గొంతెండుతోంది.. | water probloms in distic | Sakshi
Sakshi News home page

గొంతెండుతోంది..

Published Tue, Mar 29 2016 2:49 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

గొంతెండుతోంది.. - Sakshi

గొంతెండుతోంది..

వేసవి ప్రారంభంలోనే తాగునీటి ఎద్దడి తీవ్రతరం
వందలాది గ్రామాల్లో అష్టకష్టాలు పడుతున్న ప్రజలు
ప్రొద్దుటూరులో నాలుగు రోజులకు ఒకసారి నీటి సరఫరా
కడపలో ఎండిన బోర్లు.. పలు కాలనీల్లో మూడు రోజులకోసారి నీటి విడుదల
పెండ్లిమర్రి, దువ్వూరు, బి.కోడూరులలో వ్యవసాయ బోర్ల వద్దకు జనం పరుగులు

 

 మాటలు కోటలు దాటేలా హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన వారు.. ఆ హామీలను అమలు చేయకపోగా కనీసం తాగు నీటిని
కూడా ఇవ్వలేకపోతున్నారని జనం మండిపడు తున్నారు. పల్లెల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. నీటి ఎద్దడి నెలకొన్న గ్రామాల్లో ముందస్తు చర్యలు తీసుకున్నామని అధికారులు చెబుతున్న  మాటలు వాస్తవం కాదని ‘సాక్షి’ క్షేత్ర స్థాయి  పరిశీలనలో వెల్లడైంది.


సాక్షి, కడప :  వేసవి ప్రారంభంలోనే తాగు నీటి ఎద్దడి తీవ్రతరమైంది. నవంబర్‌లో భారీ వర్షాలు కురిసి వాగులు, వంకలు పోటెత్తడంతో ఇక నీటికి కరువు ఉండదని అందరూ భావించారు. మార్చి నెలలో భానుడి ఉగ్ర రూపానికి అక్కడక్కడ నిలువ ఉన్న నీరంతా అవిరైపోయింది. భూగర్భ జల మట్టం సైతం అనూహ్యంగా తగ్గిపోయింది. పర్యవసానంగా బోర్లు, బావులు ఎండిపోతున్నాయి. గ్రామాల్లో ఉన్న ఫలంగా తలెత్తుతున్న తాగునీటి సమస్యతో ప్రజలు హోరెత్తుతున్నారు. దాహార్తి తీర్చుకునేందుకు దారులు వెతుకుతున్నారు. జిల్లాలోని అనేక గ్రామాల్లో మంచి నీటి కోసం ప్రజలు పడుతున్న వేదన అంతా ఇంతా కాదు. ఏప్రిల్, మే, జూన్ నాటికి ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందోనని ప్రజలు బెంబేలెత్తుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 30 లక్షల జనాభా ఉండగా, కేవలం 20 లక్షల మందికి మాత్రమే నీటి పథకాల ద్వారా అందించే నీరు సరిపోతున్నట్లు అధికారిక   గణాంకాల ద్వారా తెలుస్తోంది. కడప, ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు లాంటి ప్రధాన పట్టణాలలో సైతం తాగునీటి సమస్య జఠిలంగా మారింది.

ప్రొద్దుటూరులో నాలుగు రోజులకోసారి..
ప్రొద్దుటూరు మున్సిపాలిటీతోపాటు పరిసర గ్రామాల్లోనూ తాగునీటి సమస్య ఎక్కువగా కంగారు పెడుతోంది. పట్టణ ప్రజలకు 14 ఎంఎల్‌డీల నీటిని అందించాల్సి ఉండగా, కేవలం 8 ఎంఎల్‌డీల నీటిని మాత్రమే అందిస్తున్నారు. ఆరు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నా, అవి ఏ మూలకూ సరిపోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. చాలా వార్డుల్లో నాలుగు రోజులకు ఒకసారి నీరందిస్తున్నారు. పెన్నానది ఎండిపోవడం, కేసీ కెనాల్ చుట్టు పక్కల బోర్లలో భూగర్భ జలాలు అడుగంటడంతో సమస్య తీవ్రరూపం దాలుస్తోంది.

 నాగులకట్టవీధి, సంజీవనగర్, స్వరాజ్‌నగర్, బాలాజీనగర్-1, 2, అమృతానగర్, గీతాశ్రమం చుట్టు పక్కల ప్రాంతాలు, 35 వార్డుల్లో సమస్య మరింత తీవ్రతరం కానుంది. ఉప్పరపల్లె, బొజ్జవారిపల్లెలో బోర్లు ఎండిపోవడంతో ప్రజలు బావి వద్దకు వెళ్లి నీరు తెచ్చుకుంటున్నారు. కొత్తపేట, శంకరాపురం, చౌడూరు, చిన్నశెట్టిపల్లెల్లో నీటి సమస్య ఆందోళన కలిగిస్తుండగా, కొర్రపాడులో ఆరు రోజులకు ఒకసారి నీరందిస్తున్నారు. వెలవల్లి రోడ్డులో ఉన్న బోరు వద్దకు ట్రాక్టర్లు, సైకిళ్లు, బైకుల్లో వెళ్లి నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్నానాలు, దుస్తులు శుభ్రపరుచుకోవడానికి కూడా ఇబ్బంది ఎదురవుతోందని పలువురు వాపోతున్నారు.

