ఎదురునిలిచిన మొనగాళ్లు | Asian Games 2018: Rowers Rohit Kumar, Bhagwan Singh get bronze medal | Sakshi
Sakshi News home page

ఎదురునిలిచిన మొనగాళ్లు

Published Sat, Aug 25 2018 1:11 AM | Last Updated on Sat, Aug 25 2018 1:11 AM

Asian Games 2018: Rowers Rohit Kumar, Bhagwan Singh get bronze medal - Sakshi

అప్రతిహత రికార్డున్న కబడ్డీలో పట్టు జారింది... అంచనాలున్న ఆర్చరీలో బాణం గురి తప్పింది... జిమ్నాస్టిక్స్‌ విన్యాసాల్లోనూ రిక్తహస్తమే మిగిలింది... కానీ, రోయింగ్‌ బృందం చరిత్ర తిరగరాసింది! ఎవరూ ఊహించని విధంగా త్రివర్ణ పతాకం ఎగురేసింది! పరువు పోయిందన్న చోటే సగర్వంగా నిలిచింది!  

సాక్షి క్రీడా విభాగం :‘ప్రత్యర్థి గురించి భయపడొద్దు. నిశ్చలంగా నిలిచి, విజయాన్ని ముద్దాడు!’ ... పంజాబీ ప్రసిద్ధ నానుడి ఇది. దీనిని అక్షరాలా ఆచరించింది భారత పురుషుల రోయింగ్‌ జట్టు. మన సైన్యంలోని సిక్కు రెజిమెంట్‌లో పనిచేసే నాయిబ్‌ సవర్ణ్‌ సింగ్, దత్తు బబన్, ఓంప్రకాశ్, సుఖ్‌మీత్‌ సింగ్‌లతో కూడిన బృందం... సైనికుల్లానే పోరాడి స్వర్ణం పట్టు కొచ్చింది. సవర్ణ్‌ సింగ్‌ సారథ్యంలో క్లిష్ట పరిస్థితులకు ఎదురొడ్డి మరీ త్రివర్ణ పతాకం ఎగురేసింది. ఈ సంచలన గెలుపుతో వారి చుట్టూ మీడియా మూగింది... ఇంటర్వ్యూల కోసం ఎగబడింది! కానీ, ఈ విజయం వెనుక ఉత్కంఠను అధిగమించిన క్షణాలు... శరీరం నియంత్రణ తప్పేంత శ్రమ... అవమానాన్ని దిగమింగిన కసి ఉన్నాయి... అంతటి ఆసక్తికర నేపథ్యం ఏమంటే! 

ఎదురుగాలికి ఎదురొడ్డి... 
శుక్రవారం ఉదయం భారత రోయింగ్‌ బృందం బరిలో దిగేటప్పటికి అన్నీ ప్రతికూలతలే. గురువా రం నాలుగు ఫైనల్స్‌లో ఓడిపోవడంతో భారత రోయింగ్‌ చరిత్రలో ఇది చీకటి రోజంటూ కోచ్‌ ఇస్మాయిల్‌ బేగ్‌ మండిపడ్డారు. దత్తు... రేసుకు ముందు ఏకంగా లాక్‌ వేసుకోవడం మర్చిపోవడంతో బోట్‌ నుంచి పడిపోయాడు. దీంతో అతడు మానసికంగా దృఢంగా లేడంటూ, ఏ దేశంలోనూ ఇలా ఉండరంటూ విదేశీ కోచ్‌ నికోల్‌ జియోగా నిందించాడు. ఇదంతా ఒక ఎత్తయితే శుక్రవారం తేమతో కూడిన గాలుల వాతావరణం సవర్ణ్‌ జట్టుకు మరింత పరీక్ష పెట్టింది. ఇక బరిలో దిగాక ఆతిథ్య దేశం ఇండోనేసియా నుంచి విపరీతమైన పోటీ ఎదురైంది. అయినా... తట్టుకుని నిలిచి గెలిచింది. 

