అధికారం ఉన్న వ్యక్తి విజనరీ అయితే సమస్యలు సున్నితంగా, సమర్థవంతంగా పరిష్కారమవుతాయి. ఇందుకు మేఘాలయ రాష్ట్రం, ఈస్ట్ గారోహిల్స్ జిల్లా డిప్యూటీ కమిషనర్ స్వప్నిల్ టెంబె మంచి ఉదాహరణ. షిల్లాంగ్‌కు సుమారు మూడు వందల కిలోమీటర్ల దూరాన ఉంది ఈస్ట్ గారో హిల్స్ జిల్లా, కోవిడ్ కోరల్లో చిక్కుకోకుండా జిల్లాను పరిరక్షించాలని స్వప్నిల్ కన్న కల నిజమైంది. అలాగే ఈ కష్టకాలంలో ఎవరూ పస్తులుండకూడదనే ఆయన సదుద్దేశం కూడా నెరవేరింది. ఆ ‘నెరవేరడం’ వెనుక స్వప్నిల్ కృషి ఉంది.
స్వప్నిల్ ఏం చేశాడంటే
కోవిడ్ కష్టకాలం మొదలైన తర్వాత జిల్లాలోకి వచ్చిన వారి వివరాలు సేకరించారు. విదేశాల నుంచి వచ్చిన వాళ్లెవరూ లేరు. కానీ దేశంలోని కోవిడ్ ప్రభావిత ప్రాంతాల నుంచి రెండువందల మంది వచ్చారు. వారందరినీ తక్షణమే క్వారంటైన్‌లో ఉంచి పరీక్షలు చేశారు. అందరికీ నెగెటివ్ వచ్చింది. క్వారంటైన్ కొనసాగిస్తూ, మిగిలిన ఎవరినీ ఇళ్ల నుంచి కదలనివ్వలేదు. మార్కెట్ నుంచి సరుకులు ఇళ్లకు చేర్చడానికి ఒక డెలివరీకి ఇరవై– ముప్పైరూపాయలు సర్వీస్ చార్జ్ ఇచ్చేటట్లు పాతిక మంది యువకులను సిద్ధం చేశారు. సెల్ఫ్‌హెల్ప్ గ్రూపు మహిళలకు మాస్కులు కుట్టడంలో శిక్షణ ఇప్పించారు. వాళ్లు కుట్టిన మాస్కులను ప్రభుత్వమే కొని ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తుంది. ఇలా లాక్‌డౌన్‌లో కూడా పని చేసుకుని డబ్బు సంపాదించుకునే దారి చూపించారు.
అభివృద్ధి ఆగలేదు... సంక్షేమమూ ఆగలేదు
ప్రపంచం స్తంభించిన పోయిన ఈ ఖాళీ సమయంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉపాధి హామీ పనులు అభివృద్ధి పనులు చేపట్టారు స్వప్నిల్. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకం ద్వారా అల్పాదాయ వర్గాలకు ఏప్రిల్, మే, జూన్‌నెలలకు గాను నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. బాగానే ఉంది... మరి వలస కార్మికుల పరిస్థితి ఏంటి? పొరుగునే ఉన్న అస్సాం నుంచి దాదాపుగా 250 మంది ఈస్ట్ గారో హిల్స్‌కి వచ్చారు. వాళ్లు రాష్ట్రంలోని ఏ సంక్షేమ పథకంలోకీ రారు. దీనికీ పరిష్కారాన్ని చూపించాడు స్వప్నిల్. వలస కార్మికులను సమీపంలోని ప్రభుత్వకార్యాలయాల్లో పేరు నమోదు చేసుకోవలసిందిగా సూచించారు.
డిస్ట్రిక్ట్ రిలీఫ్ ఫండ్, రాష్ట్ర విపత్తు సహాయ నిధి నుంచి నిధులు విడుదల చేసి, సెల్ఫ్ హెల్ప్ గ్రూపు మహిళల చేత వంట వండించి కడుపు నిండా అన్నం పెట్టి కార్మికుల ఆకలి తీరుస్తున్నారు. రెస్టారెంట్ నిర్వాహకులతో సమావేశమై, వలస కార్మికులు, రోజువారీ కూలీలకు బ్రేక్‌ఫాస్ట్ పెట్టడానికి వాళ్లను ఒప్పించారు స్వప్నిల్ టెంబె. మొత్తానికి కరోనా వైరస్‌ని తన జిల్లాలో అడుగుపెట్టనివ్వకుండా అడ్డుకున్నారాయన. ‘అధికారం ఉండేది దర్పాన్ని ప్రదర్శించడానికి కాదు. పరిపాలనను సజావుగా నడిపించడానికి, గ్రహశకలం ఊడిపడినట్లు హటాత్తుగా ముంచుకొచ్చిన విపత్తులను సమర్థంగా ఎదుర్కోవడానికి, ప్రజల సంక్షేమం కోసం పని చేయడానికి మాత్రమే’ అని నిరూపించిన అధికారి స్వప్నిల్ టెంబే.
Comments
Please login to add a commentAdd a comment