Rohit Kumar
-
‘భారత్’ బ్రాండ్ శనగపప్పుకి డిమాండ్
న్యూఢిల్లీ: ధరల కట్టడి వ్యూహంలో భాగంగా కేంద్రం ‘భారత్’ బ్రాండ్ కింద విక్రయిస్తున్న శనగపప్పుకి గణనీయంగా ఆదరణ లభిస్తోంది. ప్రవేశపెట్టిన నాలుగు నెలల్లోనే మార్కెట్లో పావు వంతు వాటా దక్కించుకుంది. ఇతర బ్రాండ్స్‌తో పోలిస్తే రేటు తక్కువగా ఉండటం ఇందుకు దోహదపడుతోందని వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు. భారత్ బ్రాండ్ శనగపప్పు ధర కిలోకి రూ. 60గా ఉండగా, ఇతర బ్రాండ్స్ రేటు సుమారు రూ. 80 వరకు ఉంటోందని పేర్కొన్నారు. 2023 అక్టోబర్‌లో ప్రవేశపెట్టినప్పటి నుంచి భారత్ బ్రాండ్ శనగపప్పు 2.28 లక్షల టన్నుల మేర అమ్ముడైందని, నెలకు సగటున 45,000 టన్నుల అమ్మకాలు నమోదవుతున్నాయని సింగ్ చెప్పారు. ప్రాథమికంగా 100 రిటైల్ పాయింట్స్‌తో మొదలుపెట్టి నేడు 21 రాష్ట్రాల్లోని 139 నగరాల్లో 13,000 పైచిలుకు మొబైల్, ఫిక్సిడ్ రిటైల్ అవుట్‌లెట్స్ స్థాయికి ఇది విస్తరించిందని ఆయన చెప్పారు. నాఫెడ్, కేంద్రీయ భండార్ వంటి సంస్థల ద్వారా ప్రభుత్వం శనగపప్పు విక్రయాలు చేపట్టడం ఇదే ప్రథమం. ఈ ఏజెన్సీలు శనగలను సబ్సిడీ రేటుపై కేజీకి రూ. 47.83 చొప్పున కొనుగోలు చేసి వాటిని మిల్లు పట్టి, పాలిష్ చేసి కేజీకి రూ. 60 చొప్పున భారత్ బ్రాండ్ కింద విక్రయిస్తాయి. కేంద్రం ఇప్పటికే భారత్ బ్రాండ్ కింద ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) గోధుమ పిండిని విక్రయిస్తుండగా, బియ్యం విక్రయాలు కూడా ప్రారంభించాలని యోచిస్తోంది. -
రూ.60కే కేజీ శనగపప్పు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ హాకా(హైదరాబాద్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ అసోసియేషన్ లిమిటెడ్) తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా శనగ పప్పు పంపిణీ చేయనుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ‘భారత్ దాల్’ పేరుతో రాయితీపై పంపిణీకి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం మార్కెట్లో కిలో శనగపప్పు ధర రూ.90 ఉండగా హాకా మాత్రం వినియోగదారులకు రాయితీపై రూ. 60కే అందించనుంది. ఈ పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం హెచ్ఐసీసీలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, కేంద్ర వినియోగదారుల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ కలిసి ప్రారంభించనున్నారు. ఇక్కడ పంపిణీని ప్రారంభించిన అనంతరం హాకా ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో పంపిణీ చేపట్టనుంది. డీ–మార్ట్, మెట్రో, రిలయన్స్మార్ట్, టాటామార్ట్తో పాటు చిన్న పెద్ద స్టోర్స్‌లలోనే కాకుండా ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్స్ అయిన జొమాటో, స్విగ్గి, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, జొమాటోలలో కూడా అందుబాటులో ఉంచనున్నారు. వీటిల్లో కూడా కేజీ రూ.60కే అందించనున్నారు. కాగా 30కేజీల బ్యాగ్ తీసుకుంటే కేజీ రూ.55కే చొప్పున రూ.1650కే అందజేస్తారు. రాయితీపై అందిస్తున్న ఈ పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే పప్పు కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరి ఫోన్ నంబర్, ఆధార్ నెంబర్‌ను సేకరించనున్నారు. అధికారులు కోనుగోలుదారుల్లో ఎవరికైనా ఫోన్ చేసి నిర్ణీత ధరకే పప్పు అందిందా లేదా అనే విషయాన్ని క్రాస్ చెక్ చేయనున్నారు. 18 రాష్ట్రాలు... 180 పట్టణాలు రాయితీ శనగ పప్పును హాకా దేశ వ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఒక్కో రాష్ట్రంలో కనీసంగా 10 పట్టణాలను ఎంపిక చేసింది. ఈ విధంగా దేశ వ్యాప్తంగా 180 పట్టణాల్లో పంపిణీ చేయడం ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉంచనుంది. తెలంగాణతో పాటు ఏపీ, బీహార్, చత్తీస్గడ్, గుజరాత్, హరియాణా, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశి్చమ బెంగాల్ రాష్ట్రాల్లో పంపిణీ చేయనుంది. -
బీమా ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలి
న్యూఢిల్లీ: బీమా ఒప్పందాల్లో అస్పష్టత, షరతులు అసౌకర్యంగా ఉండడం వంటి ఆరు అంశాలను కేంద్ర ప్రభుత్వం బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ), బీమా కంపెనీల ముందు ప్రస్తావించింది. వెంటనే వీటిని పరిష్కరించాలని, అపరిష్కృతంగా ఉన్న వినియోగదారుల కేసులను తగ్గించాలని బుధవారం ఢిల్లీలో జరిగిన సదస్సులో కోరింది. కోర్టు బయట పరిష్కారాల విషయమై బీమా కంపెనీల ప్రతినిధులకు అధికారాల్లేకపోవడం, వినియోగదారులతో ఒప్పందంపై సంతకం చేయించుకోవడానికి ముందు పాలసీకి సంంధించి అన్ని డాక్యుమెంట్లను అందించకపోవడం, ముందు నుంచీ ఉన్న వ్యాధుల పేరిట క్లెయిమ్‌లను తిరస్కరించడం, పంట బీమా క్లెయిమ్‌లను కేంద్ర పథకంతో ముడిపెట్టడాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రస్తావించింది. ప్రస్తుతం దేశంలో వినియోగదారుల నుంచి వస్తున్న ఫిర్యాదుల్లో 20 శాతానికి పైగా బీమా రంగానికి సంబంధించే ఉంటున్నాయనేది వాస్తవం ‘‘ఐఆర్డీఏఐ, ఇతర భాగస్వాముల (బీమా సంస్థలు, టీపీఏలు) వద్ద ఈ అంశాలను ప్రస్తావించాం. బీమా సంస్థలు స్వచ్చందంగా వీటిని పరిష్కరిస్తాయని ఆశిస్తున్నాం. అవసరనుకుంటే వీటిని తప్పనిసరి చేయాలని ఐఆర్‌డీఏఐని కోరతాం’’అని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు. ఈ అంశాల వల్లే దేశవ్యాప్తంగా బీమాకు సంబంధించి పెద్ద మొత్తంలో ఫిర్యాదులు అపరిష్కృతంగా ఉన్నట్టు చెప్పారు. పరిశ్రమ 8 శాతం విస్తరణ రేటును చేరుకోవాలంటే, ఫిర్యాదులు పెద్ద ఎత్తున పెరిగిపోకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. బీమా పాలసీ నిబంధనలు, షరతులు సులభతరంగా, స్పష్టంగా, అర్థం చేసుకోతగిన భాషలో ఉంటే ఫిర్యాదులను తగ్గించొచ్చని అభిప్రాయపడ్డారు. నియమ నిబంధనలు, షరతులను పూర్తిగా అర్థం చేసుకోకుండా డాక్యుమెంట్‌పై సంతకం చేయరాదన్న అవగాహనను పాలసీదారుల్లో కాల్పించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. -
ఈ– కామర్స్ ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ మెరుగుపడాలి
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ సంస్థల ఫిర్యాదుల పరిష్కార విధానం గుర్తించదగిన స్థాయిలో పటిష్టంగా లేదని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. నేషనల్ కన్సూ్యమర్ హెల్ప్‌లైన్‌కు (ఎన్సీహెచ్) వచ్చిన ఫిర్యాదుల సంఖ్య గత నాలుగేళ్లలో భారీగా పెరిగిందని కూడా చెప్పారు. పబ్లిక్ ఎఫైర్స్ ఫోరమ్ ఆఫ్ ఇండియా (పీఏఎఫ్ఐ) నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, 2021 నవంబర్‌నాటికి నేషనల్ కన్సూ్యమర్ హెల్ప్‌లైన్‌కు వచ్చిన ఫిర్యాదుల సంఖ్య 40,000 ఉంటే, 2022 నవంబర్ నాటికి ఈ సంఖ్య 90,000కు చేరిందని అన్నారు. నాలుగేళ్ల క్రితం మొత్తం ఫిర్యాదుల్లో ఈ– కామర్స్ లావాదేవీలకు సంబంధించినవి 8 శాతం ఉంటే, గత నెల్లో ఇది 48 శాతంగా నమోదయినట్లు వెల్లడించారు. ఈ–కామర్స్ సంస్థల ఫిర్యాదుల పరిష్కార విధానం సరిగా లేదన్న విషయం దీనిని బట్టి అర్థం అవుతోందని అన్నారు. కీలక చర్యలకు శ్రీకారం.. వినియోగదారుల బలహీనపడుతున్న పరిస్థితుల్లో మంత్రిత్వజోక్యం పాత్ర కీలకమవుతోందని అన్నారు. ప్రస్తుతం 10 భాషల్లో ఎన్సీహెచ్ సేవలు అందిస్తోందని, భవిష్యత్తులో ఇవి 22కి పెరుగుతాయని చెప్పారు. వినియోగ హక్కుల పరిరక్షణకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో వినియోగదారుల కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న 5.27 లక్షల కేసులపై ఆందోళన వ్యక్తం చేసిన సింగ్, ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. పెండింగ్‌లో ఉన్న మొత్తం కేసుల్లో 1.8 లక్షలు బీమా రంగానికి సంబంధించినవి కాగా మరో 80,000 కేసులు బ్యాంకింగ్‌కు సంబంధించినవని ఆయన తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించే ఉత్పత్తుల ప్రకటన విషయాన్ని ప్రస్తావిస్తూ, దీనిపై త్వరలో మార్గదర్శకాలను జారీ చేయనున్నట్లు తెలిపారు. ‘‘మేము ఇప్పుడు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ల కోసం ఒక ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేసాము. అది త్వరలో విడుదలవుతుంది. ఉత్పత్తిని ఆమోదించి, ప్రచారం చేసిన వారు డబ్బు తీసుకున్నారో, లేదో వెల్లడించాలి’’ అని ఆయన అన్నారు. కృత్రిమ మేధస్సు, స్థిర ప్యాకేజింగ్‌పై ప్రమాణాలను కూడా ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని వెల్లడించారు. -
ఒడిశాలో బాంబు పేలుడు.. జర్నలిస్టు మృతి
భవానీపట్నం/భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రం కలహండీ జిల్లాలో శనివారం బాంబు(ఐఈడీ) పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ప్రముఖ పత్రిక జర్నలిస్టు, ఫొటోగ్రాఫర్ రోహిత్‌కుమార్ బిశ్వాల్(46) మరణించాడు. భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు ఈ బాంబు పేలుడుకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నెలలో జరగబోయే ఐదు దశల పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాలని ప్రజలకు పిలుపునిస్తూ మావోయిస్టులు మదన్‌పూర్ రాంపూర్ బ్లాక్‌లోని దోమ్‌కర్లకుంటా గ్రామం వద్ద ఓ చెట్టుకు అతికించిన పోస్టర్లు, బ్యానర్‌ను రోహిత్‌కుమార్ తిలకిస్తుండగా అక్కడే బాంబు పేలిందని కలహండీ ఎస్పీ డాక్టర్ వివేక్ చెప్పారు. జర్నలిస్టు మృతి పట్ల ఒడిశా ముఖ్యమంత్రి సంతాపం ప్రకటించారు. రోహిత్‌కుమార్ కుటుంబానికి రూ.13 లక్షల నష్ట పరిహారం ప్రకటించారు. -
సహానుభూతి సైతం కరువైనచోట..!
ఔరంగాబాద్ సమీపంలో రైలుపట్టాల మీద పడుకుని నిద్రించి, గూడ్స్ రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 16 మంది వలస కార్మికుల ‘అవివేకం, మూర్ఖత్వం’ గురించి సోషల్ మీడియా గంగవెర్రులెత్తుతోంది. బాధితులనే నిందించడం అనేది సరికొత్త జాడ్యంలా తయారైన దేశంలో పట్టాల మీద తలలు చిధ్రమైపోయిన వారి పట్ల కాస్త కరుణ మనలో ఉంటుందని ఊహించలేం. ఉద్యోగాలు కోల్పోయి, అద్దె ఇళ్ల నుంచి ఉన్న çఫళాన ఖాళీ చేయాల్సి వచ్చి, కొద్దిపాటి రోటీలతో, భవిష్యత్తుపై ఎలాంటి ఆశలు లేకుండా, మండిస్తున్న ఎండలో వీపులపై పిల్లలను మోసుకుంటూ సొంత వూళ్లకు వెళ్లడానికి బలవంతంగా నడవాల్సి వచ్చిన అమానుష పరిస్థితుల్లో చిక్కుకుపోయిన వారి ‘వివేకం’పై ఎవరు అంచనా వేయాలి? మే నెల 8న మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలోని రైలు పట్టాలమీద పడుకుని నిద్రిస్తున్న 16 మంది వలస కార్మికుల జీవితాలను అటుగా వచ్చిన సరుకుల రైలు ఛిద్రంచేసి పడేసింది. ఈ విషాదం జరిగి అప్పుడే 6 రోజులు గడిచిపోయాయి. కానీ ఆ కుటుంబాలకు జరిగిన నష్టం గురించి ఇప్పటికీ నాలో ఆలోచనలు రగులుతూనే ఉన్నాయి. హృదయాన్ని రగిలిస్తున్నది వాస్తవంగా జరిగిన ప్రమాద ఘటనా లేక సోషల్ మీడియాలో ఈ ఘటనపై వస్తున్న స్పందనలా అన్నది నిర్ణయించుకోలేకపోతున్నాను. ఆ ఘటన పట్ల సోషల్ మీడియాలో వచ్చిన స్పందనల్లో కొన్ని. ‘ఇంత బాధ్యతారహితంగా వారు పట్టాలపై పడుకున్నారు, వాళ్లు తమకు తామే నిందించుకోవాలి. వాళ్లకు పిల్లలున్నారు. తమ పిల్లలను గురించి వారు ఎందుకు ఆలోచించలేదు? రైలుపట్టాలమీద ఎవరైనా పడుకుంటారా? పట్టాల పక్కన వాళ్లెందుకు పడుకోలేదు? వారు అంత మూర్ఖంగా ఎలా వ్యవహరించారు?’ సోషల్ మీడియాలో వచ్చిన ఈ తరహా స్పందనలు చూసి నేను అవాక్కయిపోలేదు. ఎందుకంటే బాధితులనే నిందించడం అనేది ఇప్పుడు ఒక సరికొత్త జాడ్యం. మన దేశంలో అత్యాచారం బారిన పడిన వారినే అవమానిస్తుంటారు. పేదల బాధలకు వారే కారణమని నిందిస్తుంటారు. ఈ నేపథ్యంలో గూడ్స్ రైలు కింద పడి చనిపోయిన వారి మరణాలకు ఆ మృతులనే తప్పుపట్టడం చూస్తుంటే ఆశ్చర్యం కలిగించదు. పేదలను ఉద్ధరించే బాధ్యతను తమకుతామే నెత్తిన వేసుకున్న ఈ పెద్దమనుషులు ఎంతో నైతిక నిష్టతో సూచిస్తున్నట్లుగా, రైలు పట్టాల మీద పడుకునే ఆ వివేకవంతులు ఎవరై ఉంటారు? నిజంగా ఇంకెవరు? వలస కార్మికులే. నిజానికి వారి వివేకం సరైందే. అలా పడుకోకుండా వారిని ఈ దేశంలో ఆదుకునేవారెవ్వరు? ఉన్నట్లుండి తమ ఉద్యోగాలనుంచి విసిరేయబడిన వారు, అద్దె ఇళ్లనుంచి ఉన్నఫళాన ఖాళీ చేయాల్సి వచ్చిన వారు, కొద్దిపాటి రోటీలతో, భవిష్యత్తుపై ఎలాంటి ఆశలు లేకుండా, మండిస్తున్న ఎండలో వీపులపై పిల్లలను మోసుకుంటూ సొంత వూళ్లకు వెళ్లడానికి బలవంతంగా నడవాల్సి వచ్చిన అమానుష పరిస్థితుల్లో చిక్కుకుపోయిన వారి వివేకం ఎలా ఉండాలి? జీవితంలో అన్నీ పోగొట్టుకుని ఏంచేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో సాధారణ హేతువుకు కూడా తావు లేకుండా వారికి తగిలిన గాయాలు ఎంత ప్రభావం వేశాయో మనకు అర్థం కాకపోవచ్చు. నిలబడేందుకు కాస్త నీడలేక నడకబాట పట్టిన వలసకార్మికులు వీపులపై పోలీసుల లాఠీలు మోగుతున్నప్పుడు ఆ పాశవికతలో మనకు ఏదైనా విచక్షణా జ్ఞానం ఉన్నట్లు కనబడుతుందా? తిండీతిప్పలు కూడా సరిగా లేనిస్థితిలో వందలాది మైళ్ల దూరం నడుచుకుంటూ కండరాలు అలసిపోయిన స్థితిలో తాము పడుకున్న చోటికి రైలు వస్తుందని, తమ దేహాలను ఛిద్రం చేస్తుందనే స్పృహ వాళ్లలో ఉంటుందని ఆశించవచ్చా? లేక లాక్డౌన్ సమయంలో రైళ్లు నడవవు అని కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాటలను యథాతథంగా వారు దృష్టిలో పెట్టుకున్నారా? మనకు తెలిసిందల్లా ఒకటే. కాలినడకన నడిచి నడిచి వారెంత అలసిపోయి ఉన్నారంటే గూడ్స్ రైలు చేసే భారీ శబ్దం కానీ, రొదపెట్టే హారన్ కానీ వారిని నిద్ర లేపలేకపోయాయి. కరోనా కాదు.. లాక్ డౌన్ మరణాలు కరోనా వ్యాధి ప్రభావం కంటే లాక్ డౌన్ విధింపు కారణంగా గత శనివారం వరకు దేశవ్యాప్తంగా 378 మంది వలసకార్మికులు దయనీయ పరిస్థితుల్లో మరణించారని తాజా పరిశోధన చెబుతోంది. వీరిలో ఏ ఒక్కరికీ కరోనా వ్యాధి సోకలేదు. తమ స్వస్థలాలకు నడిచి పోతుం డగా రోడ్డు, రైలు ప్రమాదాలకు గురై 74 మంది వలస కార్మికులు గత 50 రోజులుగా మరణించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా రవాణాను చెప్పాపెట్టకుండా రద్దు చేయడంతో వలసకార్మికులకు నడక ఒక్కటే ప్రయాణ సాధనంగా మారింది. మరణాల వారీగా చూస్తే ఆకలిదప్పులు, ఆర్థిక బాధలకు గురై 47 మంది చనిపోయారు. నడకలో అలసిపోయి, క్యూలలో నిలబడి తాళలేక చనిపోయినవారి సంఖ్య 26. పోలీసు పాశవికత్వం లేక రాజ్యహింస వల్ల 12 మంది చనిపోయారు. వైద్య సేవల లేమి, ముసలివారిని పట్టించుకోకపోవడంతో 40 మంది హరీమన్నారు. కరోనా సోకుతుందన్న భయంతో, ఒంటరితనంతో ఆత్మహత్యలు చేసుకున్నవారి సంఖ్య 83. ఆల్కహాల్ అందుబాటులో లేని సమస్యలతో చనిపోయిన, ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్య 46. నడిచిపోతుండగా రోడ్డు లేక రైలు ప్రమాదాల కారణంగా చనిపోయిన వారి సంఖ్య 74. లాక్డౌన్ సంబంధిత నేరాల కారణంగా చనిపోయినవారు 14 మంది. ఎలాంటి వర్గీకరణల్లో ఇమడకుండా చనిపోయినవారు 41 మంది. ఆ మరునాడు ఉదయం, ఈ విషాద వార్త తెలియగానే బాధితులపై ఆగ్రహాన్ని, క్రోధాన్ని ప్రదర్శించడంలో ట్విట్టర్, ఫేస్ బుక్ పోటీలు పడ్డాయి. ఇది బాధితుల మూర్ఖత్వం తప్ప మరేమీ కాదట. అంటే మరణించిన తర్వాత కూడా వలసకార్మికులను అర్థం చేసుకున్నవారు, వారి పట్ల సానుభూతి, కరుణ చూపిన వారు ఈ దేశంలోనే లేకుండా పోయారన్నమాట. కనీసం మన ప్రధాని అయినా ఈ సందర్భంగా కాస్త సరైన విధంగా ప్రకటన చేశారు. ‘మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో రైలుప్రమాద ఘటనలో వలసకార్మికులు ప్రాణాలు కోల్పోవడం నన్ను తీవ్రంగా కలిచివేస్తోంది. దీనిపై రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌తో మాట్లాడాను. ఆయన పరిస్థితిని సన్నిహితంగా పర్యవేక్షిస్తున్నారు. బాధితులకు అవసరమైన సహాయం పూర్తిగా అందజేస్తాం’. గత ఆరేళ్లుగా ప్రధాని నరేంద్రమోదీ రికార్డును పరిశీలించండి. తన ప్రతిష్టను భంగపర్చుకోవడం తప్పితే ఆయన ఏ విషయం మీద అయినా తీవ్రంగా బాధపడుతున్నారంటే నమ్మడం కష్టమే. ఇతరుల బాధల పట్ల తీవ్ర విచారం కాదు కదా.. కాస్తంత సానుభూతి అయినా ఉన్నట్లయితే, ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా ఆకలిదప్పులకు గురవుతున్న లక్షలాదిమందికి సహాయం అందించవలసిందిగా రక్షణ బలగాలను ఆదేశించి ఉండేవారు. లక్షలాది మంది అన్నార్తులకు ఉపశమనం కలిగించగల శక్తి, సామర్థ్యం సైన్యానికి మాత్రమే ఉన్నాయి మరి. ఆ పని చేసి ఉంటే గోడవున్ల కొద్దీ మగ్గుతున్న వరి, గోధుమ ధాన్యాన్ని బయటకు తీసి రేషన్ కార్డులున్నా లేకున్నా, అవసరమైన ప్రతి ఒక్కరికీ అందించేవారు. ఆయా రాష్ట్రాల్లో చిక్కుకుపోయి ఉన్న వలసకార్మికులను తరలించడానికి బస్సులు, ట్రక్కులు, చివరకు రైళ్లను కూడా రంగంలోకి దింపి ఉండేవారు. చివరకు ఆసుపత్రులపై పూలు చల్లడం కంటే మన వాయుసేన వలస కార్మికుల తరలింపులో మిన్నగా సేవలందించేది. అయినా మన పాలకులను మాత్రమే తప్పు పట్టి ప్రయోజనం ఏమిటి? బాధల పట్ల విచారం వ్యక్తం చేయడం కాదు కదా.. కనీసం పరితాపం కూడా ప్రదర్శించని ప్రజారాసుల మాటేమిటి? గత ఆరేళ్లుగా మనం చూస్తూ వస్తున్నదేమిటంటే, భారతీయ సమాజంలోని ఎగువ, మధ్య తరగతి వర్గాలలో బాధితుల పట్ల కనీస సహానుభూతి కూడా కరువైపోతుండటమే. అప్పుల్లో మునిగిపోయిన రైతు బాధ పట్ల స్పందించకపోవడంలో, దళితుల దురవస్థను అర్థం చేసుకోకపోవడంలో, ముస్లింలను సమాజం నుంచే బహిష్కరిస్తుండటాన్ని గుర్తించడానికి కూడా వెనుకాడటంలో, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) జాతీయ పౌర నమోదు (ఎన్నార్సీ)కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న యువ గళాలకు సంఘీభావం తెలుపడంలో మన అసమర్థత, అమానుషత్వం కొట్టొచ్చినట్లు ప్రతి సందర్భంల్లోనూ కనిపిస్తూనే వస్తోంది. ప్రముఖ మనస్తత్వ శాస్త్రజ్ఞుడు ఆల్ప్రెడ్ అడ్లర్ ఒక సందర్భంలో సహానుభూతి గురించి నిర్వచిస్తూ, మరొకరి కళ్లతో బాధను చూడటం, మరొకరి చెవులతో బాధను ఆలకించడం, మరొకరి హృదయంతో అనుభూతి చెందడమే సహానుభూతి అని పేర్కొన్నారు. కానీ ఇతరుల పట్ల అలాంటి సహానుభూతి ప్రదర్శించడానికి మనం ఎప్పుడో దూరమైపోయాం. బహుశా మనం మనుషులుగా ఎలా ఉండాలో, ఎలా స్పందించాలో భగవంతుడు భయానకరీతిలో నిర్దేశించినట్లుగా ఈ సాంక్రమిక వ్యాధి కానీ, లాక్డౌన్ కానీ ఇప్పుడు మనకు చక్కగానే బోధిస్తున్నాయి. బహుశా మనం మన నెట్‌ప్లిక్స్ సీరియల్స్ వీక్షణం నుంచి, సోషల్ మీడియాలో సొంత డబ్బా కొట్టుకోవడం నుంచి, వంటల ప్రదర్శన నుంచి దూరం జరిగినప్పుడే, మన చుట్టూ బాధలు పడుతున్న వారి గాథలను వినగలమనుకుంటాను. అప్పుడు మాత్రమే రైలుపట్టాల మీద తలపెట్టి నిద్రిస్తూ ప్రాణాలు కోల్పోయిన ఆ ‘మూర్ఖపు’ వలస కార్మికులపై మనం ఉచిత తీర్పులు ఇవ్వకుండా ఉండగలమేమో.. (ది వైర్ సౌజన్యంతో) వ్యాసకర్త: రోహిత్ కుమార్, విద్యావేత్త, పాజిటివ్ సైకాలజీ, సైకోమెట్రిక్స్ ఈ–మెయిల్ : letsempathize@gmail.com -
రోహిత్‌కు స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్కూల్ గేమ్స్ సమాఖ్య (ఎస్జీఎఫ్ఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి కరాటే చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు చెందిన రోహిత్ కుమార్ స్వర్ణ పతకం సాధించాడు. రాజస్తాన్‌లో జరిగిన ఈ టోర్నీలో అండర్–19 విభాగంలో బరిలోకి దిగిన రోహిత్ 75 కేజీల కేటగిరిలో అజేయంగా నిలిచాడు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతానికి చెందిన రోహిత్ తాను పోటీపడిన నాలుగు రౌండ్లలోనూ ప్రత్యర్థులను ఓడించాడు. 2017లో నిర్మల్‌లో జరిగిన ఎస్జీఎఫ్ఐ గేమ్స్‌లో రజత పతకం సొంతం చేసుకున్నాడు. -
కేటీఆర్ సూపర్!
సాక్షి, హైదరాబాద్: ‘మంత్రి కేటీఆర్ తెలంగాణకు ఒక గొప్ప వరం. ఆయన ప్రసంగించే తీరు అమోఘం. ఒక రాజకీయ నేతగా ప్రజాసమస్యల పట్ల అవగాహన, వాటి పరిష్కారానికి కృషి చేస్తూ దూసుకెళ్తున్న విధానమే కేటీఆర్‌కు వీరాభిమానిగా మార్చాయి..’ అని ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన రోహిత్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నాడు. టీఆర్ఎస్ పార్టీ గెలుపును కాంక్షిస్తూ ఏకంగా విజయవాడ నుంచి హైదరాబాద్‌కు 17 రోజుల పాదయాత్ర చేసి ఆదివారం రోహిత్ ప్రగతిభవన్‌కు చేరుకున్నాడు. అనంతరం ఐటీ, పురపాలకశాఖ మంత్రి కె.తారకరామారావును కలసి మాట్లాడాడు. సుదూర ప్రాంతం నుండి అభిమానంతో వచ్చిన రోహిత్‌ను ఈ సందర్భంగా కేటీఆర్ ఆలింగనం చేసుకుని కుశల ప్రశ్నలు అడిగారు. సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు తనకు తెలంగాణ పట్ల ఆసక్తిని, అభిమానాన్ని పెంపొందించాయని రోహిత్ తెలిపాడు. యువతరానికి స్ఫూర్తినిచ్చేలా మంత్రి కేటీఆర్ ముందుకు సాగుతున్నారని, తన ప్రత్యేక అభిమానాన్ని చాటుకోవడానికి ఆయన ముఖచిత్రాన్ని గుండె మీద టాటూగా వేయించుకున్నానని వెల్లడించాడు. ఏపీతో పోలిస్తే తెలంగాణాలో అభివృద్ధి బాగుందన్నాడు. కాగా టీఆర్ఎస్ గెలుపు కోసం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసే అవకాశం కల్పించాలని రోహిత్ కోరగా కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. హైదరాబాద్ చేరుకున్న రోహిత్‌ను టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి మంత్రి వద్దకు తీసుకుని వచ్చారు. -
ఎదురునిలిచిన మొనగాళ్లు
అప్రతిహత రికార్డున్న కబడ్డీలో పట్టు జారింది... అంచనాలున్న ఆర్చరీలో బాణం గురి తప్పింది... జిమ్నాస్టిక్స్ విన్యాసాల్లోనూ రిక్తహస్తమే మిగిలింది... కానీ, రోయింగ్ బృందం చరిత్ర తిరగరాసింది! ఎవరూ ఊహించని విధంగా త్రివర్ణ పతాకం ఎగురేసింది! పరువు పోయిందన్న చోటే సగర్వంగా నిలిచింది! సాక్షి క్రీడా విభాగం :‘ప్రత్యర్థి గురించి భయపడొద్దు. నిశ్చలంగా నిలిచి, విజయాన్ని ముద్దాడు!’ ... పంజాబీ ప్రసిద్ధ నానుడి ఇది. దీనిని అక్షరాలా ఆచరించింది భారత పురుషుల రోయింగ్ జట్టు. మన సైన్యంలోని సిక్కు రెజిమెంట్‌లో పనిచేసే నాయిబ్ సవర్ణ్ సింగ్, దత్తు బబన్, ఓంప్రకాశ్, సుఖ్మీత్ సింగ్‌లతో కూడిన బృందం... సైనికుల్లానే పోరాడి స్వర్ణం పట్టు కొచ్చింది. సవర్ణ్ సింగ్ సారథ్యంలో క్లిష్ట పరిస్థితులకు ఎదురొడ్డి మరీ త్రివర్ణ పతాకం ఎగురేసింది. ఈ సంచలన గెలుపుతో వారి చుట్టూ మీడియా మూగింది... ఇంటర్వ్యూల కోసం ఎగబడింది! కానీ, ఈ విజయం వెనుక ఉత్కంఠను అధిగమించిన క్షణాలు... శరీరం నియంత్రణ తప్పేంత శ్రమ... అవమానాన్ని దిగమింగిన కసి ఉన్నాయి... అంతటి ఆసక్తికర నేపథ్యం ఏమంటే! ఎదురుగాలికి ఎదురొడ్డి... శుక్రవారం ఉదయం భారత రోయింగ్ బృందం బరిలో దిగేటప్పటికి అన్నీ ప్రతికూలతలే. గురువా రం నాలుగు ఫైనల్స్‌లో ఓడిపోవడంతో భారత రోయింగ్ చరిత్రలో ఇది చీకటి రోజంటూ కోచ్ ఇస్మాయిల్ బేగ్ మండిపడ్డారు. దత్తు... రేసుకు ముందు ఏకంగా లాక్ వేసుకోవడం మర్చిపోవడంతో బోట్ నుంచి పడిపోయాడు. దీంతో అతడు మానసికంగా దృఢంగా లేడంటూ, ఏ దేశంలోనూ ఇలా ఉండరంటూ విదేశీ కోచ్ నికోల్ జియోగా నిందించాడు. ఇదంతా ఒక ఎత్తయితే శుక్రవారం తేమతో కూడిన గాలుల వాతావరణం సవర్ణ్ జట్టుకు మరింత పరీక్ష పెట్టింది. ఇక బరిలో దిగాక ఆతిథ్య దేశం ఇండోనేసియా నుంచి విపరీతమైన పోటీ ఎదురైంది. అయినా... తట్టుకుని నిలిచి గెలిచింది. ఇబ్బందులను తట్టుకుని... 