వరదాయని | Deputy commissioner Srividya has saved many lives | Sakshi
Sakshi News home page

వరదాయని

Published Fri, Sep 21 2018 12:03 AM | Last Updated on Fri, Sep 21 2018 5:06 AM

Deputy commissioner Srividya has saved many lives - Sakshi

వరద ఉధృతికి ముందే కొడగు ప్రజల్ని తరలించడానికి శ్రీవిద్య చేయించిన ఏర్పాట్లలో  ఈ చెక్క వంతెన ఒకటి. (ఇన్‌సెట్‌) అధికారులతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న శ్రీవిద్య

వరాలిచ్చే తల్లి వరదాయని. శ్రీవిద్యను వరదాయని అని అనడం ఎందుకంటే.. కేరళ వరదోధృతిలో ఆమె అనేకమంది ప్రాణాలను కాపాడి  పునరుజ్జీవితాన్ని వరంగా ఇచ్చారు!

శ్రీవిద్య ఐఏఎస్‌ ఆఫీసర్‌. పుట్టింది కేరళ రాష్ట్రం, కొల్లం జిల్లా కొట్టరకార గ్రామంలో. త్రివేండ్రంలో బీఏ ఇంగ్లిష్‌ లిటరేచర్, ఆ తర్వాత కేరళ లా అకాడమీలో న్యాయశాస్త్రం చదివారు. సివిల్స్‌లో 14వ ర్యాంక్‌తో 2009లో కర్ణాటక కేడర్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ డిప్యూటీ సెక్రటరీగా కొంతకాలం పనిచేశారు. ప్రస్తుతం కొడగు జిల్లా డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారామె. ఎనిమిది నెలల కిందట ఆ బాధ్యతలు చేపట్టిన శ్రీవిద్యకు గత నెలలో సంభవించిన భారీ వరదలు పెద్ద సవాల్‌ అనే చెప్పాలి. అయితే ఆమె ఆ సవాల్‌ను చాలా చాకచక్యంగా నిర్వర్తించారు. ప్రస్తుతం పై అధికారుల నుంచి, సోషల్‌ మీడియాలోనూ ఆమె మీద ప్రశంసల వర్షం కురుస్తోంది.

ప్రకృతి విలయ తాండవం
కేరళలో వర్షాలు ఎక్కువయ్యాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలతో పరిస్థితి చేయి దాటుతోంది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన కొడగు (కూర్గ్‌) కేరళ సరిహద్దు జిల్లా వయనాడును ఆనుకునే ఉంటుంది. వర్షాల ప్రభావం కొడగును కూడా కదిలించి వేయడం మొదలైంది. ఆగస్టు 12 రాత్రి శ్రీవిద్యకు ఫోన్‌ కాల్‌ వచ్చింది. జిల్లా కేంద్రం నుంచి హుటాహుటిన బయలుదేరారామె. పర్వత ప్రాంతాల్లో ప్రకృతి విలయతాండవం చేస్తోంది. పరిస్థితి బీభత్సంగా ఉంది. అధికార యంత్రాంగాన్ని కదిలించాలి, ప్రాణనష్టం జరగకుండా కాపాడాలి, వీలయినంత వరకు ఆస్తి నష్టాన్ని కూడా నివారించాలి. పరిస్థితిని అధికారికంగా ప్రకటించడానికి పూర్తి స్థాయి వివరాలందడం లేదు. కొంత సంశయం... అయినప్పటికీ వేచి చూసే పరిస్థితి ఉన్నట్లు కనిపించడం లేదు. తక్షణమే ప్రమాద హెచ్చరికలు జారీ చేశారామె. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం రంగం లోకి దిగింది.

రోడ్లు ఉండగానే చేర్చాలి
కొడగు అసలే కొండ ప్రాంతం. భారీ గాలివానల్లో కొండ చరియలు విరిగి పడే ప్రమాదం పొంచి ఉంటుంది. కొండ వాలులో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. ముంపు ప్రాంతాల జనాన్ని కూడా క్యాంపులకు చేర్చాలి. స్థానిక రేడియోల్లో, కేబుల్‌ టీవీల ద్వారా ప్రమాద హెచ్చరికలు జారీ చేయించాలి. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లమని, కొండవాలులో సంచరించవద్దని గ్రామాల్లో దండోరా వేయించాలి. ఇళ్లను వదిలి వెళ్లడానికి సామాన్య ప్రజానీకాన్ని మానసికంగా సిద్ధం చేయాలి. వారిని తరలించడానికి అవసరమైన రవాణా సౌకర్యాలను కల్పించాలి. వరద ఉధృతికి రోడ్లు కొట్టుకు పోకముందే జనాన్ని క్షేమంగా క్యాంపులకు చేర్చాలి. సాధ్యమైతే ముంపు ప్రాంతాల్లోని సివిల్‌ సప్లయిస్‌ గోడౌన్‌ల నుంచి ఆహారధాన్యాలను కూడా  కాపాడగలగాలి. అన్ని శాఖలకూ ఆదేశాలు వెళ్లిపోయాయి. పని మొదలైంది. ఇదంతా ఒక్క పూటలో పూర్తయిపోయింది. 