వందలాది గ్రామాల్లో సమస్య మొదలు..
జిల్లాలోని వందలాది గ్రామాల్లో తాగునీటి సమస్య ప్రారంభమైంది. అయితే ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు మాత్రం పదుల సంఖ్యలోని గ్రామాల్లో మాత్రమే సమస్య ఉందని చెబుతున్నారు. రాయచోటి నియోజకవర్గంలో సుమారు 80కి పైగా గ్రామాల్లో, జమ్మలమడుగు పరిధిలో 15 గ్రామాల్లో సమస్య ఏర్పడింది. ఎర్రగుంట్ల మున్సిపాలిటీలో మురికి నీరు  వస్తోందని ప్రజలు గగ్గోలు పెడుతున్నా యంత్రాంగం పట్టించుకోవడం లేదు. రాజంపేట పరిధిలో ఐదు గ్రామాల్లో, కమలాపురం నియోజకవర్గంలోని పెండ్లిమర్రి మండలంలో ఐదు గ్రామాల్లో నీటి సమస్య ఇబ్బంది పెడుతోంది. బద్వేలు మున్సిపాలిటీతోపాటు చుట్టు పక్కల 20 గ్రామాల్లో నీటి సమస్య ఏర్పడింది. బి.కోడూరు మండలం నరసింహాపురంలో వ్యవసాయ బోరు వద్దకు వెళ్లి ప్రజలు నీటిని తెచ్చుకుంటున్నారు. దువ్వూరు మండలంలో కూడా వ్యవసాయ బోర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. పులివెందుల, మైదుకూరు నియోజకవర్గాల పరిధిలోని పలు గ్రామాల్లో తాగునీటి సమస్య మొదలైంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఏప్రిల్ ఆఖరు నాటికి 1000-1500 గ్రామాల్లో సమస్య తీవ్రతరం కానుంది. కాగా, జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం రూ.7.20 కోట్లతో ప్రతిపాదనలు పంపింది.

 పాతాళంలోకి గంగమ్మ..
కడప ఎడ్యుకేషన్:  జిల్లాలో భూగర్భ జల మట్టం 12 మీటర్లకు పడిపోయింది. ఫలితంగా జిల్లాలో రానున్న రోజుల్లో తీవ్ర నీటి ఎద్దడి తలెత్తనుంది. సీకేదిన్నె, గాలివీడు, దువ్వూరు, గోపవరం, ఖాజీపేట, నందలూరు, రాజంపేట, రాజుపాలెం, రామాపురం, రాయచోటి, ఒంటిమిట్ట మండలాల్లో ఫిబ్రవరి 15వ తేదీ నాటికి ఒకటి నుంచి 5 మీటర్ల లోతులో ఉన్న నీటిమట్టం ప్రస్తుతం 12 మీటర్లకు పడిపోయింది. బిమఠం, చక్రాయపేట, చెన్నూరు. చిట్వేల్, కడప, కమలాపురం, లింగాల, మైలవరం, పెనగలూరు. ప్రొద్దుటూరు, పుల్లంపేట, సంబేపల్లి, సిద్దవటం, తొండూరు. వీఎన్‌పల్లి, వల్లూరు. వీరబల్లి, వేముల, ఎర్రగుంట్ల మండ లాల్లో 5 నుంచి 10 మీటర్ల లోతులో ఉన్న నీటి మట్టం 15 మీటర్లకు దిగజారింది. అట్లూరు. బికోడూరు. బద్వేల్, చిన్నమండెం, జమ్మలమడుగు, కోడూరు, కొండాపురం, ఎల్‌ఆర్‌పల్లి, ముద్దనూరు, మైదుకూరు. ఓబులవారిపల్లె, పెద్దముడియం, పెండ్లిమర్రి, పులివెందుల, సింహాద్రిపురం, టి సుండుపల్లి మండలాల్లో 20 మీటర్ల లోతులో నీటిమట్టం ఉంది. పోరుమామిళ్ల, కాశినాయన, వేంపల్లి మండలాల్లో మాత్రం 30 మీటర్ల లోతులో, కలసపాడు మండలంలో 30 మీటర్లు పైన నీటి మట్టం ఉంది.

 మంచినీటి ఎద్దడిని అధిగమిస్తాం ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈగా బాధ్యతలు చేపట్టిన సంజీవరావు
కడప ఎడ్యుకేషన్:  రానున్న వేసవిలో జిల్లాలో ఎక్కడ మంచినీటి ఎద్దడి తలెత్తకుండా గట్టి చర్యలు తీసుకుంటామని గ్రామీణ నీటిసరఫరా, పారిశుద్ధ్యం  శాఖ సూపరింటెండెంట్ ఇంజనీరు సంజీవరాయుడు పేర్కొన్నారు. ఒంగోలు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా  పనిచేస్తూ సూపరింటెండెంట్‌గా పదోన్నతిపై కడపకు వచ్చారు. ఈమేరకు సోమవారం ఎస్సీ కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా మంచినీటి సమస్య రాకుండా చూస్తామన్నారు.  ఈఈలతో చర్చించి సమస్య ఉన్న ప్రాంతాలకు వెళ్లి  గట్టి చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడైన సమస్య వస్తే యుద్ధప్రాతిపదికన పనులను పూర్తి చేసి గ్రామీణ ప్రజల దాహార్తి తీరుస్తామన్నారు.

 శుభాకాంక్షలు తెలిసిన ఈఈలు, డీఈలు
జిల్లా సూపరెండెంట్ ఇంజనీరుగా బాధ్యతలు చేపట్టిన సంజీవరావుకు జిల్లాలోని పలు డివిజన్లకు చెందిన ఈఈలు, డీఈలు  శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో మంచినీటి సమస్య గురించి అయన వారితో చర్చించారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement