deputy commissioner
-
Manipur Violence: నిరసనలతో దద్దరిల్లిన ఇంఫాల్
ఇంఫాల్: మణిపూర్‌లో యువ జంట హత్యతో మొదలైన నిరసనలు గురువారం సైతం కొనసాగాయి. ఆందోళనకారులు ఇంఫాల్ వెస్ట్‌లోని డిప్యూటీ కమిషనర్ కార్యాలయంపై దాడికి దిగారు. అక్కడున్న రెండు కార్లకు నిప్పుపెట్టారు. సీఆర్పీఎఫ్ బలగాలు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. బుధవారం రాత్రి పలు చోట్ల నిరసనకారులు భద్రతా బలగాలపై దాడులకు దిగారు. దీంతో, బలగాలు టియర్ గ్యాస్‌ను ప్రయోగించాల్సి వచ్చిందని అధికారులు చెప్పారు. పోలీసు వాహనానికి నిప్పుపెట్టడంతోపాటు పోలీసు వద్ద ఉన్న ఆయుధాన్ని లాక్కెళ్లారు. థౌబల్ జిల్లా ఖొంగ్జమ్లో బీజేపీ కార్యాలయానికి దుండగులు నిప్పుపెట్టారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో అధికారులు ఇంఫాల్ ఈస్ట్, వెస్ట్ ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. గురువారం రాత్రి సీఎం బిరేన్ సింగ్ పూరీ్వకుల ఇంటిపై దాడికి జరిగిన ప్రయత్నాన్ని పోలీసులు వమ్ము చేశారు. మా వాళ్ల మృతదేహాలు ఎక్కడున్నాయో గుర్తించండి దుండగుల చేతుల్లో దారుణ హత్యకు గురైన తమ పిల్లల మృతదేహాల జాడ చెబితే అంత్యక్రియలు జరుపుకుంటామని వారి తల్లిదండ్రులు పోలీసులను కోరారు. మెయితీ వర్గానికి చెందిన యువతి, యువకుడు జూన్‌లో గుర్తు తెలియని దుండగుల చేతుల్లో హత్యకు గురి కావడం, వారి ఫొటోలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షం కావడం తెలిసిందే. ఈ హత్య ఘటన మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్తతలకు కారణమైంది. మెయితీల ఆచారం ప్రకారం..అంతిమ సంస్కారాలు జరపడానికి మృతులు ధరించిన దుస్తులకు సంబంధించిన చిన్న గుడ్డ ముక్కయినా ఉండాలి. అంత్యక్రియలు జరిపేవరకు వారి ఫొటోల వద్ద మృతుల తల్లులు అగరొత్తులు, క్యాండిల్ వెలిగిస్తూ రోజూ ఆహారం నివేదన చేస్తూ ఉండాలి. వారి లేని లోటు ఎవ్వరూ పూడ్చలేరు. కనీసం వారికి తగు గౌరవంతో అంత్యక్రియలు జరపాలనుకుంటున్నామని యువతి తండ్రి హిజామ్ కులజిత్ చెప్పారు. తాజాగా, సీబీఐ దర్యాప్తుతోనయినా తమ కోరిక నెరవేరుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. మణిపూర్‌కు శ్రీనగర్ ఎస్ఎస్పీ బల్వాల్ బదిలీ న్యూఢిల్లీ: ఉగ్ర సంబంధ కేసులను డీల్ చేయడంలో సమర్థుడిగా పేరున్న శ్రీనగర్ సీనియర్ ఎస్పీ రాకేశ్ బల్వాల్ను కేంద్రం మణిపూర్‌కు బదిలీ చేసింది. మణిపూర్‌లో మరోసారి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం, శాంతిభద్రతలు దారుణంగా దెబ్బతినడంతో కేంద్రం ఈ చర్య తీసుకుంది. 2012 ఐపీఎస్ అధికారి అయిన రాకేశ్ బల్వాల్ను డిసెంబర్ 2021లో అరుణాచల్‌ప్రదేశ్, గోవా, మిజోరం, కేంద్రపాలిత ప్రాంతాల కేడర్‌కు మార్చారు. తాజాగా ఆయన్ను మణిపూర్ కేడర్‌కు మారుస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన హోం వ్యవహారాల శాఖ ప్రతిపాదనకు నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. మణిపూర్‌లో ఆయన కొత్త బాధ్యతలను చేపడతారని తెలిపింది. జమ్మూలోని ఉధంపూర్‌కు చెందిన బల్వాల్ మణిపూర్‌లోని చురాచంద్‌పూర్‌కు 2017లో సీనియర్ ఎస్పీగా పనిచేసిన అనుభవం ఉంది. -
ఆ టైంలో బయట ఉన్నందుకు...దంపతులకు రూ. 3000లు జరిమానా!
ఒక జంట అర్ధరాత్రి బయట ఉన్నందుకు దారుణమైన చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. ఈ సమయంలో బయటకు రావడం చట్టాన్ని ఉల్లంఘించడమే అంటూ మూడు వేలు జరిమానా విధించారు పోలీసులు. కట్టేంత వరకు వారిని రకరకాలుగా వేధింపులకు గురిచేశారు. దీంతో సదరు బాధితుడు సహాయం కోసం కమిషనర్ ఆఫ్ పోలీసును ఆశ్రయించాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...కర్ణాటకలోని బెంగళూరులో ఒక జంట తమ స్నేహితుడు బర్త్‌డే కేక్ కటింగ్ ఈవెంట్‌కి హజరై తిరిగి ఇంటికి పయనమయఆయరు. ఆ క్రమంలోనే ఆ జంట తమ ఇంటికీ సమీపంలోని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంతలో వారికి సమీపంలో ఒక పెట్రోలింగ్ వ్యాన్ ఆగింది. పోలీస్ యూనిఫాంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు తమ ఐడీ కార్డులు చూపించమని ఆ జంటను డిమాండ్ చేశారు. దీంతో ఒక్కసారిగా ఆ జంట అవాక్కయ్యింది. సాధారణ రోజుల్లోనే కదా మేము బయటకు వచ్చింది, ఎందకని తమను ఇలా ఐడీ కార్డులు చూపించమని నిలదీస్తున్నారో వారికి ఒక్కసారిగా అర్థం కాదు. ఆ తర్వాత ఆ దంపతలు తమ ఐడీ కార్డులను పోలీసులకు చూపించారు. ఆ తదనంతరం పోలీసులు ఆ జంట వద్ద నుంచి ఫోన్లు లాక్కుని వ్యక్తిగత వివరాలను విచారించడం ప్రారంభించారు. అర్థరాత్రి సమయం కావడంతో వారు కూడా ఓపికగా సమాధానాలు చెప్పారు. ఇంతలో వారిలో ఒక పోలీసు ఆ జంట పేర్లను, ఆధార్ నెంబర్లను నమోదు చేయడం చూసి...మాకు ఎందుకు చలానా జారీ చేస్తున్నారని ప్రశ్నించాం. అందుకు పోలీసులు రాత్రి 11 గంటల తర్వాత రోడ్లపై తిరగడానికి అనుమతి లేదని చెప్పారు. అలాంటి నియమం లేదని తెలిసినా...ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పరిస్థితి తీవ్రతరం కాకూడదనే ఉద్దేశ్యంతో దీని గురించి తమకు తెలియదని మర్యాదపూర్వకంగా చెప్పడమే గాక క్షమాపణలు కూడా చెప్పింది ఆ జంట. అయినా పోలీసులు వారిని వదలకుండా వేధింపులకు గురి చేశారు. పైగా రూ. 3000లు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆ జంట ఎంతగా ప్రాథేయపడిన వినకపోగా అరెస్టులు చేస్తామని బెదిరించారు పోలీసులు. కాసేపటికి పోలీసుల్లో ఒకరూ ఆ జరిమానాలో కనీసం మొత్తం చెల్లించేస్తే వదిలిపెట్టేస్తారని చెప్పారు. ఆ తర్వాత తాను పేటీఎం ద్వారా చెల్లించేంత వరకు పోలీసులు తమను వదలలేదని బాధితుడు కార్తీక్ పత్రి అన్నారు. ఆఖరికి నా భార్య కన్నీరు పెడుతున్న దయాదాక్షిణ్యం చూపకుండా అత్యంత అమానుషంగా ప్రవర్తించారని వాపోయాడు కార్తీక్. ఈ వియషయాంలో తనకు సాయం చేయాల్సిందిగా బాధితుడు కార్తీక్ బెంగళూరు సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌కి ట్విట్టర్ వేదికగా తన ఆవేదనను వివరించాడు. ఈ విషయంపై డిప్యూటీ కమిషనర్ అనూప్ శెట్టి స్పందించి...ఈ విషయాన్ని మా దృష్టికి తీసుకువచ్చినందకు కార్తీక్‌కి ధన్యావాదాలు. కచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. (చదవండి: మొబైల్లో గేమ్ ఆడుతుండగా పేలుడు..తీవ్రంగా గాయపడ్డ చిన్నారి) -
దేవదాయశాఖ డీసీ, ఏసీల వ్యవహారంపై విచారణ
మహారాణిపేట (విశాఖ దక్షిణ)/సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ ఉప కమిషనర్ (డీసీ) ఈవీ పుష్పవర్ధన్‌పై సహాయ కమిషనర్ (ఏసీ) కె.శాంతి ఇసుకతో దాడి చేసిన వ్యవహారంపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్ ఆదేశాల మేరకు రాజమండ్రి దేవదాయ శాఖ ప్రాంతీయ కమిషనర్ (ఆర్జేసీ) సురేష్‌బాబు విచారణ జరిపారు. శుక్రవారం బురుజుపేట శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవాలయం కార్యనిర్వహణాధికారి కార్యాలయంలో ఆర్జేసీ విచారణ చేపట్టారు. డీసీ పుష్పవర్ధన్, ఏసీ శాంతిలతోపాటు ప్రత్యక్ష సాక్షులు దేవదాయ శాఖ పర్యవేక్షకులు బి.ప్రసాదరావు పట్నాయక్, రాజారావు, టర్నర్ సత్రం ఈవో అల్లు జగన్నాథరావులను విచారించారు. సీసీ ఫుటేజ్‌లను పరిశీలించారు. ఘటన జరిగినప్పుడున్న అధికారులు, సిబ్బంది నుంచి లిఖితపూర్వకంగా వివరణ తీసుకున్నారు. వివరణ కోరిన మహిళా కమిషన్ విశాఖ దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఆరోపణలపై విచారణ నివేదిక అందజేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అధికారులను కోరారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ఈ వివాదంపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని దేవదాయశాఖ కమిషనర్‌ను కోరారు. దేవదాయ శాఖ కార్యాలయాల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీ పని తీరుపై కూడా మహిళా కమిషన్ ఆరా తీసింది. -
దేవాదాయ శాఖ డిప్యూటీ కమీషనర్ పై ఇసుక వేసిన అసిస్టెంట్ కమీషనర్ శాంతి
-
డిప్యూటీ కమిషనర్‌పై ఇసుక చల్లిన అసిస్టెంట్ కమిషనర్
సాక్షి, విశాఖపట్నం : విశాఖ దేవాదాయ శాఖలో విభేదాలు తెరపైకి వస్తున్నాయి. దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ పుష్ప వర్థన్‌పై అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఇసుక చల్లారు. పుష్ప వర్ధన్ మాన్సస్, సింహాచలం భూముల అక్రమాలపై లోతుగా విచారణ చేస్తున్నారు. గురువారం ఆయన తన ఛాంబర్లో కూర్చుని ఉండగా శాంతి చేతిలో ఇసుకతో గదిలోకి వచ్చారు. కోపంగా ఆయనపై ఇసుకను చల్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డవటంతో దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్..అసిస్టెంట్ కమిషనర్ల విభేదాలు వెలుగులోకి వచ్చాయి. అయితే, తనను డిప్యూటీ కమిషనర్ మానసికంగా వేధిస్తున్నాడని, ఆ బాధ తట్టుకోలేక ఓ మహిళగా ఆయనపై ఇసుక చల్లి నిరసన తెలియజేశానని ఆమె తెలిపింది. కాగా, ఈ సంఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించనున్నారు. అసిస్టెంట్ కమిషనర్ శాంతిపై డిసిప్లీనరీ యాక్షన్స్ తీసుకోనున్నారు. -
