
ఏషియాడ్ చరిత్రలో తొలిసారి సెమీఫైనల్‌కు చేరుకొని చరిత్ర సృష్టించిన భారత పురుషుల టేబుల్ టెన్నిస్ (టీటీ) జట్టు పోరాటం ముగిసింది. మంగళవారం జరిగిన సెమీఫైనల్లో సత్యన్ జ్ఞానశేఖరన్, ఆచంట శరత్ కమల్, ఆంథోనీ అమల్‌రాజ్, హర్మీత్ దేశాయ్‌లతో కూడిన భారత జట్టు 0–3తో దక్షిణ కొరియా చేతిలో పరాజయం పాలై కాంస్యం దక్కించుకుంది.
తొలి మ్యాచ్‌లో సత్యన్ 11–9, 9–11, 3–11, 3–11తో లీ సాంగ్‌సు చేతిలో... రెండో మ్యాచ్‌లో శరత్ కమల్ 9–11, 9–11, 11–6, 11–7, 8–11తో యంగ్ సిక్ జియోంగ్ చేతిలో... మూడో మ్యాచ్‌లో అమల్‌రాజ్ 5–11, 7–11, 11–4, 7–11తో వూజిన్ జాంగ్ చేతిలో ఓడిపోయారు. మరోసెమీఫైనల్లో చైనీస్ తైపీ 1–3తో చైనా చేతిలో ఓటమి పాలై కాంస్యాన్ని సాధించింది. ఫైనల్లో చైనా 3–0తో దక్షిణ కొరియాను ఓడించి స్వర్ణ పతకం సొంతం చేసుకుంది.