ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి రాయలసీమలోని ఇసుకను వినియోగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా కర్నూలు జిల్లా ఓర్వకల్లుపై ప్రధానంగా దృష్టి సారించింది. ఓర్వకల్లు ప్రాంతంలో భూగర్భంలో భారీ పరిమాణంలో ఇసుక ఉందని ప్రభుత్వానికి ప్రాథమిక సమాచారం అందింది. దీంతో అక్కడ ఎంత ఇసుక లభిస్తుందో అంచనా వేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)ని ప్రభుత్వం ఆదేశించింది. ఏపీఎండీసీ అధికారులు ఆ ప్రాంతంలోని భూగర్భంలో ఇసుక లభ్యత అంచనా వేసే పనుల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఏపీఎండీసీ డ్రిల్లింగ్ పనులు చేపట్టింది.
భూగర్భంలో ఇసుక...
ఓర్వకల్లు ప్రాంతంలో తెల్లని కనికరాళ్లను పోలిన క్వార్ట్జ్‌గుట్టలు ఉన్నాయి. ఈ ఖనిజం కింద భూగర్భంలో 15-20 మీటర్ల లోతులో పెద్ద పరిమాణంలో ఇసుక ఉందని ప్రభుత్వానికి సమాచారం వచ్చింది. ఓర్వకల్లు ప్రాంతంలో మొత్తం ఎంత పరిమాణంలో ఇసుక ఉంది? అది నిర్మాణాలకు పనికి వస్తుందా? ఇది సహజ సిద్ధమైన ఇసుకా? సిలికా శాండా..? అనే అంశాలను నిర్ధారించడంతో పాటు దానిని నిర్మాణాలకు వాడవచ్చా? లేదా తెలియజేయాలని ప్రభుత్వం ఏపీఎండీసీకి సూచించింది. దీంతో ఆ సంస్థ అధికారులు అక్కడ డ్రిల్లింగ్ పనులకోసం రిగ్గులను ఏర్పాటు చేశారు. అయితే డ్రిల్లింగ్ చేస్తుంటే డ్రిల్లింగ్ బిట్లు (రాతిని కత్తిరించే రాడ్లు) విరిగిపోతుండటం సమస్యగా మారింది. క్వార్ట్జ్‌రాయి గట్టితనంవల్ల డ్రిల్లింగ్ బిట్లు విపరీతంగా దెబ్బతింటున్నాయని క్షేత్రస్థాయి అధికారుల ద్వారా తెలిసింది.
గాజు పరిశ్రమలకు ఉపయోగం..
'ప్రస్తుతం ఓర్వకల్లు ప్రాంతంలోని క్వార్ట్జ్, సిలికా ఇసుక గాజు పరిశ్రమలకు బాగా ఉపయోగపడుతోంది. ఈ ఖనిజం కింద సాధారణ ఇసుక ఉందని గతంలో ఎవరికీ తెలియదు. సాధారణంగా ఇక్కడ సిలికా మాత్రమే ఉండే అవకాశం ఉంది. అయితే ఇక్కడ భవన నిర్మాణాలకు వినియోగించే ఇసుక ఉందని ప్రభుత్వానికి ఎలా తెలిసిందో మాకు తెలియదు. మరికొన్ని రోజులు డ్రిల్లింగ్ చేస్తేగానీ ఈ ప్రాంతంలోని భూగర్భంలో నిజంగా ఇసుక ఉందా? ఇది నిర్మాణాలకు ఉపయోగపడేంత నాణ్యమైనదా? కాదా? అనేది తేలదు. ఇది నిర్మాణాలకు ఉపయోగపడితే మాత్రం రాజధాని నిర్మాణ పనులకు వినియోగించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది' అని ప్రభుత్వ వర్గాలు 'సాక్షి'కి ధ్రువీకరించాయి.