సరిహద్దుల కోసం యుద్ధాలు జరుగుతాయి.. కాని హద్దులకు అతీతంగా యుద్ధాన్ని ప్రకటించింది కరోనా అలుపెరగక పోరాడుతున్నారు వైద్యవీరులు...
ఇలా కనిపించని శత్రువుతో పోరుకు తలపడ్డదేశాల్లో దుబాయ్ కూడా ఉంది.. మన డాక్టర్లు, నర్సుల సైనికబలంతో. అక్కడి రషీద్ ప్రభుత్వ ఆసుపత్రిలోని అన్ని శాఖల్లో దాదాపు వంద మంది భారతీయులు పని చేస్తున్నారు. గుర్తింపు, ఆశించిన జీతం, సౌకర్యవంతమైన జీవన శైలిని వెదుక్కుంటూ వెళ్లినవారే అంతా! కాని కరోనా అత్యవసర పరిస్థితుల్లో వాటన్నిటినీ పక్కనపెట్టి సేవలో మునిగిపోయారు. అందులో చాలామంది కేరళ, కొంతమంది తెలుగు వాళ్లు.. ఇంకొంతమంది ఉత్తర భారతీయులున్నారు. ఐసీయూ అత్యవసర సేవలందిస్తున్న డాక్టర్ రుబీనా ఇనాందార్, నర్స్.. బిజీ వర్ఘీస్ ఇలా చెప్పుకొచ్చారు.
గెలుస్తామనే ఆశతో... రుబీనా
‘కరోనా... వైద్యరంగానికి పెద్ద సవాలు. కొత్త పాఠాలను నేర్పుతోంది. వాటిని అమలు చేస్తూ రోగులను ఆరోగ్యవంతులను చేయడమే వైద్యుల కర్తవ్యం. కరోనా నుంచి విముక్తి పొంది ఇంటికి వెళ్తున్న వాళ్లను చూస్తుంటే యుద్ధంలో గెలుస్తున్నామనే భావన. చనిపోయిన వాళ్లను చూస్తుంటే వైఫల్యం చెందుతున్నామనే భయం. కాని కుంగిపోతే డ్యూటీ చేయలేం కాబట్టి రికవరీ అవుతున్న వాళ్లని చూసుకుంటూ ధైర్యం తెచ్చుకుంటున్నాం. అదృష్టవశాత్తు ఆ సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. అంతిమంగా ఈ యుద్ధంలో గెలుస్తామనే ఆశనూ కలిగిస్తోంది. ఇక్కడ ప్రభుత్వాసుపత్రుల్లో అధునాతన సౌకర్యాలన్నీ ఉంటాయి. హెల్త్ కేర్ వర్కర్స్ అయిన మా ఆరోగ్య భద్రత విషయంలోనూ. కరోనా రోగులకు చికిత్స చేయడానికి మాకు కావల్సిన సదుపాయాలన్నీ ఉన్నాయి. అంతేకాదు ఈ సంక్షోభంలో మేం ఒత్తిడికి లోనవుతూ నీరుగారిపోకుండా మెసేజ్‌ల ద్వారా ఎప్పటికప్పుడు మా సేవలను మెచ్చుకుంటూ మమ్మల్ని ఉత్సాహపరుస్తోంది ప్రభుత్వం.
డాక్టర్స్‌గా మేమూ రోగుల కుటుంబాలకు భరోసానిస్తున్నాం. కౌన్సెలింగ్‌లో భాగంగా వాళ్లతో ఇంటరాక్ట్ అవుతున్న సమయంలో ఇండియాలో ఉన్న మా కుటుంబాలూ గుర్తొస్తున్నాయి. మా పేరెంట్స్ ఔరంగాబాద్‌లో ఉంటారు. వాళ్లను చూసుకోవడానికి తమ్ముడు ఉన్నాడు. అయినా దిగులే. ఈ టైమ్‌లో వాళ్లకు దగ్గరగా ఉండుంటే బాగుండేది అనిపిస్తుంది. ఒక్క క్షణమే! వెంటనే మళ్లీ డ్యూటీలో పడిపోతాను. ఇక ఏదీ గుర్తుకు రాదు కరోనాతో యుద్ధం తప్ప!’ అంటుంది డాక్టర్ రుబీనా ఇనాందార్. రుబీనా స్వస్థలం మహారాష్ట్రలోని ఔరంగాబాద్. ఇరవై ఏళ్లుగా దుబాయ్‌లో ఉంటున్నారు. రషీద్ ప్రభుత్వాసుపత్రిలో సీనియర్ స్పెషలిస్ట్ (ఇంటర్నల్ మెడిసిన్)గా వైద్యసేవలు అందిస్తున్నారు. ఆమె భర్త అజహర్ సదత్ కూడా అక్కడే ఓ ఫ్రెంచ్ బేస్డ్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.
ఒకరికొకరం మోరల్ సపోర్ట్‌గా... బిజి
‘నర్సింగ్ రంగాన్ని ఎన్నుకున్నామంటేనే సేవకు సిద్ధమయ్యామనే. కరోనా కాని, ఇంకోటి కాని ‘నో’ అనకూడదు. అలాగే తన, పర తేడా ఉండకూడదు. పేషెంట్ తర్వగా కోలుకునేలా చేయడమే నా బాధ్యత. మాస్క్‌లు, గ్లోవ్స్, పీపీఈ వంటి అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా వంటి కేసుల్లో రిస్క్ ఉంటుంది. అందుకే ఇంటికి వెళ్లగానే బయటే షూ విప్పేసి, మొత్తం బాడీని శానిటైజ్ చేసుకొని లోపలికి వెళ్తున్నాను. ఇంట్లో కూడా బాల్కనీ, బాత్రూమ్ ఉన్న ఓ గదిని నాకోసం కేటాయించుకొని ఐసోలేట్ అవుతున్నా. వంట పాత్రల నుంచి అవసరమైనన్నిటినీ విడిగా పెట్టుకున్నా. నా తీరుకు మొదట్లో మా పిల్లలిద్దరూ (పదహారేళ్ల కూతురు, పధ్నాలుగేళ్ల కొడుకు) కొంచెం కంగారుపడ్డారు.
తర్వాత పరిస్థితి అర్థమై సహకరించడం మొదలుపెట్టారు. అయినా ఒక్కోసారి ‘అమ్మా.. నీ ఒళ్లో పడుకోవాలనుంది.. హగ్ చేసుకోవాలనుంది’ అంటూ కూతురు, ‘అమ్మా.. నీ దగ్గర కూర్చొని కబుర్లు చెప్పాలనుంది’ అంటూ అబ్బాయి బెంగటిల్లుతున్నారు. కేరళలో కూడా కరోనా సీరియస్‌గానే ఉంది. అక్కడున్న మా పేరెంట్స్ ఎలా ఉంటున్నారోనని దిగులు, బాధ. రోజూ ఫోన్ చేసి వాళ్ల యోగక్షేమాలు కనుక్కుంటున్నా. అమ్మ ఏడుస్తుంది. ఏం చేయను? ఫోన్‌లో ధైర్యం చెప్పడం తప్ప. ఇక్కడున్న చాలామంది విదేశీయుల పరిస్థితి ఇంతే. ఒకరికొకరం మోరల్ గా సపోర్ట్ చేసుకుంటూ వీలైనంత త్వరగా ఈ ప్రపంచమంతా ముందులా నార్మల్‌గా అయిపోవాలని కోరుకుంటున్నాం’ అంటుంది బిజి వర్ఘీస్. కేరళలోని పతనంతిట్టకు చెందిన బిజి హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో కొన్నాళ్లు పనిచేసి భర్తతో కలిసి దుబాయ్ వెళ్లింది. పద్దెనిమిదేళ్లుగా రషీద్ ఆసుపత్రిలో పనిచేస్తోంది. వీరి పోరాటం చూస్తుంటే గెలుపు ఖాయం అనిపిస్తోంది కదా...
Comments
Please login to add a commentAdd a comment