సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం రాజధాని పరిణామాల నేపథ్యంలో అమరావతి పరిరక్షణ సమితి దాఖలు చేసిన పిటిషన్‌లోని అంశాలపై స్పందించలేమని కేంద్రం స్పష్టం చేసింది. ఆ ఆంశాలు తమకు సంబంధించినవి కావని, వాటిపై స్పందించాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమేనని తెలిపింది. మూడు రాజధానుల ఏర్పాటును వ్యతిరేకిస్తూ అమరావతి పరిరక్షణ సమితి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం కేంద్రం ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది. ‘ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం–2014 ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏర్పడ్డాయి.
చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం రెండు రాష్ట్రాలకు పదేళ్లపాటు హైదరాబాద్ రాజధాని. ఆ తర్వాత తెలంగాణకు రాజధానిగా హైదరాబాద్ కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని వస్తుంది. అనంతరం చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం కేంద్రం ఏపీ రాజధాని నిమిత్తం ఆరునెలల్లో నివేదిక ఇవ్వాలని ఐఏఎస్ విశ్రాంత అధికారి కె.సి.శివరామకృష్ణన్ నేతృత్వంలో 2014 మార్చి 28న నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 2014 ఆగస్టు 30న నివేదిక ఇచ్చింది. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి ఆ నివేదిక పంపింది.
అనంతరం 2015 ఏప్రిల్ 23న ఏపీ ప్రభుత్వం అమరావతిని నూతన రాజధానిగా ఆదేశాలు ఇచ్చింది. చట్టంలోని సెక్షన్ 94 ప్రకారం ఏపీలోని రాజ్‌భవన్, హైకోర్టు, ప్రభుత్వ సచివాలయం, అసెంబ్లీ, మండలి ఇతర సదుపాయాలకు కేంద్రం ఆర్థికసాయం చేయాలని ఉంది. దీనిమేరకు కేంద్ర ప్రభుత్వం గృహ, పట్టణ వ్యవహారాలశాఖ నుంచి రూ.వెయ్యి కోట్ల సహా రూ.2,500 కోట్లు విడుదల చేసింది. అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ చట్టం–2020, ఆంధ్రప్రదేశ్ డీసెంట్రలైజేషన్, ఇన్‌క్లూజివ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఆల్ రీజియన్ యాక్ట్–2020లను చేసింది.
దీన్ని రాష్ట్ర గెజిట్‌లో ప్రచురిస్తూ.. అమరావతి లెజిస్లేటివ్ రాజధానిగా, విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ రాజధానిగా, కర్నూలు జ్యుడిషియల్ రాజధానిగా పేర్కొంది. ఈ రెండు చట్టాలు రూపొందించే క్రమంలో కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించలేదు..’ అని కౌంటరులో పేర్కొంది. పిటిషనర్ లేవనెత్తిన అంశాలు కేంద్రానికి సంబంధించినవి కాదని స్పష్టం చేసింది. అందువల్ల ఈ దశలో స్పందించడం లేదని, తదుపరి అవసరమైతే స్పందిస్తామని పేర్కొంది.
మాకు సంబంధం లేదు
Published Thu, Feb 9 2023 3:30 AM | Last Updated on Thu, Feb 9 2023 3:30 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment