కంది సాగుపై.. నజర్
♦ మొదటి సారిగా ముందుకొచ్చిన సంస్థ
♦ కొన్నవాటిని విత్తనాలుగా ఇచ్చి
♦ సాగు పెంచేందుకు చర్యలు
♦ క్షేత్రస్థాయిలో నిల్వలపై సర్వే
♦ వ్యవసాయ శాఖ డెరైక్టర్‌కు ప్రతిపాదనలు
♦ కందుల కొనుగోలుకు వ్యవసాయ శాఖ యోచన!
పప్పు ధాన్యాల సాగు గణనీయంగా తగ్గింది.
దీంతో ధరలు ఆకాశన్నంటుతున్నాయి. సామాన్యులు వాటిని కొనలేని పరిస్థితి నెలకొంది. వీటన్నింటికీ చెక్ పెట్టడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. వ్యవసాయ శాఖ ద్వారా కందులు కొనుగోలు చేసి వాటిని రైతులకు విత్తనాలుగా అమ్మి పప్పు ధాన్యాల సాగు పెంచడానికి నిర్ణయించింది. దీనిలో భాగంగానే మొదటిసారి వ్యవసాయ శాఖ ద్వారా కందుల కొనుగోలు చేసే ఆలోచనలో ఉంది. తాండూరు కందులు రుచిలో మేటిగా ఉండడంతో వీటిని ముందుగా కొనుగోలు చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది.
తాండూరు: మొట్టమొదటి సారిగా కందుల కొనుగోలుకు వ్యవసాయ శాఖ సన్నద్ధమవుతోంది. మార్కెట్ ధరకే రైతుల నుంచి కందులు కొనుగోలు చేయాలని భావిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా కందుల సేకరణకు వ్యవసాయ శాఖ కసరత్తులు చేస్తున్నది. జిల్లాలో కంది పంట విస్తీర్ణాన్ని మరింత పెంచేందుకు కందుల కొనుగోలుకు వ్యవసాయ శాఖ అధికారులు యోచిస్తున్నారు. ఇందుకు సంబంధించి జిల్లా అధికారులు వ్యవసాయ శాఖ డెరైక్టర్‌కు ప్రతిపాదనలు పంపించారు. ఈ డెరైక్టర్ ఈ విషయమై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో కందుల నిల్వలపై అధ్యయనం చేశారు. తాండూరు మండలంతోపాటు స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీలో కందుల నిల్వల వివరాలు సేకరించారు.
రైతుల వద్ద సుమారు 10వేల క్వింటాళ్ల వరకు కందుల నిల్వలున్నట్టు అధికారులు వ్యవసాయ శాఖ డెరైక్టర్‌కు నివేదించారు. మార్కెట్ యార్డులో క్వింటాలు కందులకు ప్రస్తుతం రూ.7వేల నుంచి రూ.8200 వరకు ధరలు పలుకుతున్నాయని అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన కందులను తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థకు అప్పగించనున్నారు. వచ్చే వర్షాకాలం నాటికి కంది విస్తీర్ణాన్ని పెంచాలనే దిశగా ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో ఇందుకు అనుగుణంగా అవసరం మేరకు కంది విత్తనాలను సిద్ధం చేయాలన్నది అధికారుల లక్ష్యంగా కనిపిస్తున్నది. ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా రైతుల నుంచి కందులు కొనుగోలు చేయనున్నారు.
నాణ్యత, రుచిలో తాండూరు కంది మేటి...
జాతీయస్థాయిలో తాండూరు కంది ప్రసిద్ధి. నాణ్యతలో, రుచిలో ఇక్కడి కందిపప్పు మేటి. జిల్లాలోనే తాండూరులో అత్యధికంగా రైతులు కందిపంటను సాగు చేస్తారు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఎఫ్‌సీఐ, మార్క్‌ఫెడ్,నాఫెడ్, డీసీఎంఎస్ ప్రభుత్వరంగ సంస్థలు కందులను కొనుగోలు చేశాయి. తాజాగా వ్యవసాయ శాఖ కూడా ముందుకు రావడం గమనార్హం. అధికారంలోకి వస్తే తాండూరు కందిసాగును ప్రోత్సహిస్తామని ఎన్నికల సమయంలో కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తాండూరులో కందిబోర్డు ఏర్పాటుకు కృషి చేస్తానని ఇటీవల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి ప్రకటించారు. తిరుపతి లడ్డూ మాదిరిగా భౌగోళిక గుర్తింపు (జీఐ) కోసం స్థానిక శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ఈ- మార్కెటింగ్‌కు తాండూరు మార్కెట్ కమిటీ ఎంపికైన విషయం తెలిసిందే.