28 ఏళ్ల సవర్ణ్ సింగ్ జట్టులో సీనియర్. భారత గొప్ప రోయర్లలో ఒకడు. గత ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచాడు. అయితే, గాయంతో రెండేళ్లుగా ఆటకు దూరమయ్యాడు. దాన్నుంచి కోలుకున్నాక టైఫాయిడ్ బారిన పడ్డాడు. కొన్నాళ్ల క్రితమే బరిలో దిగాడు. దత్తు గురువారం నీటిలో పడిపోవడంతో జ్వరం, దగ్గు, జలుబు చుట్టుముట్టాయి. అయితే, కీలకమైన వీరిద్దరూ రేసుకు వచ్చేసరికి ఇబ్బందులన్నీ మర్చిపోయారు. ‘జాన్ చలీ జాయేగీ... మర్ జాయేంగే... లేకిన్ హార్ నహీ మానేంగే (ప్రాణం పోయినా ఫర్వాలేదు కానీ ఓటమి ఒప్పుకోం)’ అంటూ కదంతొక్కారు. ఈ క్రమంలో సవర్ణ్... సిక్కుల గురువు గోవింద్ సింగ్ మాటలను జట్టు సభ్యులకు పదేపదే గుర్తుచేశాడు.‘శభాష్... శభాష్’ అంటూ వెన్నుతట్టాడు. దాని ఫలితమే ఈ విజయం. ఎవరికీ తక్కువ కాదని నిరూపించాం... స్వర్ణం నెగ్గాక భారత రోయర్ల స్పందన ఆకాశాన్నంటింది. ‘మా గుండె పేలిపోతుందేమో అన్నంతగా దడదడలాడింది. నేను 2 వేల రేసుల్లో పాల్గొన్నా. అన్నింట్లోకి ఇదే క్లిష్టమైనది. నిన్న నా కారణంగా దేశ గౌరవం పోయింది. నేడు అది తిరిగొచ్చింది. మేం ఏ దేశం వారికీ తక్కువ కాదని నిరూపించాం’ అని దత్తు వ్యాఖ్యానించాడు. ‘తల వెంట్రుకల నుంచి కాలి గోళ్ల వరకు మా శరీరం మొత్తం అలసిపోయింది. రేసులో చివరి 100 మీటర్లయితే నా పేరు అడిగినా తెలియదనే చెప్పేవాడిని’ అని సవర్ణ్ అనడం గమనార్హం. ‘అంత శక్తి మాకు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. కానీ వచ్చింది. ఇది మా జీవితాలను మార్చే రేస్’ అని ఓంప్రకాశ్ పేర్కొన్నాడు. ఈ ఒత్తిడి ఫలితమో, విజయ గర్వమో ఏమో, రేసు అనంతరం దత్తు, ఓంప్రకాశ్‌లు...సవర్ణ్ భు జంపై అమాంతం వాలిపోయారు. దుష్యంత్‌ది మరో కథ.. రోయింగ్ వ్యక్తిగత విభాగంలో కాంస్యం గెలిచిన 25 ఏళ్ల దుష్యంత్ చౌహాన్ తీవ్ర జలుబుతో బాధపడుతూనే పోటీకి దిగాడు. ‘నేను మరణానికి దగ్గరగా ఉన్నాననిపించే పరిస్థితి. చివరి 200 మీటర్లలో నా కాళ్లు, చేతుల గురించి ఆలోచించలేని పరిస్థితి. ఎక్కడున్నానో కూడా చూసుకోలేదు. ఇదే చివరి రేసా అన్నట్లున్నాను’ అని చెప్పాడు. రేసు పూర్తయ్యాక దుష్యంత్ కుప్పకూలాడు. అధికారులు వచ్చి బోటు నుంచి బయటకు తీసి అతడి మెదడుకు రక్త ప్రసరణ మెరుగు పడేలా కాళ్లను పైకెత్తారు. తర్వాత ఆస్పత్రికి తీసుకెళ్లి ఆక్సిజన్ మాస్క్ తొడిగి గ్లూకోజ్ పెట్టించారు. ఈ కారణంగానే బహుమతి ప్రదానోత్సవం ఆలస్యమైంది. అన్నింటికంటే విశేషమేమంటే... పతకం తేవడం సంతోషంగా ఉన్నా, విజయానికి సంకేతంగా త్రివర్ణ పతాకం రెపరెపలాడిన క్షణాన్ని చూడలేనందుకు దుష్యంత్ ఒకింత నిరాశకు లోనవడం. -
బెంగళూరు బుల్స్ బోణీ ప్రొ కబడ్డీ లీగ్
ముంబై: ఉత్కంఠభరితంగా సాగిన హోరాహోరీ పోరులో బెంగళూరు బుల్స్ గట్టెక్కింది. చివరి ఐదు నిమిషాల్లో రోహిత్ కుమార్ సూపర్ షో చూపడంతో ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా ఆదివారం బెంగాల్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 24-23 తేడాతో నెగ్గింది. వాస్తవానికి 35వ నిమిషం వరకు బెంగాల్ జట్టు 21-15తో ఆధిక్యంలోనే ఉంది. ఈ దశలో పుంజుకున్న బుల్స్ ఒక్కో పాయింట్ సాధిస్తూ పోటీలోకొచ్చింది. రోహిత్ ఏడు రైడింగ్ పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్ లో పుణెరి పల్టన్ 41-19 తేడాతో యు ముంబాను చిత్తుగా ఓడించింది. సోమవారం జరిగే మ్యాచ్‌ల్లో బెంగాల్ వారియర్స్‌తో దబంగ్ ఢిల్లీ; పుణెరి పల్టన్‌తో పట్నా పైరేట్స్ తలపడతాయి.