పరిశ్రమల హబ్‌గా ఓర్వకల్లు
ఓర్వకల్లు:
ఓర్వకల్లు ప్రాంతం త్వరలోనే పరిశ్రమల హబ్‌గా మారనుందని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. సోమవారం పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ముందుగా కేఈ కృష్ణమూర్తితో పాటు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా, జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, మాజీ మంత్రులు ఏరాసు ప్రతాపరెడ్డి, కేఈ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కాల్వబుగ్గ పుణ్యక్షేత్రానికి వెళ్లి బుగ్గరామేశ్వర స్వాముల వారిని దర్శించుకున్నారు.
తర్వాత ఆలయ సమీపాన ఎనిమిదిన్నర ఎకరాలలో వికాస భారతి వారి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన భరతమాత ఆలయం, గోశాలను ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు జరిపి ప్రారంభించారు.తర్వాత హుసేనాపురం 18వ జాతీయ రహదారి నుంచి ఎన్.కొంతలపాడు మీదుగా ఉప్పలపాడు వరకు రూ.2.50కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణం, అలాగే ఎన్‌హెచ్ 18 నుంచి బ్రహ్మణపల్లె వరకు రూ.2కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణాలకు కేఈ భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కాల్వ గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ ఓర్వకల్లు ప్రాంతంలో ప్రభుత్వ భూములు విస్తారంగా ఉన్నందున పరిశ్రమల స్థానకు అనువైందిగా అధికారులు నివేదికలు పంపారన్నారు.
ఈ ప్రాంతం పారిశ్రామిక కేంద్రంగా మారనుందన్నారు. డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేయడమేగాక ప్రతి సభ్యురాలికి సెల్‌ఫోన్ అందజేస్తామన్నారు. బేతంచర్ల మండలం రాజులకత్వ నుంచి వచ్చే నీటి వృథాను అరికట్టి కొమ్ముచెరువు పరిమాణం పెంచి కాల్వ, గుమ్మితంతండా, గుడుంబాయితండా ప్రాంతాలకు సాగునీటి సదుపాయం కల్పించాలని కాల్వ గ్రామ సర్పంచ్ బాకర్ సాహెబ్ ఉప ముఖ్యమంత్రికి విన్నవించుకున్నారు. ఈ విషయాన్ని సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి చెరువు నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. జేసీ కన్నబాబు, ఆర్‌డీఓ రఘుబాబు, ఇన్‌చార్జి డీఎస్పీ మనోహర్‌రావు, సీఐ శ్రీనివాసరెడ్డి, ఉలిందకొండ, ఓర్వకల్లు ఎస్సైలు నరేంద్రకుమార్‌రెడ్డి, విజయలక్ష్మి పాల్గొన్నారు.