న(అ)మ్మకాన్ని వంచించారు! | give cost price to farmers | Sakshi
Sakshi News home page

న(అ)మ్మకాన్ని వంచించారు!

Published Sat, Jun 21 2014 2:01 AM | Last Updated on Sat, Sep 2 2017 9:07 AM

న(అ)మ్మకాన్ని వంచించారు!

న(అ)మ్మకాన్ని వంచించారు!

 ఆదోని: వేల రూపాయలు పెట్టుబడి పెట్టి, ఇంటిల్లిపాది ఆరుగాలం చెమటోడ్చి వేరుశనగ పండించారు. పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో దిగుబడులను ఇళ్లలో దాచిపెట్టుకున్నారు. ఇంతలోనే ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్  ఫెడ్ గిట్టుబాటు ధరకు దిగుబడులు కొనుగోలు చేస్తోందని చెప్పడంతో రైతులు ఎంతో సంబర పడ్డారు. మార్కెట్ ధర క్వింటాల్ రూ.2200 నుంచి రూ.3300 వరకు ఉండగా..అయిల్ ఫెడ్ క్వింటాల్‌కు రూ.నాలుగు వేలు చెల్లిస్తామని చెప్పడంతో ఈ ఏడాది జనవరిలో విక్రయించారు. ఫిబ్రవరి నెలాఖరులోగా రైతులకు బిల్లులు చెల్లించాల్సి ఉన్నా..ఇంతవరకు కొందరు రైతులకు డబ్బులు అందకపోవడంతో అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రస్తుతం పంట పెట్టుబడులకు చేతిలో డబ్బు లేక..బ్యాంకులు రుణాలివ్వకపోవడంతో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది.  
 
పక్షం రోజుల్లో బిల్లులు చెల్లిస్తామన్నారు..

అయిల్ ఫెడ్ అధికారులు జిల్లాలోని ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, డోన్, ఆలూరు, కర్నూలు మార్కెట్ యార్డులలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో వ్యవ,ప్రయాసాలు కోర్చి రైతులు దిగుబడులను అమ్ముకున్నారు. పత్తికొండ యార్డులో ఏర్పడిన గందరగోళంతో కొనుగోళ్లు కొన్నాళ్లు నిలిచిపోయాయి. దీంతో రైతులు నాలుగైదు రోజుల పాటు రోడ్డెక్కి ఆందోళన నిర్వహించడంతో కొనుగోలులో నిర్లక్షం చేశారనే కారణంతో ఆయిల్ ఫెడ్ మేనేజరు ఎల్లారెడ్డి, పత్తికొండ కొనుగోలు కేంద్రం ఇన్‌చార్జ్ బ్రహ్మేశ్వరరెడ్డిపై అప్పట్లో ప్రభుత్వం సస్సెన్షన్ వేటు వేసింది. ఎట్టకేలకు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా ఆయిల్ ఫెడ్ సంస్థ లక్షా 45 వేల క్వింటాళ్లు కొనుగోలు చేశారు.
 
 అధికారులు పక్షం రోజుల్లో బిల్లులు చెల్లిస్తామని చెప్పి కొనుగోలు చేసిన వేరు శనగకు సంబందించి రైతులకు రశీదులు ఇచ్చారు. చేతికి డబ్బులు అందగానే పంట సాగు కోసం చేసిన  అప్పులు చెల్లించి ఆ తరువాత తమ ఆర్థిక అవసరాలు తీర్చుకోవాలని అన్నదాతలు ఆశించారు. పలువురు ఖరీఫ్ పంట పెట్టుబడికి ఇక దిగులుండదని బావించారు. అయితే చెప్పిన సమయానికి బిల్లులు చెల్లించకపోవడంతో రైతులకు తెలిసొచ్చి తెల్లబోయారు. గత జనవరిలో కొనుగోలు చేయగా పక్షం రోజుల్లో రైతులందరికీ బిల్లులు చెల్లించాలి. అయితే దాదాపు రెండు నెలల తరువాత బిల్లుల చెల్లింపులు ప్రారంభించారు. అప్పటికే మార్కెట్ యార్డుల చుట్టు ఎన్నో సార్లు తిరిగి వేసారి పోయారు. ఇంకా బిల్లులు అందని రైతులు వందల్లో ఉన్నారు.
 
 ఆదోనిలోనే దాదాపు 596 మందికి రూ.4.23 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఆదోని,కర్నూలు, పత్తికొండ, ఎమ్మిగనూరు, డోన్ మార్కెట్ యార్డులలో కూడా చాలా మందికి బిల్లులు అందాల్సి ఉంది. అయితే ఆదోనిలో తప్ప మిగిలిన మార్కెట్ యార్డుల పరిధిలో బకాయిలు రూ.లక్షల్లో మాత్రమే ఉందని ఆయిల్ ఫెడ్ జిల్లా కో-ఆర్డినేటర్ సుధాకర్ రావు పేర్కొన్నారు. వేరు శనగ అమ్మి ఇప్పటికే దాదాపు ఆరు నెలలు అవుతోంది. స్థానికంగా ఆయిల్ ఫెడ్ అధికారులు ఎవ్వరు లేక పోవడంతో తమ బకాయిల కోసం ఎవరిని సంప్రదించాలో రైతులకు దిక్కు తోచడం లేదు.
 
ఖరీఫ్ సీజన్ ప్రారంభం అయి దాదాపు పక్షం రోజులు అయింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ ఇంకా ఎటు తేలలేదు. బకాయిలు చెల్లిస్తేనే కొత్త రుణాలిస్తామని బ్యాంకర్లు తెగేసి చెపుతున్నారు. ఇటు ఆయిల్ ఫెడ్ అధికారులు బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారో తెలీయక, అటు బ్యాంకుల్లో అప్పు పుట్టక అన్నదాత ఆందోళనకు గురవుతున్నాడు. ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో తాము గుడ్డిగా నమ్మి చేతికి అందిన పంట దిగుబడులను అమ్ముకున్నామని, బిల్లులు ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పేవారు కరువయ్యారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌లో అమ్ముకుని ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
 
హైదరాబాదులో మకాం పెట్టిన ఆయిల్ ఫెడ్ అధికారి
ఆదోని ఆయిల్ ఫెడ్ కొనుగోలు కేంద్రం అధికారి నరేంద్రరెడ్డి తన మకాంను హైదరాబాదుకు మార్చారు. దీంతో బిల్లుల కోసం వచ్చిన రైతులకు సమాధానం చెప్పేందుకు స్థానికంగా ఎవ్వరు లేకుండా పోయారు. రైతుల నుంచి వస్తున్న ఒత్తిళ్లను తట్టుకోలేకే ఆయన హైదరాబాదులో ఉన్నట్లు తెలుస్తోంది.
 
నరేంద్ర రెడ్డిని ‘సాక్షి’ఫోన్‌లో సంప్రదించగా బకాయి బిల్లులకు సంబంధించిన నిధులు మంజూరు చేయించుకోడానికి తాను హైదరాబాదులో ఉన్నట్లు చెప్పారు. నిధులు మంజూరు కాగానే రైతులకు డబ్బులు చెల్లిస్తామని, ఎవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.  వారం రోజుల్లో వేరు శనగ అమ్మిన రైతులందరికీ బిల్లులు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయిల్ ఫెడ్ జిల్లా కో-ఆర్డినేటర్ సుధాకర్ రావు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement