యూఎన్‌ మెచ్చిన ఇండియన్‌ | Special Story About Neeta Hussain From India | Sakshi
Sakshi News home page

యూఎన్‌ మెచ్చిన ఇండియన్‌

Published Sun, Jul 12 2020 12:01 AM | Last Updated on Sun, Jul 12 2020 5:11 AM

Special Story About Neeta Hussain From India - Sakshi

సప్త సముద్రాలు భూమ్మీద. అవన్నీ కలిస్తే.. వికీపీడియా. సమాచార మహా సముద్రం. ఆ సముద్రంలో.. జల్లెడ పట్టే వాలంటీర్‌ నీతా! అవాస్తవాలను తొలగిస్తుంది. సరైన వాటినే ఉంచుతుంది.ఈ డిజిటల్‌ యోధురాలిని.. యు.ఎన్‌.ఒ. ప్రశంసించింది.

ఈమధ్య ఒక దినపత్రికలో ఒక వార్తా కథనం వచ్చింది. అందులోని ఒక వాక్యం.. ‘తాజాగా కర్నల్‌ ఆఫీసర్‌గా విధుల్లో చేరింది గౌరి. కుర్చీలో కూర్చుంటూ మెడలో ఉన్న తాళిబొట్టును చూసుకుంది. పెళ్లినాటి సంగతులన్నీ గుర్తొచ్చాయి’.. అని. ఆమె భర్త భారత సైన్యంలో మేజర్‌. ఆయన చనిపోతే నివాళిగా ఆమె కూడా సైన్యంలో చేరింది. చేరిన మాట నిజమే కానీ, ఆ కథనంలో ఉన్నట్లు ‘తాజా’గా మాత్రం కాదు. ఈ ఏడాది మార్చి 7న జాయిన్‌ అయ్యారు! నాటి ఆమె జాయినింగ్‌ వార్తను కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ఇప్పుడు ఆన్‌లైన్‌లో చూసి, తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయడంతో గౌరి జాయినింగ్‌ని ‘తాజా’పరిచేసింది ఆ పత్రిక. ‘ఫ్యాక్చువల్‌ ఎర్రర్‌’ ఇది. ఇటువంటి తప్పిదాలు చరిత్రకు తప్ప, మానవులకు ప్రత్యక్షంగా హానికరమైనవి కాకపోవచ్చు. అయితే ఇవే తప్పుల్ని వైద్య, చికిత్సల సమాచారంలో దొర్లించేస్తే?! కోవిడ్‌కు ఫలానా మందులు పని చేస్తున్నాయని నిర్థారణ కాని ‘వాస్తవాలను’ కూడా రాసేస్తే? సోషల్‌ మీడియాలో ఇప్పుడు అదే జరుగుతోంది! 

కోవిడ్‌పై డాక్టర్లు, వైద్యపరిశోధకులు యుద్ధం చేస్తుంటే, కోవిడ్‌పై ఇంటర్నెట్‌లో పోటెత్తుతున్న ఈ తప్పుడు సమాచారంతో డిజిటల్‌ బ్యాటిల్‌ చేస్తున్నారు డాక్టర్‌ నీతా హుస్సేన్‌. వికీపీడియాలో ఆమె వాలంటరీ ప్రాజెక్టు ఆఫీసర్‌. కోవిడ్‌ వ్యాక్సిన్‌ మీద వస్తున్న సమాచారాన్ని జల్లెడ పట్టి, నికార్సయిన అంశాలను మాత్రమే ఉంచడం ఆమె పని. నీతా కేరళ యువతి. కోళికోడ్‌ దగ్గరి కున్నమంగళం ఆమె స్వస్థలం. స్వీడన్‌లో ఉంటున్నారు. కొన్నాళ్ల క్రితమే ఆమె స్వీడన్‌లోని గోథెన్‌బర్గ్‌ యూనివర్సిటీ నుంచి క్లినికల్‌ న్యూరోసైన్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. తాజాగా.. ఐక్యరాజ్యసమితి ట్విట్టర్‌ హ్యాండిల్‌పై ప్రత్యక్షం అయ్యారు! ‘నెట్‌’లోకి అప్‌లోడ్‌ అవుతున్న కోవిడ్‌ ఫేక్‌ న్యూస్‌ని తొలగించడంలో నీతా అలుపెరుగని కృషి చేస్తున్నారు అని యు.ఎన్‌.ఒ. ఆమెను ప్రశంసించింది.
వికీపీడియాలో తప్పుల పరిశోధకురాలు నీతా. వాస్తవానికి పదేళ్ల నుంచే వికీలో ఆమె ఈ పనిలో ఉన్నారు. ఇప్పుడు పూర్తిగా కోవిడ్‌ సమాచారాన్ని మాత్రమే చూస్తున్నారు. నిర్థారణ అయిన వాటినే ఆమె వికీలో ఉంచుతారు. మిగతా వాటిని తొలగిస్తారు. అంతేకాదు, అపోహల్ని తొలగించే విధంగా వికీలో ఆమె వ్యాసాలు కూడా రాస్తుంటారు. మార్చి నుంచి ఇప్పటి వరకు కోవిద్‌పై ముప్పై వ్యాసాల వరకు రాశారు. ఆమె తాజా వ్యాసం.. ‘లిస్ట్‌ ఆఫ్‌ అన్‌ప్రోవెన్‌ మెథడ్స్‌ అగైన్‌స్ట్‌ కోవిడ్‌–19’. కరోనా వైద్యంగా నిర్థారణ కాని ఆ చికిత్సా విధానాల జాబితాలో మనం నమ్ముతున్న అల్లం, వెల్లుల్లి, ‘సి’ విటమిన్, పుల్లని రుచితో ఉండే పండ్లు కూడా ఉన్నాయి! అంటే ఇవేవీ కరోనాకు పనిచేస్తాయని నమ్మకంగా నిర్థారణ కాలేదని. అలాగే అత్యధిక ఉష్ణోగ్రత వద్ద కోవిడ్‌ క్రిమి నశిస్తుందన్నదీ అవాస్తవ సమాచారమే అంటారు నీతా. మలేరియా మందు హైడ్రోక్సిక్లోరోక్విన్‌కూ కోవిడ్‌ను నయం చేసే శక్తి లేదని కూడా ఆమె కొన్ని పరిశోధనా ఫలితాలను జోడిస్తూ రాశారు. ఆ మధ్య కరోనాకు వైద్యంగా ఉమ్మెత్త విత్తనాల రసం తాగి, ఆసుపత్రి పాలైన వారి గురించి కూడా అందులో ఆమె ప్రస్తావించారు. 