జేజమ్మా .. జాయమ్మా
చరియలు విరిగి పడ్డాయి. కిందవున్న వాళ్లను తప్పించారు. వరదలు ముంచెత్తాయి. లోతట్టు వాళ్లను గట్టెక్కించారు. కోవిడ్ విరుచుకు పడింది. వైరస్ వ్యాప్తిని కట్టడి చేశారు. భూ వ్యాపారులు దిగబడ్డారు. రైతుల్ని కాపాడారు. ఇన్ని చేసిన కణ్మణి జాయ్.. ఎప్పుడూ వార్తల్లోకి రాలేదు. చిన్న స్మైలిచ్చి వెళ్లిపోయేవారు. జాయ్.. డిప్యూటీ కమీషనర్. వైరల్ అవుతున్న ఓ వీడియోలో.. ఇప్పుడామె.. జేజమ్మా.. జాయమ్మా..! ఒక మంచి ఫేక్ ప్రపంచానికి త్వరలోనే మీరు తలవంచవలసి రావచ్చు. మీరు గనుక అబ్బాయి లేదా పురుషుడు అయితే.. ‘మిర్చి’ సినిమాలో అచ్చు మీలా ఉండే ప్రభాస్ లాంటి వ్యక్తి భోజనం బల్లల ముందు వరుసగా కూర్చున్న పేదవాళ్లకు ఆప్యాయంగా అన్నం వడ్డిస్తూ ఉంటాడు. ‘పండగలా దిగివచ్చావు.. ప్రాణాలకు వెలుగిచ్చావు...’ అంటూ, ఇంకా మీరు చేసిన మంచి పనులన్నిటినీ కీర్తిస్తూ ఉన్న ఒక వీడియో అక్కడి తిరిగి, ఇక్కడ తిరిగి, లోకమంతా తిరిగి చివరికి మీ వాట్సాప్కే రావచ్చు! అదే మీరు అమ్మాయి లేదా మహిళ అయితే.. ‘అరుంథతి’ సినిమాలో అచ్చు మీలా ఉండే అనుష్క లాంటి మంచమ్మాయి భోజనానికి నేల మీద వరుసగా పరిచిన అరటి ఆకుల ముందు కూర్చున్న పేదలకు ఆప్యాయంగా అన్నం వడ్డిస్తూ ఉంటుంది. ‘కమ్ముకున్న చీకట్లోనా.. కమ్ముకొచ్చే వెలుతురమ్మా.. జేజమ్మా మాయమ్మా.. జేజమ్మా ఓయమ్మా..’ అంటూ, ఇంకా మీరు చేసిన మంచి పనులన్నిటినీ కీర్తిస్తూ ఉన్న ఒక వీడియో తిరిగి తిరిగి, చివరికి మీ వాట్సాప్కే రావచ్చు. ఆ వీడియోలో ఉన్నది మీరు కాదని మీకు తెలుస్తూనే ఉంటుంది. అయితే వీడియోలో మీలాంటి మనిషే చేసిన మంచి పనులు మాత్రం అచ్చంగా మీరు చేసినవే అయి ఉంటాయి. అప్పుడు మీకు సంతోషమే కదా. అయితే ‘అందులో ఉన్నది నేను కాదు’ అని లోకానికి చెప్పాలని కూడా అనిపిస్తుంది. ఎవరికి చెబుతారు? యానిస్ కణ్మణి జాయ్ జిల్లా డిప్యూటీ కమిషనర్ కాబట్టి, తన వాట్సాప్‌కు ఫార్వర్డ్ అయిన వీడియోలో తనలా ఉన్న యువతి, తను ఒకటి కాదని చెప్పేందుకు ఒక ప్రకటన విడుదల చేయగలిగారు. మనుషుల్ని మంచి పనులకు ఇన్స్పైర్ చేసే ఆ అబద్ధపు సోషల్ మీడియా వీడియో యానిస్ కణ్మణి జాయ్ పేరు మీద ఇప్పుడు నెట్లో తిరుగుతోంది. వీడియోలోని యువతి ఏదో ఆఫీస్ లోపలికి నడుచుకుంటూ వస్తుండగా సూట్లు వేసుకుని ఉన్న సిబ్బంది అంతా లేచి నిలబడి ఆమెకు నమస్కరిస్తుంటారు. వారిలో కొందరు వంగి ఆమె కాళ్లకు దండం పెడుతుంటారు. ఆమె చిరునవ్వుతో ఇబ్బందిగా పక్కకు తప్పుకుని వెళుతుంటుంది... ఆ వీడియోకు అటాచ్ చేసిన పోస్టులో.. ‘‘ఒకప్పుడు ఈమె త్రివేండ్రం మెడికల్ కాలేజ్‌లో నర్సు. ఐ.ఎస్.ఎస్. అయ్యి, కొడగు జిల్లా కలెక్టరుగా వెళ్లారు. నర్సుగా తనకు ఉన్న అనుభవంతో కొడగు జిల్లాలో కోవిడ్ వ్యాప్తిని విజయవంతంగా కట్టడి చేశారు. ఈమె పేరు యానిస్ కణ్మణి జాయ్. జిల్లాలో కోవిడ్ వ్యాప్తి చెందకుండా ఈమె చూపిన దీక్షాదక్షతలకు, అంకిత భావానికి జిల్లా ప్రజలు కరోనా వారియర్ గా పట్టం కడుతున్నారు. పాదాభివందనాలు చేస్తున్నారు’’ అని ఉంటుంది. సోమవారం నాటికి ఆ వీడియో నేరుగా యానిస్ కణ్మణికే ఫార్వార్డ్ అయింది! వీడియోను చూసి ఆమె నవ్వుకున్నారు. ‘‘నిన్నటి నుంచీ నాకు అభినందనలు తెలుపుతూ మెజేస్‌లు వస్తున్నాయి. అయితే అందులో ఉన్నది నేను కాదు’’ అని మర్నాడే ఒక ప్రకటన విడుదల చేశారు. వీడియోలో ఉన్నది యానీస్ కణ్మణి కాకపోయినా, కర్ణాటక కొడగు జిల్లాలో ప్రభుత్వం కోవిడ్‌ను నియంత్రించ గలిగిందంటే.. అది కణ్మణి వల్లనే. వైరల్ అవుతున్న ఆ వీడియోలో కనిపిస్తున్న యువతి తప్ప, తక్కిన వివరాలన్నీ వాస్తవమైనవే. కణ్మణి నర్సుగా చేశారు. ఐ.ఎ.ఎస్. చదివారు. కొడగు జిల్లా డిప్యూటీ కమిషనర్‌గా చేస్తున్నారు. కరోనా ఆరంభం అయిన నాటి నుంచీ అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. అందరి మన్ననలు అందుకుంటున్నారు. అనేక సంస్థలు ఆమెకు సన్మానం చేయడానికి ముందుకు వచ్చినా ఆమె నవ్వుతూ ‘‘నా డ్యూటీ నేను చేస్తున్నాను. అంతే’’ అని నిరాకరిస్తుంటారు. కొడగు డిప్యూటీ కమిషనర్‌గా యానిస్ కణ్మణి జాయ్‌కి (35) కి ఇది తొలి పోస్టింగ్. 2009లో త్రివేండ్రంలో నర్సింగ్ కోర్సు చదివారు. 2012లో సివిల్స్ రాశారు. ఆలిండియాలో 65 వ ర్యాంకు సంపాదించారు. కొడగు పోస్టింగ్‌కి ముందు బీదర్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్‌గా ఉన్నారు. కర్ణాటక భవన్లో, తుమకూరు జిల్లా పరిషత్‌లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా చేశారు. గత ఏడాది ఫిబ్రవరిలో కొడగు డీసీగా వచ్చారు. మరుసటి నెలలోనే దేశంలోకి కోవిడ్ ప్రవేశించింది. కేంద్ర ప్రభుత్వం కంటే త్వరగా స్పందించారు కణ్మణి జాయ్. మార్చి 25 లాక్‌డౌన్‌కు ముందే ఆమె తన ప్రత్యేక అధికారాలతో కొడగులోని పర్యాటక స్థలాలను మూసి వేశారు. మార్చి నుంచి ఇప్పటికి వరకు కొండ ప్రాంతమైన కొడగు జిల్లాలో నమోదైన కేసులు 4720. మరణించినవారు 61 మంది. ప్రస్తుతం 306 కేసులు ఉన్నాయి. ఇటీవల అక్కడ కావేరీ తీర్థోత్సవం, మడికెరి దసరా వేడుకలు జరిగాయి. ప్రజలు గుమికూడకుండా, దూరం పాటించేలా కణ్మణి జాయ్ గట్టి చర్యలు తీసుకున్నారు. కేసులేమీ నమోదు కాలేదు. ‘‘టీమ్ అంతా కష్టపడి పనిచేస్తేనే ఇది సాధ్యమయింది. అలాగే వైద్య ఆరోగ్య శాఖలు సహకరించాయి’’ అంటారు కణ్మణి జాయ్. కోవిద్ ఒక్కటే కాదు. డిప్యూటీ కమిషనర్‌గా ఈ ఏడాదిన్నరలో అనేక సంక్షోభాల్లో జిల్లాను కంటికి రెప్పలా చూసుకున్నారు కణ్మణి. వరదలు వచ్చాయి. కొండ చరియలు విరిగి పడ్డాయి. ఆ ప్రమాదాల నుంచి ప్రజల్ని తప్పించారు. పంట భూములు రియల్ ఎస్టేట్ వాళ్ల చేతుల్లోకి వెళ్లకుండా కూడా అడ్డుకున్నారు. ప్రజలకు ఆమె మీద ఎంత అభిమానం ఉందో, రియల్టర్లకు అంత కోపం ఉంది. కోపాలకు భయపడే వ్యక్తి కారు కణ్మణి. కోవిడ్‌నే అదుపులో పెట్టిన ఆఫీసర్‌కి లాండ్ మాఫియా ఒక లెక్కా?! -
అస్సాం ప్రజల్లో తెలుగు‘కీర్తి’
ఆమె తల్లిదండ్రులకు హైదరాబాద్‌లో కరోనా వచ్చింది.అయినా అస్సాంలో విధులను వదులుకోకుండా ప్రజల్లోనే ఉంది కీర్తి.ఐదారు రోజుల క్రితం వివాహం చేసుకుంది.అయినా మరుసటి రోజే కోవిడ్ స్పెషల్ వార్డు నిర్మాణ పనుల్లో నిమగ్నమైంది కీర్తి.స్త్రీల రక్తహీనతకు విరుగుడుగా ఉసిరి మురబ్బాను పంచి జనం మెచ్చుకోలు పొందింది కీర్తి.ఎన్నికలలో స్త్రీల భాగస్వామ్యాన్ని ప్రచారం చేసి రాష్ట్రపతి ప్రణబ్ ప్రశంసలు పొందింది కీర్తి.2013 బ్యాచ్ తెలంగాణ ఐ.ఏ.ఎస్ కీర్తి జెల్లి. ఇవాళ అస్సాం ప్రజల్లో స్త్రీ సామర్థ్యాన్ని,తెలుగువారి సామర్థ్యాన్ని నిరూపించి అభినందనలు అందుకుంటోంది ‘కీర్తి’. మొన్నటి సెప్టెంబర్ మొదటివారంలో అస్సాంలోని ‘కచార్’ జిల్లా హెడ్‌క్వార్టర్స్ అయిన ‘సిల్చార్’లో కొంత మంది ప్రభుత్వ ముఖ్యాధికారులకు ఆహ్వానం అందింది. ఆ ఆహ్వానం పంపింది కచార్ జిల్లా డిప్యూటి కమిషనర్ కీర్తి జెల్లి. ‘మా ఇంట్లో సెప్టెంబర్ 10న వినాయకపూజ ఉంది. రండి’ అని ఆ ఆహ్వానం సారాంశం. జిల్లాలోని ముఖ్యాధికారులు ఆ రోజు కీర్తి జెల్లి బంగ్లాకు చేరుకున్నారు. అక్కడకు వెళ్లాక తమలాగే మొత్తం 25 మంది అతిథులు కనిపించారు. తాము వచ్చింది కేవలం వినాయక పూజకు మాత్రమే కాదనీ కీర్తి జెల్లి వివాహానికి అని అక్కడకు వెళ్లాకగాని వారికి తెలియలేదు. తమ జిల్లా ముఖ్యాధికారి అంత నిరాడంబరంగా పెళ్లి చేసుకోవడం చూసి వారు ఆశ్చర్యపోయారు. ఆనందించారు. వరుడు ఆదిత్యా శశికాంత్ వ్యాపారవేత్త. పూణె నుంచి వచ్చి క్వారంటైన్ నియమాలు పాటించాకే ఈ పెళ్లి జరిగింది. వీరిద్దరి పెళ్లి ముందే నిశ్చయమైనా లాక్డౌన్ వల్ల పోస్ట్‌పోన్ అయ్యింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో విధులను వదులుకునే పరిస్థితి లేదు కనుక తన పని చోటులోనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని కీర్తి తెలిపింది. దాంతో కేవలం కొద్దిమంది సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. ‘జూమ్’ ద్వారా మరో 800 మంది బంధుమిత్రులు వీక్షించారు. తల్లిదండ్రులు కరోనా నుంచి కోలుకుంటున్నారు కనుక కేవలం చెల్లెలు ఐశ్వర్య మాత్రం అమ్మాయి తరఫున హాజరయ్యింది. పెళ్లికి కీర్తి ప్రత్యేకంగా సెలవు తీసుకోలేదు. పెళ్లయిన మరుసటి రోజే విధులకు హాజరయ్యి ఎప్పటిలాగే విధుల పట్ల తన అంకితభావాన్ని నిరూపించుకుంది. వరంగల్ అమ్మాయి కీర్తి జెల్లి స్వస్థలం వరంగల్. తండ్రి జెల్లి కనకయ్య న్యాయవాది. తల్లి వసంత గృహిణి. 2011లో బి.టెక్ పూర్తి చేసిన కీర్తి తన చిరకాల కోరిక అయిన ఐ.ఏ.ఎస్ ఎంపికను నెరవేర్చుకోవడానికి కోచింగ్ కోసం ఢిల్లీకి వెళ్లింది. ఆమె కుటుంబంలో, బంధువుల్లో ఎవరూ ఐ.ఏ.ఎస్‌కు వెళ్లలేదు. పైగా చదువు పూర్తయిన వెంటనే పెళ్లి చేయడం గురించి బంధువుల ఆలోచనలు ఉండేవి. కాని కీర్తి తండ్రి కనకయ్యకు కుమార్తెను ఐ.ఏ.ఎస్ చేయాలని పట్టుదల. చిన్నప్పటి నుంచి ఆయన ఇందిరా గాంధీ వంటి ధీర మహిళలను ఉదాహరణగా చూపిస్తూ కీర్తిని పెంచారు. ఐ.ఏ.ఎస్ కోచింగ్‌లో చేర్పించారు. రెండేళ్లు కష్టపడిన కీర్తి 2013 సివిల్స్‌లో జాతీయస్థాయిలో 89వ ర్యాంకూ, రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకూ సాధించింది. అస్సాంలో దూకుడు ఐ.ఏ.ఎస్ ట్రయినింగ్ పూర్తయ్యాక కీర్తికి అస్సాంలో వివిధ బాధ్యతల్లో పని చేసే అవకాశం లభించింది. జోర్హట్ జిల్లాలోని తితబార్ ప్రాంతానికి సబ్ డివిజనల్ ఆఫీసర్‌గా కీర్తి పని చేస్తున్నప్పుడు 2016 అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చాయి. సాధారణంగా అస్సాం ప్రజలు ఎన్నికల పట్ల నిరాసక్తంగా ఉంటారు. అది గమనించిన కీర్తి తన నియోజకవర్గంలో ఓటింగ్ శాతం పెంచడానికి, ముఖ్యంగా మహిళా ఓటర్ల భాగస్వామ్యం పెరగడానికి ‘భోని’ (చిన్నచెల్లెలు) అనే ‘ప్రచారకర్త బొమ్మ’ (మస్కట్)ను తయారు చేసి అన్నిచోట్ల ఆ బొమ్మ ద్వారా ప్రజలను ఉత్సాహపరిచింది. అస్సాం సంస్కృతిలో ‘చిన్న చెల్లెలు’ అంటే మురిపం ఎక్కువ. అందుకని ఆ ప్రచారం పని చేసింది. ఇది ఎలక్షన్ కమిషన్‌కు నచ్చింది. దాంతో కీర్తికి నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ‘బెస్ట్ ఎలక్టొరల్ ప్రాక్టిసెస్ అవార్డ్’ ఇప్పించింది. రక్తహీనతకు ఉసిరి మురబ్బా 2019లో ‘హైలాకండి’ జిల్లాలో డెప్యూటి కమిషనర్‌గా కీర్తి బాధ్యతలు తీసుకున్నప్పుడు అక్కడి పరిస్థితులు ఆమెకు సవాలుగా మారాయి. అక్కడ 47 శాతం మహిళలు, ముఖ్యంగా టీ ఎస్టేట్స్‌లో పని చేసే కార్మిక మహిళలు రక్తహీనతతో బాధ పడుతున్నారు. ఇక 33 శాతం ఐదేళ్లలోపు పిల్లలు తక్కువ బరువుతో ఉన్నారు. పౌష్టికాహారలోపం విపరీతంగా ఉంది. స్త్రీలకు రక్తహీనత పోవడానికి అక్కడ విస్తృతంగా దొరికే కొండ ఉసిరి నుంచి ‘ఉసిరి మురబ్బా’ (బెల్లంపాకంలో నాన్చి ఎండబెట్టిన ఉసిరి ముక్కలు) తయారు చేసి పంచడంతో గొప్ప ఫలితాలు వచ్చాయి. ఇక అంగన్వాడి కేంద్రాలలో పిల్లలకు అందించే ఆహారంతో పాటు వారంలో ఒకరోజు తల్లులు తమ ఇంటి తిండి క్యారేజీ కట్టి పిల్లలతో పంపే ఏర్పాటు చేసింది కీర్తి. అంగన్వాడీ కేంద్రాలలో ‘డిబ్బీ ఆదాన్ ప్రధాన్’ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించింది. అంటే పిల్లలు ఆ రోజు తమ బాక్స్ వేరొకరికి ఇచ్చి వేరొకరి బాక్స్ తాము తింటారు. దాని వల్ల ఇతర రకాల ఆహారం తిని వారి పౌష్టికాహారం లోపం నుంచి బయట పడతారు. ఇది కూడా మంచి ఫలితాలు ఇచ్చి కీర్తికి కీర్తి తెచ్చి పెట్టింది. కోవిడ్ విధులలో 2020 మే నెల నుంచి కచార్ జిల్లా డిప్యూటి కమిషనర్‌గా ఇటు పాలనా విధులు, ఇటు కోవిడ్ నియంత్రణ కోసం పోరాటం చేస్తోంది కీర్తి. సిల్చార్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో 16 పడకల ఐ.సి.యు కోవిడ్ పేషెంట్స్‌కు సరిపోవడం లేదు కనుక కీర్తి ఆధ్వర్యంలో ఆఘమేఘాల మీద అక్కడ కొత్త ఐ.సి.యు యూనిట్ నిర్మాణం జరుగుతోంది. పెళ్లి చేసుకున్న మరుసటి రోజున కీర్తి ఈ నిర్మాణ పనులను పర్యవేక్షించడానికి హాజరవడం చూస్తే ఆమె పని స్వభావం అర్థమవుతుంది. కీర్తి ప్రచారానికి, ఇంటర్య్వూలకు దూరంగా ఉంటుంది. తన గురించి తాను కాకుండా తన పని మాట్లాడాలని ఆమె విశ్వాసం. అది ఎలాగూ జరుగుతోంది. ప్రజలూ, పత్రికలు ఆమెను మెచ్చుకోకుండా ఎందుకు ఉంటాయి? -
పెళ్లికి కూడా సెలవు తీసుకోని ఐఏఎస్
గువాహటి: కోవిడ్–19 విధుల్లో బిజీగా ఉన్న ఓ ఐఏఎస్ అధికారిణి వ్యక్తిగత జీవితం కంటే విధి నిర్వహణనే ఆమె మిన్నగా భావించారు. అందుకే, ఆమె జీవితంలో అత్యంత ముఖ్యమైన తన వివాహానికి కూడా సెలవు తీసుకోలేదు. దీంతో వరుడే వచ్చి పెళ్లి చేసుకున్నాడు. అస్సాంలో జరిగిన ఈ ఘటనలో వధువుది హైదరాబాద్ కాగా, వరుడు పుణే వాసి. హైదరాబాద్‌కు చెందిన కీర్తి జల్లి 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం అస్సాం లోని చచర్ జిల్లాలో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు పుణేకు చెందిన వ్యాపారవేత్త ఆదిత్య శశికాంత్‌తో వివాహం కుదిరింది. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న చచర్ జిల్లా హైలకండిలో ప్రస్తుతం రోజుకు 100 వరకు కోవిడ్ కేసులు బయటపడుతున్నాయి. ఇలాంటి కీలక సమయంలో విధులను పక్కనబెట్టి, పెళ్లి కోసం హైదరాబాద్ వెళ్లడం ఆమెకు ఇష్టం లేదు. వరుడు, అతని కుటుంబం కూడా ఆమె నిర్ణయాన్ని ప్రశంసించారు. వరుడు తన బంధువులతో కలిసి పెళ్లికి ముందే సిల్చార్ వెళ్లాడు. కోవిడ్–19 ప్రొటోకాల్స్ ప్రకారం అక్కడ క్వారంటైన్లో గడిపాకే వివాహ తంతు జరిపించారు. కీర్తి అధికారిక బంగ్లాలో బుధవారం ఎలాంటి హంగూ ఆర్భాటాలూ లేకుండా కేవలం కర్ణాటక సంగీతం వినిపిస్తుండగా వరుడు తాళికట్టాడు. కేవలం 20 మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. ఈ వేడుకను జూమ్ వీడియో యాప్ ద్వారా 800 మంది చూశా రు. ‘హైదరాబాద్‌లో ఉన్న మా అమ్మానాన్నలకు కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. దీంతో నా సోదరి మాత్రమే పెళ్లికి హాజరైంది’అని కీర్తి తెలిపారు. మంగళ, గురువారాల్లో కూడా కీర్తి అధికారిగా తన విధుల్లో పాల్గొన్నారు. పెళ్లి రోజు బుధవారం కూడా ఫోన్ ద్వారా బాధ్యతలు కొనసాగించారు. -
కోవిడ్-19 : బీఎంసీ డిప్యూటీ కమిషనర్ మృతి
ముంబై : కోవిడ్-19పై పోరులో చురుకుగా వ్యవహరించిన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ శిరీష్ దీక్షిత్ (54) మహమ్మారి బారినపడి మరణించారు. మూడు రోజుల కిందట ఆయనకు కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఎలాంటి వ్యాధి లక్షణాలు లేకపోవడంతో ఇంటివద్దే దీక్షిత్ చికిత్స పొందుతున్నారు. ఇంతలోనే తీవ్ర అస్వస్ధతకు గురవడంతో కుటుంబ సభ్యులు వైద్యులకు సమాచారం అందించారు. వైద్య బృందం ముంబైలోని మహీం ప్రాంతంలోని ఆయన ఇంటికి చేరుకునేలోగానే బీఎంసీ అధికారి మరణించారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారని వారు ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నారని అధికారులు తెలిపారు. ఎన్ఎస్సీఐ డోమ్, రేస్ కోర్స్‌ల్లో కోవిడ్-19 మౌలిక వసతుల ఏర్పాటులో దీక్షిత్ కీలక పాత్ర పోషించారు. 1987లో ఆయన సబ్ ఇంజనీర్‌గా బీఎంసీలో చేరారు. చదవండి : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు కరోనా నెగెటివ్ -
హద్దు దాటనివ్వలేదు
అధికారం ఉన్న వ్యక్తి విజనరీ అయితే సమస్యలు సున్నితంగా, సమర్థవంతంగా పరిష్కారమవుతాయి. ఇందుకు మేఘాలయ రాష్ట్రం, ఈస్ట్ గారోహిల్స్ జిల్లా డిప్యూటీ కమిషనర్ స్వప్నిల్ టెంబె మంచి ఉదాహరణ. షిల్లాంగ్‌కు సుమారు మూడు వందల కిలోమీటర్ల దూరాన ఉంది ఈస్ట్ గారో హిల్స్ జిల్లా, కోవిడ్ కోరల్లో చిక్కుకోకుండా జిల్లాను పరిరక్షించాలని స్వప్నిల్ కన్న కల నిజమైంది. అలాగే ఈ కష్టకాలంలో ఎవరూ పస్తులుండకూడదనే ఆయన సదుద్దేశం కూడా నెరవేరింది. ఆ ‘నెరవేరడం’ వెనుక స్వప్నిల్ కృషి ఉంది. స్వప్నిల్ ఏం చేశాడంటే కోవిడ్ కష్టకాలం మొదలైన తర్వాత జిల్లాలోకి వచ్చిన వారి వివరాలు సేకరించారు. విదేశాల నుంచి వచ్చిన వాళ్లెవరూ లేరు. కానీ దేశంలోని కోవిడ్ ప్రభావిత ప్రాంతాల నుంచి రెండువందల మంది వచ్చారు. వారందరినీ తక్షణమే క్వారంటైన్లో ఉంచి పరీక్షలు చేశారు. అందరికీ నెగెటివ్ వచ్చింది. క్వారంటైన్ కొనసాగిస్తూ, మిగిలిన ఎవరినీ ఇళ్ల నుంచి కదలనివ్వలేదు. మార్కెట్ నుంచి సరుకులు ఇళ్లకు చేర్చడానికి ఒక డెలివరీకి ఇరవై– ముప్పైరూపాయలు సర్వీస్ చార్జ్ ఇచ్చేటట్లు పాతిక మంది యువకులను సిద్ధం చేశారు. సెల్ఫ్‌హెల్ప్ గ్రూపు మహిళలకు మాస్కులు కుట్టడంలో శిక్షణ ఇప్పించారు. వాళ్లు కుట్టిన మాస్కులను ప్రభుత్వమే కొని ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తుంది. ఇలా లాక్డౌన్లో కూడా పని చేసుకుని డబ్బు సంపాదించుకునే దారి చూపించారు. అభివృద్ధి ఆగలేదు... సంక్షేమమూ ఆగలేదు ప్రపంచం స్తంభించిన పోయిన ఈ ఖాళీ సమయంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉపాధి హామీ పనులు అభివృద్ధి పనులు చేపట్టారు స్వప్నిల్. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకం ద్వారా అల్పాదాయ వర్గాలకు ఏప్రిల్, మే, జూన్‌నెలలకు గాను నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. బాగానే ఉంది... మరి వలస కార్మికుల పరిస్థితి ఏంటి? పొరుగునే ఉన్న అస్సాం నుంచి దాదాపుగా 250 మంది ఈస్ట్ గారో హిల్స్‌కి వచ్చారు. వాళ్లు రాష్ట్రంలోని ఏ సంక్షేమ పథకంలోకీ రారు. దీనికీ పరిష్కారాన్ని చూపించాడు స్వప్నిల్. వలస కార్మికులను సమీపంలోని ప్రభుత్వకార్యాలయాల్లో పేరు నమోదు చేసుకోవలసిందిగా సూచించారు. డిస్ట్రిక్ట్ రిలీఫ్ ఫండ్, రాష్ట్ర విపత్తు సహాయ నిధి నుంచి నిధులు విడుదల చేసి, సెల్ఫ్ హెల్ప్ గ్రూపు మహిళల చేత వంట వండించి కడుపు నిండా అన్నం పెట్టి కార్మికుల ఆకలి తీరుస్తున్నారు. రెస్టారెంట్ నిర్వాహకులతో సమావేశమై, వలస కార్మికులు, రోజువారీ కూలీలకు బ్రేక్‌ఫాస్ట్ పెట్టడానికి వాళ్లను ఒప్పించారు స్వప్నిల్ టెంబె. మొత్తానికి కరోనా వైరస్‌ని తన జిల్లాలో అడుగుపెట్టనివ్వకుండా అడ్డుకున్నారాయన. ‘అధికారం ఉండేది దర్పాన్ని ప్రదర్శించడానికి కాదు. పరిపాలనను సజావుగా నడిపించడానికి, గ్రహశకలం ఊడిపడినట్లు హటాత్తుగా ముంచుకొచ్చిన విపత్తులను సమర్థంగా ఎదుర్కోవడానికి, ప్రజల సంక్షేమం కోసం పని చేయడానికి మాత్రమే’ అని నిరూపించిన అధికారి స్వప్నిల్ టెంబే. -
మానండి.. మారండి
‘అందరూ బాగుండాలి... ఆ అందరిలో నేనూ ఉండాలి’ అనుకుంటే... అది ఒక మంచి ఆలోచన. ‘ఒకరితో నాకు పనేంటి.. నేను మాత్రమే బాగుండాలి’ అనుకుంటే... అది స్వార్థానికి పరాకాష్ట. ‘నేను బాగున్నాను.. నాతోపాటు సమాజం కూడా బాగుండాలి’ అనుకుంటే... అది ఉదాత్తమైన భావన, ఒక మంచికి పునాది. అలాంటి పునాది రాళ్లను వేసుకుంటూ వస్తున్నారు డిప్యూటీ కమీషనర్ నాగలక్ష్మి. తండ్రి తాగుడికి బానిసై ప్రాణాల మీదికి తెచ్చుకోవడంతో.. ఆయనపై ఉన్న ప్రేమ వల్ల.. సారా తయారీని అంతమొందించే బాధ్యతను తన ఉద్యోగ బాధ్యతలలో ఒక భాగంగా చేసుకున్నారు. ‘‘మా అమ్మ పడిన కష్టాలు మరే మహిళకూ రాకూడదనుకున్నాను. అందుకే సారాకు వ్యతిరేకంగా గ్రామస్థులను చైతన్యవంతం చేస్తున్నాను’’ అన్నారు నాగలక్ష్మి. తండా నాగలక్ష్మి రమావత్‌ది అనంతపురం జిల్లా పెనుగొండ మండలం, అడదాకుల పల్లి తండా. తండ్రి రామానాయక్ ఒక ఎన్జీవోలో వాచ్‌మన్‌గా చేసేవారు. ఆ ఉద్యోగంలో ఆయన బాగా చదువుకున్న వాళ్లను, పెద్ద పెద్ద హోదాల్లో ఉన్న వాళ్లను దగ్గరగా చూస్తుండటంతో వారి స్ఫూర్తితో తన కూతుళ్లకు కూడా పెద్ద ఉద్యోగాల్లో చేరి జిల్లా అధికారులు కావాలని చెప్పేవారు. పిల్లల్ని బాగా చదివించడానికి కుటుంబాన్ని అనంతపురం పట్టణానికి మార్చారాయన. కూతుళ్లు ముగ్గురినీ స్కూళ్లలో చేర్చారు. రామానాయక్ నిరక్షరాస్యుడు. అయినా సరే రోజూ తెల్లవారి ఐదు గంటలకు వెళ్లి పేపర్ కొనుక్కొచ్చేవాడు. కూతుళ్లు చదువుతుంటే వినేవాడు. సామాజిక, రాజకీయ పరిణామాలను సమగ్రంగా తెలుసుకునేవాడాయన. ఆయనలో ఎంత విజ్ఞత ఉన్నప్పటికీ మద్యం విషయంలో విచక్షణ లేకపోవడంతో తమ కుటుంబం తీవ్రమైన కష్టాలపాలయినట్లు చెప్పారు నాగలక్ష్మి. ఆయన తాగి తాగి యాభై ఏళ్ల లోపలే చనిపోయారు. శ్రీకాకుళంలో కొత్త ప్రపంచం శ్రీకాకుళం జిల్లాలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా ఉద్యోగంలో చేరడం నా జీవితాన్ని కొత్త మలుపు తిప్పిందనే చెప్పాలి. అక్కడ మారుమూల ప్రాంతాలకు రోడ్డు కూడా ఉండదు. అక్కడి వాళ్లకు నాగరిక సమాజంతో సంబంధాలు పెద్దగా ఉండవు. అక్కడి గిరిజనులకు బియ్యం కూడా ఉండవు. నూకల్లో తెల్ల గుళికల్లాంటి ఉండలను వేసి చిక్కటి గంజిలా కాచి, ఆ గంజిని పులవబెట్టి తాగుతారు. ఆ గంజి తాగితే రోజంతా మత్తుగా పడుంటారు. అందుకని అక్కడ ప్రతి శనివారం ఒక్కో గ్రామానికి వెళ్లి కుటుంబానికి ఐదు కేజీల బియ్యం, లీటరు నూనె, కేజీ చక్కెర పంపిణీ చేయడం మొదలుపెట్టాం. కర్నూలు జిల్లాలో పనిచేసిన రోజుల్లో పత్తికొండలో 24 తండాల్లో సారా వ్యతిరేక చైతన్యం తెచ్చేందుకు ప్రయత్నించాను. కొన్ని గ్రామాల్లో అందరి చేత ప్రతిజ్ఞ చేయించగలిగాం. మా వాళ్లు సారా బట్టీలను వెతికి పట్టుకుని పగలకొట్టేవాళ్లు. మరో టీమ్ గ్రామస్థులను సమావేశ పరిచి సారా తాగడంతో వచ్చే అనారోగ్యాలను వివరించేది. మా టీమ్‌లో డాక్టర్‌ను కూడా తీసుకెళ్లి లివర్, కిడ్నీ పాడయిన వాళ్లను చూపించి మరీ వివరించేవాళ్లం. మేము అధికారాన్ని ప్రదర్శిస్తే వాళ్లు కూడా మొండిగా ఉండేవాళ్లేమో. నేను తండావాసులతో మా బంజారా భాషలో మాట్లాడతాను. మా నాన్న... సారాకు బానిసయ్యి ప్రాణాలు కోల్పోయిన సంగతి వాళ్లకు చెబుతాను. మా అమ్మ, ఆమె అక్కచెల్లెళ్లు చిన్న వయసులోనే భర్తను కోల్పోయారు. వయసులో ఉన్న మహిళకు భర్త తోడు లేకపోతే సమాజంలో ఎదురయ్యే వేధింపులను దగ్గరగా చూసినదాన్ని కావడంతో ఆ కష్టాలు మరే మహిళకూ రాకూడదని వాళ్లను వేడుకుంటాను. ఒక్క సమావేశంలోనే పూర్తిగా మారరు, ఆలోచనలో పడతారంతే. ఐదారుసార్లు కలిసిన తర్వాత ‘సారా తాగము– సారా కాయము’ అని ప్రతిజ్ఞ చేయిస్తాం. కౌన్సెలింగ్‌లతో దారికి రాని వాళ్ల విషయంలో స్ట్రిక్టుగానే ఉంటాం. సారా తయారు చేసేవాళ్లతోపాటు సారా తయారీకి భూమి ఇచ్చిన వాళ్ల మీద కూడా కేసులు పెడుతున్నాం. నాయకుల నుంచి ఫోన్ కాల్ సారా బట్టీలను, తయారీని చూస్తే కడుపులో తిప్పినట్లవుతుంది. బెల్లం ఊటను మరిగించేటప్పుడు ఇంకా ఏంటేంటో పదార్థాలు వేస్తుంటారు. వాటితోపాటు కుంకుడుకాయలు, ఆకులు, పుల్లలు, పాములు, తేళ్లు, జెర్రులు, బల్లులు కూడా కలిసిపోతుంటాయి. వాటి విషం కూడా సారాలోకి దిగుతుంది. ప్రాణాల మీదకు వచ్చేది ఇలాంటి సారా తాగినప్పుడే. చిత్తూరు కార్వేటి నగరం సమీపంలో కొన్ని నాటుసారా బట్టీలున్నాయి. అక్కడి నుంచి తమిళనాడుకి నంబర్ ప్లేట్ లేని లారీలలో దొంగ సారా రవాణా అవుతుంటుంది. సారా రవాణా గురించిన సమాచారంతో ఆ ప్రదేశానికి వెళ్తుంటే దారిలో ఉండగానే ఫోన్ కాల్, వెనక్కి వచ్చేయమని ఆదేశం వచ్చేది. గ్రామస్థులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న డిప్యూటీ కమిషనర్ నాగలక్ష్మి నాటుసారా బట్టీలపై దాడులు చేయడం, సారా తయారీని అరికట్టడం, నంబర్ లేని వాహనాన్ని వెంటనే సీజ్ చేయడం మా డ్యూటీ. మా డ్యూటీని మమ్మల్ని చేయనివ్వకపోతే మమ్మల్ని ఉద్యోగంలో ఎందుకు చేర్చుకున్నట్లు? గత ప్రభుత్వంలో మాకు ఉద్యోగం చేయడమే కష్టంగా ఉండేది. ఐదేళ్లలో నాలుగు చోట్లకు బదిలీ అయ్యాను. ఇప్పుడు కొత్త ప్రభుత్వం సారా నిషేధం మీద చిత్తశుద్ధితో ఉండడంతో మాలాంటి వాళ్లకు ధైర్యం వచ్చింది. సారా కాయడం మీద ఉక్కు పాదం మోపితే సరిపోదు. సారా తాగకూడదనేటట్లు మనుషుల మనసులను మార్చాలి. వారిని చైతన్యవంతం చేయడం కోసమే ఎనిమిది పాటలు రాయించాం. వాటిని రికార్డ్ చేయిస్తున్నాం’’ అన్నారు నాగలక్ష్మి. – వాకా మంజులారెడ్డి ఫొటోలు: ఎన్. మురళి, సాక్షి, చిత్తూరు చదువు – ఉద్యోగం రెండు కళ్లు మా నాన్న జీతం మమ్మల్ని ముగ్గుర్ని పోషించడానికే సరిపోయేది. దాంతో ఆరవ తరగతి నుంచి ప్రతి వేసవి సెలవుల్లో నిర్మాణంలో ఉన్న భవనాలకు వాటర్ క్యూరింగ్ వంటి పనులకు వెళ్లేవాళ్లం. రోజుకు ఇరవై రూపాయలొచ్చేవి. సెలవుల్లో సంపాదించుకున్న డబ్బుతో పుస్తకాలు, దుస్తులు కొనుక్కునే వాళ్లం. సత్యసాయి కాలేజ్, అనంతపురం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ తర్వాత పీజీకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకెళ్లాను. అందులోనే ఎంఫిల్ చేస్తున్న సమయంలో ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌లో హిస్టరీ లెక్చరర్‌గా ఉద్యోగం వచ్చింది.రెండేళ్ల తర్వాత అనంతపురం ఉరవకొండకు బదిలీ అయింది. తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఉమెన్ స్టడీస్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉన్న సమయంలో అంతర్జాతీయ పత్రికల్లో ‘ఎంపవర్మెంట్ ఆఫ్ ట్రైబల్ ఉమెన్, అబ్జర్వేషన్స్, రికమండేషన్స్’ టాపిక్ లో వ్యాసాలు రాశాను. ఏపీ హిస్టరీ కాంగ్రెస్‌లో పేపర్ ప్రజెంట్ చేశాను. ఇదే సమయంలో గ్రూప్ వన్‌లో ఒక ప్రయత్నం చేశాను. తొలిసారి ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ పోస్ట్ వచ్చింది. రెండో ప్రయత్నంలో ఎక్సైజ్ పోలీస్నయ్యాను. ఇలా నా చదువూ, ఉద్యోగం రెండు కలిసి కొనసాగుతున్నాయి. ఇప్పుడు ‘ట్రైబల్ ఉమెన్ ఇన్ ఎ చేంజింగ్ సొసైటీ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు బంజారా ఉమెన్ ఇన్ ఆంధ్రప్రదేశ్’ అంశంలో పీహెచ్డీ చేస్తున్నాను. – టి. నాగలక్ష్మి రమావత్, డిప్యూటీ కమిషనర్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్, చిత్తూరు జిల్లా -
ఇంటికి త్వరగా వెళ్లండి..యెస్ బాస్!
‘ అసలు ఈ ఆనందాన్ని ఎలా వర్ణించాలో అర్థం కావడం లేదు. ఈ రోజు తను బాస్. నా కంటే ఉన్నత స్థానంలో ఉన్న అధికారి. ఇంటికి త్వరగా వెళ్లాలని ఆదేశించింది. ఈరోజు నేను కచ్చితంగా తన ఆదేశాలు శిరసా వహిస్తా’ అంటూ ఓ పోలీసు తండ్రి పుత్రికోత్సాహంతో పొంగిపోయారు. ఐసీఎస్సీ క్లాస్ 10, ఐఎస్సీ 12వ తరగతి ఫలితాలు మంగళవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో కోల్‌కతాకు చెందిన రిచా సింగ్ 99.25 శాతం మార్కులు సాధించి దేశం మొత్తంలో నాలుగో స్థానంలో నిలిచింది. ఈమె తండ్రి రాజేష్ సింగ్ పోలీసు అధికారి. గరియాహట్ పోలీస్ స్టేషనులో అదనపు ఇంచార్జిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజేష్ సింగ్ కూతురు విజయాన్ని సెలబ్రేట్ చేస్తూ కోల్‌కతా పోలీసులు ఆమెను సత్కరించారు. ఇందులో భాగంగా ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సిటీ ఆగ్నేయ డివిజన్ డిప్యూటీ కమిషనర్‌గా ఉండేందుకు రిచాకు అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా సబార్డినేట్ అయిన తండ్రికి బాస్‌గా ఎటువంటి ఆదేశాలు జారీ చేయాలనుకుంటున్నారు అని ప్రశ్నించగా..‘ ఇంటికి త్వరగా వెళ్లాలని ఆయనను ఆదేశిస్తా’ అంటూ సమాధానమిచ్చింది. దీంతో ఒక్కరోజైనా తండ్రి ఇంటికి త్వరగా రావాలనే ఆమె కోరిక విని రాజేష్ సింగ్ భావోద్వేగానికి గురయ్యారు. డ్యూటీలో ఉండి కూతురితో సమయం కేటాయించలేని ఆయన లాంటి పోలీసు తండ్రులకు ‘బాస్’ కల్పించిన ఈ అవకాశం ఎంతో ఆనందాన్నిస్తుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా! Congratulations Richa!! Richa Singh, daughter of Insp. Rajesh Kumar Singh, Addl. OC, Gariahat PS, secured the fourth position across India at the ISC Examinations this year. She was felicitated this afternoon by @CPKolkata , Dr. @RajeshKumarIPS for her academic excellence. pic.twitter.com/KIJ8BtCH0S — Kolkata Police (@KolkataPolice) May 8, 2019 -
వరదాయని
వరాలిచ్చే తల్లి వరదాయని. శ్రీవిద్యను వరదాయని అని అనడం ఎందుకంటే.. కేరళ వరదోధృతిలో ఆమె అనేకమంది ప్రాణాలను కాపాడి పునరుజ్జీవితాన్ని వరంగా ఇచ్చారు! శ్రీవిద్య ఐఏఎస్ ఆఫీసర్. పుట్టింది కేరళ రాష్ట్రం, కొల్లం జిల్లా కొట్టరకార గ్రామంలో. త్రివేండ్రంలో బీఏ ఇంగ్లిష్ లిటరేచర్, ఆ తర్వాత కేరళ లా అకాడమీలో న్యాయశాస్త్రం చదివారు. సివిల్స్‌లో 14వ ర్యాంక్‌తో 2009లో కర్ణాటక కేడర్ ఐఏఎస్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ డిప్యూటీ సెక్రటరీగా కొంతకాలం పనిచేశారు. ప్రస్తుతం కొడగు జిల్లా డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారామె. ఎనిమిది నెలల కిందట ఆ బాధ్యతలు చేపట్టిన శ్రీవిద్యకు గత నెలలో సంభవించిన భారీ వరదలు పెద్ద సవాల్ అనే చెప్పాలి. అయితే ఆమె ఆ సవాల్‌ను చాలా చాకచక్యంగా నిర్వర్తించారు. ప్రస్తుతం పై అధికారుల నుంచి, సోషల్ మీడియాలోనూ ఆమె మీద ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రకృతి విలయ తాండవం కేరళలో వర్షాలు ఎక్కువయ్యాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలతో పరిస్థితి చేయి దాటుతోంది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన కొడగు (కూర్గ్) కేరళ సరిహద్దు జిల్లా వయనాడును ఆనుకునే ఉంటుంది. వర్షాల ప్రభావం కొడగును కూడా కదిలించి వేయడం మొదలైంది. ఆగస్టు 12 రాత్రి శ్రీవిద్యకు ఫోన్ కాల్ వచ్చింది. జిల్లా కేంద్రం నుంచి హుటాహుటిన బయలుదేరారామె. పర్వత ప్రాంతాల్లో ప్రకృతి విలయతాండవం చేస్తోంది. పరిస్థితి బీభత్సంగా ఉంది. అధికార యంత్రాంగాన్ని కదిలించాలి, ప్రాణనష్టం జరగకుండా కాపాడాలి, వీలయినంత వరకు ఆస్తి నష్టాన్ని కూడా నివారించాలి. పరిస్థితిని అధికారికంగా ప్రకటించడానికి పూర్తి స్థాయి వివరాలందడం లేదు. కొంత సంశయం... అయినప్పటికీ వేచి చూసే పరిస్థితి ఉన్నట్లు కనిపించడం లేదు. తక్షణమే ప్రమాద హెచ్చరికలు జారీ చేశారామె. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం రంగం లోకి దిగింది. రోడ్లు ఉండగానే చేర్చాలి కొడగు అసలే కొండ ప్రాంతం. భారీ గాలివానల్లో కొండ చరియలు విరిగి పడే ప్రమాదం పొంచి ఉంటుంది. కొండ వాలులో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. ముంపు ప్రాంతాల జనాన్ని కూడా క్యాంపులకు చేర్చాలి. స్థానిక రేడియోల్లో, కేబుల్ టీవీల ద్వారా ప్రమాద హెచ్చరికలు జారీ చేయించాలి. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లమని, కొండవాలులో సంచరించవద్దని గ్రామాల్లో దండోరా వేయించాలి. ఇళ్లను వదిలి వెళ్లడానికి సామాన్య ప్రజానీకాన్ని మానసికంగా సిద్ధం చేయాలి. వారిని తరలించడానికి అవసరమైన రవాణా సౌకర్యాలను కల్పించాలి. వరద ఉధృతికి రోడ్లు కొట్టుకు పోకముందే జనాన్ని క్షేమంగా క్యాంపులకు చేర్చాలి. సాధ్యమైతే ముంపు ప్రాంతాల్లోని సివిల్ సప్లయిస్ గోడౌన్ల నుంచి ఆహారధాన్యాలను కూడా కాపాడగలగాలి. అన్ని శాఖలకూ ఆదేశాలు వెళ్లిపోయాయి. పని మొదలైంది. ఇదంతా ఒక్క పూటలో పూర్తయిపోయింది. అందరితో ఒక ‘బృందం’ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అవసరమైన ఆదేశాలు జారీ చేయడానికి శ్రీవిద్య తన ఆఫీస్ పక్కనే ఒక కంట్రోల్ రూమ్‌ను ఓపెన్ చేయించారు. వరద సహాయక చర్యలను స్వయంగా సమన్వయం చేశారు. స్థానిక ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో బలమైన బృందాన్ని తయారు చేయగలిగారామె. స్వయంగా పర్యవేక్షిస్తూ సహాయక చర్యలను నిర్వర్తించారు. ప్రమాద తీవ్రతను అంచనా వేసి పటిష్టమైన జాగ్రత్తలు తీసుకోవడం వల్లనే ప్రాణనష్టాన్ని నివారించగలిగామంటారామె. ఆస్తి నష్టం కూడా భారీగా జరగలేదన్నారు. జిల్లాలో వరద బాధితుల క్షేమం కోసం ఒక సమర్థవంతమైన అధికారిగా ఇంత చక్కగా చేశారామె. మరి ఆమె కుటుంబం సంగతి ఏమిటి? భర్తతో మాట్లాడ్డమే కుదర్లేదు! ఆమె భర్త నారాయణన్ కేరళ రాష్ట్రంలోని పాథానాంతిట్ట జిల్లా పోలీస్ ఆఫీసర్. ఆ ప్రాంతం కూడా అత్యంత దయనీయమైన స్థితిలో చిక్కుకుపోయింది. అక్కడ వరద సహాయక చర్యల్లో ఉండిపోయారాయన. ఆ క్లిష్టమైన సమయంలో ఐదారు రోజుల పాటు భార్యాభర్తలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కూడా కుదరలేదు. పరిస్థితులు చక్కబడే వరకు ఆమె నాలుగేళ్ల కొడుకు కూడా సహాయక క్యాంపులోనే గడపాల్సి వచ్చింది. ఆమె అత్త, మామగారు కూడా అదే క్యాంపులో బిడ్డ సంరక్షణ చూసుకుంటూ గడిపారు. అప్పటి పరిస్థితులను వివరిస్తూ ‘‘సమాచార వ్యవస్థ చిన్నాభిన్నమైంది. అక్కడ నా భర్త ఉన్న ప్రదేశంలో వరద ఎంత భయానకంగా ఉందనే వివరాలు నాకు తెలియదు. ఇక్కడ నా జిల్లాలో పరిస్థితి ఏమిటనేది ఆయనకు సమాచారం లేదు. మా మధ్య మాటల్లేని రోజులవి’’ అంటూ నవ్వారు. టూరిస్టులకు హెచ్చరిక ఆగస్టు 20వ తేదీకి పరిస్థితి కొంత అదుపులోకి వచ్చింది. నిత్యావసర వస్తువులను గ్రామాలకు, క్యాంపులకు తరలించడం సులువైంది. స్థానిక ప్రజలను రక్షించడం ఒక ఎత్తయితే, పర్యాటకులను కాపాడటం మరొక ఎత్తయింది. కొడగులో ప్రమాదకరమైన ప్రదేశాల గురించి వాళ్లకు అవగాహన ఉండదు. కూర్గ్ కాఫీ తోటలు ప్రఖ్యాత పర్యాటక ప్రదేశం కావడంతో సందర్శకుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. ప్రకృతి విలయం గురించిన సరైన సమాచారం లేక కొందరు పర్యాటకులు వారి ముందస్తు ప్రణాళిక ప్రకారం వచ్చేశారు. అప్పుడు అప్రమత్తమై వారినీ క్యాంపులకు తరలించారు. రాబోయే పర్యాటకులను హెచ్చరించి కొడగు చేరకముందే వెనక్కి పంపించే ఏర్పాట్లు చేశారు. ఒక నెల పాటు పర్యాటకులకు ప్రవేశం నిషిద్ధం అని అధికారికంగా ప్రకటించి, పరిస్థితి పూర్తిగా చక్కబడిన తర్వాత నిషేధాన్ని తొలగించారు. మొత్తం మీద శ్రీవిద్య వరదను అరచేతితో ఆపలేదనే మాటే కానీ అంతటి నైపుణ్యంతో పనిచేశారు. ప్రజాజీవనాన్ని త్వరగా చక్కబెట్టారు. – మంజీర -
డీఎస్పీకి రెండేళ్ల కఠిన కారాగార శిక్ష
నిజామాబాద్ క్రైం: లంచం తీసుకున్న డీఎస్పీకి కరీంనగర్ ఏసీబీ కోర్టు రెండేళ్ల కఠిన కారాగార శిఖ విధించింది. ఈ మేరకు శుక్రవారం ప్రత్యేక న్యాయమూర్తి భాస్కర్‌రావు తీర్పు చెప్పారు. నిజామాబాద్ ఏఆర్ కానిస్టేబుల్ తిరునగిరి శ్రీనివాస్, విజయకుమారిని కులాంతర వివాహం చేసుకున్నాడు. ఐదేళ్ల తర్వాత వీరి మధ్య విభే దాలు రావడంతో విజయకుమారి భర్త శ్రీనివాస్‌పై 2006 జూలై 9న నగరంలోని 5వ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది శ్రీనివాస్‌పై అట్రాసిటీ కేసు నమోదు కావడంతో అప్పటి ఎస్పీ సస్పెండ్ చేశారు. తనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని అప్పటి డీఎస్పీ విలియమ్స్‌ను కోరగా రూ. 15 వేలు లంచం డిమాండ్ చేశాడు. ఏసీబీ సూచన మేరకు డబ్బులు ఇస్తుండటంతో అధికా రులు పట్టుకున్నారు. ఈ కేసులో శుక్రవారం ఏసీబీ తరపున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల లక్ష్మీప్రసాద్ తన వాదనలు వినిపించా రు. జరిమానా చెల్లించని పక్షంలో మరో 3 నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలన్నారు. -
లిక్కర్ జోష్..!
సాక్షి, ఆదిలాబాద్: మద్యం అమ్మకాల్లో ఇదో సునామి. ఉమ్మడి జిల్లాలో రూ.1000 కోట్లకు పైగా మార్క్‌ను సాధించబోతోంది. ఫిబ్రవరి వరకు రూ.965 కోట్లు క్రాస్ చేసింది. మార్చి నెలలో రికార్డ్ మార్క్‌ను మించిపోనుంది. దీంతో మద్యం అమ్మకాల్లో జిల్లా రికార్డును చూసి మురిసిపోవాలో లేనిపక్షంలో ఉమ్మడి జిల్లాలో లిక్కర్ ఇంతగా సేవిస్తున్నారా..! అని మదనపడాలో అర్థం కాని పరిస్థితి. ఏదేమైనా రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల పరంగా టాప్ 5లో ఆదిలాబాద్ ఉందని ఎక్సైజ్ అధికారులు సంబరపడిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్థిక సంవత్సరంలో వృద్ధి ఏకంగా 30 శాతానికి పెరగడంతో ఆబ్కారీ అధికారుల మాటల్లోనూ గంభీరం కనిపిస్తోంది. 30 శాతం వృద్ధి.. పెరగడానికి కారణాలు ఇవే.. ఉమ్మడి జిల్లాలో ప్రతి నెల సగటున రూ.80 కోట్లకు పైబడి ఆదాయం మద్యం అమ్మకాల ద్వారా లభిస్తోంది. గత మూడు నెలలుగా విక్రయాలను పరిశీలిస్తే డిసెంబర్లో రూ.95.48 కోట్లు, జనవరిలో రూ.85.30 కోట్లు, ఫిబ్రవరిలో రూ.93.88 కోట్లు విక్రయాల ద్వారా ఆదాయం వచ్చింది. ఇండియన్ మేడ్ లిక్కర్(ఐఎంఎల్), బీర్ల కేసుల అమ్మకాలు రెండూను గత ఏడాది కంటే భారీగా పెరగడం గమనార్హం. అధికారులు ప్రధానంగా గుడుంబా, దేశీదారును అరికట్టడంతోనే ఈ ఆదాయం పెరిగిందని అధికారులు చెబుతున్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది చీప్ లిక్కర్ అమ్మకాలు కేవలం 5 శాతమే పెరిగాయి. దీన్ని బట్టి ఇంత ఆదాయం గుడుంబా, దేశీదారును అరికట్టడం ద్వారా వచ్చిందనడం పట్ల కొంతమంది ఎక్సైజ్ అధికారులు కొట్టి పడేస్తున్నారు. దీనికి ఇతరత్రా కారణాలు కూడా ఉన్నాయని పేర్కొంటున్నారు. ప్రధానంగా గత ఏడాదిన్నర కాలంగా ఈత, తాటి చెట్ల నుంచి లభించే కల్లు విక్రయాల్లో కల్తీ జరుగుతుందని ఎక్సైజ్ అధికారులు నిఘా పెంచడం, తరచూగా దాడులు చేస్తుండడంతో కల్లు విక్రయాలపై ప్రభావం పడింది. ఉమ్మడి జిల్లాల్లో ప్రధానంగా సొసైటీల నుంచి కల్లు విక్రయాలు భారీగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో కల్లు దొరకకపోవడంతో మద్యం కొనుగోలు చేస్తున్నారు. కల్లు తాగే వ్యక్తులు చీఫ్ లిక్కర్ తీసుకున్నా దాని వృద్ధి రేటు పెరగాలి. కానీ చీఫ్ లిక్కర్ కంటే మీడియం లిక్కర్, హై లిక్కర్, అంత కంటే బీరు విక్రయాల శాతం భారీగా పెరగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తద్వారా జిల్లాలో తక్కువ స్థాయి మద్యం కంటే మధ్యమస్థాయి, అతి ఖరీదైన మద్యం తాగేందుకు జనాలు డబ్బులు వెచ్చించేందుకు వెనుకాడడం లేదని వృద్ధి రేటు స్పష్టం చేస్తోంది. అదే సమయంలో మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో మద్యం అమ్మకాలపై నిషేధం ఉండడం కూడా జిల్లాలో విక్రయాలు పెరగడానికి కారణమని చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల నుంచి మహారాష్ట్రకు పెద్ద ఎత్తున మద్యం రవాణా అవుతోందని చెబుతున్నారు. అదే సమయంలో తెలంగాణ కంటే మహారాష్ట్రలో మద్యం ధరలు అధికంగా ఉండడంతో నిషేధం లేనటువంటి మహారాష్ట్రలోని ప్రాంతాలకు కూడా మన జిల్లా నుంచి సరిహద్దు ప్రాంతాల ద్వారా హైలిక్కర్ మద్యం కొనుగోలు చేస్తున్నారని చెబుతున్నారు. గత ఏడాదిన్నర కాలంలో రెండు సార్లు మద్యం ధరలను ప్రభుత్వం పెంచగా, అందులో గతేడాది ఈ ధరలను భారీగా పెంచారని మద్యంప్రియులు వాపోతున్నారు. ఆదాయానికి పెరిగిన మద్యం ధరలు కూడా కారణమని చెబుతున్నారు. వీటిన్నింటి కారణంగానే 30 శాతం వృద్ధి ఉందని తెలుస్తోంది. ఇదీ పరిస్థితి.. గత అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ అమలైన విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లాలో 160 వైన్స్ షాపులకు రెండు సంవత్సరాల కాల పరిమితితో లైసెన్స్ ఇచ్చారు. దీంతోపాటు ఉమ్మడి జిల్లాలో 23 బార్లు, మంచిర్యాలలో ఓ క్లబ్లో మద్యం విక్రయాలకు రెన్యూవల్ చేశారు. ఉట్నూర్ మద్యం డిపో నుంచి ఆదిలాబాద్, నిర్మల్, భైంసా, ఇచ్చోడ, ఉట్నూర్, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ ఎక్సైజ్ సర్కిళ్లలోని మద్యం దుకాణాలు, వైన్స్‌లు, బార్లకు మద్యం సరఫరా జరుగుతోంది. మంచిర్యాల డిపో నుంచి మంచిర్యాల, చెన్నూర్, లక్షెట్టిపేట, బెల్లంపల్లి ఎక్సైజ్ సర్కిళ్లకు మద్యం విక్రయాలు జరుగుతాయి. సాధారణంగా ఉట్నూర్ డిపో నుంచి ప్రతిరోజు రూ.1 కోటి నుంచి రూ.కోటిన్నర వరకు మద్యం విక్రయాలు జరుగుతాయి. మంచిర్యాల డిపో నుంచి రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు విక్రయాలు జరుగుతాయి. కొంత ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎక్సైజ్ సర్కిళ్లకు కూడా మంచిర్యాల డిపో నుంచి సరుకు వెళ్తుంది. ఈ రెండు డిపోల నుంచి ప్రతి నెల ఉమ్మడి జిల్లాకు రూ.80 కోట్లకు పైబడి మద్యం వెళ్తుంది. ఉమ్మడి జిల్లాలో మద్యం అమ్మకాలు.. సంవత్సరం ఐఎంఎల్ కేసులు బీర్ కేసులు అమ్మకం విలువ గతేడాది కంటే వృద్ధి రేటు(రూ. కోట్లలో) 2015–16 15,99,838 15,07,766 రూ.715.19 8.60 శాతం 2016–17 18,61,173 15,77,748 రూ.828.03 16 శాతం 2017–18 21,17,319 19,00,219 రూ.965.29 30 శాతం దేశీదారు కంట్రోల్‌తోనే.. ఐడీ, దేశీదారు కంట్రోల్ చేయడంతోనే జిల్లాలో మద్యం అమ్మకాలు పెరిగాయి. రాష్ట్రంలోనే టాప్ 5లో ఉన్నాం. మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ నాలుగు జిల్లాలోనూ అమ్మకాల్లో మంచి వృద్ధి ఉంది. అన్ని సర్కిళ్ల పరిధిలో విక్రయాల పరంగా ముందున్నాయి. ప్రధానంగా జిల్లాలో గుడుంబాను పూర్తి స్థాయిలో అరికట్టడం జరిగింది. అదే సమయంలో దేశీదారును నియంత్రించాం. దాని ఫలితంగానే అమ్మకాలు పెరిగాయి. – ఎం.రమేశ్‌రాజు, డిప్యూటీ కమిషనర్, ఆదిలాబాద్ ఎక్సైజ్ డివిజన్ -
99 శాతం గుడుంబా నిర్మూలించాం
ఖమ్మం క్రైం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 99 శాతం గుడుంబా విక్రయాలు జరగడంలేదని, ఎక్కడో ఏజెన్సీ ప్రాంతంలో మాత్రమే గుడుంబా అమ్ముతున్నట్లు తెలుస్తోందని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అంజన్‌రావు తెలిపారు. సోమవారం ‘సాక్షి’మెయిన్‌లో ‘నాటుసారాకు కొత్తరెక్కలు’ శీర్షికన కథనం ప్రచురితమైన నేపథ్యంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం సువిజ్ఞానపురం ప్రాంతంలో చక్కెరతో గుడుంబా తయారు చేస్తున్నారని, దీంతో పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు వెళ్లి వారిని అరెస్టు చేయడంతోపాటు పదిమంది చక్కెర వ్యాపారులపై కేసు నమోదు చేసి.. బస్తాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. గుడుంబా పునరావాసం కింద ఉమ్మడి జిల్లాలో 732 మందిని ఎంపికచేసి, వారికి రూ. 2 లక్షల చొప్పన రుణాలిచ్చామన్నారు. వారు మళ్లీ గుడుంబా విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వస్తే రుణాన్ని రద్దు చేయడంతోపాటు బైండోవర్ కేసులు నమోదు చేస్తామన్నారు. చక్కె ర రూపంలో గుడుంబాను తయారు చేస్తున్నట్లు తమ దృష్టికి వస్తే వాటిపై కూడా కఠినచర్యలు తీసుకుంటామన్నారు. ఏపీ నుంచి చక్కెర తరలించే ప్రాం తాలపై నిఘాపెట్టామని, నాటుసారాను అరికట్టేందుకు కృషి చేస్తామన్నారు. -
రెండేళ్లు ఉంటా.. 2 కోట్లు కావాలి!
బోధన్ స్కాంలో మరో తిమింగళం తెరపైకి డిప్యూటీ కమిషనర్ అవినీతి బాగోతం ► ఏ–1 శివరాజుతో ములాఖత్ అయినట్టు గుర్తించిన సీఐడీ ► ఒప్పందంలో భాగంగా రూ. 25 లక్షల అడ్వాన్స్ ► శివరాజు కుమారుడు సునీల్‌తో ఒప్పందం ► సర్కిళ్లు, చెక్‌పోస్టుల నుంచి నెలకు రూ. 10 లక్షలు ► అక్రమార్జన సొమ్ముతో రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి సాక్షి, హైదరాబాద్ బోధన్ కమర్షియల్ ట్యాక్స్ స్కాంలో అవినీతి తిమింగళాల పాత్ర బయటపడుతోంది. ఇప్పటికే ఈ కేసులో తొమ్మిది మంది వాణిజ్య పన్నుల శాఖ అధికారులు, సిబ్బంది అరెస్ట్ కాగా తాజాగా మరో డిప్యూటీ కమిషనర్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సీఐడీ విచారణలో కళ్లు బైర్లు కమ్మే అవినీతి బండారం బయటపడింది. పోస్టింగ్ పొందగానే శివరాజు(కేసులో ఇప్పటికే అరెస్టయిన ఏ–1 నిందితుడు)ను దర్శనం చేసుకునేందుకు డిప్యూటీ కమిషనర్లు ఉవ్విళ్లూరుతారట! రెండేళ్లు నేనే ఉంటా.. డిప్యూటీ కమిషనర్(డీసీ)గా ఉన్న ఓ అధికారి తనకు కోట్లలో ముట్టజెప్పాలని డిమాండ్ చేశారు. శివరాజు కుమారుడు సునీల్‌తో సదరు డీసీ నేరుగా బేరసారాలు సాగించినట్టు సీఐడీ అధికారులు తెలిపారు. ‘రెండేళ్లపాటు పనిచేస్తా కాబట్టి ఏడాదికి రూ.కోటి చొప్పున రెండేళ్లకు రూ.2 కోట్లు ఇవ్వాల్సిందే..’అని ఆ డీసీ స్పష్టం చేసినట్టు తెలిసింది. దీంతో ముందుగా అడ్వాన్స్ కింద రూ.25 లక్షలు నగదు చెల్లించినట్టు సునీల్ తన వాంగ్మూలంలో వెల్లడించినట్టు సీఐడీ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. అంతేకాదు మిగిలిన మొత్తాన్ని ప్రతినెలా రూ.10 లక్షల చొప్పున ఇవ్వాలని ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్టు తెలిపారు. అలా ఇప్పటివరకు రూ.80 లక్షలు సంబంధిత డిప్యూటీ కమిషనర్‌కు అందినట్టు విచారణలో బయటపడినట్లు ఆయన తెలిపారు. ప్రతీ ఆడిటింగ్‌కు ఓ రేటు వాణిజ్య పన్నుల శాఖలో ఒక్కో అధికారికి నెలకు 4 లేదా 5 ఆడిటింగ్లు చేయాలని ఆదేశాలుంటాయి. దీని ప్రకారం సంబంధిత అధికారులు ఆడిటింగ్ నిర్వహిస్తారు. ఇక్కడ కూడా సంబంధిత డిప్యూటీ కమిషనర్ రేటు ఫిక్స్ చేసినట్టు సీఐడీ వెలుగులోకి తెచ్చింది. ఒక్కో ఆడిటింగ్‌లో టర్నోవర్‌ను బట్టి రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేసినట్టు గుర్తించారు. ఏడు సర్కిళ్లు, నాలుగు చెక్‌పోస్టులు సంబంధిత డిప్యూటీ కమిషనర్ కింద ఏడు సర్కిల్ కార్యాలయాలు, నాలుగు ప్రధాన చెక్ పోస్టులున్నాయి. వీటి నుంచి సాగే జీరో దందా వ్యాపార సంస్థల వాహనాల నుంచి వసూలు చేసిన లంచాల్లో మెజారీటీ శాతం డిప్యూటీ కమిషనర్‌దేనని సీఐడీ తేల్చింది. ఇలా రూ.50 వేల నుంచి రూ.75 వేల వరకు పై స్థాయిలో ఉన్న అధికారులకు ఈ డిప్యూటీ కమిషనర్ ద్వారానే చేరుతుందని సీఐడీ గుర్తించింది. అక్రమార్జనతో బిజినెస్... అక్రమార్జనతో సంపాదించిన కోట్ల రూపాయాలను సదరు డిప్యూటీ కమిషనర్ హైదరాబాద్‌లోని ప్రముఖ రియల్ ఎస్టేట్, నిర్మాణ సంస్థలో పెట్టుబడిగా పెట్టినట్టు సీఐడీ గుర్తించింది. ప్రతి శుక్రవారం లేదా సోమవారం కార్యాలయానికి వెళ్లడం, తనకు రావాల్సిన వాటాను తీసుకోవడం, తన వెంట వచ్చే తండ్రికి ఆ మొత్తాన్ని ఇచ్చి ఆర్టీసీ బస్సులో పంపించడం ఆ డిప్యూటీ కమిషనర్ స్టయిల్ అని తేలింది. పోస్టింగ్‌కు రూ.30 లక్షలు హైదరాబాద్‌లో పోస్టింగ్ ఇప్పించాలంటూ ఈ డిప్యూటీ కమిషనర్ గతంలో ఓ మంత్రి ఓఎస్డీకి రూ.30 లక్షలు ముట్టజెప్పారు. తీరా పోస్టింగులు అయ్యే సమయంలో మంత్రి పైరవీ పని చేయలేదు. అందరిలాగే సాదాసీదా బదిలీపై పోస్టింగ్ ఇచ్చారు. దీంతో తాను పోస్టింగ్ కోసం ఇచ్చిన రూ.30 లక్షలు ఇవ్వాలని ఓఎస్డీని డీసీ గట్టిగా నిలదీశారు. తన వద్ద లేవని, వెళ్లి మంత్రిగారితో చెప్పుకోండని సదరు ఓఎస్డీ తెగేసి చెప్పారు. మంత్రిని అడిగేందుకు ధైర్యం చాలకపోవడంతో ఇచ్చిన పోస్టింగ్‌కే వెళ్లారు. మలేసియా ప్యాకేజీ రూ.2.5 లక్షలు సంబంధిత డిప్యూటీ కమిషనర్ ఐదు నెలల క్రితం మలేసియా వెళ్లినట్టు సీఐడీ గుర్తించింది. ఆ దేశం వెళ్లేందుకు రూ.2.5 లక్షల ఖర్చును తామే భరించినట్లు సునీల్ విచారణలో ఒప్పుకున్నాడని సీఐడీ అధికారి ఒకరు స్పష్టంచేశారు. ఇది కూడా ఒప్పందంలో భాగంగానే జరిగిందని సునీల్ చెప్పినట్టు ఆయన తెలిపారు. ఈ వివరాలన్నీ ఏసీబీ అధికారులు సైతం వాకబు చేశారని, వాటితో ఒక నివేదిక రూపొందించి వాణిజ్య పన్నుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపించారని, త్వరలోనే ఏసీబీ కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉందని సమాచారం. -
సాగర్‌బాబు ఇంటిపై ఏసీబీ దాడులు
-
తెర పైకి వాణిజ్యపన్నులశాఖ డీసీ కార్యాలయం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం ః వాణిజ్యపన్నులశాఖ పరిధిలో జిల్లాకో డెప్యూటీ కమిషనర్ (డీసీ) కార్యాలయం ప్రారంభించాలన్న ప్రతిపాదనకు కసరత్తు మొదలైంది. ఇప్పటివరకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు కలిపి విజయనగరంలో ఎనిమిది సర్కిళ్లకు సంబంధించి డీసీ కార్యాలయం ఉంది. దీనివల్ల శ్రీకాకుళం పరిధిలో ఉన్న ఖాతాదారులకు కొంత ఇబ్బందులొస్తున్నాయి. వాణిజ్యపరమైన సర్వీసులు, ఫిర్యాదులు, భారీ లావాదేవీలకు విజయనగరం వెళ్లాలంటే కష్టతరంగా మారింది. 13జిల్లాల పరిధిలో విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో రెండేసి డివిజన్లుండగా భారీ ఆదాయం వ స్తున్న విశాఖసిటీకి ఒక్కటే ఉంది. విశాఖ రూరల్ పరిధిలో మరో డీసీ కార్యాలయం ఉండాలన్న డిమాండ్‌తో పాటు ఆయా జిల్లాల పరిధిలోనూ ఒక్కో కార్యాలయం తెరిచేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులు హైదరాబాద్‌లోని ఉన్నతాధికారులకు నివేదించారు. నాలుగు సర్కిళ్ల పరిధిలో.. శ్రీకాకుళం జిల్లాలో రాజాం, కాశీబుగ్గ, నరసన్నపేట, శ్రీకాకుళం ప్రాంతాల్లో సర్కిళ్లు పనిచేస్తున్నాయి. ఏటా రూ.200 నుంచి రూ.250కోట్ల ఆదాయం వస్తోంది. రాజాం నుంచి భారీ రెవెన్యూ జమ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ నాలుగు సర్కిళ్లకూ కలిపి ఒక డీసీ కార్యాలయ అవసరంపైనా ఇక్కడి అధికారులు నివేదించినట్టు తెలిసింది. ఇందుకు తగ్గ సిబ్బంది, కార్యాలయం అందుబాట్లో ఉందని కూడా అధికారులు చెబుతున్నారు. విజయనగరం జిల్లాలో ఈస్ట్, వెస్ట్, సౌత్ సర్కిళ్లతోపాటు పార్వతీపురాన్ని దృష్టిలో పెట్టుకుని నాలుగు సర్కిళ్లను కులుపుతూ శ్రీకాకుళంలో ఉన్న మరో నాలుగింటిని (మొత్తం 8సర్కిళ్లతో కూడిన డివిజన్) డివిజన్ కార్యాలయం ఏర్పాటైంది. పెరిగిన లావాదేవీలు, ఆన్లైన్ వ్యవహారం, స్కైప్ విధానం, రెవెన్యూ ఆధారంగా వాణిజ్యపన్నులశాఖ పరిధిలో శ్రీకాకుళంలోనూ మరో డీసీ కార్యాలయం ఏర్పాటు చేస్తే బావుంటుందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఏమిటి ఉపయోగం స్థానికంగా డీసీ కార్యాలయం ఉంటే వ్యాపారులు తమ ఇబ్బందుల్ని ఉన్నతాధికారి దృష్టికి తీసుకువెళ్లే వీలుంటుంది. గ్రూప్-1స్థాయి అధికారి సీటీవోగా ఎంపికై పదోన్నతలు, సీనియార్టీ ఆధారంగా డీసీ పోస్టు హోదా వస్తుంది. కిందిస్థాయి సిబ్బందితో లక్ష్యాలకు అనుగుణంగా పనిచేసే వీలుంటుంది. సిబ్బంది సంఖ్య, కార్యాలయ పరిధి పెరుగుతుంది. ఆదాయ వనరుగా ఉన్న వాణిజ్యపన్నులశాఖలో రెవెన్యూ లీకేజీ అరికట్టే అవకాశం ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేయించుకున్న డీలర్ల వ్యాపారంపై నిఘా పెంచేందుకు, తరచూ ఆడిట్ నిర్వహించుకునే వీలుంటుంది. నిత్యం వ్యాపారులు తమకు ప్రభుత్వం అందించే ప్రోత్సహకాలతోపాటు చెల్లించాల్సిన పన్ను, జమ కావాల్సిన ఖర్చులపై నేరుగా డీసీ స్థాయి అధికారులతో చర్చించే అవకాశం ఉంటుంది. సీజన్ వారీ వ్యాపారంపై దృష్టిసారించడంతో పాటు అవసరమయ్యే చోట చెక్పోస్టులేర్పాటు, అబ్జర్వేషన్ పాయింట్ (ఓపీ)లేర్పాటు చేసే అవకాశం ఉంటుంది. దీంతో శ్రీకాకుళం జిల్లాకూ డీసీ కార్యాలయ ఏర్పాటు అవసరమేనంటూ కొంతమంది వ్యాపారులతో పాటు అధికారులూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి, రాష్ట్ర వ్యాప్త నిర్ణయం కాబట్టి, శ్రీకాకుళంలో డీసీ కార్యాలయం ఏర్పాటు చేస్తే విజయనగరం పరిస్థితి ఏంటన్న విషయంపైనా మంత్రి యనమల రామకృష్ణుడి వద్ద ఓ ఫైల్ కూడా పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం. -
హై...టెన్షన్!
రిజర్వేషన్లపై నాయకుల ఆరా ఎక్కడ చూసినా ఇదే చర్చ గ్రేటర్ ఎన్నికలపై పెరుగుతున్న ఆసక్తి సాక్షి, సిటీబ్యూరో: ‘హలో.. డిప్యూటీ కమిషనర్ గారూ... ‘ఫలానా’ డివిజన్ ఎవరికి రిజర్వు అయింది? అసలు రిజర్వ్ అవుతుందా? ఓపెన్‌లో ఉంటుందా?’... జీహెచ్ఎంసీలోని ఒక సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌కు స్థానిక ఎమ్మెల్యే ప్రశ్న. ‘కమిషనర్ గారూ.. ఫలానా డివిజన్ ఎవరికిస్తున్నారు?’... ఓ మంత్రి ఆరా. ... ఇదీ గ్రేటర్లో శనివారం నాటి పరిస్థితి. ఎక్కడ చూసినా... ఎవరిని కదిలించినా ఇదే చర్చ. ‘ఫలానా డివిజన్ బీసీలకు ఇచ్చేశారట కదా.. మంత్రి ఆబ్లిగేషన్... ఇవ్వకేం చేస్తారు..?...’ ఓ రాజకీయ పార్టీ నేతల మధ్య సంభాషణ. ‘ఆ’ డివిజన్ మహిళలకు ఇస్తే మనకు మంచిది. మన వాళ్లున్నారు. అధికార పార్టీ టీఆర్ఎస్ రాష్ట్ర నాయకునికి ఓ నేత సూచన. జీహెచ్ఎంసీలోని 150 డివిజన్లలో ఏ వర్గానికి ఎన్ని అనేది లెక్క తేలడంతో ఇప్పుడు అందరి దృష్టి దీనిపై పడింది. ఫలానా డివిజన్‌ను ఫలానా వర్గానికి రిజర్వు చేయాలి. ఈసారి అది ‘ఆ’ వర్గానికిరిజర్వ్ కాకుండా చూడాలి. మళ్లీ వారికే రిజర్వు అయితే నేనిక ఎప్పుడు పోటీ చేయాలి? ఓ ప్రజాప్రతినిధి వద్ద స్థానిక యువనేత ఆవేదన. ఇలా రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్న వారు... తమ వాళ్లను రంగంలో దింపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్న వారు డివిజన్ల రిజర్వేషన్ల కోసం తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఈ సమాచారం తెలుసుకునేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. సమాచారం తెలియక క్షణక్షణానికీ వీరి హార్ట్‌బీట్ పెరుగుతోంది. తాము కోరుకుంటున్న డివిజన్ వేరే వర్గానికి రిజర్వు అయితే ఏం చేయాలి..? ప్రత్యామ్నాయంగా ఇరుగు పొరుగున ఉన్న డివిజన్లలో పోటీ చేయవచ్చా? అక్కడ నిలబడితే గెలుస్తామా? ఇలా విభిన్న అంశాలపై రాజకీయ నేతలు సన్నిహితులతో చర్చిస్తున్నారు. రిజర్వేషన్లో సంబంధిత డివిజన్ ఏ వర్గానికి పోతుందో తెలియక ముందే ప్రజల్లోకి వెళ్లడం... ప్రచారం చేసుకోవడం వృథా అని కొంతమంది ఆశావహులు నిట్టూరుస్తున్నారు. ఇలా ఏ రాజకీయ పార్టీలో చూసినా ఇదే హాట్ టాపిక్‌గా మారింది. శుక్రవారం ఎన్ని డివిజన్లు ఏయే వర్గాలకో తెలియడంతో... శనివారం ఎవరికి ఏ డివిజన్ కేటాయించారో తెలుస్తుందేమోననే ఆశతో అనేక మంది దాని పైనే దృష్టి సారించారు. కమిషనర్ సమీక్ష మరోవైపు ఎన్నికల ప్రక్రియకు సంబంధించి జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి అధికారులతో సమీక్షించారు. అన్ని డివిజన్లలో వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాల్సిందిగా సంబంధిత జోనల్/డిప్యూటీ కమిషనర్లకు సూచించారు. డివిజన్ల వారీగా సాధారణ ఓటర్లు, బీసీలు, 2011 జనగణన మేరకు ఎస్సీ, ఎస్టీ జనాభా తదితర వివరాలతో సరిపోలుస్తూ... ఎక్కడా ఎలాంటి తేడాలు రాకుండా అన్నీ సవ్యంగా ఉన్నాయో లేదో సరిచూసుకోవాల్సిందిగా సూచించినట్లు తెలిసింది. మరోవైపు ఎస్టీ/ఎస్సీ/బీసీ/మహిళ/ జనరల్ డివిజన్లను సర్కిళ్ల వారీగా కేటాయిస్తారా? లేక నియోజకవర్గాల వారీగానా అనే చర్చలు జోరుగా సాగాయి. జీహెచ్ఎంసీ మొత్తాన్ని ఒకే యూనిట్‌గా తీసుకొని వీటిని ఖరారు చేస్తారని సంబంధిత అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. -
మూడు రోజులే..
►సమీకరణకు ముగుస్తున్న గడువు ►రాజధాని నిర్మాణానికి సర్కారీ లక్ష్యం 31,205 ఎకరాలు ►ఇప్పటివరకు సమీకరించింది 18,634 ఎకరాలు మాత్రమే ►రైతుల నుంచి వెల్లువలా వస్తున్న అభ్యంతర పత్రాలు ►కురగల్లులో డిప్యూటీ కమిషనర్ ఎదుట బైఠాయింపు ►గ్రామ కంఠం వెలుపల స్థలాల యజమానుల్లో ఆందోళన సాక్షి ప్రతినిధి, గుంటూరు : రాజధాని భూ సమీకరణ ప్రక్రియ పూర్తికావడానికి ఇంకా మూడు రోజుల సమయమే ఉంది. గడుపు సమీపిస్తున్న కొద్దీ అభ్యంతర పత్రాలు (9.2 ఫారాలు) ఇచ్చే రైతుల సంఖ్య పెరుగు తోంది. మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి, మంగళగిరి రైతులు రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చేది లేదంటూ అభ్యంతర పత్రాలను ఎక్కువగా ఇస్తున్నారు. వీరితోపాటు గ్రామ కంఠం వెలుపల ఇళ్లు, నివేశన స్థలాలు ఉన్నవారు కూడా ఎక్కువగా అందజేస్తున్నారు. గ్రామాలు విస్తరించిన నేపథ్యంలో గ్రామ కంఠం వెలుపల స్థలాలు, ఇళ్లు ఉన్న ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొందరు రియల్టర్లు ఈ పరిస్థితిని ముందుగానే ఊహించి నెల రోజుల క్రితం గ్రామకంఠం వెలుపల ఉన్న నివేశన స్థలాలను హడావుడిగా అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. ఈ నిబంధనలు తెలియని అమాయక రైతులు ఆందోళన చెందుతున్నారు.డిసెంబరు 8 వ తేదీన తీయించిన శాటిలైట్ చిత్రాన్ని అనుసరించి గ్రామ కంఠం విస్తీర్ణాన్ని నిర్ణయిస్తారని అధికారులు చెబుతున్నారు. దీనిని బట్టి తమ స్థలాలు భూ సమీకరణ పరిధిలోకి వస్తాయో లేదో తెలుసుకునే ప్రయత్నంలో రైతులు ఉన్నారు. ఎందుకైనా మంచిదనే అభిప్రాయంతో ఈ స్థలాలు, ఇళ్లకు కూడా అభ్యంతర పత్రాలను ఇస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి, మంగళగిరిలో 16,520 ఎకరాలను సమీకరిం చేందుకు నోటిఫికేషన్ జారీ చేయగా బుధవారం సాయంత్రానికి 2,824 ఎకరాలకు రైతులు అంగీకారపత్రాలు ఇచ్చారు. తాడేపల్లి, ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లోని సీఆర్డీఏ కార్యాలయాలు రైతులు రాకపోవడంతో వెలవెలబోయాయి. రాత్రి 8గంటల సమయంలో కురగల్లు గ్రామంలోని రైతులు, మహిళలు భూసమీకరణకు వ్యతిరేకంగా సీఆర్డీఏ డిప్యూటీ కమిషనర్ చంద్రుడు వాహనానికి అడ్డుగా నిలిచి తమ నిరసన వ్యక్తం చేశారు. ల్యాండ్ పూలింగ్ను ఉపసంహరించుకోవాలని, లేకపోతే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని ఆయన వాహనం ముందు బైఠాయించారు. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో జనవరి 1 తేదీన భూ సమీకరణ ప్రారంభమైంది. మొత్తం 31,205 ఎకరాలను సమీకరించాలని లక్ష్యంగా తీసుకుంటే బుధవారం సాయంత్రానికి 18,634 ఎకరాలను మాత్రమే సమీకరించారు. మిగిలిన ఈ మూడు రోజుల్లో నిర్ణయించిన లక్ష్యాన్ని సాధించలేమనే అభిప్రాయానికి వచ్చారు. ఇప్పటికి సగటును రోజుకు 400 నుంచి 500 ఎకరాలు మాత్రమే సమీకరించారు. రాయపూడి, వెంకటపాలెం, ఉండవల్లి, పెనుమాక, మంగళగిరి తదితర గ్రామాల్లో భూసమీకరణకు వ్యతిరేకంగా 9.2 ఫారాలు అందిస్తూనే ఉన్నారు. నదీపరివాహక గ్రామాల్లోని రైతులు ప్యాకేజీ పెంచాలని చేస్తున్న డిమాండ్‌కు ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో అంగీకార పత్రాలు ఇచ్చేందుకు ముందుకు రాలేదు. భూ సమీ కరణకు రైతులు ముందుకు రాకపోయినా, మంగళగిరి నియోజకవర్గంలోని భూములు తీసుకు నేందుకు తమకంటూ ఒక మార్గం ఉందని అధికారులు చెబుతున్నారు. ఆ విధానాలను అనుస రించేందుకు అవసరమైన చర్యలు ప్రారంభించారు. అదే విధంగా ఈనెల 14 నుంచి భూ సమీకరణకు నియమితులైన కొందరు డిప్యూటీ కలెక్టర్లు, ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆ విధుల నుంచి రిలీవ్ చేయనుందని తెలుస్తోంది. -
ఓటమి భయం.. తమ్ముళ్ల రచ్చ
నెల్లూరు (నవాబుపేట): తెలుగు తమ్ముళ్లకు స్టాండింగ్ కమిటీ ఎన్నికల భయం పుట్టుకుంది. ఎలాగైనా ఎన్నికను వాయిదా వేసేందుకు టీడీపీ కార్పొరేటర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం సాయంత్రం టీడీపీ కార్పొరేటర్లు నూనె మల్లికార్జునయాదవ్, షేక్ వహీదా, ఊటుకూరు మస్తానమ్మలు తమకు స్టాండింగ్ కమిటీ ఎన్నికల సర్క్యులర్ అందలేదని, స్టాండింగ్ కమిటీ ఎన్నికలను వాయిదా వేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ చక్రధర్‌బాబుకు వినతి పత్రం అందజేశారు. ఆ సమయంలో తమకు సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం చేశారంటూ కమిషనర్‌ను టీడీపీ కార్పొరేటర్లు నిలదీశారు. స్పందించిన కమిషనర్ డిప్యూటీ కమిషనర్‌పై అసహనం వ్యక్తం చేశారు. ఎందుకు ఇలా చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఏవీ వీరభద్రారావును ఉద్దేశించి ‘న్యూసెన్స్’ క్రియేట్ అయ్యేవరకు తీసుకొచ్చావని మందలించాడు. ఈ క్రమంలో కార్పొరేటర్ నూనె మల్లికార్జున్‌యాదవ్ దూసుకొచ్చి ‘మేం న్యూసెన్స్ క్రియేట్ చేసేలా కనిపిస్తున్నామా’ అంటూ కమిషనర్ పైకి వచ్చారు. ఎంతకీ తగ్గకపోవడంతో కమిషనర్ పైకి లేచి ‘మీరు ఆఫ్ట్రాల్ కార్పొరేటర్లు. గెటౌట్ ఇన్మై చాంబర్’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కార్పొరేటర్లు కమిషనర్ చాంబర్ ముందు ధర్నాకు దిగారు. సాయంత్రం 6 గంటల నుంచి 9.15 వరకు ఆందోళనకు దిగారు. కమిషనర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ.. క్షమాపణ చెప్పే వరకు కదిలేది లేదని బైఠాయించారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు చాట్ల నరసింహరావు, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, కిలారి వెంకటస్వామి కార్పొరేటర్లను సముదాయించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కార్పొరేటర్లు శాంతించలేదు. -
నల్లగొండ డీటీసీగా చంద్రశేఖర్‌గౌడ్
నల్లగొండ అర్బన్ : జిల్లాకు రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్ (డీటీసీ) పోస్టును ప్రభుత్వం మంజూరు చేసింది. నూతన డీటీసీగా చంద్రశేఖర్‌గౌడ్‌ను నియమించింది. ప్రస్తుతం ఆయన వరంగల్ డీటీసీగా పనిచేస్తున్నారు. తెలంగాణ గ్రూప్- 1 అధికారుల సంఘం అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నారు. రీజినల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టీఏ) స్థాయిలో ఉన్న జిల్లాకు ఇటీవలే డిప్యూటీ ట్రాన్స్‌ఫోర్ట్ కమిషనరేట్ కార్యాలయాన్ని తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసింది. మూడు రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదముద్ర వేశారు. -
కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు..
కరీంనగర్ క్రైం/కరీంనగర్ అర్బన్ : కరీంనగర్ ఇన్‌కం ట్యాక్ డెప్యూటీ కమిషనర్ జయప్రకాశ్ లంచం కోసం తనను తీవ్రంగా వేధించారని సన్నిహిత చిట్‌ఫండ్ ఎండీ భూమాగౌడ్ తెలిపారు. రూ.50 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడని, కాళ్లు పట్టుకున్నా కనికరించలేదని, ఆయన వేధింపులు భరించలేకనే సీబీఐ అధికారులను ఆశ్రయించానని చెప్పారు. భూమాగౌడ్ నుంచి రూ.25 లక్షలు లంచం తీసుకుంటూ ఇన్‌కం ట్యాక్స్ డెప్యూటీ కమిషనర్, ఇన్స్పెక్టర్లు రాము, భూపతి సోమవారం రాత్రి సీబీఐ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన విషయం తెలిసిందే. రాత్రి 7 గంటల నుంచి మంగళవారం ఉదయం 7 గంటల దాకా సీబీఐ అధికారులు ఇన్‌కం ట్యాక్స్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. పలు రికార్డులను స్వాధీనం చేసుకోవడంతో పాటు జయప్రకాశ్, రాము, భూపతిలను అరెస్టు చేసి హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు తరలించారు. అనంతరం భూమాగౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. ఇన్‌కం ట్యాక్స్ అధికారులు ఏవిధంగా ఇబ్బందులు పెట్టారో వివరించారు. ‘కొద్ది రోజుల క్రితం నేను కరీంనగర్లో ఓ భవనం కొన్నాను. ఈ విషయం తెలుసుకున్న జయప్రకాశ్ ఈ నెల 16న మా సన్నిహిత చిట్‌ఫండ్‌కు వచ్చి రికార్డులు తనిఖీ చేశారు. ఆ రోజు నేను పనిమీద హైదరాబాద్‌లో ఉన్నాను. ఆయన నాకు ఫోన్ చేసి ఇన్‌కం ట్యాక్స్‌కు సంబంధించిన రికార్డులు సరిగా లేవన్నారు. రేపు వచ్చి తన ఆఫీసులో కలవమన్నారు. మరసటి రోజు ఆయనను కలిస్తే.. రికార్డులు సరిగా లేవని, రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పది రోజుల క్రితమే నేను రూ.8.60 లక్షలు ఇన్‌కం ట్యాక్స్ కట్టాను. ఆ రికార్డులను తీసుకొచ్చి చూపించినా ఒప్పుకోలేదు. నన్ను భయభ్రాంతులకు గురిచేసి లంచం కోసం ఒత్తిడి చేశాడు. అంత డబ్బు ఇచ్చుకోలేనని కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు. చివరకు రూ.25 లక్షలు ఇమ్మన్నాడు. ఆయన వేధింపులు భరించలేక ఈ నెల 17న సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశాను. వారి సూచన మేరకు ముందుగా రాము, భూపతిలకు రూ.2లక్షలు ఇచ్చాను. ఆ డబ్బును వారిద్దరు పంచుకున్నారు. రాత్రి 7 గంటలకు జయప్రకాశ్‌కు ఫోన్ చేసి మిగతా రూ.23 లక్షలు తెచ్చానని చెప్పాను. ఆయకర్ భవన్ సమీపంలో పార్కింగ్ చేసి ఉన్న తన కారులో డబ్బు పెట్టమన్నారు. కొద్దిసేపటికి ఆయన కారువద్దకు వచ్చి డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. జయప్రకాశ్ గతంలో కూడా పలుమార్లు డబ్బుల కోసం వేధింపులకు గురిచేశాడు. మా దగ్గర పనిచేస్తున్న ఆడిటర్ శివకుమార్ ఇన్‌కం ట్యాక్స్ అధికారులతో మధ్యవర్తిగా వ్యవహరించాడు’ అని భూమాగౌడ్ వాపోయాడు. -
మద్యం దుకాణాల కేటాయింపునకు రంగం సిద్ధం
శ్రీకాకుళం క్రైం: జిల్లాలోని 232 మద్యం దుకాణాల కేటాయింపునకు సంబంధించి సర్వం సిద్ధం చేశామని ఎక్సైజ్‌శాఖ జిల్లా డిప్యూటీ కమిషనర్ టి.నాగలక్ష్మి తెలిపారు. తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దుకాణాల ఏర్పాట్లు తదితర విషయాలపై ఆమె మాట్లాడారు. పదివేల లోపు జనాభా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లోని దుకాణాల లెసైన్సు ఫీజును రూ. 32.5 లక్షలుగా కేటాయించారు. పది వేల నుంచి 50 వేలలోపు జనాభా ఉన్న ప్రాంతాల్లోని దుకాణాలకు రూ. 36 లక్షలుగా, పట్టణ ప్రాంతంలోని దుకాణాలకు రూ. 45 లక్షలుగా లెసైన్సు ఫీజును నిర్ణయించినట్టు వివరించారు. గతంలో మాదిరిగానే లాటరీ పద్ధతిలో దుకాణాల కేటాయింపు జరుగుతోందన్నారు. మొత్తం దుకాణాలకు సంబంధించి అసక్తి గల అభ్యర్థులు ఈ నెల 27వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తులను తమ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బాక్సుల్లో వేయాలన్నారు. 28వ తేదీన జిల్లా కలెక్టర్ సమక్షంలో అంబేద్కర్ అడిటోరియంలో లాటరీ పద్ధతి ద్వారా దుకాణాలను కేటాయిస్తామన్నారు. జిల్లాలో 14 సర్కిళ్లు ఉండగా, వాటిలో శ్రీకాకుళం, పలాస ఎక్సైజ్ సూపరింటెండెంట్ల పరిధిలో ఏడేసీ సర్కిళ్లు ఉన్నట్టు పేర్కొన్నారు. శ్రీకాకుళం సర్కిల్ పరిధిలో 134 , పలాస పరిధిలో 98 దుకాణాలు ఉన్నట్టు వివరించారు. మొత్తం 232 దుకాణాలకు సంబంధించి గతంలో రూరల్ ప్రాంతాల్లో ఉన్న ఐదు దుకాణాలకు అసలు టెండర్లే పడలేదని, వాటిని ప్రస్తుతం శ్రీకాకుళం పట్టణంలో కేటాయించటం జరుగుతుందన్నారు. జిల్లా పరిషత్‌కు సమీపంలో ఒకటి, ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో రెండు, డే అండ్ నైట్ జంక్షన్ సమీపంలో రెండు దుకాణాలను కేటాయించనున్నట్టు వెల్లడించారు. అసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఒక్కో దుకాణానికి రూ. 25 వేలు చలానా తీయాల్సి ఉంటుందని, అలాగే రూ. ఐదు లక్షలకు సంబంధించిన డీడీని దరఖాస్తుతో జత చేయాలన్నారు. ఏ-1, ఏ-2, ఏ-3 డిక్లరేషన్లతో పాటు ఆరు ఫొటోలను దరఖాస్తుకు జత చేయాలన్నా. జూలై ఒకటో తేదీ నుంచి కొత్త దుకాణాలు ప్రారంభమవుతాయన్నారు. కాగా బార్లకు సంబంధించి 50 వేల జనాభా దాటి ఉన్న ప్రాంతాల్లో లెసైన్సు ఫీజులు పెంచారు. శ్రీకాకుళం సమీపంలోని పది బార్లకు సంబంధించి గతంలో రూ. 35 లక్షల లెసెన్స్ ఫీజు ఉండగా ప్రస్తుతం మరో మూడు లక్షల రూపాయలు పెంచుతూ 38 లక్షల రూపాయలుగా నిర్ణయించామన్నారు. సమావేశంలో శ్రీకాకు ళం, పలాస ఎక్సైజ్ సూపరింటెండెంట్లు కె.ఏసుదాసు, ఎస్.సుకేష్లు పాల్గొన్నారు.