ఔరంగాబాద్ సమీపంలో రైలుపట్టాల మీద పడుకుని నిద్రించి, గూడ్స్ రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 16 మంది వలస కార్మికుల ‘అవివేకం, మూర్ఖత్వం’ గురించి సోషల్ మీడియా గంగవెర్రులెత్తుతోంది. బాధితులనే నిందించడం అనేది సరికొత్త జాడ్యంలా తయారైన దేశంలో పట్టాల మీద తలలు చిధ్రమైపోయిన వారి పట్ల కాస్త కరుణ మనలో ఉంటుందని ఊహించలేం. ఉద్యోగాలు కోల్పోయి, అద్దె ఇళ్ల నుంచి ఉన్న çఫళాన ఖాళీ చేయాల్సి వచ్చి, కొద్దిపాటి రోటీలతో, భవిష్యత్తుపై ఎలాంటి ఆశలు లేకుండా, మండిస్తున్న ఎండలో వీపులపై పిల్లలను మోసుకుంటూ సొంత వూళ్లకు వెళ్లడానికి బలవంతంగా నడవాల్సి వచ్చిన అమానుష పరిస్థితుల్లో చిక్కుకుపోయిన వారి ‘వివేకం’పై ఎవరు అంచనా వేయాలి?
మే నెల 8న మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలోని రైలు పట్టాలమీద పడుకుని నిద్రిస్తున్న 16 మంది వలస కార్మికుల జీవితాలను అటుగా వచ్చిన సరుకుల రైలు ఛిద్రంచేసి పడేసింది. ఈ విషాదం జరిగి అప్పుడే 6 రోజులు గడిచిపోయాయి. కానీ ఆ కుటుంబాలకు జరిగిన నష్టం గురించి ఇప్పటికీ నాలో ఆలోచనలు రగులుతూనే ఉన్నాయి. హృదయాన్ని రగిలిస్తున్నది వాస్తవంగా జరిగిన ప్రమాద ఘటనా లేక సోషల్ మీడియాలో ఈ ఘటనపై వస్తున్న స్పందనలా అన్నది నిర్ణయించుకోలేకపోతున్నాను. ఆ ఘటన పట్ల సోషల్ మీడియాలో వచ్చిన స్పందనల్లో కొన్ని.
‘ఇంత బాధ్యతారహితంగా వారు పట్టాలపై పడుకున్నారు, వాళ్లు తమకు తామే నిందించుకోవాలి. వాళ్లకు పిల్లలున్నారు. తమ పిల్లలను గురించి వారు ఎందుకు ఆలోచించలేదు? రైలుపట్టాలమీద ఎవరైనా పడుకుంటారా? పట్టాల పక్కన వాళ్లెందుకు పడుకోలేదు? వారు అంత మూర్ఖంగా ఎలా వ్యవహరించారు?’ సోషల్ మీడియాలో వచ్చిన ఈ తరహా స్పందనలు చూసి నేను అవాక్కయిపోలేదు. ఎందుకంటే బాధితులనే నిందించడం అనేది ఇప్పుడు ఒక సరికొత్త జాడ్యం. మన దేశంలో అత్యాచారం బారిన పడిన వారినే అవమానిస్తుంటారు. పేదల బాధలకు వారే కారణమని నిందిస్తుంటారు. ఈ నేపథ్యంలో గూడ్స్ రైలు కింద పడి చనిపోయిన వారి మరణాలకు ఆ మృతులనే తప్పుపట్టడం చూస్తుంటే ఆశ్చర్యం కలిగించదు.
పేదలను ఉద్ధరించే బాధ్యతను తమకుతామే నెత్తిన వేసుకున్న ఈ పెద్దమనుషులు ఎంతో నైతిక నిష్టతో సూచిస్తున్నట్లుగా, రైలు పట్టాల మీద పడుకునే ఆ వివేకవంతులు ఎవరై ఉంటారు? నిజంగా ఇంకెవరు? వలస కార్మికులే. నిజానికి వారి వివేకం సరైందే. అలా పడుకోకుండా వారిని ఈ దేశంలో ఆదుకునేవారెవ్వరు? ఉన్నట్లుండి తమ ఉద్యోగాలనుంచి విసిరేయబడిన వారు, అద్దె ఇళ్లనుంచి ఉన్నఫళాన ఖాళీ చేయాల్సి వచ్చిన వారు, కొద్దిపాటి రోటీలతో, భవిష్యత్తుపై ఎలాంటి ఆశలు లేకుండా, మండిస్తున్న ఎండలో వీపులపై పిల్లలను మోసుకుంటూ సొంత వూళ్లకు వెళ్లడానికి బలవంతంగా నడవాల్సి వచ్చిన అమానుష పరిస్థితుల్లో చిక్కుకుపోయిన వారి వివేకం ఎలా ఉండాలి?
జీవితంలో అన్నీ పోగొట్టుకుని ఏంచేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో సాధారణ హేతువుకు కూడా తావు లేకుండా వారికి తగిలిన గాయాలు ఎంత ప్రభావం వేశాయో మనకు అర్థం కాకపోవచ్చు. నిలబడేందుకు కాస్త నీడలేక నడకబాట పట్టిన వలసకార్మికులు వీపులపై పోలీసుల లాఠీలు మోగుతున్నప్పుడు ఆ పాశవికతలో మనకు ఏదైనా విచక్షణా జ్ఞానం ఉన్నట్లు కనబడుతుందా?
తిండీతిప్పలు కూడా సరిగా లేనిస్థితిలో వందలాది మైళ్ల దూరం నడుచుకుంటూ కండరాలు అలసిపోయిన స్థితిలో తాము పడుకున్న చోటికి రైలు వస్తుందని, తమ దేహాలను ఛిద్రం చేస్తుందనే స్పృహ వాళ్లలో ఉంటుందని ఆశించవచ్చా?
లేక లాక్‌డౌన్ సమయంలో రైళ్లు నడవవు అని కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాటలను యథాతథంగా వారు దృష్టిలో పెట్టుకున్నారా? మనకు తెలిసిందల్లా ఒకటే. కాలినడకన నడిచి నడిచి వారెంత అలసిపోయి ఉన్నారంటే గూడ్స్ రైలు చేసే భారీ శబ్దం కానీ, రొదపెట్టే హారన్ కానీ వారిని నిద్ర లేపలేకపోయాయి.
కరోనా కాదు.. లాక్ డౌన్ మరణాలు
కరోనా వ్యాధి ప్రభావం కంటే లాక్ డౌన్ విధింపు కారణంగా గత శనివారం వరకు దేశవ్యాప్తంగా 378 మంది వలసకార్మికులు దయనీయ పరిస్థితుల్లో మరణించారని తాజా పరిశోధన చెబుతోంది. వీరిలో ఏ ఒక్కరికీ కరోనా వ్యాధి సోకలేదు. తమ స్వస్థలాలకు నడిచి పోతుం డగా రోడ్డు, రైలు ప్రమాదాలకు గురై 74 మంది వలస కార్మికులు గత 50 రోజులుగా మరణించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా రవాణాను చెప్పాపెట్టకుండా రద్దు చేయడంతో వలసకార్మికులకు నడక ఒక్కటే ప్రయాణ సాధనంగా మారింది. మరణాల వారీగా చూస్తే ఆకలిదప్పులు, ఆర్థిక బాధలకు గురై 47 మంది చనిపోయారు.
నడకలో అలసిపోయి, క్యూలలో నిలబడి తాళలేక చనిపోయినవారి సంఖ్య 26. పోలీసు పాశవికత్వం లేక రాజ్యహింస వల్ల 12 మంది చనిపోయారు. వైద్య సేవల లేమి, ముసలివారిని పట్టించుకోకపోవడంతో 40 మంది హరీమన్నారు. కరోనా సోకుతుందన్న భయంతో, ఒంటరితనంతో ఆత్మహత్యలు చేసుకున్నవారి సంఖ్య 83. ఆల్కహాల్ అందుబాటులో లేని సమస్యలతో చనిపోయిన, ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్య 46. నడిచిపోతుండగా రోడ్డు లేక రైలు ప్రమాదాల కారణంగా చనిపోయిన వారి సంఖ్య 74. లాక్‌డౌన్ సంబంధిత నేరాల కారణంగా చనిపోయినవారు 14 మంది. ఎలాంటి వర్గీకరణల్లో ఇమడకుండా చనిపోయినవారు 41 మంది.
ఆ మరునాడు ఉదయం, ఈ విషాద వార్త తెలియగానే బాధితులపై ఆగ్రహాన్ని, క్రోధాన్ని ప్రదర్శించడంలో ట్విట్టర్, ఫేస్ బుక్ పోటీలు పడ్డాయి. ఇది బాధితుల మూర్ఖత్వం తప్ప మరేమీ కాదట. అంటే మరణించిన తర్వాత కూడా వలసకార్మికులను అర్థం చేసుకున్నవారు, వారి పట్ల సానుభూతి, కరుణ చూపిన వారు ఈ దేశంలోనే లేకుండా పోయారన్నమాట. కనీసం మన ప్రధాని అయినా ఈ సందర్భంగా కాస్త సరైన విధంగా ప్రకటన చేశారు. ‘మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో రైలుప్రమాద ఘటనలో వలసకార్మికులు ప్రాణాలు కోల్పోవడం నన్ను తీవ్రంగా కలిచివేస్తోంది.
దీనిపై రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌తో మాట్లాడాను. ఆయన పరిస్థితిని సన్నిహితంగా పర్యవేక్షిస్తున్నారు. బాధితులకు అవసరమైన సహాయం పూర్తిగా అందజేస్తాం’. గత ఆరేళ్లుగా ప్రధాని నరేంద్రమోదీ రికార్డును పరిశీలించండి. తన ప్రతిష్టను భంగపర్చుకోవడం తప్పితే ఆయన ఏ విషయం మీద అయినా తీవ్రంగా బాధపడుతున్నారంటే నమ్మడం కష్టమే.
