కసరత్తులు చేస్తున్నది. జిల్లాలో కంది పంట విస్తీర్ణాన్ని మరింత పెంచేందుకు కందుల కొనుగోలుకు వ్యవసాయ శాఖ అధికారులు యోచిస్తున్నారు. ఇందుకు సంబంధించి జిల్లా అధికారులు వ్యవసాయ శాఖ డెరైక్టర్‌కు ప్రతిపాదనలు పంపించారు. ఈ డెరైక్టర్ ఈ విషయమై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో కందుల నిల్వలపై అధ్యయనం చేశారు. తాండూరు మండలంతోపాటు స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీలో కందుల నిల్వల వివరాలు సేకరించారు. రైతుల వద్ద సుమారు 10వేల క్వింటాళ్ల వరకు కందుల నిల్వలున్నట్టు అధికారులు వ్యవసాయ శాఖ డెరైక్టర్‌కు నివేదించారు. మార్కెట్ యార్డులో క్వింటాలు కందులకు ప్రస్తుతం రూ.7వేల నుంచి రూ.8200 వరకు ధరలు పలుకుతున్నాయని అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన కందులను తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థకు అప్పగించనున్నారు. వచ్చే వర్షాకాలం నాటికి కంది విస్తీర్ణాన్ని పెంచాలనే దిశగా ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో ఇందుకు అనుగుణంగా అవసరం మేరకు కంది విత్తనాలను సిద్ధం చేయాలన్నది అధికారుల లక్ష్యంగా కనిపిస్తున్నది. ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా రైతుల నుంచి కందులు కొనుగోలు చేయనున్నారు. నాణ్యత, రుచిలో తాండూరు కంది మేటి... జాతీయస్థాయిలో తాండూరు కంది ప్రసిద్ధి. నాణ్యతలో, రుచిలో ఇక్కడి కందిపప్పు మేటి. జిల్లాలోనే తాండూరులో అత్యధికంగా రైతులు కందిపంటను సాగు చేస్తారు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఎఫ్‌సీఐ, మార్క్‌ఫెడ్,నాఫెడ్, డీసీఎంఎస్ ప్రభుత్వరంగ సంస్థలు కందులను కొనుగోలు చేశాయి. తాజాగా వ్యవసాయ శాఖ కూడా ముందుకు రావడం గమనార్హం. అధికారంలోకి వస్తే తాండూరు కందిసాగును ప్రోత్సహిస్తామని ఎన్నికల సమయంలో కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తాండూరులో కందిబోర్డు ఏర్పాటుకు కృషి చేస్తానని ఇటీవల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి ప్రకటించారు. తిరుపతి లడ్డూ మాదిరిగా భౌగోళిక గుర్తింపు (జీఐ) కోసం స్థానిక శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ఈ- మార్కెటింగ్‌కు తాండూరు మార్కెట్ కమిటీ ఎంపికైన విషయం తెలిసిందే. -
రైతులకు మార్కెట్ ధర చెల్లించాలి
కృష్ణా జిల్లా జి.కొండూరులో 33వ నెంబర్ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులు గురువారం ఆందోళనకు దిగారు. తమకు ప్రభుత్వం సరైన ఇవ్వటం లేదని రహదారిపై రాస్తారోకోకు దిగారు. మార్కెట్ రేటు ప్రకారం ఎకరా రూ.2 కోట్లు పలుకుతున్న భూములకు ప్రభుత్వం కేవలం రూ.16 లక్షలు మాత్రమే చెల్లిస్తుండటంతో ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వం కనీసం రూ.కోటి ఐనా చెల్లించాలని ధర్నా చేపట్టారు. రైతులు చేపట్టిన రాస్తారోకోతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. -
ఇదో రకం టెండర్!
ఎక్కువ మొత్తంలో సరుకులు కొనుగోలు చేస్తే మార్కెట్ ధరకంటే రూపాయో, రెండు రూపాయలో తగ్గించడం సహజం. అదే భారీ మొత్తంలో ఏడాది పాటు కొనుగోలు చేస్తే ఇంకా తగ్గించడం వ్యాపార లక్షణం. అదే టెండర్ల ప్రక్రియలో ఎవరు తక్కువ ధరకు ఇస్తే వారి వద్దే కొంటాం. అయితే గిరిజన సహకారం సంఘం (జీసీసీ) ఆధ్వర్యంలో ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాలకు పప్పులు, కాస్మోటిక్స్, కూరగాయలు సరఫరా చేయడానికి వేసిన టెండర్లు భిన్నంగా ఉన్నాయి. టెండర్ల విధానానికి విరుద్ధంగా ధరలు కొండెక్కి కూర్చున్నాయి. నాలుగు రోజుల కిందట ఐటీడీఏలో జరిగిన టెండర్ల ప్రక్రియలో వ్యాపారులు సిండికేట్‌గా మారడంతో ఈ పరిస్థితి నెలకుందనే విమర్శలు వస్తున్నాయి. సీతంపేట:సీతంపేట సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) పరిధిలో 44 గిరిజన సంక్షేమ ఆశ్రమఉన్నత పాఠశాలలు, మూడు వసతిగృహాలు, 22 పోస్ట్‌మెట్రిక్ వసతిగృహాలు, ఒక కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్, మూడు గురుకుల కళాశాలలు, నాలుగు గురుకుల పాఠశాలలు, మూడు కేజీబీవీలు, రెండు మినీ గురుకులాలున్నాయి. వీటిలో 18,850 మంది గిరిజన విద్యార్థినీ విద్యార్థులు చదువుతున్నారు. వీరి మెనూకు అవసరమైన సరుకులన్నీ (కూరగాయలు తప్ప) జీసీసీ ద్వారా సరఫరా చేయాలి. గిరిజన సంక్షేమశాఖ ద్వారా నిధులు వచ్చిన వెంటనే మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాదికి జీసీసీకి చెల్లిస్తుంటారు. అయితే మెనూకు అవసరమైన వస్తువలను టెండర్ ప్రక్రియ ద్వారా జీసీసీ కొనుగోలు చేసి సరఫరా చేస్తుంది. ప్రతీ ఏటా విద్యాసంవత్సరం ఆరంభంలో ఈ తంతు జరుగుతుంది. గతేడాది టెండర్లు వేయకుండానే విజయనగరం జిల్లాలోని టెండర్ ధరలను ఇక్కడ అమలు చేశారు. అయితే టెండర్లప్పుడు ఒక క్వాలిటీ సరుకులను చూపించి అనంతరం సరఫరా చేసినప్పుడు నాశిరకం సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. కందిపప్పు వంటి ముఖ్యమైన సరుకులు ఇలానే వసతిగృహాలకు గతంలో సరఫరా చేశారు. అప్పట్లో రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖాధికారులు కూడా హాస్టళ్లను సందర్శించినపుడు నాణ్యత లేని కందిపప్పును, ఇతర వస్తువులను తిరస్కరించాలని ఆదేశించారు. ప్రస్తుతం టెండర్‌దారులు కోట్ చేసిన ధరలిలా ఉన్నాయి. జీసీసీ వేసిన టెండర్లలో వ్యాపారులు కోట్ చేసిన ధరలు పరిశీలిస్తే.. కందిపప్పు కిలో రూ. 155కు కోట్ చేశారు. ప్రస్తుతం మండుతున్న ధరల్లోనే కిలో కందిపప్పు రూ.150 ఉంది. అయినా రూ.5 ఎక్కువగా టెండర్ వేయడం గమనార్హం. నెల రోజుల క్రితమైతే కిలో రూ. 108 ఉండేది. ఇప్పుడు టెండర్‌దారులు రూ.155 కోట్ చేయడం అనుమానాలకు తావిస్తోంది. కారంపొడి కిలో ప్యాకెట్ మార్కెట్లో రూ. 140 లోపు ఉండగా టెండర్ దారులు రూ. 142కి ఖరారు చేశారు. రిన్ సబ్సు రూ.4.55 పైసలు, డాబర్ కొబ్బరి, సంతూర్ సబ్బు చిన్నది మార్కెట్లో రూ.5 ఉండగా కేవలం 50 పైసలు మాత్రమే తగ్గించారు. అదే డిపార్ట్మెంట్ మార్కెట్లో ఒక్కటి కొనుగోలు చేస్తేనే రూపాయి వరకు తగ్గిస్తారు. టెండర్‌దారులు రూ.4.50 పైసలకు కోట్ చేశారు. పది రూపాయల టూత్ పేస్ట్ రూ.8.50 ధర ఖరారయ్యింది. నూనె రూ.23.75 పైసలు, (వంద గ్రాములు), లీటర్ పామాయిల్ ప్యాకెట్ రూ.47, పెసరపప్పు కిలో రూ. 102, గుడ్‌మిల్క్ ప్యాకెట్ రూ.39, బన్సీ రవ్వ రూ. 23.75, బటాణీ రూ.33.25 పైసలకు సరఫరా చేసేలా టెండర్‌దారులు కోట్ చేశారు. దీనిలో ఒకటి, రెండు వస్తువులు తప్పితే మిగతా వస్తువులన్నీ అధికధరలకు ఉండడం గమనార్హం. అరువుపై ఇస్తున్నారు కాబట్టి తప్పదు: మోహన్‌రావు,జీసీసీ డీఎం ఈ విషయాన్ని జీసీసీ డివిజనల్ మేనేజరు మోహన్‌రావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా.. అరువుపై సరుకులను సరఫరా చేస్తారు కాబట్టి ఈ ధరలు కేటాయించడం తప్పడం లేదన్నారు. గిరిజన సంక్షేమశాఖ ద్వారా బిల్లులు ఎప్పటికో అవుతాయన్నారు. గతేడాది బిల్లులు ఇంతవరకు టెండర్‌దారులకు చెల్లించలేదని చెప్పారు. -
గ్యాస్ రాయితీ రద్దు
- ఆధార్‌తో అనుసంధానమైతేనే సబ్సిడీ - 15 నుంచే అమలు - డీబీటీఎల్కు జంటజిల్లాల్లో - ఏడు లక్షల మంది దూరం - మార్కెట్ ధరపైన సిలిండర్ సరఫరా సాక్షి, హైదరాబాద్: మీ గ్యాస్ కనెక్షన్ ఆధార్‌తో అనుసంధానం కాలేదా? అయితే సిలిండర్‌పై రాయితీ ఆగిపోనుంది.. ఇక నుంచి మార్కెట్ ధరపైనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇది ఆదివారం నుంచే అమలులోకి వచ్చింది. సోమవారం నుంచి ఆధార్, బ్యాంకు ఖాతా, డీలర్ పేరు అనుసంధానం చేసుకున్న వారికి మాత్రమే రాయితీ వర్తిస్తుంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో దాదాపు ఏడు లక్షల మంది వినియోగదారులు అదనపు భారాన్ని మోయనున్నారు. ప్రస్తుతం జంట జిల్లాల్లో సుమారు 29 లక్షల ఎల్పీజీ గృహా వినియోగదారులు ఉన్నారు. అందులో బ్యాంక్ ఖాతాలతో అనుసంధానమైన 22.24 లక్షల వినియోగదారులకు మార్కెట్ ధరపై సిలిండర్ సరఫరా జరుగుతోంది. సిలిండర్ సబ్సిడీ నగదు రూపంలో బ్యాంకు ఖాతాల్లో జమ అవుతోంది. అనుసంధానికి దూరంగా 6.76 లక్షల వినియోగదారులకు మాత్రం వెసులుబాటు కారణంగా ఫిబ్రవరి 14 వరకు సబ్సిడీ ధరపైనే సిలిండర్ సరఫరా అవుతూ వచ్చింది. ఇప్పటి వరకూ వారు అనుసంధానం చేసుకోక పోవడంతో మార్కెట్ ధరకు సిలిండర్ కొనుగోలుచేసుకోవాలి. ప్రస్తుతం డొమెస్టిక్ వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.675.50పైసలు. ఆధార్‌తో అనుసంధానం అయిన వారికి సబ్సిడీ రూ.219లు బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. సబ్సిడీ పొందాలనుకుంటే తప్పనిసరిగా ఎల్పీజీని ఆధార్, బ్యాంక్ ఖాతాలతో అనుసంధానం చేసుకోవల్సిందే.. మరో మూడు నెలల గడువు.. డెరైక్ట్ బెనిఫిట్ ట్రాన్ఫర్ ఎల్పీజీ (డీబీటీఎల్) పథకం గడువు ఫిబ్రవరి 14తో ముగిసింది. మే 15వ తేదీలోగా అనుసంధానం చేసుకుంటే మూడు నెలల్లో ఎన్ని సిలిండర్లు తీసుకున్నారో వాటికి ఒకేసారి సబ్సిడీ జమ అయ్యే వెసులుబాటు ఉంది. ఆ తర్వాత ఎటువంటి రాయితీ పొందే అవకాశం ఉండదు. -
తాగునీటికీ సోలార్ పంప్సెట్లు
తెలంగాణ, ఏపీలకు చెరో వెయ్యి యూనిట్లు మంజూరు చేసిన కేంద్రం వ్యవసాయానికి 1,425 పంప్సెట్లు తొలి టెండర్ల రద్దుతో.. వీటికీ పీటముడి కొనుగోళ్లకు వెనుకాడుతున్న టీఎన్ఆర్ఈడీసీ ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ పంప్‌సెట్లతో పాటు తాగునీటి పథకాలకు సోలార్ పంప్సెట్లు అమర్చనున్నారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఈ ప్రయోగానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో రాష్ట్రానికి వెయ్యి పంప్ సెట్లను మంజూరు చేసింది. ఫలితాలను అధ్యయనం చేసేందుకు.. అనువైన భౌగోళిక వాతావరణ పరిస్థితులున్న చోట వీటిని అమర్చాలని సూచించింది. ఎంపిక చేసిన గ్రామాల్లోనే అమర్చాలని, గ్రామీణ నీటి సరఫరా విభాగాన్ని (ఆర్డబ్ల్యూఎస్) ఇందులో భాగస్వామిని చేయాలని కేంద్రం మార్గదర్శకా లు జారీ చేసింది. ఇందులో భాగంగా 3 హెచ్‌పీ, 5 హెచ్‌పీ సామర్థ్యమున్న పంప్సెట్లకు టెండర్లు పిలిచి కొనుగోలు చేస్తారు. అంతమేరకు సామర్థ్యంతో నిర్వహించగలిగే చిన్న తాగునీటి పథకాలకు అమర్చుతారు. ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలను కేంద్రం సంప్రదాయేతర ఇంధన వనరుల విభాగానికి (ఎన్‌ఆర్‌ఈడీసీ) అప్పగించింది. వ్యయంలో 30 శాతం కేంద్రం సబ్సిడీ ఇస్తుంది. ఇటీవల వ్యవసాయానికి మంజూరు చేసిన సోలార్ సెట్ల కొనుగోలుకు ఆరంభంలోనే చుక్కెదురైంది. మొత్తం వెయ్యి సెట్ల కొనుగోలుకు రెండు రాష్ట్రాల సంప్రదాయేతర ఇంధన వనరుల విభాగాలు వేర్వేరుగా టెండర్లు పిలిచాయి. మార్కెట్ ధర కంటే కంపెనీలు ఎక్కువ రేట్ కోట్ చేసినట్లు అభియోగాలు రావటంతో తెలంగాణ ప్రభుత్వం టెండర్ల రద్దుకు ఆదేశించింది. దీంతో తెలంగాణ సంప్రదాయేతర, పునరుత్పాదక ఇంధన అభివృద్ది సంస్థ (టీఎన్ఆర్ఈడీసీ) టెండర్ల ప్రక్రియను యథాతథంగా నిలిపివేసింది. దీంతో ఏపీ ప్రభుత్వం సైతం పంప్సెట్ల కొనుగోలును ఆపేసింది. దీంతో కొత్త పంప్సెట్ల కొనుగోళ్లపై ప్రతిష్టంభన నెలకొంది. మరోవైపు విద్యుత్తు సంక్షోభం దృష్ట్యా తెలంగాణకు మరో 5వేల వ్యవసాయ పంప్సెట్లు మంజూరు చేయాలని టీఎన్ఆర్ఈడీసీ కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. వీటిలో 1,425 పంప్సెట్లు మంజూరు చేస్తూ కేంద్రం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 3,425 పంప్సెట్లు మంజూరైనట్లు అధికారులు తెలిపారు. కానీ.. మొదటిదశలో పిలిచిన టెండర్లు రద్దు కావటంతో వీటి కొనుగోలుకు టీఎన్ఆర్ఈడీసీ వెనుకంజ వేస్తోంది. కొత్తగా మంజూరైన యూనిట్ల వివరాలతో పాటు కొనుగోలు ప్రతిపాదనలన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు టెండర్లు ముందుకు కదిలే పరిస్థితి లేదని.. అందుకే కొత్త వాటికి టెండర్లు పిలవాలా.. వద్దా.. అనే సందిగ్ధత ఉందని ఒక ఉన్నతాధికారి అన్నారు. మరోవైపు తెలంగాణలో మొత్తం 20 లక్షల సోలార్ పంప్సెట్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. సాధ్యాసాధ్యాల పరిశీలన, కంపెనీల ప్రతినిధులతో సమాలోచనలు జరిపేందుకు వివిధ విభాగాల ముఖ్య కార్యదర్శులతో ఇటీవలే కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నిర్ణయాలు.. సూచనలు అందే వరకు ప్రభుత్వం ఈ యూనిట్ల కొనుగోలుకు అంగీకరిస్తుందా, లేదా అనే సందేహాలను అధికారులు వెలిబుచ్చారు. -
మిర్చి రైతులను ఏమార్చి..!
పాతగుంటూరు : కోల్ట్ స్టోరేజీల నిర్వాహకులు, వ్యాపారుల మాయూజాలంతో మిర్చి రైతులు మోసపోతున్నారు. మంచి ధర వచ్చినపుడు మిర్చి అమ్మి నాలుగు రాళ్లు సంపాదిద్దామన్న రైతులను ఏమార్చి కోల్డ్ స్టోరేజీల నిర్వాహకులు, వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు సొమ్ము చేసుకుంటున్నారు. మరోవైపు జీరో వ్యాపారంతో సెస్ చెల్లించకుండా మార్కెట్ యూర్డు ఆదాయూనికి గండికొడుతున్నారు.ఇదీ జరుగుతోంది.. కోస్తాంధ్రలోని జిల్లాల రైతులు తాము పండించిన మిర్చిని గుంటూరు మిర్చి యార్డులో విక్రరుస్తుంటారు. సరుకు తీసుకొచ్చిన రోజు మార్కెట్ ధర ఆశాజనకంగా లేకపోయినా, మరికొద్ది రోజుల్లో మంచి ధర వచ్చే అవకాశం ఉందని భావించినా తాము తెచ్చిన మిర్చి బస్తాలను కోల్డు స్టోరేజిల్లో నిల్వ చేస్తుంటారు. ఈ సందర్భంలోనే మంచి ధర వచ్చిన రోజున సరుకు విక్రరుుంచేందుకు వీలుగా కోల్డు స్టోరేజీల నిర్వాహకులు, వ్యాపారులు రైతులతో ఒప్పంద పత్రం(బాండ్) రాయించుకుంటారు. అంతేకాకుండా కోల్డ్ స్టోరేజీలో పెట్టిన సరుకును తాకట్టుగా ఉంచుకుని అవసరమైతే రైతులకు రుణంగా కొంతమొత్తం కూడా అందజేస్తారు. మంచి ధర వచ్చిన రోజున రైతులకు ఫోన్ ద్వారా సమాచారం అందించి సరుకు విక్రరుుస్తారు. సాధారణంగా ఇక్కడే రైతులు మోసపోతుంటారు. వ్యాపారులు మార్కెట్లో విక్రరుుంచిన ధర కన్నా రైతుకు తక్కువ చెల్లించి జెల్లకొడుతుంటారు. కమీషన్ ఏజెంట్లది కీలకపాత్ర.. ఈ దందాలో కమీషన్ ఏజెంట్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. పంట సాగుకు రైతులకు అవసరమైన విత్తనాలు, పురుగు మందులు, ఎరువులను గుంటూరులోని కమీషన్ ఏజెంట్లు, కోల్డ్ స్టోరేజీల నిర్వాహకులు అరువుపై ఇప్పిస్తారు. తీసుకున్న అరువుకు వ్యాపారులు వడ్డీ కట్టించుకుంటారు. అంతేకాకుండా ఖాళీ ప్రామిసరీ నోట్లపై రైతుల సంతకాలు, వేలిముద్రలు తీసుకుంటారు. ఇంత జరిగినా అవసరానికి ఆదుకున్నారన్న కృతజ్ఞతతో కమీషన్ ఏజెంట్లు చెప్పినట్లు మిర్చి రైతులు వింటుంటారు. వారు చెప్పిన కోల్డ్ స్టోరేజీల్లోనే మిర్చి బస్తాలను నిల్వ చేస్తారు. కాగా గుంటూరులో ఉన్న కోల్డ్ స్టోరేజీల్లో ఎక్కువ శాతం కమీషన్ ఏజెంట్లు, ఎగుమతి-దిగుమతి వ్యాపారులు, ఎరువులు, పురుగుమందుల దుకాణదారులవే కావటం గమనార్హం.అధిక అద్దె వసూలు.. కోల్డ్ స్టోరేజీలో ఏడాదిపాటు నిల్వ చేసేందుకు బస్తాకు 100 రూపాయల చొప్పున అద్దె చెల్లించాలనేది నిబంధన. కానీ రూ.130 చొప్పున వసూలు చేస్తున్నారు. కేవలం నెల రోజులే నిల్వ చేసినా కనీస రుసుముగా 130 రూపాయలు వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం ఉండటం లేదని పెదకూరపాడుకు చెందిన వెంకటేశ్వర్లు అనే రైతు చెప్పారు. దీనిపై ప్రశ్నిస్తే ఇష్టం ఉంటే పెట్టుకోండి లేకుంటే వెళ్లిపోండని కోల్డు స్టోరేజీల నిర్వాహకులు సమాధానం ఇస్తున్నారని వాపోయూరు. నిల్వ చేసే రోజులను బట్టి అద్దె వసూలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. అన్ని రకాల కూలుల వసూలు.. కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన మిర్చి బస్తాలను అమ్మిన సందర్భంలోనూ అన్ని రకాల కూలీలను వ్యాపారులు వసూలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. వాస్తవానికి కాటా, హమాలీ కూలి తప్ప మరే కూలి కట్టాల్సిన అవసరం లేదు. అయినా వ్యాపారులు దొడ్డి కూలి, కాటా కూలి, ఎత్తుడు, దించుడు కూలి, తరుగు ఇలా అనేక పేర్లతో సొమ్ము మినహారుుంచుకుని మిగతా మొత్తం చెల్లిస్తున్నారు. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో ఎక్కువమంది రైతులు యార్డుకు సరుకు తెచ్చిన రోజే అరుునకాడికి విక్రరుుంచి వెళ్లిపోతున్నారు. మార్కెట్ యార్డు ఆదాయం గోవిందా.. కోల్డ్ స్టోరేజీల వద్దే మిర్చి టిక్కీలను విక్రరుుస్తుండటంతో వ్యాపారుల నుంచి రావాల్సిన ఒక శాతం యార్డు సెస్ వసూలు కావటం లేదు. దీన్నే జీరో వ్యాపారమని అంటారు. దీనివల్ల మిర్చి యూర్డు ఏటా కోట్లాది రూపాయల ఆదాయూన్ని కోల్పోతోంది. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదు. వ్యాపారుల నుంచి భారీగా మామూళ్లు అందుతుండటమే దీనికి కారణమన్న ఆరోపణలు ఉన్నారుు. వ్యాపారులు చేస్తున్న జీరో వ్యాపారం గురించి ప్రస్తుత దిగుమతి వ్యాపారుల సంఘం నాయకులు ఐదేళ్ల క్రితమే అప్పటి కలెక్టర్, మార్కెటింగ్ శాఖ కమిషనర్ల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. -
న(అ)మ్మకాన్ని వంచించారు!
