తాగునీటికీ సోలార్ పంప్‌సెట్లు
- తెలంగాణ, ఏపీలకు చెరో వెయ్యి యూనిట్లు మంజూరు చేసిన కేంద్రం
- వ్యవసాయానికి 1,425 పంప్‌సెట్లు
- తొలి టెండర్ల రద్దుతో.. వీటికీ పీటముడి
- కొనుగోళ్లకు వెనుకాడుతున్న టీఎన్‌ఆర్‌ఈడీసీ
- ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ పంప్‌సెట్లతో పాటు తాగునీటి పథకాలకు సోలార్ పంప్‌సెట్లు అమర్చనున్నారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఈ ప్రయోగానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో రాష్ట్రానికి వెయ్యి పంప్ సెట్లను మంజూరు చేసింది. ఫలితాలను అధ్యయనం చేసేందుకు.. అనువైన భౌగోళిక వాతావరణ పరిస్థితులున్న చోట వీటిని అమర్చాలని సూచించింది.
ఎంపిక చేసిన గ్రామాల్లోనే అమర్చాలని, గ్రామీణ నీటి సరఫరా విభాగాన్ని (ఆర్‌డబ్ల్యూఎస్) ఇందులో భాగస్వామిని చేయాలని కేంద్రం మార్గదర్శకా లు జారీ చేసింది. ఇందులో భాగంగా 3 హెచ్‌పీ, 5 హెచ్‌పీ సామర్థ్యమున్న పంప్‌సెట్లకు టెండర్లు పిలిచి కొనుగోలు చేస్తారు. అంతమేరకు సామర్థ్యంతో నిర్వహించగలిగే చిన్న తాగునీటి పథకాలకు అమర్చుతారు.
ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలను కేంద్రం సంప్రదాయేతర ఇంధన వనరుల విభాగానికి (ఎన్‌ఆర్‌ఈడీసీ) అప్పగించింది. వ్యయంలో 30 శాతం కేంద్రం సబ్సిడీ ఇస్తుంది. ఇటీవల వ్యవసాయానికి మంజూరు చేసిన సోలార్ సెట్ల కొనుగోలుకు ఆరంభంలోనే చుక్కెదురైంది. మొత్తం వెయ్యి సెట్ల కొనుగోలుకు రెండు రాష్ట్రాల సంప్రదాయేతర ఇంధన వనరుల విభాగాలు వేర్వేరుగా టెండర్లు పిలిచాయి.
మార్కెట్ ధర కంటే కంపెనీలు ఎక్కువ రేట్ కోట్ చేసినట్లు అభియోగాలు రావటంతో తెలంగాణ ప్రభుత్వం టెండర్ల రద్దుకు ఆదేశించింది. దీంతో తెలంగాణ సంప్రదాయేతర, పునరుత్పాదక ఇంధన అభివృద్ది సంస్థ (టీఎన్‌ఆర్‌ఈడీసీ) టెండర్ల ప్రక్రియను యథాతథంగా నిలిపివేసింది. దీంతో ఏపీ ప్రభుత్వం సైతం పంప్‌సెట్ల కొనుగోలును ఆపేసింది. దీంతో కొత్త పంప్‌సెట్ల కొనుగోళ్లపై ప్రతిష్టంభన నెలకొంది.
మరోవైపు విద్యుత్తు సంక్షోభం దృష్ట్యా తెలంగాణకు మరో 5వేల వ్యవసాయ పంప్‌సెట్లు మంజూరు చేయాలని టీఎన్‌ఆర్‌ఈడీసీ కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. వీటిలో 1,425 పంప్‌సెట్లు మంజూరు చేస్తూ కేంద్రం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 3,425 పంప్‌సెట్లు మంజూరైనట్లు అధికారులు తెలిపారు. కానీ.. మొదటిదశలో పిలిచిన టెండర్లు రద్దు కావటంతో వీటి కొనుగోలుకు టీఎన్‌ఆర్‌ఈడీసీ వెనుకంజ వేస్తోంది.
కొత్తగా మంజూరైన యూనిట్ల వివరాలతో పాటు కొనుగోలు ప్రతిపాదనలన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు టెండర్లు ముందుకు కదిలే పరిస్థితి లేదని.. అందుకే కొత్త వాటికి టెండర్లు పిలవాలా.. వద్దా.. అనే సందిగ్ధత ఉందని ఒక ఉన్నతాధికారి అన్నారు.
మరోవైపు తెలంగాణలో మొత్తం 20 లక్షల సోలార్ పంప్‌సెట్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. సాధ్యాసాధ్యాల పరిశీలన, కంపెనీల ప్రతినిధులతో సమాలోచనలు జరిపేందుకు వివిధ విభాగాల ముఖ్య కార్యదర్శులతో ఇటీవలే కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నిర్ణయాలు.. సూచనలు అందే వరకు ప్రభుత్వం ఈ యూనిట్ల కొనుగోలుకు అంగీకరిస్తుందా, లేదా అనే సందేహాలను అధికారులు వెలిబుచ్చారు.