అందరితో ఒక ‘బృందం’
పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అవసరమైన ఆదేశాలు జారీ చేయడానికి శ్రీవిద్య తన ఆఫీస్‌ పక్కనే ఒక కంట్రోల్‌ రూమ్‌ను ఓపెన్‌ చేయించారు. వరద సహాయక చర్యలను స్వయంగా సమన్వయం చేశారు. స్థానిక ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో బలమైన బృందాన్ని తయారు చేయగలిగారామె. స్వయంగా పర్యవేక్షిస్తూ సహాయక చర్యలను నిర్వర్తించారు. ప్రమాద తీవ్రతను అంచనా వేసి పటిష్టమైన జాగ్రత్తలు తీసుకోవడం వల్లనే ప్రాణనష్టాన్ని నివారించగలిగామంటారామె. ఆస్తి నష్టం కూడా భారీగా జరగలేదన్నారు. జిల్లాలో వరద బాధితుల క్షేమం కోసం ఒక సమర్థవంతమైన అధికారిగా ఇంత చక్కగా చేశారామె. మరి ఆమె కుటుంబం సంగతి ఏమిటి?

భర్తతో మాట్లాడ్డమే కుదర్లేదు!
ఆమె భర్త నారాయణన్‌ కేరళ రాష్ట్రంలోని పాథానాంతిట్ట జిల్లా పోలీస్‌ ఆఫీసర్‌. ఆ ప్రాంతం కూడా అత్యంత దయనీయమైన స్థితిలో చిక్కుకుపోయింది. అక్కడ వరద సహాయక చర్యల్లో ఉండిపోయారాయన. ఆ క్లిష్టమైన సమయంలో ఐదారు రోజుల పాటు భార్యాభర్తలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కూడా కుదరలేదు. పరిస్థితులు చక్కబడే వరకు ఆమె నాలుగేళ్ల కొడుకు కూడా సహాయక క్యాంపులోనే గడపాల్సి వచ్చింది. ఆమె అత్త, మామగారు కూడా అదే క్యాంపులో బిడ్డ సంరక్షణ చూసుకుంటూ గడిపారు. అప్పటి పరిస్థితులను వివరిస్తూ ‘‘సమాచార వ్యవస్థ చిన్నాభిన్నమైంది. అక్కడ నా భర్త ఉన్న ప్రదేశంలో వరద ఎంత భయానకంగా ఉందనే వివరాలు నాకు తెలియదు. ఇక్కడ నా జిల్లాలో పరిస్థితి ఏమిటనేది ఆయనకు సమాచారం లేదు. మా మధ్య మాటల్లేని రోజులవి’’ అంటూ నవ్వారు. 

టూరిస్టులకు హెచ్చరిక
ఆగస్టు 20వ తేదీకి పరిస్థితి కొంత అదుపులోకి వచ్చింది. నిత్యావసర వస్తువులను గ్రామాలకు, క్యాంపులకు తరలించడం సులువైంది. స్థానిక ప్రజలను రక్షించడం ఒక ఎత్తయితే, పర్యాటకులను కాపాడటం మరొక ఎత్తయింది. కొడగులో ప్రమాదకరమైన ప్రదేశాల గురించి వాళ్లకు అవగాహన ఉండదు. కూర్గ్‌ కాఫీ తోటలు ప్రఖ్యాత పర్యాటక ప్రదేశం కావడంతో సందర్శకుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది.  ప్రకృతి విలయం గురించిన సరైన సమాచారం లేక కొందరు పర్యాటకులు వారి ముందస్తు ప్రణాళిక ప్రకారం వచ్చేశారు. అప్పుడు అప్రమత్తమై వారినీ క్యాంపులకు తరలించారు. రాబోయే పర్యాటకులను హెచ్చరించి కొడగు చేరకముందే వెనక్కి పంపించే ఏర్పాట్లు చేశారు. ఒక నెల పాటు పర్యాటకులకు ప్రవేశం నిషిద్ధం అని అధికారికంగా ప్రకటించి, పరిస్థితి పూర్తిగా చక్కబడిన తర్వాత నిషేధాన్ని తొలగించారు. మొత్తం మీద శ్రీవిద్య వరదను అరచేతితో ఆపలేదనే మాటే కానీ అంతటి నైపుణ్యంతో పనిచేశారు. ప్రజాజీవనాన్ని త్వరగా చక్కబెట్టారు.
– మంజీర

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement