ఓర్వకల్లు : భూములు కోల్పోయిన రైతులు పరిహారం కోసం శనివారం శకునాల గ్రామం వద్ద సోలార్ పరిశ్రమను దిగ్బంధించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు న్యాయం చేసేంత వరకు కదలబోమని భీష్మించుకు కూర్చున్నారు. ముందుగా గని, శకునాల, దేవనూరు గ్రామాలకు చెందిన వ్యవసాయ కూలీలు, బాధిత రైతులు పెద్ద ఎత్తున సోలార్ పరిశ్రమ వద్దకు తరలి వెళ్లారు. పరిహారం చెల్లింపులో నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని నినాదాలు చేశారు. విష యం తెలుసుకున్న పాణ్యం, కర్నూలు పోలీసులు అక్కడికి చేరుకొని.. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని నచ్చజెప్పారు. అయితే అధికారులు వచ్చి హామీ ఇచ్చేదాక కదిలేదని రైతులు, కూలీలు భీష్మించి కూర్చున్నారు. అక్కడే టెంట్ వేసుకొని నాలుగు గంటల పాటు బైఠాయించారు.
హైకోర్టు ఉత్తర్వుల మేరకు వ్యవసాయ కూలీలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల పరిహారం చెల్లించి, పునరావాసం కల్పించాలని, స్థానిక యువతకు పరిశ్రమలో ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కర్నూలు ఆర్డీవో హుసేన్ సాహెబ్, ఓర్వకల్లు తహసీల్దార్ రజనీకుమారి అక్కడికి చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడారు. సోలార్ పరిశ్రమలో కోల్పోయిన భూములకు పరిహారం చెల్లింపులో నాలుగేళ్ల నుంచి జాప్యం జరుగుతున్న విషయం వాస్తవమేనని ఆర్డీఓ అంగీకరించారు. మొత్తం 980 ఎకరాలకు పరిహారం ఇవ్వడానికి రూ.81 కోట్లు అవసరమని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ప్రభుత్వానికి నివేదికలు పంపినట్లు తెలిపారు.
ఇందులో మొదట జనరల్ అవార్డు కింద గుర్తించిన 210 ఎకరాలకు రూ.27 కోట్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నప్పటికీ కోర్టు వ్యవహారం కారణంగా పెండింగ్‌లో ఉంచినట్లు వెల్లడించారు. రెక్టిఫికేషన్ అవార్డు కింద గుర్తించిన మరో 230 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో కాలయాపన జరుగుతోందన్నారు. పరిహార విషయంలో తీవ్ర మనస్తాపానికి లోనై ఆత్మహత్య చేసుకున్న బోయ మద్దిలేటి కుటుంబానికి జాతీయ కుటుంబ యోజన పథకం(ఎన్‌ఎఫ్‌బి) కింద ఆర్థిక ప్రయోజనం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
మృతుని కుటుంబంలో ఒకరికి సోలార్ పరిశ్రమలో ఉద్యోగ అవకాశం కల్పిస్తామని చెప్పారు. స్థానిక యువతకు అర్హతను బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆ సంస్థ ఈఈ సుధాకర్‌ను ఆర్డీఓ ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌తో చర్చించిన తర్వాత 15 రోజుల్లో రూ. 81 కోట్ల్ల పరిహారం చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో బాధిత రైతులు, వ్యవసాయ కూలీలు తమ ఆందోళనను విరమించుకున్నారు. సీపీఎం మండల కన్వీనర్ నాగన్న , రైతు సంఘం నాయకులు రామకృష్ణ , భూ నిర్వాసిత కమిటీ సభ్యులు చంద్రబాబు, చాంద్‌బాషా షంషీర్‌ఖాన్, జయరాముడు, మల్లమ్మ, రమాదేవి, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ కూలీలు, బాధిత రైతులతో మాట్లాడుతున్న ఆర్డీవో హుసేన్ సాహెబ్
Comments
Please login to add a commentAdd a comment