కరోనా కాలం మొదలైనప్పటి నుంచి కావల్సిన వారు కానివారవుతున్నారు. 70 ఏళ్ల లీలావతి దుబేకు కూడా అలాంటి కష్టమే వచ్చింది. కడుపున పుట్టిన పిల్లలు కాదు పొమ్మంటే దిక్కులేనిదానిలా రోడ్డున పడింది. కానీ, మనుషుల్లో దాగున్న మంచితనంతో ఆమెకో కొత్త కుటుంబం దగ్గరయ్యింది. ముసలి వయసులో ఓ ఆలంబన దొరికింది. కరోనా టైమ్‌లో లక్షలాది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఉద్యోగాలు కోల్పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ముంబయ్‌లో ఉంటున్న కేదార్‌నాథ్‌కి భార్యాపిల్లలతో పాటు తల్లిని సాకడం కష్టమై ఆమెను ఇంటినుంచి వెళ్లగొట్టాడు. పెద్దకొడుకు కాదనడంతో ఢిల్లీలో ఉన్న రెండవ కొడుకు దగ్గరకు వెళ్లడానికి ముంబయ్ రైల్వేస్టేషన్‌లో రైలు కోసం ఎదురు చూస్తూ కూర్చుంది లీలావతి. కొడుకు దగ్గరకు వెళ్లడానికి లీలావతి వద్ద రూపాయి కూడా లేదు.
మనసును కదిలించే ఈ లీలావతి కథను యూట్యూబ్ ద్వారా సీనియర్ జర్నలిస్ట్ బర్ఖాదత్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇది చూసిన కిరణ్ వర్మ అనే సామాజిక కార్యకర్త లీలావతిని తన ఇంటికి తీసుకువచ్చాడు. ఆమెను నానమ్మగా భావించి, తనతోనే ఉండిపొమ్మన్నాడు. ‘లీలావతి నానమ్మకు కరోనా పరీక్ష చేయించాను. తను ఆరోగ్యంగా ఉంది. ఆమెకు ఇష్టమైనన్ని రోజులు మా ఇంట్లోనే ఉంటుంది. మా కుటుంబంలోకి కొత్తగా నానమ్మ వచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది. నానమ్మ కూడా సంతోషంగా ఉండటం గమనిస్తున్నాను’ అంటూ ఆనందిస్తున్నాడు కిరణ్. కరోనా అయినవారి మధ్య చిచ్చు పెట్టింది. కడుపున పుట్టిన బిడ్డలు కూడా కాదు పొమ్మంటున్న పరిస్థితులు వచ్చి పడ్డాయి. అయినా, మనుషుల్లో మానవత్వం దాగి ఉందని ఇలాంటి సంఘటనలు రుజువు చేస్తూనే ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment