స్వర్ణ కిలారి తన ‘లిప్తకాలపు స్వప్నం’ అనే పుస్తకం ద్వారా హైదరాబాద్ సాహితీ బృందాల్లో సుపరిచితులు. ఇప్పుడు ఫేస్‌బుక్ వల్ల మరింత మందికి తెలిశారు. దానికి కారణం కోవిడ్‌ను జయించాక ఆమె రాసిన పోస్ట్ వైరల్‌గా మారడమే. ఆ పోస్ట్ ఎంతోమందికి ధైర్యం ఇవ్వడమే. ఆ పోస్ట్‌లో ఆమె రాసిన అనుభవం ఆమె మాటల్లో.... ‘‘కరోనా మన ఇండియాకి వచ్చిందని మార్చ్ నెల మొదటి వారంలో తెలిసింది. మార్చ్ మూడో వారం నుండి లాక్డౌన్ ప్రారంభం అయింది. నా భర్త, తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం అప్పటికే రోజూ ఆఫీస్‌కు వెళ్లి వస్తున్నాడు కనుక ముందు జాగ్రత్తగా సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లిపోయాడు. అదే సమయంలో వలస కార్మికుల ఇబ్బందులు మొదలయ్యాయి. వారి కష్టం చూడలేక కొంతమేరకు తోచిన సాయం చేయగలిగాను. కొన్నాళ్ళు గడిచాక వ్యాధి విస్తృతంగా వ్యాపించడం మొదలుపెట్టింది. మొదట్లో ఎవరో తెలియని వ్యక్తులకు వచ్చింది, కానీ త్వరలోనే మన దగ్గరి వాళ్లకు కూడా వస్తుంది అని అర్ధం అయింది’’.
నాకెలా తెలిసిందంటే...
ఒకరోజు ఒళ్ళు కాస్త వేడిగా అనిపించింది. రాత్రికల్లా ఎక్కువయి పారసిటమాల్ వేసుకునే స్థితి ఏర్పడింది. రెండో రోజు, మూడో రోజు కూడా 99–100 డిగ్రీలు వుండేది టెంపరేచర్. తర్వాత మాతోనే ఉండే చెల్లి కూతురు దరహాసకు కూడా జ్వరం మొదలైంది. ఎందుకో కరోనా వచ్చిందా అనే అనుమానం వచ్చి ఇద్దరం ఆసుపత్రిలో టెస్ట్‌కి శాంపిల్ ఇచ్చి వచ్చాం. రిపోర్ట్ వచ్చేసరికి మా జ్వరం తగ్గిపోయింది కానీ బాగా నీరసం, దగ్గు, బ్రీతింగ్ ప్రాబ్లం, వాసన, రుచి కోల్పోవడం, తలనొప్పి. రిపోర్టులో మాకు పాజిటివ్ అని వచ్చింది. ఆదుర్దా పడ్డాం కానీ వెంటనే తేరుకుని తరువాత ఏం చేయాలో ఆలోచించాము’’.
వాడిన మందులు
వెంటనే తెలిసిన ఇద్దరు గవర్నమెంట్ డాక్టర్లతో ఫోన్లోనే మాట్లాడి, వారిచ్చిన ప్రిస్క్రిప్షన్ ట్రీట్మెంట్ తీసుకోవడం మొదలుపెట్టాం. మొదటి నాలుగు రోజులు పారసిటమాల్, తరువాత విటమిన్ సీ, డీ, జింక్, ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఒక యాంటీబయోటిక్ కూడా ఇచ్చారు. ప్రతీరోజూ థర్మామీటర్‌తో జ్వరం చెక్ చేసుకోవడం, ఆక్సీమీటర్‌తో ఆక్సిజన్ శాచురేషన్ చెక్ చేసుకోవడం చేశాము. ఉదయం ఒకసారి కషాయం, ఉడకబెట్టిన గుడ్డు, నానబెట్టిన బాదం, మొలకలు, అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, మళ్లీ సాయంత్రం కషాయం, ఒక ఫ్రూట్ జ్యూస్, రాత్రికి చపాతీ, ఒక కప్పు పసుపు వేసిన పాలు. రెండ్రోజులకు ఒకసారి భోజనంలో చికెన్ కూడా తీసుకున్నాము.
కరోనా టైంలో నేను చేసిన పనులు
► అమేజాన్, నెట్‌ఫ్లిక్స్‌లలో ఎప్పటినుండో చూడాలి అనుకున్న సినిమాలు చూసాను.
► ఎప్పటినుండో పెండింగ్‌లో వున్న ఒక రెండు ఆర్టికల్స్ పూర్తి చేయగలిగాను.
► రోజూ యోగాసనాలు, గదిలోనే నడక.
మధ్యలో రెగ్యులర్‌గా ప్రభుత్వ కాల్ సెంటర్ నుండి ఫోన్ చేసి ఆరోగ్యం ఎలా ఉందో వాకబు చేశారు. ఐసొలేషన్ కిట్ పంపిస్తాం అంటే ఆల్రెడీ అవన్నీ ఉన్నాయి, కిట్ వద్దని చెప్పాను. నాతోపాటు దరహాస కూడా ఉండటం వల్ల పెద్దగా బోర్ కొట్టకుండా, ఒకరికొకరం అన్నట్టు ఉండగలిగాం.
నేనేం చెప్పాలనుకుంటున్నానంటే...
ఇదొక కొత్త వ్యాధి. లక్షణాలు ఒక్కొక్కరికీ ఒక్కోలా వున్నాయి. లక్షణ తీవ్రతను బట్టి ఆసుపత్రిలో వుండాలా, యింట్లోనే ఐసోలేషన్ లో వుండాలో డాక్టర్ సలహాతో నిర్ణయించుకోవాలి. ఈ వ్యాధి తగ్గి, మనం ఆరోగ్యంగా బయట పడాలంటే ముఖ్యంగా కావలసింది ధైర్యం. కరోనా రావడం నేరం, ఘోరం కాదు. రహస్యంగా వుంచాల్సిన అవసరమూ లేదు. మన చుట్టుపక్కల వాళ్లు జాగ్రత్తగా ఉంటూ, ఎక్కువ వ్యాప్తి చెందకుండా నివారించవచ్చు. నాకు అర్థమయ్యింది ఏమిటంటే కరోనా పట్ల మనకు వుండాల్సింది అప్రమత్తత. భయాందోళనలు కాదు!
Comments
Please login to add a commentAdd a comment