ఇబ్బందులను తట్టుకుని... 
28 ఏళ్ల సవర్ణ్‌ సింగ్‌ జట్టులో సీనియర్‌. భారత గొప్ప రోయర్లలో ఒకడు. గత ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచాడు. అయితే, గాయంతో రెండేళ్లుగా ఆటకు దూరమయ్యాడు. దాన్నుంచి కోలుకున్నాక టైఫాయిడ్‌ బారిన పడ్డాడు. కొన్నాళ్ల క్రితమే బరిలో దిగాడు. దత్తు గురువారం నీటిలో పడిపోవడంతో జ్వరం, దగ్గు, జలుబు చుట్టుముట్టాయి. అయితే, కీలకమైన వీరిద్దరూ రేసుకు వచ్చేసరికి ఇబ్బందులన్నీ మర్చిపోయారు. ‘జాన్‌ చలీ జాయేగీ... మర్‌ జాయేంగే... లేకిన్‌ హార్‌ నహీ మానేంగే (ప్రాణం పోయినా ఫర్వాలేదు కానీ ఓటమి ఒప్పుకోం)’ అంటూ కదంతొక్కారు. ఈ క్రమంలో సవర్ణ్‌... సిక్కుల గురువు గోవింద్‌ సింగ్‌ మాటలను జట్టు సభ్యులకు పదేపదే గుర్తుచేశాడు.‘శభాష్‌... శభాష్‌’ అంటూ వెన్నుతట్టాడు. దాని ఫలితమే ఈ విజయం. 

ఎవరికీ తక్కువ కాదని నిరూపించాం... 
స్వర్ణం నెగ్గాక భారత రోయర్ల స్పందన ఆకాశాన్నంటింది. ‘మా గుండె పేలిపోతుందేమో అన్నంతగా దడదడలాడింది. నేను 2 వేల రేసుల్లో పాల్గొన్నా. అన్నింట్లోకి ఇదే క్లిష్టమైనది. నిన్న నా కారణంగా దేశ గౌరవం పోయింది. నేడు అది తిరిగొచ్చింది. మేం ఏ దేశం వారికీ తక్కువ కాదని నిరూపించాం’ అని దత్తు వ్యాఖ్యానించాడు.  ‘తల వెంట్రుకల నుంచి కాలి గోళ్ల వరకు మా శరీరం మొత్తం అలసిపోయింది. రేసులో చివరి 100 మీటర్లయితే నా పేరు అడిగినా తెలియదనే చెప్పేవాడిని’ అని సవర్ణ్‌ అనడం గమనార్హం. ‘అంత శక్తి మాకు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. కానీ వచ్చింది. ఇది మా జీవితాలను మార్చే రేస్‌’ అని ఓంప్రకాశ్‌ పేర్కొన్నాడు. ఈ ఒత్తిడి ఫలితమో, విజయ గర్వమో ఏమో, రేసు అనంతరం దత్తు, ఓంప్రకాశ్‌లు...సవర్ణ్‌ భు జంపై అమాంతం వాలిపోయారు.  

దుష్యంత్‌ది మరో కథ.. 
రోయింగ్‌ వ్యక్తిగత విభాగంలో కాంస్యం గెలిచిన 25 ఏళ్ల దుష్యంత్‌ చౌహాన్‌ తీవ్ర జలుబుతో బాధపడుతూనే పోటీకి దిగాడు. ‘నేను మరణానికి దగ్గరగా ఉన్నాననిపించే పరిస్థితి. చివరి 200 మీటర్లలో నా కాళ్లు, చేతుల గురించి ఆలోచించలేని పరిస్థితి. ఎక్కడున్నానో కూడా చూసుకోలేదు. ఇదే చివరి రేసా అన్నట్లున్నాను’ అని చెప్పాడు. రేసు పూర్తయ్యాక దుష్యంత్‌ కుప్పకూలాడు. అధికారులు వచ్చి బోటు నుంచి బయటకు తీసి అతడి మెదడుకు రక్త ప్రసరణ మెరుగు పడేలా కాళ్లను పైకెత్తారు. తర్వాత ఆస్పత్రికి తీసుకెళ్లి ఆక్సిజన్‌ మాస్క్‌ తొడిగి గ్లూకోజ్‌ పెట్టించారు. ఈ కారణంగానే బహుమతి ప్రదానోత్సవం ఆలస్యమైంది. అన్నింటికంటే విశేషమేమంటే... పతకం తేవడం సంతోషంగా ఉన్నా, విజయానికి సంకేతంగా త్రివర్ణ పతాకం రెపరెపలాడిన క్షణాన్ని చూడలేనందుకు దుష్యంత్‌ ఒకింత నిరాశకు లోనవడం.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement