రుబీనా అదుర్స్‌ | First medal for India in Paralympics pistol event | Sakshi
Sakshi News home page

రుబీనా అదుర్స్‌

Published Sun, Sep 1 2024 4:13 AM | Last Updated on Sun, Sep 1 2024 7:43 AM

First medal for India in Paralympics pistol event

మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌లో కాంస్యం

పారాలింపిక్స్‌ పిస్టల్‌ ఈవెంట్లో భారత్‌కు తొలి పతకం  

బ్యాడ్మింటన్‌లో సెమీస్‌ చేరిన నితీశ్, సుకాంత్‌ 

పారిస్‌ పారాలింపిక్స్‌లో భారత షూటర్ల జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు మన గన్‌ గర్జించడంతో భారత్‌ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌లో భారత పారా షూటర్‌ రుబీనా ఫ్రాన్సిస్‌ కాంస్యంతో సత్తా చాటింది. చెదరని గురితో పోడియంపై చోటు దక్కించుకుంది. ఇతర క్రీడల్లోనూ శనివారం భారత్‌కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. బ్యాడ్మింటన్‌లో నితీశ్‌ కుమార్, సుకాంత్‌ కదమ్‌ సెమీఫైనల్‌కు దూసుకెళ్లి పతకాలకు చేరువయ్యారు. 

పారిస్‌: పారాలింపిక్స్‌లో భారత షూటర్లు పతకాలతో అదరగొడుతున్నారు. శుక్రవారం రైఫిల్‌ విభాగంలో అవనీ లేఖరా, మోనా అగర్వాల్‌ పతకాలతో సత్తా చాటితే... శనివారం మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఎస్‌హెచ్‌1 విభాగంలో రుబీనా ఫ్రాన్సిస్‌ కాంస్య పతకంతో మెరిసింది. ఈ విభాగంలో పారాలింపిక్స్‌ పతకం నెగ్గిన తొలి భారత మహిళా షూటర్‌గా రికార్డుల్లోకెక్కింది. తుదిపోరులో 25 ఏళ్ల రుబీనా 211.1 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి పతకం ఖాతాలో వేసుకుంది. 

వైల్డ్‌కార్డ్‌ ద్వారా పారిస్‌ పారాలింపిక్స్‌ బెర్త్‌ దక్కించుకున్న రుబీనా... క్వాలిఫయింగ్‌ రౌండ్‌లో ఏడో స్థానంలో నిలిచి ఫైనల్‌ చేరింది. ఇరాన్‌ షూటర్‌ జవాన్‌మార్డీ సారా 236.8 పాయింట్లతో స్వర్ణం చేజిక్కించుకుంది. సారాకు ఇది వరుసగా మూడో పారాలింపిక్‌ పసిడి కావడం విశేషం. అజ్గాన్‌ అయ్‌సెల్‌ (టర్కీ) 231.1 పాయింట్లతో రజత పతకం గెలుచుకుంది. స్థిరమైన గురితో సత్తాచాటిన రుబీనా... క్వాలిఫయింగ్‌ రౌండ్‌ కంటే ఎంతో మెరుగైన ప్రదర్శన చేసి పోడియంపై నిలిచింది. 

తుది పోరులో తొలి పది షాట్‌ల తర్వాత రుబీనా 97.6 పాయింట్లతో నిలిచింది. 14 షాట్‌ల తర్వాత నాలుగో స్థానంలో ఉన్న రుబీనా తదుపరి రెండు షాట్‌లలో మెరుగైన ప్రదర్శన చేసి మూడో స్థానానికి చేరింది. కాంస్యం గెలిచిన రుబీనాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘ఎక్స్‌’ వేదికగా అభినందించారు. గొప్ప సంకల్పం, అసాధారణమైన గురితో పతకం సాధించిన రుబీనా దేశాన్ని గర్వపడేలా చేసిందని పేర్కొన్నారు.  

గగన్‌ నారంగ్‌ స్ఫూర్తితో.. 
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు చెందిన మెకానిక్‌ కూతురైన రుబీనా... పుట్టుకతోనే కుడి కాలు లోపంతో జన్మించింది.  తండ్రి స్నేహితుల ప్రోద్బలంతో షూటింగ్‌ కెరీర్‌ ప్రారంభించిన రుబీనా... ఆరంభంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది. జబల్‌పూర్‌ అకాడమీలో షూటింగ్‌ ఓనమాలు నేర్చుకున్న ఫ్రాన్సిస్‌... ఒలింపిక్‌ పతక విజేత, హైదరాబాదీ షూటర్‌ గగన్‌ నారంగ్‌ ఘనతలు చూసి షూటింగ్‌పై మరింత ఆసక్తి పెంచుకుంది. 

కెరీర్‌ ఆరంభంలో షూటింగ్‌ రేంజ్‌కు వెళ్లేందుకు కూడా డబ్బులు లేని గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న రుబీనా... అకుంఠిత దీక్షతో ముందుకు సాగి 2017లో గగన్‌ నారంగ్‌ అకాడమీ ‘గన్‌ ఫర్‌ గ్లోరీ’లో అడుగుపెట్టిన తర్వాత అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా పతకాలు సాధించింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో ప్రపంచ రికార్డు స్కోరుతో బరిలోకి దిగి ఏడో స్థానంతో సరిపెట్టుకుంది.  

బ్యాడ్మింటన్‌ సెమీస్‌లో నితీశ్, సుకాంత్‌ 
పారిస్‌ పారాలింపిక్స్‌లో భారత షట్లర్లు అదరగొట్టారు. పురుషుల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌3లో నితీశ్‌ కుమార్, ఎస్‌ఎల్‌4లో సుకాంత్‌ కదమ్‌ సెమీఫైనల్‌కు దూసుకెళ్లి పతకానికి అడుగు దూరంలో నిలిచారు. శనివారం క్వార్టర్‌ ఫైనల్లో నితీశ్‌ 21–13, 21–14తో మాంగ్‌ఖాన్‌ బున్సన్‌ (థాయ్‌లాండ్‌)పై విజయం సాధించి గ్రూప్‌ ‘ఎ’లో టాప్‌ ప్లేస్‌ దక్కించుకొని సెమీస్‌కు చేరాడు. గ్రూప్‌ నుంచి రెండో స్థానంలోనిలిచిన బున్సన్‌ కూడా సెమీస్‌కు చేరాడు. 

ఎస్‌ఎల్‌4 క్లాస్‌లో సుకాంత్‌ 21–12, 21–12తో టిమార్రోమ్‌ సిరిపాంగ్‌ (థాయ్‌లాండ్‌)పై గెలిచి సెమీఫైనల్లో అడుగుపెట్టాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఎస్‌ఎల్‌3లో సుహాస్‌ యతిరాజ్‌–పాలక్‌ కోహ్లీ జంట 11–21, 17–21తో హిక్‌మత్‌–లియాని రాట్రి (ఇండోనేసియా) ద్వయం చేతిలో ఓడింది. మరో మ్యాచ్‌లో నితీశ్‌ కుమార్‌–తులసిమతి ద్వయం కూడా పరాజయం పాలైంది.  

క్వార్టర్‌ ఫైనల్లో సరిత ఓటమి 
భారత పారా ఆర్చర్‌ సరితా కుమారి క్వార్టర్‌ఫైనల్లో పరాజయం పాలైంది. శనివారం మహిళల కాంపౌండ్‌ క్వార్టర్స్‌లో సరిత 140–145తో టాప్‌ సీడ్‌ ఓజు్నర్‌ కూర్‌ గిర్డి (కొరియా) చేతిలో ఓటమి పాలైంది. అంతకుముందు ఎలిమినేషన్‌ రెండో రౌండ్‌లో సరిత 141–135తో ఎలెనోరా సార్టీ (ఇటలీ)పై గెలిచింది. తొలి రౌండ్‌లో సరిత 138–124తో నూర్‌ అబ్దుల్‌ జలీల్‌ (మలేసియా)పై గెలిచింది. మరోమ్యాచ్‌లో భారత ఆర్చర్, రెండో సీడ్‌ శీతల్‌ దేవి 137–138తోమిరియానా జునీగా (చిలీ)పై చేతిలో ఓడింది.  

రోయింగ్‌ రెపిచాజ్‌లో మూడో స్థానం 
రోయింగ్‌ మిక్స్‌డ్‌ పీఆర్‌3 డబుల్‌ స్కల్స్‌లో అనిత, నారాయణ కొంగనపల్లె జంట రెపిచాజ్‌ ఈవెంట్‌లో మూడో స్థానంలో నిలిచి ఫైనల్‌ ‘బి’లో అడుగుపెట్టింది. శనివారం పోటీలో ఈ జంట 7 నిమిషాల 54.33 సెకన్లలో లక్ష్యాన్ని చేరింది. ఉక్రెయిన్‌ (7 నిమిషాల 29.24 సెకన్లు), బ్రిటన్‌ (7 నిమిషాల 20.53 సెకన్లు) జోడీలు తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. ఫైనల్‌ ‘బి’లోని రోవర్లు 7 నుంచి 12వ స్థానం కోసం పోటీపడనున్నారు. 

సైక్లింగ్‌లో నిరాశ 
పారిస్‌ పారాలింపిక్స్‌లో భారత సైక్లిస్ట్‌లకు నిరాశ ఎదురైంది. అర్షద్‌ షేక్, జ్యోతి గడేరియా తమతమ విభాగాల్లో ఫైనల్‌కు చేరకుండానే వెనుదిరిగారు. పురుషుల 1000 మీటర్ల టైమ్‌ ట్రయల్‌ సీ1–3 విభాగంలో బరిలోకి దిగిన అర్షద్‌ శనివారం క్వాలిఫయింగ్‌ రౌండ్‌లో చివరి స్థానంతో రేసును ముగించాడు. 

మొత్తం 17 మంది పాల్గొన్న ఈ పోటీలో అర్షద్‌ 1 నిమిషం 21.416 సెకన్లలో లక్ష్యాన్ని చేరాడు. మహిళల 500 మీటర్ల టైమ్‌ ట్రయల్‌ సీ1–3 క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌లో జ్యోతి గడేరియా 49.233 సెకన్లలో లక్ష్యాన్ని చేరి చివరి స్థానంలో నిలిచింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement