దూసుకుపోతున్న వర్జీనియా మార్కెట్
దూసుకుపోతున్న వర్జీనియా మార్కెట్
Published Tue, Sep 19 2017 12:38 AM | Last Updated on Tue, Sep 19 2017 4:44 PM
ఆశాజనకంగా పొగాకు ధరలు
కిలో సగటు ధర రూ.173
సాగుకు సన్నద్ధమవుతున్న రైతులు
దేవరపల్లి:
వర్జీనియా పొగాకు మార్కెట్ ఆశాజనకంగా ఉంది. అధికారులు, రైతులు ఊహకు అందని విధంగా పొగాకు ధరలు పలుకుతున్నాయి. దాదాపు నెల రోజులుగా మార్కెట్ పుంజుకుంది. సోమవారం జిల్లాలోని వేలం కేంద్రాల్లో కిలో గరిష్ట ధర రూ.190, సగటు ధర రూ.173.70 లభించింది. ఈ ఏడాది మార్చి 15న ప్రారంభమైన కొనుగోళ్లు జూలై వరకు మందకొడిగా జరిగాయి. గిట్టుబాటు ధర రాక రైతులు పంటను అమ్ముకోవడానికి ఆసక్తిచూపలేదు. రోజుకు 200కు మించి బేళ్లు వేలానికి రాకపోవడంతో అధికారులు కూడా అయోమయంలో పడ్డారు. కొంతకాలం టేడర్లు కూడా సిండికేట్‌గా మారి ధర విషయంలో సీలింగ్ వి«ధించడంతో రైతులు వేలాన్ని నిలుపుదల చేశారు. గిట్టుబాటు ధర కోసం రైతులు ఢిల్లీ వెళ్లి కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖకు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. అనంతరం ఆగస్టు నుంచి మార్కెట్‌లో ధర పెరుగుతూ వచింది. అప్పటి వరకు కొనుగోలుకు ముందుకు రాని కంపెనీలు కూడా వేలంలో పాల్గొన్నాయి. పొగాకు అమ్మేందుకు రైతులు ముందుకు వచ్చారు. రోజుకు 1000 నుంచి 1300 బేళ్ల వరకూ రైతులు తీసుకొచ్చారు.
14 నుంచి కొనుగోళ్లు పునఃప్రారంభం
జిల్లాలోని ఐదు వేలం కేంద్రాల పరిధిలో 201617 సంవత్సరానికి పొగాకు బోర్డు 41 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తికి అనుమతిచ్చింది. బ్యారన్‌కు 30 క్వింటాళ్లకు మించి పండించడానికి అవకాశం లేదని పేర్కొంది. బ్యారన్ రిజిస్ట్రేషన్లు కూడా చేసింది. అయితే ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో పాటు కొందరు రైతులు అనుమతికి మించి విస్తీర్ణంలో పంట వేశారు. దీంతో అదనంగా సుమారు 3 మిలియన్ కిలోల వరకు పండినట్లు అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులు అంచనా వేశారు. 36 మిలియన్ కిలోలు కొనుగోలు చేసిన అనంతరం ఈ నెల ఒకటో తేదీ నుంచి 13 వరకు నిలిపివేశారు. అదనపు పొగాకు కొనుగోలుకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ బ్యారన్‌కు 300 కిలోలు వరకు, కిలోకు రూ.2 కమీషన్, 7.5 శాతం రుసుంతో కొనుగోలుకు అనుమతి ఇచ్చింది. దీంతో ఈ నెల 14 నుంచి ఐదు వేలం కేంద్రాల్లో కొనుగోళ్లు పునఃప్రారంభమయ్యాయి. అయితే మీడియం గ్రేడులకు తక్కువ ధర పలుకుతుందని రైతులు వాపోతున్నారు. లెమన్, ఆరంజ్ కలర్ పొగాకుకు మంచి ధర లభిస్తుందని రైతులు వివరించారు.
వేలం కేంద్రాల్లో పరిస్థితి ఇది
దేవరపల్లి వేలం కేంద్రంలో 6.8 మిలియన్ కిలోలు ఉత్పత్తికి అనుమతివ్వగా ఇప్పటికి 6.5 మిలియన్ కిలోలు విక్రయించారు. మరో 4 లక్షల కిలోల పొగాకు రైతుల వద్ద ఉంది. గోపాలపురం వేలం కేంద్రంలో 7.1 మిలియన్ కిలోలు ఉత్పత్తికి అనుమతి ఉండగా ఇప్పటికి 6.7 మిలియన్ కిలోలు విక్రయించారు. మరో 5 లక్షల కిలోలు రైతులు వద్ద ఉంది. కొయ్యలగూడెం వేలం కేంద్రంలో 1.5 మిలియన్ కిలోలు, జంగారెడ్డిగూడెం1, 2 వేలం కేంద్రాల్లో సుమారు మూడు మిలియన్ కిలోలు రైతుల వద్ద ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దేవరపల్లి, గోపాలపురం వేలం కేంద్రాల్లో ఈ నెల 25న కొనుగోళ్లు ముగుస్తుండగా, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం వేలం కేంద్రాల్లో అక్టోబర్ 15 వరకు కొనుగోళ్లు జరగనున్నట్లు సమాచారం.
25న పొగాకు వేలం ముగింపు
ఈ నెల 25న దేవరపల్లి, గోపాలపురం వేలం కేంద్రాల్లో పొగాకు వేలం ముగుస్తుంది. రెండు వేలం కేంద్రాల్లో సుమారు 9 లక్షల కిలోలు రైతులు అమ్ముకోవాల్సి ఉంది. కిలో సగటు ధర రూ.173.70 లభించింది. రోజుకు లక్ష కిలోలు వరకు పొగాకు వేలం జరుగుతోంది.
ఎం.హనుమంతరావు, వేలం నిర్వహణాధికారి, దేవరపల్లి
టి.తల్పసాయి, వేలం నిర్వహణాధికారి, గోపాలపురం
Advertisement
Advertisement