ముగిసిన సూర పొగాకు కొనుగోళ్లు
Published Sun, Aug 21 2016 12:06 AM | Last Updated on Wed, Oct 3 2018 7:02 PM
దేవరపల్లి : దేవరపల్లి, గోపాలపురం పొగాకు వేలం కేంద్రాల్లో సూర పొగాకు కొనుగోళ్లు ముగిశాయి. ఈ నెల 14 నాటితో రెండు వేలం కేంద్రాల్లో పొగాకు కొనుగోళ్లు ముగియడంతో రైతుల వద్ద గల సూర పొగాకు కొనుగోళ్లును ప్రారంభించారు. ఈ నెల 17న ప్రారంభమైన సూర పొగాకు కొనుగోళ్లు శనివారం ముగిశాయి. దేవరపల్లి వేలం కేంద్రంలో ఈ ఏడాది 6.36 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలు చేయగా.. కిలో గరిష్ట ధర రూ. 185 పలికింది. సగటు ధర రూ. 136.75 లభించింది. రైతులు కిలో సటగు ధర రూ. 150 వరకు ఆశించారు. మార్కెట్ చివరి దశలో పుంజుకుంది. దీంతో రైతులు కొంత వరకు ఊపిరిపీల్చుకున్నారు. నాలుగు రోజుల్లో వేలం కేంద్రంలో 3.50 లక్షల కిలోల సూర పొగాకు కొనుగోలు చేశారు. సూరకు కిలో గరిష్ట ధర రూ. 66, కనిష్ట ధర రూ. 10, సగటు ధర రూ. 39.36 లభించింది. శనివారం వేలం కేంద్రం పరిధిలోని గ్రామాల నుంచి రైతులు 891 సూర బేళ్లు వేలానికి తీసుకురాగా.. పూర్తిగా కొనుగోలు చేసినట్లు వేలం నిర్వహణాధికారి వై.వి.ప్రసాద్ తెలిపారు. 2015–16 సీజన్‌కు సంబంధించి పొగాకు వేలం ముగిసిందని ఆయన ప్రకటించారు. గోపాలపురం వేలం కేంద్రంలో 1.10 లక్షల కిలోల పొగాకు కొనుగోలు చేయగా కిలో గరిష్ట ధర రూ. 60, కనిష్ట ధర రూ. 11, సగటు ధర రూ. 36.12 లభించినట్లు వేలం నిర్వహణా«ధికారి టి.తల్పసాయి తెలిపారు.
Advertisement