rubina
-
రుబీనా అదుర్స్
పారిస్ పారాలింపిక్స్‌లో భారత షూటర్ల జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు మన గన్ గర్జించడంతో భారత్ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో భారత పారా షూటర్ రుబీనా ఫ్రాన్సిస్ కాంస్యంతో సత్తా చాటింది. చెదరని గురితో పోడియంపై చోటు దక్కించుకుంది. ఇతర క్రీడల్లోనూ శనివారం భారత్‌కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. బ్యాడ్మింటన్‌లో నితీశ్ కుమార్, సుకాంత్ కదమ్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లి పతకాలకు చేరువయ్యారు. పారిస్: పారాలింపిక్స్‌లో భారత షూటర్లు పతకాలతో అదరగొడుతున్నారు. శుక్రవారం రైఫిల్ విభాగంలో అవనీ లేఖరా, మోనా అగర్వాల్ పతకాలతో సత్తా చాటితే... శనివారం మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1 విభాగంలో రుబీనా ఫ్రాన్సిస్ కాంస్య పతకంతో మెరిసింది. ఈ విభాగంలో పారాలింపిక్స్ పతకం నెగ్గిన తొలి భారత మహిళా షూటర్‌గా రికార్డుల్లోకెక్కింది. తుదిపోరులో 25 ఏళ్ల రుబీనా 211.1 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి పతకం ఖాతాలో వేసుకుంది. వైల్డ్‌కార్డ్ ద్వారా పారిస్ పారాలింపిక్స్ బెర్త్ దక్కించుకున్న రుబీనా... క్వాలిఫయింగ్ రౌండ్లో ఏడో స్థానంలో నిలిచి ఫైనల్ చేరింది. ఇరాన్ షూటర్ జవాన్మార్డీ సారా 236.8 పాయింట్లతో స్వర్ణం చేజిక్కించుకుంది. సారాకు ఇది వరుసగా మూడో పారాలింపిక్ పసిడి కావడం విశేషం. అజ్గాన్ అయ్సెల్ (టర్కీ) 231.1 పాయింట్లతో రజత పతకం గెలుచుకుంది. స్థిరమైన గురితో సత్తాచాటిన రుబీనా... క్వాలిఫయింగ్ రౌండ్ కంటే ఎంతో మెరుగైన ప్రదర్శన చేసి పోడియంపై నిలిచింది. తుది పోరులో తొలి పది షాట్ల తర్వాత రుబీనా 97.6 పాయింట్లతో నిలిచింది. 14 షాట్ల తర్వాత నాలుగో స్థానంలో ఉన్న రుబీనా తదుపరి రెండు షాట్లలో మెరుగైన ప్రదర్శన చేసి మూడో స్థానానికి చేరింది. కాంస్యం గెలిచిన రుబీనాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘ఎక్స్’ వేదికగా అభినందించారు. గొప్ప సంకల్పం, అసాధారణమైన గురితో పతకం సాధించిన రుబీనా దేశాన్ని గర్వపడేలా చేసిందని పేర్కొన్నారు. గగన్ నారంగ్ స్ఫూర్తితో.. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్కు చెందిన మెకానిక్ కూతురైన రుబీనా... పుట్టుకతోనే కుడి కాలు లోపంతో జన్మించింది. తండ్రి స్నేహితుల ప్రోద్బలంతో షూటింగ్ కెరీర్ ప్రారంభించిన రుబీనా... ఆరంభంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది. జబల్పూర్ అకాడమీలో షూటింగ్ ఓనమాలు నేర్చుకున్న ఫ్రాన్సిస్... ఒలింపిక్ పతక విజేత, హైదరాబాదీ షూటర్ గగన్ నారంగ్ ఘనతలు చూసి షూటింగ్‌పై మరింత ఆసక్తి పెంచుకుంది. కెరీర్ ఆరంభంలో షూటింగ్ రేంజ్‌కు వెళ్లేందుకు కూడా డబ్బులు లేని గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న రుబీనా... అకుంఠిత దీక్షతో ముందుకు సాగి 2017లో గగన్ నారంగ్ అకాడమీ ‘గన్ ఫర్ గ్లోరీ’లో అడుగుపెట్టిన తర్వాత అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా పతకాలు సాధించింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో ప్రపంచ రికార్డు స్కోరుతో బరిలోకి దిగి ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. బ్యాడ్మింటన్ సెమీస్‌లో నితీశ్, సుకాంత్ పారిస్ పారాలింపిక్స్‌లో భారత షట్లర్లు అదరగొట్టారు. పురుషుల సింగిల్స్ ఎస్ఎల్3లో నితీశ్ కుమార్, ఎస్ఎల్4లో సుకాంత్ కదమ్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లి పతకానికి అడుగు దూరంలో నిలిచారు. శనివారం క్వార్టర్ ఫైనల్లో నితీశ్ 21–13, 21–14తో మాంగ్ఖాన్ బున్సన్ (థాయ్‌లాండ్)పై విజయం సాధించి గ్రూప్ ‘ఎ’లో టాప్ ప్లేస్ దక్కించుకొని సెమీస్‌కు చేరాడు. గ్రూప్ నుంచి రెండో స్థానంలోనిలిచిన బున్సన్ కూడా సెమీస్‌కు చేరాడు. ఎస్ఎల్4 క్లాస్‌లో సుకాంత్ 21–12, 21–12తో టిమార్రోమ్ సిరిపాంగ్ (థాయ్‌లాండ్)పై గెలిచి సెమీఫైనల్లో అడుగుపెట్టాడు. మిక్స్డ్ డబుల్స్ ఎస్ఎల్3లో సుహాస్ యతిరాజ్–పాలక్ కోహ్లీ జంట 11–21, 17–21తో హిక్మత్–లియాని రాట్రి (ఇండోనేసియా) ద్వయం చేతిలో ఓడింది. మరో మ్యాచ్‌లో నితీశ్ కుమార్–తులసిమతి ద్వయం కూడా పరాజయం పాలైంది. క్వార్టర్ ఫైనల్లో సరిత ఓటమి భారత పారా ఆర్చర్ సరితా కుమారి క్వార్టర్ఫైనల్లో పరాజయం పాలైంది. శనివారం మహిళల కాంపౌండ్ క్వార్టర్స్‌లో సరిత 140–145తో టాప్ సీడ్ ఓజు్నర్ కూర్ గిర్డి (కొరియా) చేతిలో ఓటమి పాలైంది. అంతకుముందు ఎలిమినేషన్ రెండో రౌండ్లో సరిత 141–135తో ఎలెనోరా సార్టీ (ఇటలీ)పై గెలిచింది. తొలి రౌండ్లో సరిత 138–124తో నూర్ అబ్దుల్ జలీల్ (మలేసియా)పై గెలిచింది. మరోమ్యాచ్‌లో భారత ఆర్చర్, రెండో సీడ్ శీతల్ దేవి 137–138తోమిరియానా జునీగా (చిలీ)పై చేతిలో ఓడింది. రోయింగ్ రెపిచాజ్లో మూడో స్థానం రోయింగ్ మిక్స్డ్ పీఆర్3 డబుల్ స్కల్స్‌లో అనిత, నారాయణ కొంగనపల్లె జంట రెపిచాజ్ ఈవెంట్లో మూడో స్థానంలో నిలిచి ఫైనల్ ‘బి’లో అడుగుపెట్టింది. శనివారం పోటీలో ఈ జంట 7 నిమిషాల 54.33 సెకన్లలో లక్ష్యాన్ని చేరింది. ఉక్రెయిన్ (7 నిమిషాల 29.24 సెకన్లు), బ్రిటన్ (7 నిమిషాల 20.53 సెకన్లు) జోడీలు తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. ఫైనల్ ‘బి’లోని రోవర్లు 7 నుంచి 12వ స్థానం కోసం పోటీపడనున్నారు. సైక్లింగ్‌లో నిరాశ పారిస్ పారాలింపిక్స్‌లో భారత సైక్లిస్ట్‌లకు నిరాశ ఎదురైంది. అర్షద్ షేక్, జ్యోతి గడేరియా తమతమ విభాగాల్లో ఫైనల్‌కు చేరకుండానే వెనుదిరిగారు. పురుషుల 1000 మీటర్ల టైమ్ ట్రయల్ సీ1–3 విభాగంలో బరిలోకి దిగిన అర్షద్ శనివారం క్వాలిఫయింగ్ రౌండ్లో చివరి స్థానంతో రేసును ముగించాడు. మొత్తం 17 మంది పాల్గొన్న ఈ పోటీలో అర్షద్ 1 నిమిషం 21.416 సెకన్లలో లక్ష్యాన్ని చేరాడు. మహిళల 500 మీటర్ల టైమ్ ట్రయల్ సీ1–3 క్వాలిఫయింగ్ ఈవెంట్లో జ్యోతి గడేరియా 49.233 సెకన్లలో లక్ష్యాన్ని చేరి చివరి స్థానంలో నిలిచింది. -
కలల కుండీ
ఆశల కలలు.. నింగిలో మొలకెత్తే పూల విత్తనాలు. మట్టినేలపై కూడా విరిసే ఇంద్ర ధనుస్సులు. లేమికి చెరగని చిరునవ్వులు... ఈదురు గాలులకు చెదరని వెదురు తడికెల గదులు. మలీషా కళ్ల నిండా ముంబై పట్టనన్ని కలలు. మోడలింగ్.. డ్యాన్స్.. మంచి లైఫ్.. ఫ్యామిలీకి ఫుడ్. మరో ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ స్టోరీ ఉందిక్కడ! ఆ స్టోరీని కుండీలో నాటి వెళ్లాడు ఓ హాలీవుడ్ హీరో. మలీషా జీవితానికి లాక్డౌన్ ఇచ్చిన స్క్రీన్‌ప్లే ఇది! పన్నెండేళ్ల మలీషా ఖర్వాకు మోడలింగ్ అంటే ఇష్టం. ‘ఏముంటుంది అందులో ఇష్టపడటానికి?’ అని అడిగితే.. ‘కెమెరా వైపు చూస్తూ నడుము మీద చేతులు వేసుకుని పోజులు ఇవ్వడం బాగుంటుంది’ అంటుంది నవ్వుతూ మలీషా! తనెక్కడో చూసి ఉండాలి మోడల్స్ అలా చేస్తారని. ఎక్కడైనా చూసి ఉండాలి కానీ, తనింట్లో మాత్రం కాదు. ఎందుకంటే ముంబైలోని బాంద్రాలో ఓ మురికివాడలో తండ్రి, తమ్ముడు సాహిల్ (7)తో పాటు ఒక వెదురు గొట్టాల రేకుల షెడ్డులో ఉంటున్న మలీషా ఇంట్లో టీవీ లేదు. అలాంటి ఇంటికి హాలీవుడ్ నటుడు, డాన్సర్, కొరియోగ్రాఫర్ రాబర్ట్ హాఫ్‌మ్యాన్ వచ్చాడు! డ్యాన్స్ సినిమా ‘ది స్టెప్ అప్ 2: ది స్ట్రీట్స్’ ఫేమ్ అతడు. గత మూడు నెలలుగా ముంబైలోనే ఉంటూ మలీషా ఇంటికి వెళ్లొస్తూ అక్కడ ఉన్నంతసేపు సరదాగా హిందీ నేర్చుకుంటున్నాడు. అతడి వల్ల మలీషాకూ కాస్త ఇంగ్లిష్ వచ్చింది. అయితే రాబర్ట్ ముంబై వచ్చిన పని వేరే. ముందు డ్యాన్సర్, ఆ తర్వాతే నటుడు హాఫ్‌మ్యాన్. తాను నటించిన సినిమాలలో ఎక్కువగా అతడు డ్యాన్సర్ పాత్రలోనే కనిపిస్తాడు. తూర్పు ఐరోపా దేశాల్లో డ్యాన్స్ టీచింగ్ క్లాసుల టూర్ పెట్టుకుని ఫిబ్రవరిలో ముంబైలో దిగాడు హాఫ్‌మ్యాన్. టూర్లో భాగంగా తను ప్లాన్ చేసిన మ్యూజిక్ వీడియో లో నటించడానికి అతడికి మురికివాడల నుంచి కాస్త డ్యాన్స్ తెలిసిన అమ్మాయి కావలసి వచ్చింది. అప్పుడే మలీషా ఖర్వా గురించి అతడికి తెలిసింది. ముంబైలో హాఫ్మ్యాన్కి ఆతిథ్యం ఇచ్చిన అభిమాని అతడిని మలీషా ఇంటికి తీసుకెళ్లింది. ‘‘మలీషాది చక్కటి నవ్వుముఖం. చక్కగా డ్యాన్స్ కూడా చేస్తుందని మా పనమ్మాయి చెప్పింది’’ అని ఆమె చెప్పిన మాట నిజమేననిపించింది మలీషాను చూడగానే. అయితే మ్యూజిక్ వీడియోలోని స్లమ్ పాత్రకు అంతకన్నా తక్కువ ‘వెలుగు’ ఉండే అమ్మాయి కావాలి. మలీషా కజిన్‌ని తీసుకున్నాడు హాఫ్‌మ్యాన్. షూట్ పూర్తయింది. ఈలోపు లాక్డౌన్. చాన్స్ రానందుకు తనేమీ బాధపడలేదు మలీషా. అందుకు కారణం హాఫ్‌మ్యాన్. ‘‘మలీషా.. నువ్వు మోడలింగ్‌కి చక్కగా పనికొస్తావు. అయితే వెంటనే కాదు. ఇంకా కొన్ని రోజులకు. అప్పుడు నువ్వు డ్యాన్స్ కూడా ఇంకా బాగా చేయగలుగుతావు’’ అన్నాడు. ఇంకా కొన్నాళ్లు తను ముంౖ»ñ లోనే ఉంటాడు కాబట్టి తనకు హిందీ నేర్పించమని అడిగాడు. ఆ రేకుల షెడ్డులోనే మలీషా కుటుంబ సభ్యులతో కలిసి కూర్చుని మలీషా చెబుతుంటే ఒక్కో మాటా నేర్చుకున్నాడు. ‘మేరా ఫోన్ ఖరాబ్ హోగయా’ అని మలీషా చెప్పమన్నప్పుడు.. ‘హోగయా’ అనే మాటను సరిగా పలకలేక ఆ అమెరికా ఆయన ‘హోపలా’ అనగానే మలీషా ఎలా పడీ పడీ నవ్విందో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో హాఫ్‌మ్యాన్ అప్లోడ్ చేసిన వీడియోలో చూడొచ్చు. రాబర్ట్ హాఫ్మ్యాన్తో మలీషా మలీషా కోసం అతడే ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను క్రియేట్ చేశాడు. తనే మలీషా ఫొటోలు తీసి అందులో పోస్ట్ చేశాడు. ‘హాయ్, నేను ఉంటున్న చోటును మురికివాడ అని అంతా అంటుంటారు. కానీ ఐ లవ్ మై హోమ్. నా ఫ్యామిలీని పోషించుకోవడం కోసం నేను మోడల్ని కావాలని అనుకుంటున్నాను. ఇదీ నా జర్నీ. నా వయసు 12’ అని ఇన్‌స్టాలో సైడ్ యాంగిల్లో కనిపిస్తూ ఉంటుంది మలీషా. హాఫ్మ్యాన్కు