ఆదోని: వేల రూపాయలు పెట్టుబడి పెట్టి, ఇంటిల్లిపాది ఆరుగాలం చెమటోడ్చి వేరుశనగ పండించారు. పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో దిగుబడులను ఇళ్లలో దాచిపెట్టుకున్నారు. ఇంతలోనే ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ ఫెడ్ గిట్టుబాటు ధరకు దిగుబడులు కొనుగోలు చేస్తోందని చెప్పడంతో రైతులు ఎంతో సంబర పడ్డారు. మార్కెట్ ధర క్వింటాల్ రూ.2200 నుంచి రూ.3300 వరకు ఉండగా..అయిల్ ఫెడ్ క్వింటాల్‌కు రూ.నాలుగు వేలు చెల్లిస్తామని చెప్పడంతో ఈ ఏడాది జనవరిలో విక్రయించారు. ఫిబ్రవరి నెలాఖరులోగా రైతులకు బిల్లులు చెల్లించాల్సి ఉన్నా..ఇంతవరకు కొందరు రైతులకు డబ్బులు అందకపోవడంతో అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రస్తుతం పంట పెట్టుబడులకు చేతిలో డబ్బు లేక..బ్యాంకులు రుణాలివ్వకపోవడంతో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. పక్షం రోజుల్లో బిల్లులు చెల్లిస్తామన్నారు.. అయిల్ ఫెడ్ అధికారులు జిల్లాలోని ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, డోన్, ఆలూరు, కర్నూలు మార్కెట్ యార్డులలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో వ్యవ,ప్రయాసాలు కోర్చి రైతులు దిగుబడులను అమ్ముకున్నారు. పత్తికొండ యార్డులో ఏర్పడిన గందరగోళంతో కొనుగోళ్లు కొన్నాళ్లు నిలిచిపోయాయి. దీంతో రైతులు నాలుగైదు రోజుల పాటు రోడ్డెక్కి ఆందోళన నిర్వహించడంతో కొనుగోలులో నిర్లక్షం చేశారనే కారణంతో ఆయిల్ ఫెడ్ మేనేజరు ఎల్లారెడ్డి, పత్తికొండ కొనుగోలు కేంద్రం ఇన్చార్జ్ బ్రహ్మేశ్వరరెడ్డిపై అప్పట్లో ప్రభుత్వం సస్సెన్షన్ వేటు వేసింది. ఎట్టకేలకు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా ఆయిల్ ఫెడ్ సంస్థ లక్షా 45 వేల క్వింటాళ్లు కొనుగోలు చేశారు. అధికారులు పక్షం రోజుల్లో బిల్లులు చెల్లిస్తామని చెప్పి కొనుగోలు చేసిన వేరు శనగకు సంబందించి రైతులకు రశీదులు ఇచ్చారు. చేతికి డబ్బులు అందగానే పంట సాగు కోసం చేసిన అప్పులు చెల్లించి ఆ తరువాత తమ ఆర్థిక అవసరాలు తీర్చుకోవాలని అన్నదాతలు ఆశించారు. పలువురు ఖరీఫ్ పంట పెట్టుబడికి ఇక దిగులుండదని బావించారు. అయితే చెప్పిన సమయానికి బిల్లులు చెల్లించకపోవడంతో రైతులకు తెలిసొచ్చి తెల్లబోయారు. గత జనవరిలో కొనుగోలు చేయగా పక్షం రోజుల్లో రైతులందరికీ బిల్లులు చెల్లించాలి. అయితే దాదాపు రెండు నెలల తరువాత బిల్లుల చెల్లింపులు ప్రారంభించారు. అప్పటికే మార్కెట్ యార్డుల చుట్టు ఎన్నో సార్లు తిరిగి వేసారి పోయారు. ఇంకా బిల్లులు అందని రైతులు వందల్లో ఉన్నారు. ఆదోనిలోనే దాదాపు 596 మందికి రూ.4.23 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఆదోని,కర్నూలు, పత్తికొండ, ఎమ్మిగనూరు, డోన్ మార్కెట్ యార్డులలో కూడా చాలా మందికి బిల్లులు అందాల్సి ఉంది. అయితే ఆదోనిలో తప్ప మిగిలిన మార్కెట్ యార్డుల పరిధిలో బకాయిలు రూ.లక్షల్లో మాత్రమే ఉందని ఆయిల్ ఫెడ్ జిల్లా కో-ఆర్డినేటర్ సుధాకర్ రావు పేర్కొన్నారు. వేరు శనగ అమ్మి ఇప్పటికే దాదాపు ఆరు నెలలు అవుతోంది. స్థానికంగా ఆయిల్ ఫెడ్ అధికారులు ఎవ్వరు లేక పోవడంతో తమ బకాయిల కోసం ఎవరిని సంప్రదించాలో రైతులకు దిక్కు తోచడం లేదు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం అయి దాదాపు పక్షం రోజులు అయింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ ఇంకా ఎటు తేలలేదు. బకాయిలు చెల్లిస్తేనే కొత్త రుణాలిస్తామని బ్యాంకర్లు తెగేసి చెపుతున్నారు. ఇటు ఆయిల్ ఫెడ్ అధికారులు బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారో తెలీయక, అటు బ్యాంకుల్లో అప్పు పుట్టక అన్నదాత ఆందోళనకు గురవుతున్నాడు. ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో తాము గుడ్డిగా నమ్మి చేతికి అందిన పంట దిగుబడులను అమ్ముకున్నామని, బిల్లులు ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పేవారు కరువయ్యారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో అమ్ముకుని ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాదులో మకాం పెట్టిన ఆయిల్ ఫెడ్ అధికారి ఆదోని ఆయిల్ ఫెడ్ కొనుగోలు కేంద్రం అధికారి నరేంద్రరెడ్డి తన మకాంను హైదరాబాదుకు మార్చారు. దీంతో బిల్లుల కోసం వచ్చిన రైతులకు సమాధానం చెప్పేందుకు స్థానికంగా ఎవ్వరు లేకుండా పోయారు. రైతుల నుంచి వస్తున్న ఒత్తిళ్లను తట్టుకోలేకే ఆయన హైదరాబాదులో ఉన్నట్లు తెలుస్తోంది. నరేంద్ర రెడ్డిని ‘సాక్షి’ఫోన్లో సంప్రదించగా బకాయి బిల్లులకు సంబంధించిన నిధులు మంజూరు చేయించుకోడానికి తాను హైదరాబాదులో ఉన్నట్లు చెప్పారు. నిధులు మంజూరు కాగానే రైతులకు డబ్బులు చెల్లిస్తామని, ఎవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. వారం రోజుల్లో వేరు శనగ అమ్మిన రైతులందరికీ బిల్లులు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయిల్ ఫెడ్ జిల్లా కో-ఆర్డినేటర్ సుధాకర్ రావు వెల్లడించారు.