దాదాపు పద్దెనిమిదేళ్లుగా వికీపీడియా మనకు నమ్మకమైన సమాచార సాధనం. అందులోనూ తప్పులు వస్తుండే మాట వాస్తవమే అయినా.. కోవిద్‌ లాంటి కల్లోల సమయంలో చాలావరకు నమ్మకమైన సమాచారమూ లభిస్తోంది. నమ్మదగని వాటిని కత్తిరించడానికి నీతా వంటి ప్రాజెక్టు ఆఫీసర్‌లు ప్రపంచ వ్యాప్తంగా వికీకి 285 భాషల్లో పని చేస్తున్నారు. ఇన్ఫర్మేషన్‌ని షేర్‌ చేశాక, నిర్థారణ కాని సమాచారం ఇచ్చామని తెలుసుకున్నప్పుడు వ్యాసకర్తలు క్షమాపణలు చెబుతుంటారు. అయితే అప్పటికే ఆ సమాచారం రౌండ్‌లు కొట్టడం మొదలయి ఉంటుంది. అలా కాకుండా ముందే నీతా వడగట్టేస్తుంటారు.
‘సరైన దానిని చేర్చడం, సరిగా లేని దాన్ని తొలగించడం ఎంతో సరదా అయిన బాధ్యత’’ అని అంటున్నారు నీతా. కోవిడ్‌ విషయంలో.. ప్రపంచ ఆరోగ్య సంస్థ బులెటిన్‌లను, ఇంకా కొన్ని నమ్మకమైన పరిశోధనా సంస్థలు, జర్నల్స్‌ను ఆధారం చేసుకుని.. వికీకి చేరుతున్న వైద్య వ్యాసాల్లోని అపనమ్మక సమాచారాన్ని ఆమె తొలగిస్తున్నారు. వికీలో నీతా రాసిన కొన్ని ఉమన్‌ బయోగ్రఫీలు కూడా ఉన్నాయి. ‘‘సాధారణ మహిళ జీవిత చరిత్ర కూడా ఇన్‌స్పైరింగ్‌గానే ఉంటుంది’’ అంటారు నీతా హుస్సేన్‌. 

చమ్మంతి చట్నీ లేదు!
వికీపీడియాలో నీతా ప్రయాణం.. పదేళ్ల క్రితం ఆమె కోళికోడ్‌లోని కాలికట్‌ మెడికల్‌ కాలేజీలో ఫస్ట్‌ ఇయర్‌ చదువుతుండగా అనుకోకుండా మొదలైంది. కేరళకు ప్రత్యేకమైన ‘చమ్మంతి’ రెసిపీ అంటే నీతాకు ఇష్టం. కొబ్బరితో చేసే చట్నీ అది. దాని కోసం వికీపీడియా వెదికారు. లేదు! వెంటనే చమ్మంతిపై వికీపీడియాకు వ్యాసం రాసి పంపిస్తే వాళ్లు తమ భాండాగారంలో చేర్చుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement