సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ హాకా(హైదరాబాద్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ అసోసియేషన్ లిమిటెడ్) తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా శనగ పప్పు పంపిణీ చేయనుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ‘భారత్ దాల్’ పేరుతో రాయితీపై పంపిణీకి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం మార్కెట్లో కిలో శనగపప్పు ధర రూ.90 ఉండగా హాకా మాత్రం వినియోగదారులకు రాయితీపై రూ. 60కే అందించనుంది. ఈ పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం హెచ్‌ఐసీసీలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, కేంద్ర వినియోగదారుల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ కలిసి ప్రారంభించనున్నారు.
ఇక్కడ పంపిణీని ప్రారంభించిన అనంతరం హాకా ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో పంపిణీ చేపట్టనుంది. డీ–మార్ట్, మెట్రో, రిలయన్స్‌మార్ట్, టాటామార్ట్‌తో పాటు చిన్న పెద్ద స్టోర్స్‌లలోనే కాకుండా ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్స్ అయిన జొమాటో, స్విగ్గి, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, జొమాటోలలో కూడా అందుబాటులో ఉంచనున్నారు. వీటిల్లో కూడా కేజీ రూ.60కే అందించనున్నారు.
కాగా 30కేజీల బ్యాగ్ తీసుకుంటే కేజీ రూ.55కే చొప్పున రూ.1650కే అందజేస్తారు. రాయితీపై అందిస్తున్న ఈ పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే పప్పు కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరి ఫోన్ నంబర్, ఆధార్ నెంబర్‌ను సేకరించనున్నారు. అధికారులు కోనుగోలుదారుల్లో ఎవరికైనా ఫోన్ చేసి నిర్ణీత ధరకే పప్పు అందిందా లేదా అనే విషయాన్ని క్రాస్ చెక్ చేయనున్నారు.
18 రాష్ట్రాలు... 180 పట్టణాలు
రాయితీ శనగ పప్పును హాకా దేశ వ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఒక్కో రాష్ట్రంలో కనీసంగా 10 పట్టణాలను ఎంపిక చేసింది. ఈ విధంగా దేశ వ్యాప్తంగా 180 పట్టణాల్లో పంపిణీ చేయడం ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉంచనుంది. తెలంగాణతో పాటు ఏపీ, బీహార్, చత్తీస్‌గడ్, గుజరాత్, హరియాణా, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశి్చమ బెంగాల్ రాష్ట్రాల్లో పంపిణీ చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment