toboco
-
‘మాచన’ కు జాతీయ సదస్సు ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: ప్రజల ఆరోగ్యాన్ని సవాలు చేస్తున్న పొగాకును నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఆ దిశగా, జరుగుతున్న కృషిలో ఔత్సాహిక స్వచ్చంద కార్యకర్తల సహకారం అవశ్యమనీ పొగాకు, ఆరోగ్యం అనే అంశంపై తలపెట్టిన నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ టుబాకో21 ( ఎన్ సీ టీ ఓ హెచ్ 21) సదస్సుకు హైదరాబాద్ కు చెందిన మాచన రఘునందన్‌కు పిలుపు వచ్చింది. ఈ సదస్సులో స్వచ్చంద కార్యకర్త గా పాల్గొనాల్సిందిగా సదస్సు నిర్వాహకులు కోరారు. పొగాకు రహిత భారతావని ధ్యేయంగా పంజాబ్ రాష్ట్రం లో చండీగఢ్ కేంద్రం గా ఉన్న స్నాతకోత్తర ప్రజా ఆరోగ్య అధ్యయన సంస్థ పీజీఐఎమ్ఈఆర్ అధ్వర్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ టుబాకో , హెల్త్ పేరిట జాతీయ సదస్సును సెప్టెంబర్ 25,27 తేదీల్లో పంజాబ్ చండీగఢ్ లో నిర్వహిస్తోంది. పొగాకు ,ధూమపానం వ్యసనాలతో కరోనా బారిన పడే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ గత సంవత్సరం నుంచి పదే పదే హెచ్చరిస్తోనే ఉంది. కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా పొగాకు నియంత్రణ ఆవశ్యకతపై కీలకంగా జరగనున్న ఈ చారిత్రక సదస్సుకు హాజరు కావాలని కోరుతూ పౌరసరఫరాలశాఖ లో ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ గా పని చేస్తున్న మాచన రఘునందన్ కు ఆహ్వానం అందింది. రిసోర్స్ సెంటర్ ఫర్ టుబాకో కంట్రోల్ (ఆర్ సీ టీ సీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పొగాకు నియంత్రణ ప్రాథమిక అవగాహన శిక్షణ కు సైతం పూర్తి ఉపకార వేతనం తో అవకాశం దక్కించుకున్న ఏకైక దక్షిణ భారత దేశపు వ్యక్తిగా రఘునందన్ ఘనత ను సొంతం చేసుకున్నారు. గత 5 సంవత్సరాల్లో పొగాకు పగాకు అంటూ 50,000 కిలో మీటర్లు బైక్ పై ప్రయాణించి అవగాహన కలిగించారు. అటు విధులు నిర్వర్తిస్తునే.. డ్యూటీ తర్వాత కాలక్షేపం చెయ్యకుండా, సమాజ హితం కోసం సమయాన్ని కేటాయిస్తున్నారు. సొంత డబ్బు తో జన హితం కోసం పాటు పడుతున్నారు. మేడ్చల్ జిల్లా కేశవరంకు చెందిన మాచన రఘునందన్ కృషిని అమెరికాకు చెందిన పల్మనరీ మెడిసిన్ వైద్య ఆరోగ్య జర్నల్ రఘునందన్‌ను ప్రశంసించింది. -
‘ప్రభుత్వం ఎప్పుడూ రైతుల పక్షాన ఉంటుంది’
సాక్షి, గుంటూరు: ప్రభుత్వం ఎప్పుడూ రైతుల పక్షాన ఉండి వారి ఉత్పత్తులకు తగిన గిట్టుబాటు ధరను ఇప్పించేందుకు కృషి చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఆయన పోగాకు రైతులు, వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. పొగాకు వ్యాపారులు, ట్రేడర్లతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. పొగాకు సాగు వచ్చే ఏడాది నుంచి తగ్గించేలా అందరూ సహకరించాలన్నారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు రావాలంటే ట్రేడర్లు, వ్యాపారులు పోటీతత్వంతో మార్కెట్లో పాల్గొనాలని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి పొగాకు సాగుకు బదులుగా ప్రత్యాన్మయ పంటల సాగు చేసేందుకు ప్రయత్నం చేయాలని రైతులను కోరుతున్నామన్నారు. దీనికోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని సంప్రదించి రాయితీలను అందించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. బ్రైట్ గ్రేడ్‌తో పాటు మీడియం, లోయర్ గ్రేడ్ ఉత్పత్తులను కూడా రైతుల నుంచి ట్రేడర్లు కొనుగోలు చేసి వారిని ఆదుకోవాలని తెలిపారు. ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పూనమ్ మాలకొండయ్య, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
దూసుకుపోతున్న వర్జీనియా మార్కెట్
ఆశాజనకంగా పొగాకు ధరలు కిలో సగటు ధర రూ.173 సాగుకు సన్నద్ధమవుతున్న రైతులు దేవరపల్లి: వర్జీనియా పొగాకు మార్కెట్ ఆశాజనకంగా ఉంది. అధికారులు, రైతులు ఊహకు అందని విధంగా పొగాకు ధరలు పలుకుతున్నాయి. దాదాపు నెల రోజులుగా మార్కెట్ పుంజుకుంది. సోమవారం జిల్లాలోని వేలం కేంద్రాల్లో కిలో గరిష్ట ధర రూ.190, సగటు ధర రూ.173.70 లభించింది. ఈ ఏడాది మార్చి 15న ప్రారంభమైన కొనుగోళ్లు జూలై వరకు మందకొడిగా జరిగాయి. గిట్టుబాటు ధర రాక రైతులు పంటను అమ్ముకోవడానికి ఆసక్తిచూపలేదు. రోజుకు 200కు మించి బేళ్లు వేలానికి రాకపోవడంతో అధికారులు కూడా అయోమయంలో పడ్డారు. కొంతకాలం టేడర్లు కూడా సిండికేట్‌గా మారి ధర విషయంలో సీలింగ్ వి«ధించడంతో రైతులు వేలాన్ని నిలుపుదల చేశారు. గిట్టుబాటు ధర కోసం రైతులు ఢిల్లీ వెళ్లి కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖకు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. అనంతరం ఆగస్టు నుంచి మార్కెట్లో ధర పెరుగుతూ వచింది. అప్పటి వరకు కొనుగోలుకు ముందుకు రాని కంపెనీలు కూడా వేలంలో పాల్గొన్నాయి. పొగాకు అమ్మేందుకు రైతులు ముందుకు వచ్చారు. రోజుకు 1000 నుంచి 1300 బేళ్ల వరకూ రైతులు తీసుకొచ్చారు. 14 నుంచి కొనుగోళ్లు పునఃప్రారంభం జిల్లాలోని ఐదు వేలం కేంద్రాల పరిధిలో 201617 సంవత్సరానికి పొగాకు బోర్డు 41 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తికి అనుమతిచ్చింది. బ్యారన్‌కు 30 క్వింటాళ్లకు మించి పండించడానికి అవకాశం లేదని పేర్కొంది. బ్యారన్ రిజిస్ట్రేషన్లు కూడా చేసింది. అయితే ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో పాటు కొందరు రైతులు అనుమతికి మించి విస్తీర్ణంలో పంట వేశారు. దీంతో అదనంగా సుమారు 3 మిలియన్ కిలోల వరకు పండినట్లు అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులు అంచనా వేశారు. 36 మిలియన్ కిలోలు కొనుగోలు చేసిన అనంతరం ఈ నెల ఒకటో తేదీ నుంచి 13 వరకు నిలిపివేశారు. అదనపు పొగాకు కొనుగోలుకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ బ్యారన్‌కు 300 కిలోలు వరకు, కిలోకు రూ.2 కమీషన్, 7.5 శాతం రుసుంతో కొనుగోలుకు అనుమతి ఇచ్చింది. దీంతో ఈ నెల 14 నుంచి ఐదు వేలం కేంద్రాల్లో కొనుగోళ్లు పునఃప్రారంభమయ్యాయి. అయితే మీడియం గ్రేడులకు తక్కువ ధర పలుకుతుందని రైతులు వాపోతున్నారు. లెమన్, ఆరంజ్ కలర్ పొగాకుకు మంచి ధర లభిస్తుందని రైతులు వివరించారు. వేలం కేంద్రాల్లో పరిస్థితి ఇది దేవరపల్లి వేలం కేంద్రంలో 6.8 మిలియన్ కిలోలు ఉత్పత్తికి అనుమతివ్వగా ఇప్పటికి 6.5 మిలియన్ కిలోలు విక్రయించారు. మరో 4 లక్షల కిలోల పొగాకు రైతుల వద్ద ఉంది. గోపాలపురం వేలం కేంద్రంలో 7.1 మిలియన్ కిలోలు ఉత్పత్తికి అనుమతి ఉండగా ఇప్పటికి 6.7 మిలియన్ కిలోలు విక్రయించారు. మరో 5 లక్షల కిలోలు రైతులు వద్ద ఉంది. కొయ్యలగూడెం వేలం కేంద్రంలో 1.5 మిలియన్ కిలోలు, జంగారెడ్డిగూడెం1, 2 వేలం కేంద్రాల్లో సుమారు మూడు మిలియన్ కిలోలు రైతుల వద్ద ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దేవరపల్లి, గోపాలపురం వేలం కేంద్రాల్లో ఈ నెల 25న కొనుగోళ్లు ముగుస్తుండగా, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం వేలం కేంద్రాల్లో అక్టోబర్ 15 వరకు కొనుగోళ్లు జరగనున్నట్లు సమాచారం. 25న పొగాకు వేలం ముగింపు ఈ నెల 25న దేవరపల్లి, గోపాలపురం వేలం కేంద్రాల్లో పొగాకు వేలం ముగుస్తుంది. రెండు వేలం కేంద్రాల్లో సుమారు 9 లక్షల కిలోలు రైతులు అమ్ముకోవాల్సి ఉంది. కిలో సగటు ధర రూ.173.70 లభించింది. రోజుకు లక్ష కిలోలు వరకు పొగాకు వేలం జరుగుతోంది. ఎం.హనుమంతరావు, వేలం నిర్వహణాధికారి, దేవరపల్లి టి.తల్పసాయి, వేలం నిర్వహణాధికారి, గోపాలపురం -
వర్జీనియాకు వేళాయె..
–పొగాకు సాగుకు మెట్ట రైతుల సన్నద్ధం –పలు చోట్ల నాట్లు ప్రారంభం –ఈ నెల 20 నుంచి ఊపందుకోనున్న నాట్లు –నారుకు డిమాండ్ దేవరపల్లి : పొగాకు సాగుకు మెట్ట రైతులు సన్నద్ధమవుతున్నారు. ఈ వారం నుంచి అక్కడక్కడా నాట్లు వేయడం ప్రారంభించారు. ఈ నెల 20 నుంచి పూర్తిస్థాయిలో నాట్లు ఊపందుకోనున్నాయి. నారు పెరిగినా వాతావరణంలో తరచూ మార్పులు చోటుచేసుకుంటుండడంతో రైతులు కాస్త వెనక్కుతగ్గుతున్నారు. భారీవర్షాలు, తుపానులు వస్తే కొట్టుకుపోతాయని ఆందోళన కారణంగా కొందరు రైతులు నాట్లను కావాలని ఆలస్యం చేస్తున్నారు. జిల్లాలోని దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెంలోని రెండు వేలం కేంద్రాల పరిధిలో వాణì జ్య పంటగా రైతులు వర్జీనియాను సాగు చేస్తున్నారు. పొగాకు సాగుకు తేలికపాటి ఎర్ర నేలలు అనుకూలం కావడంతో మెట్ట ప్రాంతంలోని భూములు ఈ పంట సాగుకు అనుకూలంగా ఉన్నాయి. దాదాపు 50 ఏళ్లుగా జిల్లాలో మెట్ట ప్రాంతంలోని 8 మండలాల్లో రైతులు సుమారు లక్ష ఎకరాల్లో పొగాకు పండించే వారు. గత రెండు సంవత్సరాల నుంచి మార్కెట్ సంక్షో¿¶ ంలో ఉండడం, కేంద్ర ప్రభుత్వం పంటపై నిబంధనలు వి«ధించి సాగు విస్తీర్ణాన్ని తగ్గించడంతో రైతులు పొగాకు పంటను తగ్గించారు. 40 మిలియన్ కిలోలకు అనుమతి జిల్లాలో 2014 వరకు 60 నుంచి 62 మిలియన్ కిలోల ఉత్పత్తి జరిగే పొగాకును గత ఏడాది కేంద్ర ప్రభుత్వం 35 మిలియన్ కిలోలకు తగ్గించింది. బ్యారన్‌కు 2.5 ఎకరాల విస్తీర్ణంలో పండించడానికి అనుమతి ఇచ్చారు. అయితే రైతులు సుమారు 40 మిలియన్ కిలోల పొగాకు పండించారు. ఈ ఏడాది బ్యారన్‌కు 3.5 ఎకరాల విస్తీర్ణం రిజిస్ట్రేషన్ చేసి 40 మిలియన్ కిలోల ఉత్పత్తికి అనుమతి ఇచ్చారు. గతేడాది బ్యార్కు 25 కింటాళ్లు పండించి అమ్ముకోవడానికి బోర్డు అనుమతి ఇవ్వగా ఈ ఏడాది 30 క్వింటాళ్లకు పెంచారు. జిల్లాలోని ఐదు వేలం కేంద్రాల పరిధిలో 13,925 బ్యారన్లు ఉండగా సుమారు 49,000 ఎకరాల్లో పంటకు అనుమతి ఇచ్చారు. సుమారు 12,000 మంది రైతులు పొగాకు పంటను సాగు చేస్తున్నారు. దేవరపల్లి వేలం కేంద్రం పరిధిలో 2276 బ్యారన్లు, గోపాలపురం వేలం కేంద్రం పరి«ధిలో 2380 బ్యారన్లు, కొయ్యలగూడెం వేలం కేంద్రం పరిధిలో 2941 బ్యారన్లు, జంగారెడ్డిగూడెం–1 వేలం కేంద్రం పరిధిలో 3154 బ్యారన్లు, జంగారెడ్డిగూడెం–2 వేలం కేంద్రం పరిధిలో 3174 బ్యారన్లు ఈ ఏడాది రిజిస్ట్రేషన్లు జరిగాయి. నారుకు గిరాకీ పొగాకు నారుకు మంచి గిరాకీ ఏర్పడింది. జిల్లాలో సుమారు 1200 ఎకరాల్లో పొగాకు నారుమడులు వేశారు. ఎల్.వి–7, ఎన్ఎల్ఎస్–4 వంగడాలను ఎక్కువగా నారు వేశారు. పెద్ద రైతులు ట్రేలలో నారు పెంచి నాటడానికి సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది ఎక్కువ మంది రైతులు నారును మడి నుంచి తీసి ట్రేలలో రీసెట్టింగ్ చేస్తున్నారు. రీసెట్టింగ్ నారు ఎకరం నారు రూ.1500 ధర పలుకుంది. రీసెట్టింగ్ నారుకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో నారుమడులు కట్టిన రైతులు లాభాలు పొందుతున్నారు. ట్రేలలో పెంచిన నారు ఎకరం (6,500 మొక్కలు) రూ.6,000 పలుకుతుండగా, మడిలో పెంచిన నారు రూ.3,000 నుంచి 3,500 ధర పలుకుతోంది. ఎకరం విస్తీర్ణంలోని నారుమడులను రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు రైతులు కొనుగోలు చేస్తున్నారు. దేవరపల్లి, పల్లంట్ల, బందపురం, లక్ష్మీపురం, యర్నగూడెం, సంగాయిగూడెం, చిన్నాయగూడెం గ్రామాల్లో నారుమడులు ఉన్నాయి. అనుమతికి మించి పంట వేయవద్దు బోర్డు అనుమతించిన విస్తీర్ణంలో మాత్రమే రైతులు పంట సాగు చేయాలి. గతేడాది కంటే ఈ ఏడాది బోర్డు ఎన్ఎల్ఎస్ ప్రాంతంలో 5 మిలియన్ కిలోల పొగాకు అదనంగా పండించడానికి అనుమతి ఇచ్చింది. బ్యారన్ల రిజిస్ట్రేషన్లు పూర్తి చేయడం జరిగింది. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడులు సాధించడానికి రైతులు కృషిచేయాలి. – వైవీ ప్రసాద్, వేలం నిర్వహణాధికారి, దేవరపల్లి -
ముగిసిన సూర పొగాకు కొనుగోళ్లు
దేవరపల్లి : దేవరపల్లి, గోపాలపురం పొగాకు వేలం కేంద్రాల్లో సూర పొగాకు కొనుగోళ్లు ముగిశాయి. ఈ నెల 14 నాటితో రెండు వేలం కేంద్రాల్లో పొగాకు కొనుగోళ్లు ముగియడంతో రైతుల వద్ద గల సూర పొగాకు కొనుగోళ్లును ప్రారంభించారు. ఈ నెల 17న ప్రారంభమైన సూర పొగాకు కొనుగోళ్లు శనివారం ముగిశాయి. దేవరపల్లి వేలం కేంద్రంలో ఈ ఏడాది 6.36 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలు చేయగా.. కిలో గరిష్ట ధర రూ. 185 పలికింది. సగటు ధర రూ. 136.75 లభించింది. రైతులు కిలో సటగు ధర రూ. 150 వరకు ఆశించారు. మార్కెట్ చివరి దశలో పుంజుకుంది. దీంతో రైతులు కొంత వరకు ఊపిరిపీల్చుకున్నారు. నాలుగు రోజుల్లో వేలం కేంద్రంలో 3.50 లక్షల కిలోల సూర పొగాకు కొనుగోలు చేశారు. సూరకు కిలో గరిష్ట ధర రూ. 66, కనిష్ట ధర రూ. 10, సగటు ధర రూ. 39.36 లభించింది. శనివారం వేలం కేంద్రం పరిధిలోని గ్రామాల నుంచి రైతులు 891 సూర బేళ్లు వేలానికి తీసుకురాగా.. పూర్తిగా కొనుగోలు చేసినట్లు వేలం నిర్వహణాధికారి వై.వి.ప్రసాద్ తెలిపారు. 2015–16 సీజన్‌కు సంబంధించి పొగాకు వేలం ముగిసిందని ఆయన ప్రకటించారు. గోపాలపురం వేలం కేంద్రంలో 1.10 లక్షల కిలోల పొగాకు కొనుగోలు చేయగా కిలో గరిష్ట ధర రూ. 60, కనిష్ట ధర రూ. 11, సగటు ధర రూ. 36.12 లభించినట్లు వేలం నిర్వహణా«ధికారి టి.తల్పసాయి తెలిపారు.