ఇతరుల బాధల పట్ల తీవ్ర విచారం కాదు కదా.. కాస్తంత సానుభూతి అయినా ఉన్నట్లయితే, ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా ఆకలిదప్పులకు గురవుతున్న లక్షలాదిమందికి సహాయం అందించవలసిందిగా రక్షణ బలగాలను ఆదేశించి ఉండేవారు. లక్షలాది మంది అన్నార్తులకు ఉపశమనం కలిగించగల శక్తి, సామర్థ్యం సైన్యానికి మాత్రమే ఉన్నాయి మరి. ఆ పని చేసి ఉంటే గోడవున్ల కొద్దీ మగ్గుతున్న వరి, గోధుమ ధాన్యాన్ని బయటకు తీసి రేషన్ కార్డులున్నా లేకున్నా, అవసరమైన ప్రతి ఒక్కరికీ అందించేవారు.
ఆయా రాష్ట్రాల్లో చిక్కుకుపోయి ఉన్న వలసకార్మికులను తరలించడానికి బస్సులు, ట్రక్కులు, చివరకు రైళ్లను కూడా రంగంలోకి దింపి ఉండేవారు. చివరకు ఆసుపత్రులపై పూలు చల్లడం కంటే మన వాయుసేన వలస కార్మికుల తరలింపులో మిన్నగా సేవలందించేది. అయినా మన పాలకులను మాత్రమే తప్పు పట్టి ప్రయోజనం ఏమిటి? బాధల పట్ల విచారం వ్యక్తం చేయడం కాదు కదా.. కనీసం పరితాపం కూడా ప్రదర్శించని ప్రజారాసుల మాటేమిటి?
గత ఆరేళ్లుగా మనం చూస్తూ వస్తున్నదేమిటంటే, భారతీయ సమాజంలోని ఎగువ, మధ్య తరగతి వర్గాలలో బాధితుల పట్ల కనీస సహానుభూతి కూడా కరువైపోతుండటమే. అప్పుల్లో మునిగిపోయిన రైతు బాధ పట్ల స్పందించకపోవడంలో, దళితుల దురవస్థను అర్థం చేసుకోకపోవడంలో, ముస్లింలను సమాజం నుంచే బహిష్కరిస్తుండటాన్ని గుర్తించడానికి కూడా వెనుకాడటంలో, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) జాతీయ పౌర నమోదు (ఎన్నార్సీ)కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న యువ గళాలకు సంఘీభావం తెలుపడంలో మన అసమర్థత, అమానుషత్వం కొట్టొచ్చినట్లు ప్రతి సందర్భంల్లోనూ కనిపిస్తూనే వస్తోంది.
ప్రముఖ మనస్తత్వ శాస్త్రజ్ఞుడు ఆల్ప్రెడ్ అడ్లర్ ఒక సందర్భంలో సహానుభూతి గురించి నిర్వచిస్తూ, మరొకరి కళ్లతో బాధను చూడటం, మరొకరి చెవులతో బాధను ఆలకించడం, మరొకరి హృదయంతో అనుభూతి చెందడమే సహానుభూతి అని పేర్కొన్నారు. కానీ ఇతరుల పట్ల అలాంటి సహానుభూతి ప్రదర్శించడానికి మనం ఎప్పుడో దూరమైపోయాం. బహుశా మనం మనుషులుగా ఎలా ఉండాలో, ఎలా స్పందించాలో భగవంతుడు భయానకరీతిలో నిర్దేశించినట్లుగా ఈ సాంక్రమిక వ్యాధి కానీ, లాక్‌డౌన్ కానీ ఇప్పుడు మనకు చక్కగానే బోధిస్తున్నాయి.
బహుశా మనం మన నెట్‌ప్లిక్స్ సీరియల్స్ వీక్షణం నుంచి, సోషల్ మీడియాలో సొంత డబ్బా కొట్టుకోవడం నుంచి, వంటల ప్రదర్శన నుంచి దూరం జరిగినప్పుడే, మన చుట్టూ బాధలు పడుతున్న వారి గాథలను వినగలమనుకుంటాను. అప్పుడు మాత్రమే రైలుపట్టాల మీద తలపెట్టి నిద్రిస్తూ ప్రాణాలు కోల్పోయిన ఆ ‘మూర్ఖపు’ వలస కార్మికులపై మనం ఉచిత తీర్పులు ఇవ్వకుండా ఉండగలమేమో..
(ది వైర్ సౌజన్యంతో)
వ్యాసకర్త: రోహిత్ కుమార్, విద్యావేత్త, పాజిటివ్ సైకాలజీ, సైకోమెట్రిక్స్
ఈ–మెయిల్ : letsempathize@gmail.com
Comments
Please login to add a commentAdd a comment