మేము గతంలో పని చేసిన సంస్థలోని ఉద్యోగులందరినీ కలుపుతూ ‘ప్రభ గ్రూప్’ పేరుతో ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. అందులో ఒక విశ్రాంత జర్నలిస్టు ఈ మధ్య ఒక పోస్ట్ పెట్టారు. ‘కరోనా జాగ్రత్తలు, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడానికి మేము సిద్ధమే. కానీ మా పిల్లలు వేరే దేశాల్లో ఉన్నారు. మేమిద్దరమే హైదరాబాద్‌లో ఉన్నాం. మాలాంటి వాళ్లు ఎంతోమంది ఉన్నారు. మా వయసు వాళ్లు బయటకు వెళ్లకపోతే... సరుకులు, మందులు, ఇతర అవసరమైన పనులు ఎలా?’ అని ఆ పోస్ట్ సారాంశం. వెంటనే ‘మా ఇల్లు మీకు దగ్గరలోనే. మీ ఏరియా మీదుగానే రోజూ ప్రయాణిస్తుంటాను. ఏం కావాలో నా నంబర్‌కి మెసేజ్ పెట్టండి. రాత్రి ఇంటికి వెళ్లేటప్పుడు మీ ఇంట్లో ఇచ్చి వెళ్తాను’ అంటూ ముగ్గురు ప్రతిస్పందించారు.
అప్పుడా పెద్దాయన... ‘మీరు స్పందించిన తీరు చాలా సంతోషంగా ఉంది. నేను అడిగిన సమస్య నా గురించి కాదు. నాలాంటి వాళ్లు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్లకు ఏదైనా వ్యవస్థీకృతమైన మార్గం ఉందా? ఫీల్డులో ఉన్న మీకు వివరాలు తెలిసి ఉంటాయని అడిగాను. మీరు తెలుసుకుని అందరికీ తెలియచేయండి’ అని మరో పోస్ట్ పెట్టారు. ఆయన చెప్పింది నిజమే. ‘ఒక సమస్య ఎదురైంది.. అంటే అందుకు పరిష్కారం కూడా ఉండే ఉంటుంది. ఆ పరిష్కారం ఏమిటో మనం వెతికి పట్టుకోవాలి. పరిష్కారం కోసం ఇప్పటి వరకు అలాంటి ఒక వ్యవస్థ లేకపోతే మనమే ఎస్టాబ్లిష్ చేయాలి. బెంగుళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పర్ట్ మహితా నాగరాజ్ అదే పని చేశారు.
ఫ్రెండ్ నుంచి ఫోన్
దేశం లాక్‌డౌన్‌లోకి వెళ్లడానికి కొద్ది ముందుగా ఓ రోజు మహితకు యూకేలో ఉన్న ఒక ఫ్రెండ్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. కోరమంగళలో ఉంటున్న ఆమె ఫ్రెండ్ తల్లిదండ్రులకు ఎదురైన ఇబ్బంది తెలిసింది. ఆ రోజు వాళ్లకు కావలసిన వస్తువులను తీసుకెళ్లి ఇచ్చారు మహిత. ఆ మరుసటి రోజే యూఎస్ నుంచి మరో ఫ్రెండ్ నుంచి ఫోన్. అప్పుడామెకు ‘కోర్ మాంగర్స్ ఇండియా’ ఆలోచన వచ్చింది. బెంగళూరుతోపాటు చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ, నొయిడా, ఉత్తరాఖండ్, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్, ఒడిషాల నుంచి దాదాపుగా ఐదు వందల మంది ఫేస్‌బుక్ మిత్రులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు.
బిడ్డ పాల కోసం పొద్దున్నే ఫోన్
‘‘ఓ రోజు ఉదయం ఆరున్నరకు ఒక చంటిబిడ్డ తల్లి నుంచి ఫేస్‌బుక్ పోస్ట్‌తోపాటు ఫోన్ కాల్ కూడా వచ్చింది. తన బిడ్డకు బేబీ ఫార్ములా స్టాక్ తనకు దగ్గరగా ఉన్న స్టోర్‌లో దొరకలేదని, బిడ్డతో పెద్ద మార్కెట్‌లకు వెళ్లడం కుదరడం లేదని చెప్పింది. ఆ చంటిబిడ్డ పాల కోసం పాల డబ్బా తీసుకెళ్లి ఇవ్వడంలో ఎంత సంతోషం కలిగిందో మాటల్లో చెప్పలేను. మా సర్వీస్ ఇలాంటి అవసరాల కోసమే మొదలు పెట్టాం. కానీ రెండు రోజుల కిందట ఒక పెద్దాయన వాళ్ల కాలనీలో ఉన్న ఏటీఎమ్ సెంటర్‌లో క్యాష్ స్టాక్ లేదని చెప్పాడు. ఆయనకు అకౌంట్‌లో డబ్బుంది. చేతిలో డబ్బులేదు. మరో కాలనీకి వెళ్లడం ఆయనకు కుదిరే పని కాదు. అప్పుడు నా దగ్గరకున్న క్యాష్ ఆయనకు ఇచ్చాను. ఆయన ఆన్‌లైన్‌లో నా అకౌంట్‌కు డబ్బు ట్రాన్స్‌ఫర్ చేశారు. ఒకరికి సహాయం చేయాలని ముందుకు వస్తే... చేయాల్సిన ఎన్నో కనిపిస్తాయి. ఒక అవసరం ఏర్పడినప్పుడే దానికి పరిష్కారం కోసం ఒక ఆలోచన వస్తుంది’’ అన్నారు మహిత. ఛ్చిట్ఛఝౌnజ్ఛటటజీnఛీజ్చీ ఫేస్‌బుక్ పేజీలో కానీ, caremongersindia వెబ్‌సైట్‌లో కానీ సంప్రదించవచ్చు. – మంజీర
Comments
Please login to add a commentAdd a comment