ఒకటే ఆశ్చర్యం. ఇంత ముఖసిరి గల అమ్మాయిని ఇంకా ఎవరూ మోడలింగ్‌కి తీసుకోకపోవడం ఏంటని! బహుశా ఇండియన్స్‌కి చర్మం రంగు మీద ఉన్న పట్టింపు ఇందుకు కారణం కావచ్చునని అనుకున్నాడు. ఇన్స్టాగ్రామ్లోనైతే మలీషా ఫాలోవర్లు ఆమెను ‘స్లమ్ ప్రిన్సెస్’ అని కీర్తించడం మొదలుపెట్టేశారు. ‘‘మీ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంది’’ అని మలీషా తండ్రితో హాఫ్‌మ్యాన్ అన్నప్పుడు ఆయన ముఖం వెలిగిపోయింది. కూతుర్ని మురిపెంగా దగ్గరకు తీసుకున్నాడు. (పైన పన్నెండేళ్ల క్రితం ఆస్కార్ వేడుకలో రుబీనా (9), (కింద) ప్రస్తుతం రుబీనా (21) లాక్‌డౌన్‌కి సడలింపులు రాగానే హాఫ్‌మ్యాన్ తిరిగి టూర్‌కి రెడీ అయ్యారు. ఈలోపు మలీషా ‘వ్లోగింగ్’ (వెబ్సైట్లో ఫొటోలు, వీడియోలు షేర్ చేయడం) కోసం మంచి కెమెరా ఉన్న సెల్‌ఫోన్‌ను గిఫ్టుగా ఇవ్వబోతున్నాడు. అప్పటికే అతడు మలీషా పేరు మీద ‘గోఫండ్‌మి’ అనే వెబ్ పేజీని క్రియేట్ చేశాడు. ఇంతవరకు మలీషాకు 76 వేల రూపాయల విరాళాలు వచ్చాయి. హాఫ్మ్యాన్ని రాబర్ట్ అంటుంది మలీషా. ‘‘నా కలల్ని నిజం చేసుకోడానికి రాబర్ట్ నాకు చాలా హెల్ప్ చేశారు’’ అంటోంది తను. పన్నెండేళ్ల క్రితం రుబీనా బాంద్రాకు సమీపంలోని మురికివాడల మట్టి నుంచే పన్నెండేళ్ల క్రితం రూబినా అలీ అనే మాణిక్యం బయటపడింది. ఎనిమిది కేటగిరీలలో ఆస్కార్ గెలుచుకున్న ‘స్లమ్‌డాక్ మిలియనీర్’ చిత్రంలోని బాలనటిగా రుబీనాకు గుర్తింపు వచ్చింది. ఆ సినిమా దర్శకుడు డ్యానీ బోయల్ ‘జయహో ట్రస్టు’ కింద బాంద్రాలోనే కట్టించి ఇచ్చిన సొంత ఇంట్లో ఇప్పుడు రుబీనా కుటుంబం ఉంటోంది. రుబీనా ప్రస్తుతం (లాక్డౌన్ ముందు వరకు) ఓ మేకప్ స్టూడియోలో పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేస్తోంది. బాంద్రా మురికివాడలో మలీషా ఉంటున్న ఇల్లు -
ఎల్లలకు ఆవల మన సేవలు
సరిహద్దుల కోసం యుద్ధాలు జరుగుతాయి.. కాని హద్దులకు అతీతంగా యుద్ధాన్ని ప్రకటించింది కరోనా అలుపెరగక పోరాడుతున్నారు వైద్యవీరులు... ఇలా కనిపించని శత్రువుతో పోరుకు తలపడ్డదేశాల్లో దుబాయ్ కూడా ఉంది.. మన డాక్టర్లు, నర్సుల సైనికబలంతో. అక్కడి రషీద్ ప్రభుత్వ ఆసుపత్రిలోని అన్ని శాఖల్లో దాదాపు వంద మంది భారతీయులు పని చేస్తున్నారు. గుర్తింపు, ఆశించిన జీతం, సౌకర్యవంతమైన జీవన శైలిని వెదుక్కుంటూ వెళ్లినవారే అంతా! కాని కరోనా అత్యవసర పరిస్థితుల్లో వాటన్నిటినీ పక్కనపెట్టి సేవలో మునిగిపోయారు. అందులో చాలామంది కేరళ, కొంతమంది తెలుగు వాళ్లు.. ఇంకొంతమంది ఉత్తర భారతీయులున్నారు. ఐసీయూ అత్యవసర సేవలందిస్తున్న డాక్టర్ రుబీనా ఇనాందార్, నర్స్.. బిజీ వర్ఘీస్ ఇలా చెప్పుకొచ్చారు. గెలుస్తామనే ఆశతో... రుబీనా ‘కరోనా... వైద్యరంగానికి పెద్ద సవాలు. కొత్త పాఠాలను నేర్పుతోంది. వాటిని అమలు చేస్తూ రోగులను ఆరోగ్యవంతులను చేయడమే వైద్యుల కర్తవ్యం. కరోనా నుంచి విముక్తి పొంది ఇంటికి వెళ్తున్న వాళ్లను చూస్తుంటే యుద్ధంలో గెలుస్తున్నామనే భావన. చనిపోయిన వాళ్లను చూస్తుంటే వైఫల్యం చెందుతున్నామనే భయం. కాని కుంగిపోతే డ్యూటీ చేయలేం కాబట్టి రికవరీ అవుతున్న వాళ్లని చూసుకుంటూ ధైర్యం తెచ్చుకుంటున్నాం. అదృష్టవశాత్తు ఆ సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. అంతిమంగా ఈ యుద్ధంలో గెలుస్తామనే ఆశనూ కలిగిస్తోంది. ఇక్కడ ప్రభుత్వాసుపత్రుల్లో అధునాతన సౌకర్యాలన్నీ ఉంటాయి. హెల్త్ కేర్ వర్కర్స్ అయిన మా ఆరోగ్య భద్రత విషయంలోనూ. కరోనా రోగులకు చికిత్స చేయడానికి మాకు కావల్సిన సదుపాయాలన్నీ ఉన్నాయి. అంతేకాదు ఈ సంక్షోభంలో మేం ఒత్తిడికి లోనవుతూ నీరుగారిపోకుండా మెసేజ్‌ల ద్వారా ఎప్పటికప్పుడు మా సేవలను మెచ్చుకుంటూ మమ్మల్ని ఉత్సాహపరుస్తోంది ప్రభుత్వం. డాక్టర్స్‌గా మేమూ రోగుల కుటుంబాలకు భరోసానిస్తున్నాం. కౌన్సెలింగ్‌లో భాగంగా వాళ్లతో ఇంటరాక్ట్ అవుతున్న సమయంలో ఇండియాలో ఉన్న మా కుటుంబాలూ గుర్తొస్తున్నాయి. మా పేరెంట్స్ ఔరంగాబాద్‌లో ఉంటారు. వాళ్లను చూసుకోవడానికి తమ్ముడు ఉన్నాడు. అయినా దిగులే. ఈ టైమ్‌లో వాళ్లకు దగ్గరగా ఉండుంటే బాగుండేది అనిపిస్తుంది. ఒక్క క్షణమే! వెంటనే మళ్లీ డ్యూటీలో పడిపోతాను. ఇక ఏదీ గుర్తుకు రాదు కరోనాతో యుద్ధం తప్ప!’ అంటుంది డాక్టర్ రుబీనా ఇనాందార్. రుబీనా స్వస్థలం మహారాష్ట్రలోని ఔరంగాబాద్. ఇరవై ఏళ్లుగా దుబాయ్‌లో ఉంటున్నారు. రషీద్ ప్రభుత్వాసుపత్రిలో సీనియర్ స్పెషలిస్ట్ (ఇంటర్నల్ మెడిసిన్)గా వైద్యసేవలు అందిస్తున్నారు. ఆమె భర్త అజహర్ సదత్ కూడా అక్కడే ఓ ఫ్రెంచ్ బేస్డ్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఒకరికొకరం మోరల్ సపోర్ట్‌గా... బిజి ‘నర్సింగ్ రంగాన్ని ఎన్నుకున్నామంటేనే సేవకు సిద్ధమయ్యామనే. కరోనా కాని, ఇంకోటి కాని ‘నో’ అనకూడదు. అలాగే తన, పర తేడా ఉండకూడదు. పేషెంట్ తర్వగా కోలుకునేలా చేయడమే నా బాధ్యత. మాస్క్‌లు, గ్లోవ్స్, పీపీఈ వంటి అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా వంటి కేసుల్లో రిస్క్ ఉంటుంది. అందుకే ఇంటికి వెళ్లగానే బయటే షూ విప్పేసి, మొత్తం బాడీని శానిటైజ్ చేసుకొని లోపలికి వెళ్తున్నాను. ఇంట్లో కూడా బాల్కనీ, బాత్రూమ్ ఉన్న ఓ గదిని నాకోసం కేటాయించుకొని ఐసోలేట్ అవుతున్నా. వంట పాత్రల నుంచి అవసరమైనన్నిటినీ విడిగా పెట్టుకున్నా. నా తీరుకు మొదట్లో మా పిల్లలిద్దరూ (పదహారేళ్ల కూతురు, పధ్నాలుగేళ్ల కొడుకు) కొంచెం కంగారుపడ్డారు. తర్వాత పరిస్థితి అర్థమై సహకరించడం మొదలుపెట్టారు. అయినా ఒక్కోసారి ‘అమ్మా.. నీ ఒళ్లో పడుకోవాలనుంది.. హగ్ చేసుకోవాలనుంది’ అంటూ కూతురు, ‘అమ్మా.. నీ దగ్గర కూర్చొని కబుర్లు చెప్పాలనుంది’ అంటూ అబ్బాయి బెంగటిల్లుతున్నారు. కేరళలో కూడా కరోనా సీరియస్‌గానే ఉంది. అక్కడున్న మా పేరెంట్స్ ఎలా ఉంటున్నారోనని దిగులు, బాధ. రోజూ ఫోన్ చేసి వాళ్ల యోగక్షేమాలు కనుక్కుంటున్నా. అమ్మ ఏడుస్తుంది. ఏం చేయను? ఫోన్లో ధైర్యం చెప్పడం తప్ప. ఇక్కడున్న చాలామంది విదేశీయుల పరిస్థితి ఇంతే. ఒకరికొకరం మోరల్ గా సపోర్ట్ చేసుకుంటూ వీలైనంత త్వరగా ఈ ప్రపంచమంతా ముందులా నార్మల్‌గా అయిపోవాలని కోరుకుంటున్నాం’ అంటుంది బిజి వర్ఘీస్. కేరళలోని పతనంతిట్టకు చెందిన బిజి హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో కొన్నాళ్లు పనిచేసి భర్తతో కలిసి దుబాయ్ వెళ్లింది. పద్దెనిమిదేళ్లుగా రషీద్ ఆసుపత్రిలో పనిచేస్తోంది. వీరి పోరాటం చూస్తుంటే గెలుపు ఖాయం అనిపిస్తోంది కదా... -
కట్నం కోసం ముక్కు, జడ కోసేశాడు..
పిలిబిట్: ఉత్తరప్రదేశ్‌లోని పిలిబిట్లో అమానుషం చోటుచేసుకుంది. కట్నం కోసం ఓ భర్త రాక్షసంగా ప్రవర్తించాడు. భార్య అనే కనికరం కూడా లేకుండా కత్తెరతో ఆమె ముక్కు, జడ కోశాడు. కోత్వాలీ పూరాన్‌పూర్‌లో ఈ దారుణం బుధవారం ఉదయం వెలుగు చూసింది. స్థానికంగా నివాసం ఉండే ఆలమ్ భార్య రుబీనాను కట్నం కోసం గత కొంతకాలంగా వేధిస్తున్నాడు. రూ.20వేలతో పాటు బైక్ ఇవ్వాలంటూ అత్తమామలను డిమాండ్ చేశాడు. అయితే కట్న దాహం తీరకపోవటంతో ఆలమ్ ఈ దారుణానికి తెగబడ్డాడు. వెంటనే స్పందించిన స్థానికులు రుబీనాను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై ఆగ్రహం చెందిన బాధితురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆలమ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.