న్యూఢిల్లీ: ధరల కట్టడి వ్యూహంలో భాగంగా కేంద్రం ‘భారత్’ బ్రాండ్ కింద విక్రయిస్తున్న శనగపప్పుకి గణనీయంగా ఆదరణ లభిస్తోంది. ప్రవేశపెట్టిన నాలుగు నెలల్లోనే మార్కెట్లో పావు వంతు వాటా దక్కించుకుంది. ఇతర బ్రాండ్స్‌తో పోలిస్తే రేటు తక్కువగా ఉండటం ఇందుకు దోహదపడుతోందని వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు. భారత్ బ్రాండ్ శనగపప్పు ధర కిలోకి రూ. 60గా ఉండగా, ఇతర బ్రాండ్స్ రేటు సుమారు రూ. 80 వరకు ఉంటోందని పేర్కొన్నారు.
2023 అక్టోబర్‌లో ప్రవేశపెట్టినప్పటి నుంచి భారత్ బ్రాండ్ శనగపప్పు 2.28 లక్షల టన్నుల మేర అమ్ముడైందని, నెలకు సగటున 45,000 టన్నుల అమ్మకాలు నమోదవుతున్నాయని సింగ్ చెప్పారు. ప్రాథమికంగా 100 రిటైల్ పాయింట్స్‌తో మొదలుపెట్టి నేడు 21 రాష్ట్రాల్లోని 139 నగరాల్లో 13,000 పైచిలుకు మొబైల్, ఫిక్సిడ్ రిటైల్ అవుట్‌లెట్స్ స్థాయికి ఇది విస్తరించిందని ఆయన చెప్పారు.
నాఫెడ్, కేంద్రీయ భండార్ వంటి సంస్థల ద్వారా ప్రభుత్వం శనగపప్పు విక్రయాలు చేపట్టడం ఇదే ప్రథమం. ఈ ఏజెన్సీలు శనగలను సబ్సిడీ రేటుపై కేజీకి రూ. 47.83 చొప్పున కొనుగోలు చేసి వాటిని మిల్లు పట్టి, పాలిష్ చేసి కేజీకి రూ. 60 చొప్పున భారత్ బ్రాండ్ కింద విక్రయిస్తాయి. కేంద్రం ఇప్పటికే భారత్ బ్రాండ్ కింద ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) గోధుమ పిండిని విక్రయిస్తుండగా, బియ్యం విక్రయాలు కూడా ప్రారంభించాలని యోచిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment