
సాక్షి, హైదరాబాద్: ప్రజల ఆరోగ్యాన్ని సవాలు చేస్తున్న పొగాకును నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఆ దిశగా, జరుగుతున్న కృషిలో ఔత్సాహిక స్వచ్చంద కార్యకర్తల సహకారం అవశ్యమనీ పొగాకు, ఆరోగ్యం అనే అంశంపై తలపెట్టిన నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ టుబాకో21 ( ఎన్ సీ టీ ఓ హెచ్ 21) సదస్సుకు హైదరాబాద్ కు చెందిన మాచన రఘునందన్‌కు పిలుపు వచ్చింది. ఈ సదస్సులో స్వచ్చంద కార్యకర్త గా పాల్గొనాల్సిందిగా సదస్సు నిర్వాహకులు కోరారు.
పొగాకు రహిత భారతావని ధ్యేయంగా పంజాబ్ రాష్ట్రం లో చండీగఢ్ కేంద్రం గా ఉన్న స్నాతకోత్తర ప్రజా ఆరోగ్య అధ్యయన సంస్థ పీజీఐఎమ్ఈఆర్ అధ్వర్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ టుబాకో , హెల్త్ పేరిట జాతీయ సదస్సును సెప్టెంబర్ 25,27 తేదీల్లో పంజాబ్ చండీగఢ్ లో నిర్వహిస్తోంది. పొగాకు ,ధూమపానం వ్యసనాలతో కరోనా బారిన పడే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ గత సంవత్సరం నుంచి పదే పదే హెచ్చరిస్తోనే ఉంది.
కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా పొగాకు నియంత్రణ ఆవశ్యకతపై కీలకంగా జరగనున్న ఈ చారిత్రక సదస్సుకు హాజరు కావాలని కోరుతూ పౌరసరఫరాలశాఖ లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహసీల్దార్ గా పని చేస్తున్న మాచన రఘునందన్ కు ఆహ్వానం అందింది. రిసోర్స్ సెంటర్ ఫర్ టుబాకో కంట్రోల్ (ఆర్ సీ టీ సీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పొగాకు నియంత్రణ ప్రాథమిక అవగాహన శిక్షణ కు సైతం పూర్తి ఉపకార వేతనం తో అవకాశం దక్కించుకున్న ఏకైక దక్షిణ భారత దేశపు వ్యక్తిగా రఘునందన్ ఘనత ను సొంతం చేసుకున్నారు.
గత 5 సంవత్సరాల్లో పొగాకు పగాకు అంటూ 50,000 కిలో మీటర్లు బైక్ పై ప్రయాణించి అవగాహన కలిగించారు. అటు విధులు నిర్వర్తిస్తునే.. డ్యూటీ తర్వాత కాలక్షేపం చెయ్యకుండా, సమాజ హితం కోసం సమయాన్ని కేటాయిస్తున్నారు. సొంత డబ్బు తో జన హితం కోసం పాటు పడుతున్నారు. మేడ్చల్ జిల్లా కేశవరంకు చెందిన మాచన రఘునందన్ కృషిని అమెరికాకు చెందిన పల్మనరీ మెడిసిన్ వైద్య ఆరోగ్య జర్నల్ రఘునందన్‌ను ప్రశంసించింది.