chana
-
‘భారత్’ బ్రాండ్ శనగపప్పుకి డిమాండ్
న్యూఢిల్లీ: ధరల కట్టడి వ్యూహంలో భాగంగా కేంద్రం ‘భారత్’ బ్రాండ్ కింద విక్రయిస్తున్న శనగపప్పుకి గణనీయంగా ఆదరణ లభిస్తోంది. ప్రవేశపెట్టిన నాలుగు నెలల్లోనే మార్కెట్లో పావు వంతు వాటా దక్కించుకుంది. ఇతర బ్రాండ్స్‌తో పోలిస్తే రేటు తక్కువగా ఉండటం ఇందుకు దోహదపడుతోందని వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు. భారత్ బ్రాండ్ శనగపప్పు ధర కిలోకి రూ. 60గా ఉండగా, ఇతర బ్రాండ్స్ రేటు సుమారు రూ. 80 వరకు ఉంటోందని పేర్కొన్నారు. 2023 అక్టోబర్‌లో ప్రవేశపెట్టినప్పటి నుంచి భారత్ బ్రాండ్ శనగపప్పు 2.28 లక్షల టన్నుల మేర అమ్ముడైందని, నెలకు సగటున 45,000 టన్నుల అమ్మకాలు నమోదవుతున్నాయని సింగ్ చెప్పారు. ప్రాథమికంగా 100 రిటైల్ పాయింట్స్‌తో మొదలుపెట్టి నేడు 21 రాష్ట్రాల్లోని 139 నగరాల్లో 13,000 పైచిలుకు మొబైల్, ఫిక్సిడ్ రిటైల్ అవుట్‌లెట్స్ స్థాయికి ఇది విస్తరించిందని ఆయన చెప్పారు. నాఫెడ్, కేంద్రీయ భండార్ వంటి సంస్థల ద్వారా ప్రభుత్వం శనగపప్పు విక్రయాలు చేపట్టడం ఇదే ప్రథమం. ఈ ఏజెన్సీలు శనగలను సబ్సిడీ రేటుపై కేజీకి రూ. 47.83 చొప్పున కొనుగోలు చేసి వాటిని మిల్లు పట్టి, పాలిష్ చేసి కేజీకి రూ. 60 చొప్పున భారత్ బ్రాండ్ కింద విక్రయిస్తాయి. కేంద్రం ఇప్పటికే భారత్ బ్రాండ్ కింద ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) గోధుమ పిండిని విక్రయిస్తుండగా, బియ్యం విక్రయాలు కూడా ప్రారంభించాలని యోచిస్తోంది. -
రూ.60కే కేజీ శనగపప్పు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ హాకా(హైదరాబాద్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ అసోసియేషన్ లిమిటెడ్) తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా శనగ పప్పు పంపిణీ చేయనుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ‘భారత్ దాల్’ పేరుతో రాయితీపై పంపిణీకి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం మార్కెట్లో కిలో శనగపప్పు ధర రూ.90 ఉండగా హాకా మాత్రం వినియోగదారులకు రాయితీపై రూ. 60కే అందించనుంది. ఈ పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం హెచ్ఐసీసీలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, కేంద్ర వినియోగదారుల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ కలిసి ప్రారంభించనున్నారు. ఇక్కడ పంపిణీని ప్రారంభించిన అనంతరం హాకా ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో పంపిణీ చేపట్టనుంది. డీ–మార్ట్, మెట్రో, రిలయన్స్మార్ట్, టాటామార్ట్తో పాటు చిన్న పెద్ద స్టోర్స్‌లలోనే కాకుండా ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్స్ అయిన జొమాటో, స్విగ్గి, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, జొమాటోలలో కూడా అందుబాటులో ఉంచనున్నారు. వీటిల్లో కూడా కేజీ రూ.60కే అందించనున్నారు. కాగా 30కేజీల బ్యాగ్ తీసుకుంటే కేజీ రూ.55కే చొప్పున రూ.1650కే అందజేస్తారు. రాయితీపై అందిస్తున్న ఈ పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే పప్పు కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరి ఫోన్ నంబర్, ఆధార్ నెంబర్‌ను సేకరించనున్నారు. అధికారులు కోనుగోలుదారుల్లో ఎవరికైనా ఫోన్ చేసి నిర్ణీత ధరకే పప్పు అందిందా లేదా అనే విషయాన్ని క్రాస్ చెక్ చేయనున్నారు. 18 రాష్ట్రాలు... 180 పట్టణాలు రాయితీ శనగ పప్పును హాకా దేశ వ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఒక్కో రాష్ట్రంలో కనీసంగా 10 పట్టణాలను ఎంపిక చేసింది. ఈ విధంగా దేశ వ్యాప్తంగా 180 పట్టణాల్లో పంపిణీ చేయడం ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉంచనుంది. తెలంగాణతో పాటు ఏపీ, బీహార్, చత్తీస్గడ్, గుజరాత్, హరియాణా, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశి్చమ బెంగాల్ రాష్ట్రాల్లో పంపిణీ చేయనుంది. -
హిమాచల్ వంటకం.. చనా మద్రా ఎప్పుడైనా తిన్నారా!
కావలసినవి: కాబూలి చనా – రెండు కప్పులు(రాత్రంతా నానబెట్టుకుని ఉడికించినవి తీసుకోవాలి), ఆవనూనె – మూడు టేబుల్ స్పూన్లు, ఇంగువ –పావు టీస్పూను, లవంగాలు – మూడు, దాల్చిన చెక్క – అంగుళం ముక్క, నల్ల యాలుక్కాయ – ఒకటి, మిరియాలు – నాలుగు, జీలకర్ర – ఒకటిన్నర టీస్పూన్లు, ఉల్లిపాయ – ఒకటి(ముక్కలు తరగాలి), గరం మసాలా పొడి – ముప్పావు టీస్పూను, ధనియాల పొడి – టేబుల్ స్పూను, పసుపు – అరటేబుల్ స్పూను, కారం, ఉప్పు – రుచికి సరిపడా, పచ్చిమిర్చి – మూడు, పెరుగు – రెండు కప్పులు, బియ్యప్పిండి – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు, నెయ్యి – టేబుల్ స్పూను. తయారీ విధానం: ►ముందుగా మిరియాలు, యాలుక్కాయ, లవంగాలను బరకగా గ్రైండ్ చేసి పక్కనపెట్టుకోవాలి ►బియ్యప్పిండిలో కొద్దిగా నీళ్లుపోసి కలిపి పక్కన పెట్టుకోవాలి ►స్టవ్ మీద బాణలి పెట్టి ఆవనూనె వేయాలి. ఇది వేడెక్కిన తరువాత దాల్చిన చెక్క, ఇంగువ, జీలకర్ర వేసి వేయించాలి. ►ఇవి వేగాక గ్రైండ్ చేసి పెట్టుకున్న లవంగాల మిశ్రమాన్ని వేయాలి ∙రెండు నిమిషాలు వేగాక, ఉల్లిపాయ ముక్కలు, గరం మసాలా, ధనియాల పొడి వేసి మగ్గనివ్వాలి ∙ ►ఇప్పుడు ఉడికించిపెట్టుకున్న కాబూలి చనా, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి కలపాలి. ►పచ్చిమిర్చిని నిలువుగా చీల్చి వేసి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి. ►పెరుగుని గడ్డలు లేకుండా చిలికి కూర మిశ్రమంలో వేసి సన్నని మంట మీద ఉడికించాలి ∙ ఐదు నిమిషాల తరువాత బియ్యపు పిండి మిశ్రమం, నెయ్యివేసి మరో పదినిమిషాలు ఉడికించాలి – ఆయిల్ పైకి తేలిన తరువాత దించేయాలి. ఇది అన్నంలోకి చాలా బావుంటుంది. -
ఈయన దయ ఉంటే గెలిచేయొచ్చు!
శుక్రవారం బుల్లి రాష్ట్రం మిజోరాంలో ఎన్నికలు జరిగాయి. ఇక్కడ ఎంపీ సీటుకు ఎన్నిక జరిగింది. ఈ పోటీలో అందరు రాజకీయ నాయకులు, అన్ని పార్టీలు ఒక్క వ్యక్తి చుట్టే తిరుగుతున్నాయి. ఆయన పేరు జియోన్గాకా చానా. ఇంతకీ ఎందుకు అన్ని పార్టీలూ చానా చుట్టు తిరుగుతున్నాయి? ఎందుకంటే ఆయనకు 39 మంది భార్యలు, 127 మంది పిల్లలు, మనవళ్లు ఉన్నారు. వీరందరితో కలిసి నూరు గదుల సువిశాలమైన ఇంట్లో చానా నివసిస్తూ ఉంటాడు. వీరిలో భార్యలందరూ ఓటర్లే. కొడుకుల్లోనూ దాదాపు 80 మంది ఓటర్లున్నారు. అంటే చానా చేతిలో దాదాపు 160కి పైగా ఓట్లున్నాయి. ఇంకా తమాషా ఏమింటే వీరంతా చానా మాటను జవదాటరు. ఆయన ఏ పార్టీకి వేయమంటే ఆ పార్టీకే ఓటు వేస్తారు. అంటే గుండుగుత్తగా 160 ఓట్లు ఒకే పార్టీకి పడతాయన్నమాట. మిజోరాం జనాభా చాలా తక్కువ. కొన్ని లక్షలే ఉంటుంది. కాబట్టి వంద ఓట్లు గెలుపోటములను నిర్ధారిస్తాయి. అందుకే పార్టీలన్నీ చానా గారి చుట్టూ చానా చక్కర్లు కొడుతున్నాయి. గతంలోనూ చానా చుట్టూ లీడర్లు ఇలాగే తిరిగారట!