orvakallu
-
‘ఉపాధి’ పనులను పరిశీలించిన కేంద్ర బృందం
ఓర్వకల్లు: ప్రధాని నరేంద్రమోదీ సలహాదారు, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు సభ్యులు అమర్‌జిత్‌సిన్హా నేతృత్వంలోని కేంద్ర బృందం కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లెలో బుధవారం పర్యటించింది. ఆ గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పండ్ల తోటల పెంపకం, అభివృద్ధి పనులను పరిశీలించింది. రైతు వెంకటేశ్వర్లు సాగు చేసిన మునగ తోటను పరిశీలించి పంట దిగుబడి, పెట్టుబడుల ఖర్చుల వివరాలను బృందంలోని సభ్యులు అడిగి తెలుసుకున్నారు. మునగ సాగు లాభసాటిగా ఉందని, దిగుబడులకు తగ్గట్టు మార్కెట్లో ధరలు ఆశాజనకంగా ఉన్నాయని రైతు వివరించారు. సమీపంలో ఉపాధి హామీ పథకం కింద తవ్విన అమృత్ సరోవర్ (నీటి కుంట)ను కేంద్ర బృందం పరిశీలించింది. ఈ కుంట ద్వారా ప్రజలకు ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి, ఎంత ఖర్చు చేశారనే వివరాలను అడిగి తెలుసుకుంది. అనంతరం జాతీయ గ్రామీణాభివృద్ధి పథకం ప్రయోజనాలు, పనితీరుపై గ్రామస్తులతో బృంద సభ్యులు సమీక్ష నిర్వహించారు. పేదరిక నిర్మూలనకు చేపట్టాల్సిన పనులపై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఉపాధి పథకాన్ని మరింత విస్తృతం చేయాలని, రైతుల పంట పొలాలను అభివృద్ధి చేయాలని, పొలం రస్తాల వెంటవున్న కంపచెట్లను తొలగించాలని పలువురు కోరారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఉపాధి పథకమే తమను ఆదుకుందని, లేకపోతే ఎంతో మంది పస్తులుండాల్సి వచ్చేదని లక్ష్మీదేవి, శారదమ్మ అనే మహిళలు చెప్పారు. కేంద్ర బృందంలో కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ ప్రొఫెసర్ అశోక్ పంకజ్, ఎస్సీఏఈఆర్ ఎన్డీఐసీ డైరెక్టర్ సోనాల్డ్ దేశాయ్, గ్రామీణాభివృద్ధి శాఖ చీఫ్ ఎకనామికల్ అడ్వైజర్ ప్రవీణ్ మెహతా, ఎన్ఐఆర్డి–పీఆర్ ప్రొఫెసర్ జ్యోతిస్ పాలన్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కోటేశ్వరరావు, డ్వామా పీడీ అమర్నాథ్రెడ్డి, డీఆర్డీఏ పీడి వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు. ఇదీ చదవండి: సమష్టిగా నడుద్దాం.. క్లీన్ స్వీప్ చేద్దాం -
కర్నూలు జిల్లా: గొంతుకోసి ఇద్దరు మహిళల దారుణ హత్య
సాక్షి, కర్నూలు జిల్లా: ఓర్వకల్లు మండలం నన్నూరులో దారుణం జరిగింది. పొలంలో కూలి పనులకు వెళ్లిన ఇద్దరు మహిళలను దుండగులు గొంతుకోసి చంపారు. మృతులను రామేశ్వరి, రేణుకగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: సాఫ్ట్వేర్ ఉద్యోగినంటూ భర్త రెండో పెళ్లి.. మొదటి భార్య సడెన్ ఎంట్రీతో షాక్.. తర్వాత -
ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో ప్రారంభమైన విమాన సర్వీసులు
సాక్షి, కర్నూలు: ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో విమానాల సర్వీసులు ఆదివారం ప్రారంభమయ్యాయి. బెంగళూరు నుంచి తొలి ఇండిగో విమానం 52 మంది ప్రయాణికులతో కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. ఈ విమానానికి మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి గుమ్మనూరు జయరాం, నంద్యాల ఎంపీ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే కాటసాని ఘన స్వాగతం పలికారు. అదే విమానం 72మంది ప్రయాణికులతో బెంగళూరుకు తిరుగు ప్రయాణమైంది. దీంతో పాటు ఉదయం 10:30కి ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ నుంచి విశాఖ వెళ్లే మొదటి విమానాన్ని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, గుమ్మనూరు జయరాం తదితరులు జెండా ఊపి ప్రారంభించారు. ఇక మూడు నగరాలకు ఇండిగో సంస్థ విమానాలు నడపనుంది. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా నిర్మించిన కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును గురువారం సీఎం జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును సీఎం జగన్ ప్రకటించారు. చదవండి: గిరిజనుల అభ్యున్నతికి ఎన్నో చర్యలు -
పోలవరం ఖర్చు రీయింబర్స్ చేయాలి: బుగ్గన
సాక్షి, ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పలు అంశాలపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శుక్రవారం నాడు కేంద్ర జలశక్తి శాఖ కొత్త కార్యదర్శి పంకజ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు పూర్వాపరాలు వివరిస్తూ టీడీపీ హయాంలో జరిగిన పొరపాట్లను వివరించారు. ఇక పూర్తి స్థాయిలో ప్రాజెక్టు ఖర్చును కేంద్రం రీయింబర్స్ చేయాలని, దాని ప్రకారమే ముందుకు వెళ్లాలని కోరారు. తర్వాత పౌర విమానయాన శాఖ అధికారులను కలిసిన బుగ్గన ఓర్వకల్లు విమానాశ్రయంలో కమర్షియల్ రాకపోకలు మొదలు పెట్టే అంశం గురించి చర్చించారు. నిన్న కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కేసింగ్ను కలిసి అప్పర్ సీలేరు ప్రాజెక్టు రివర్స్ పంపింగ్ గురించి చర్చించారు. విద్యుత్ ఆదా చేసే ప్రాజెక్ట్ కాబట్టి కేంద్రం నుంచి సహాయం కోరారు. అదే విధంగా స్టేట్ డెవలప్మెంట్స్ రుణాలపై వడ్డీని తగ్గించాలని కోరారు. కేంద్ర ప్రాయోజిక పథకాలకు బడ్జెట్లో నిధులివ్వాలని అడిగారు. ప్రత్యేక హోదా అంశాన్ని కూడా కేంద్ర బడ్జెట్లో స్థానం కల్పించాలన్నారు. ఏపీ పునర్విభజన వల్ల నష్టం జరిగింది కనుక రాష్ట్రానికి సాయం చేయాలని బుగ్గన కేంద్రాన్ని కోరారు. (చదవండి: ముగ్గురు కేంద్ర మంత్రులతో ఆర్థిక మంత్రి బుగ్గన భేటీ) -
విమానాశ్రయంలో హడావుడి పనులు
కర్నూలు(అగ్రికల్చర్): ఓర్వకల్లు విమానాశ్రయం అసంపూర్తి పనులతోనే ట్రయల్ రన్‌కు సిద్ధమైంది. కొంత వరకు రోడ్లు వేయడం మినహా ఎటువంటి పురోగతి లేదు. టెర్మినల్ ప్లాంట్, ప్రయాణికుల విశ్రాంతి భవనం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సముదాయం తదితర పనులు ఇంకా కొనసాగుతున్నాయి. కేవలం రన్‌వే, ఎప్రోచ్ రోడ్డు, విమానాల పార్కింగ్ మాత్రమే పూర్తి చేశారు. జనవరి 7వ తేదీన ఎయిర్‌పోర్టు ప్రారంభిస్తున్న నేపథ్యంలో సోమవారం ట్రయల్ రన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ట్రయల్ రన్‌కు సెస్నా సైటేషన్ సీజే2 (CESSANA CITATION CJ2) మోడల్ విమానం ఓర్వకల్లుకు రానుంది. ఈ మోడల్ విమానం అతి చిన్నది. ఇందులో నలుగురు నుంచి ఆరుగురు మాత్రమే కూర్చునే అవకాశం ఉంది. ఉదయం 10.30 నుంచి 1.30 గంటల మధ్య ట్రైయల్ రన్ నిర్వహించనున్నారు. కార్యక్రమానికి కలెక్టర్ సత్య నారాయణతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొననున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తుండటంతో అరకొర పనులతోనే విమానం ట్రయల్ రన్, జనవరి 7న ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. సోమవారం ఓర్వకల్ విమానాశ్రయంలో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారనే సమాచారంతో ఆదివారం వందల మంది విమానాశ్రయం చూసేందుకు వచ్చారు. అక్కడ అరకొర పనులు చూసి విమానాశ్రయాన్ని ప్రారంభించినా రెగ్యులర్‌గా విమానాలు ఎగురడానికి చాలా కాలం పడుతుందని పలువురు చర్చించుకున్నారు. -
సోలార్ పరిశ్రమ దిగ్బంధం
ఓర్వకల్లు : భూములు కోల్పోయిన రైతులు పరిహారం కోసం శనివారం శకునాల గ్రామం వద్ద సోలార్ పరిశ్రమను దిగ్బంధించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు న్యాయం చేసేంత వరకు కదలబోమని భీష్మించుకు కూర్చున్నారు. ముందుగా గని, శకునాల, దేవనూరు గ్రామాలకు చెందిన వ్యవసాయ కూలీలు, బాధిత రైతులు పెద్ద ఎత్తున సోలార్ పరిశ్రమ వద్దకు తరలి వెళ్లారు. పరిహారం చెల్లింపులో నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని నినాదాలు చేశారు. విష యం తెలుసుకున్న పాణ్యం, కర్నూలు పోలీసులు అక్కడికి చేరుకొని.. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని నచ్చజెప్పారు. అయితే అధికారులు వచ్చి హామీ ఇచ్చేదాక కదిలేదని రైతులు, కూలీలు భీష్మించి కూర్చున్నారు. అక్కడే టెంట్ వేసుకొని నాలుగు గంటల పాటు బైఠాయించారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు వ్యవసాయ కూలీలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల పరిహారం చెల్లించి, పునరావాసం కల్పించాలని, స్థానిక యువతకు పరిశ్రమలో ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కర్నూలు ఆర్డీవో హుసేన్ సాహెబ్, ఓర్వకల్లు తహసీల్దార్ రజనీకుమారి అక్కడికి చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడారు. సోలార్ పరిశ్రమలో కోల్పోయిన భూములకు పరిహారం చెల్లింపులో నాలుగేళ్ల నుంచి జాప్యం జరుగుతున్న విషయం వాస్తవమేనని ఆర్డీఓ అంగీకరించారు. మొత్తం 980 ఎకరాలకు పరిహారం ఇవ్వడానికి రూ.81 కోట్లు అవసరమని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ప్రభుత్వానికి నివేదికలు పంపినట్లు తెలిపారు. ఇందులో మొదట జనరల్ అవార్డు కింద గుర్తించిన 210 ఎకరాలకు రూ.27 కోట్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నప్పటికీ కోర్టు వ్యవహారం కారణంగా పెండింగ్‌లో ఉంచినట్లు వెల్లడించారు. రెక్టిఫికేషన్ అవార్డు కింద గుర్తించిన మరో 230 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో కాలయాపన జరుగుతోందన్నారు. పరిహార విషయంలో తీవ్ర మనస్తాపానికి లోనై ఆత్మహత్య చేసుకున్న బోయ మద్దిలేటి కుటుంబానికి జాతీయ కుటుంబ యోజన పథకం(ఎన్‌ఎఫ్‌బి) కింద ఆర్థిక ప్రయోజనం కల్పిస్తామని హామీ ఇచ్చారు. మృతుని కుటుంబంలో ఒకరికి సోలార్ పరిశ్రమలో ఉద్యోగ అవకాశం కల్పిస్తామని చెప్పారు. స్థానిక యువతకు అర్హతను బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆ సంస్థ ఈఈ సుధాకర్‌ను ఆర్డీఓ ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌తో చర్చించిన తర్వాత 15 రోజుల్లో రూ. 81 కోట్ల్ల పరిహారం చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో బాధిత రైతులు, వ్యవసాయ కూలీలు తమ ఆందోళనను విరమించుకున్నారు. సీపీఎం మండల కన్వీనర్ నాగన్న , రైతు సంఘం నాయకులు రామకృష్ణ , భూ నిర్వాసిత కమిటీ సభ్యులు చంద్రబాబు, చాంద్‌బాషా షంషీర్‌ఖాన్, జయరాముడు, మల్లమ్మ, రమాదేవి, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ కూలీలు, బాధిత రైతులతో మాట్లాడుతున్న ఆర్డీవో హుసేన్ సాహెబ్ -
విద్యుత్ చార్జీలు తగ్గిస్తాం : సీఎం
అమరావతి: సోలార్ విద్యుత్ అందుబాటులోకి వస్తుండటంతో విద్యుత్ చార్జీలు తగ్గుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పనపై ఆయన శనివారం సమీక్షించారు. వచ్చే ఏడాది విద్యుత్ చార్జీలు తగ్గిస్తామన్నారు. ఈ నెలాఖరున ఓర్వకల్లు విమానాశ్రయానికి శంకుస్థాపన జరుగుతుందని, జూలై నెల చివరకు విజయవాడ-ముంబయి, విజయవాడ-తిరుపతి, విజయవాడ-ఇండోర్ విమాన సర్వీసులు నడుస్తాయని వివరించారు. గ్యాస్ పైపు లైన్ల ఏర్పాటులో జాప్యంపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రికి లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నారు. -
కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య
ఓర్వకల్లు: భార్యాభర్తల మధ్య కలహాలు ఒకరి ప్రాణం తీశాయి. తెల్లారితే ఆనందంగా పండుగ నిర్వహించాల్సిన ఇంట్లో విషాదం అలుముకుంది. ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడ గ్రామంలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామానికి చెందిన మహబూబ్‌బాషా (డీజిల్బాష)కు కోడుమూరు మండలం లద్దగిరి గ్రామానికి చెందిన కుర్షిద్జహ (32)తో 16 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. కుమారులు ఇద్దరు హైదరాబాద్‌లో పాలిష్కట్టర్లుగా పని చేస్తున్నారు. భర్త మహబూబ్‌బాష ఊర్లోనే డీజిల్ వ్యాపారం చేస్తున్నాడు. సోమవారం భార్యాభర్తలు ఇద్దరు ఓ రైతు పొలానికి కూలీకి వెళ్లారు. అక్కడే కుటుంబ కలహాలతో ఇద్దరు వాగ్వాదపడ్డారు. దీంతో మనస్తాపానికి గురైన కుర్షిద్జహా సాయంత్రం ఇంటికి చేరుకుని పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కోలుకోలేక మంగళవారం మతి చెందింది. మతురాలి సోదరుడు షేక్షావలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
రాజధానికి ఓర్వకల్లు ఇసుక!
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి రాయలసీమలోని ఇసుకను వినియోగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా కర్నూలు జిల్లా ఓర్వకల్లుపై ప్రధానంగా దృష్టి సారించింది. ఓర్వకల్లు ప్రాంతంలో భూగర్భంలో భారీ పరిమాణంలో ఇసుక ఉందని ప్రభుత్వానికి ప్రాథమిక సమాచారం అందింది. దీంతో అక్కడ ఎంత ఇసుక లభిస్తుందో అంచనా వేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)ని ప్రభుత్వం ఆదేశించింది. ఏపీఎండీసీ అధికారులు ఆ ప్రాంతంలోని భూగర్భంలో ఇసుక లభ్యత అంచనా వేసే పనుల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఏపీఎండీసీ డ్రిల్లింగ్ పనులు చేపట్టింది. భూగర్భంలో ఇసుక... ఓర్వకల్లు ప్రాంతంలో తెల్లని కనికరాళ్లను పోలిన క్వార్ట్జ్‌గుట్టలు ఉన్నాయి. ఈ ఖనిజం కింద భూగర్భంలో 15-20 మీటర్ల లోతులో పెద్ద పరిమాణంలో ఇసుక ఉందని ప్రభుత్వానికి సమాచారం వచ్చింది. ఓర్వకల్లు ప్రాంతంలో మొత్తం ఎంత పరిమాణంలో ఇసుక ఉంది? అది నిర్మాణాలకు పనికి వస్తుందా? ఇది సహజ సిద్ధమైన ఇసుకా? సిలికా శాండా..? అనే అంశాలను నిర్ధారించడంతో పాటు దానిని నిర్మాణాలకు వాడవచ్చా? లేదా తెలియజేయాలని ప్రభుత్వం ఏపీఎండీసీకి సూచించింది. దీంతో ఆ సంస్థ అధికారులు అక్కడ డ్రిల్లింగ్ పనులకోసం రిగ్గులను ఏర్పాటు చేశారు. అయితే డ్రిల్లింగ్ చేస్తుంటే డ్రిల్లింగ్ బిట్లు (రాతిని కత్తిరించే రాడ్లు) విరిగిపోతుండటం సమస్యగా మారింది. క్వార్ట్జ్‌రాయి గట్టితనంవల్ల డ్రిల్లింగ్ బిట్లు విపరీతంగా దెబ్బతింటున్నాయని క్షేత్రస్థాయి అధికారుల ద్వారా తెలిసింది. గాజు పరిశ్రమలకు ఉపయోగం.. 'ప్రస్తుతం ఓర్వకల్లు ప్రాంతంలోని క్వార్ట్జ్, సిలికా ఇసుక గాజు పరిశ్రమలకు బాగా ఉపయోగపడుతోంది. ఈ ఖనిజం కింద సాధారణ ఇసుక ఉందని గతంలో ఎవరికీ తెలియదు. సాధారణంగా ఇక్కడ సిలికా మాత్రమే ఉండే అవకాశం ఉంది. అయితే ఇక్కడ భవన నిర్మాణాలకు వినియోగించే ఇసుక ఉందని ప్రభుత్వానికి ఎలా తెలిసిందో మాకు తెలియదు. మరికొన్ని రోజులు డ్రిల్లింగ్ చేస్తేగానీ ఈ ప్రాంతంలోని భూగర్భంలో నిజంగా ఇసుక ఉందా? ఇది నిర్మాణాలకు ఉపయోగపడేంత నాణ్యమైనదా? కాదా? అనేది తేలదు. ఇది నిర్మాణాలకు ఉపయోగపడితే మాత్రం రాజధాని నిర్మాణ పనులకు వినియోగించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది' అని ప్రభుత్వ వర్గాలు 'సాక్షి'కి ధ్రువీకరించాయి. -
కారు బోల్తా: నలుగురికి గాయాలు
ఓర్వకల్లు (కర్నూలు జిల్లా): వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో ఆదివారం జరిగింది. వివరాలు.. నంద్యాల నుంచి కర్నూలు వైపు వెళ్తున్న కారు బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని వైద్యం కోసం ఓర్వకల్లు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. -
పరిశ్రమల హబ్‌గా ఓర్వకల్లు
ఓర్వకల్లు: ఓర్వకల్లు ప్రాంతం త్వరలోనే పరిశ్రమల హబ్‌గా మారనుందని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. సోమవారం పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ముందుగా కేఈ కృష్ణమూర్తితో పాటు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా, జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, మాజీ మంత్రులు ఏరాసు ప్రతాపరెడ్డి, కేఈ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కాల్వబుగ్గ పుణ్యక్షేత్రానికి వెళ్లి బుగ్గరామేశ్వర స్వాముల వారిని దర్శించుకున్నారు. తర్వాత ఆలయ సమీపాన ఎనిమిదిన్నర ఎకరాలలో వికాస భారతి వారి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన భరతమాత ఆలయం, గోశాలను ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు జరిపి ప్రారంభించారు.తర్వాత హుసేనాపురం 18వ జాతీయ రహదారి నుంచి ఎన్.కొంతలపాడు మీదుగా ఉప్పలపాడు వరకు రూ.2.50కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణం, అలాగే ఎన్‌హెచ్ 18 నుంచి బ్రహ్మణపల్లె వరకు రూ.2కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణాలకు కేఈ భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కాల్వ గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ ఓర్వకల్లు ప్రాంతంలో ప్రభుత్వ భూములు విస్తారంగా ఉన్నందున పరిశ్రమల స్థానకు అనువైందిగా అధికారులు నివేదికలు పంపారన్నారు. ఈ ప్రాంతం పారిశ్రామిక కేంద్రంగా మారనుందన్నారు. డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేయడమేగాక ప్రతి సభ్యురాలికి సెల్‌ఫోన్ అందజేస్తామన్నారు. బేతంచర్ల మండలం రాజులకత్వ నుంచి వచ్చే నీటి వృథాను అరికట్టి కొమ్ముచెరువు పరిమాణం పెంచి కాల్వ, గుమ్మితంతండా, గుడుంబాయితండా ప్రాంతాలకు సాగునీటి సదుపాయం కల్పించాలని కాల్వ గ్రామ సర్పంచ్ బాకర్ సాహెబ్ ఉప ముఖ్యమంత్రికి విన్నవించుకున్నారు. ఈ విషయాన్ని సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి చెరువు నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. జేసీ కన్నబాబు, ఆర్డీఓ రఘుబాబు, ఇన్చార్జి డీఎస్పీ మనోహర్‌రావు, సీఐ శ్రీనివాసరెడ్డి, ఉలిందకొండ, ఓర్వకల్లు ఎస్సైలు నరేంద్రకుమార్‌రెడ్డి, విజయలక్ష్మి పాల్గొన్నారు. -
ఓర్వకల్లులో యుద్ధ సామగ్రి ఉత్పత్తి కేంద్రం
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో భారత రక్షణ శాఖ ఆధ్వర్యంలో డిఫెన్స్ రీసెర్స్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీఓ) ఏర్పాటు కాబోతుంది. కేంద్రం నవ్యాంధ్రప్రదేశ్‌కు ఈ పరిశ్రమను మంజూరు చేయగా ఇప్పటికైనా వివిధ జిల్లాల్లో భూములను పరిశీలించిన ప్రత్యేక బృందం కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు ప్రాంతంలో ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చింది. రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే డీఆర్డీఓ దేశంలోనే కీలకమవుతుంది. యుద్ధ సామాగ్రికి అవసరమైన క్షిపణులు, యుద్ధ ట్యాంకులు, మిస్సైల్స్, గన్స్ వంటివి ఇక్కడ ఉత్పత్తి చేయనున్నారు. డీఆర్డీఓ నెలకొల్పేందుకు 2500 ఎకరాల భూములు అవసరమవుతాయని కేంద్రం అంచనా వేసింది. శనివారం ఓర్వకల్లు ప్రాంతంలో డీఆర్డీఓ ఉన్నతాధికారి కల్నల్ రాజు ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం పర్యటించి భూములను పరిశీలించింది. అనంతరం జిల్లా కలెక్టర్ సిహెచ్.విజయ్మోహన్తో క్యాంపు కార్యాలయంలో సమావేశమై చర్చించారు. సమావేశం అనంతరం కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ ఆ వివరాలను వెల్లడించారు. డిఫెన్స్, రీసెర్స్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీఓ) ఏర్పాటు కోసం రక్షణ శాఖ ఐదు దశల్లో రూ.5 వేల కోట్లు వ్యయం చేయనుందని వెల్లడించారు. డీఆర్డీఓను జిల్లాలో నెలకొల్పేందుకు ఉన్నతాధికారుల బృందం సానుకూలత వ్యక్తం చేసిందని పేర్కొన్నారు. ఇందులో జిల్లా వాసులకు 4 వేల నుంచి 5 వేల ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని వివరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ కన్నబాబు పాల్గొన్నారు.