
తారుమార్..తక్కెడమార్
సాక్షి ప్రతినిధి, కాకినాడ :‘దేవుని దయ ఉంటే ఏదైనా సాధ్యమే!’ అని భక్తులు నమ్ముతారు. అయితే తమ దయ ఉంటే చని పోయిన వారు లేచి రావడం, భూముల్ని కౌలుకు తీసుకుని సేద్యం చేయడం కూడా సాధ్యమేనని నిరూపిస్తున్నారు దేవాదాయ శాఖ అధికారులు. పిఠాపురం శ్రీ సంస్థానం సత్రానికి తొండంగిలో గల భూముల అవినీతి వ్యవహారంలో ఇది మరో కోణం. ‘అప్పనంగా చప్పరించేశారు’ శీర్షికన ‘సాక్షి’ సోమవారం ఈ భూబాగోతాన్ని వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. శ్రీ సంస్థానానికి చెందిన 218.46 ఎకరాలకు 2012 మార్చిలో, జూన్‌లో 232 ఎకరాలకు రెండు దఫాలుగా నోటిఫికేషన్‌లు ఇవ్వడం,
వాటిలో 218.46 ఎకరాలకు ఆమోదం తెలపడం, 232 ఎకరాలకు ఆమోదం లేకున్నా అనధికారికంగా కౌలు హక్కులు కట్టబెట్టడాన్ని ‘సాక్షి’ సోదాహరణంగా వివరించింది. ఈ వ్యవహారంలో తవ్వేకొద్దీ అనేక లొసుగులు బయటపడుతున్నాయి. 232 ఎకరాలకు వేలం నిర్వహించకుండా 126 మందికి కౌలుకు ఎందుకు ఇచ్చారు, ఇందుకు ఎవరు బాధ్యులు అని అక్కడి రైతులు ప్రశ్నిస్తున్నారు. దేవాదాయ శాఖ ఆదాయానికి గండి కొట్టిన వారి నుంచి రికవరీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
సస్పెండ్ అయిన మేనేజర్ తరువాత ఈఓ చలపతిరావు 2013 నవంబర్ 30న బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం వెనుక ఎవరి హస్తం ఉందని ప్రశ్నిస్తున్నారు. లీజు లేకపోయినా.. 2012-13, 2013-14 కాలానికి బినామీదారులకు భూములిచ్చి వ్యవసాయం చేయించడమే కాక ఈ ఏడాది కూడా వారితోనే వ్యవసాయం కొనసాగించాలనుకోవడం వెనుక మతలబేమిటో తేలాలంటున్నారు. చనిపోయిన వారి పేరున కూడా లీజులు కొనసాగిస్తూ తమకు నచ్చిన వారికి వేలం హక్కులు కట్టబెడుతూ లక్షలు వెనకేసుకోవడమే కాక ఇతర జిల్లాలకు వలసపోయినవారిని కౌలుదారులుగా చూపి ఆరేడేళ్లుగా అదే కొనసాగిస్తున్నారని అంటున్నారు. దీనిపైనే రైతులు దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. దాని మేరకు వివరాలిలా ఉన్నాయి.
లక్షల వ్యయంతో బోర్ల ఏర్పాటు
ఇక పలువురు రైతులను భూమిలేని నిరుపేదలు(ఎల్‌ఎల్‌పీ)గా చూపి, 28 ఎకరాలను కౌలుకు ఇవ్వడం వెనుక పెద్ద ఎత్తున సొమ్ములు చేతులు మారాయంటున్నారు. వీరిలో 10 మంది స్థానికంగా సంపన్న వర్గాలకు చెందిన వారే. ఇతర ప్రాంతాలకు వలస పోయిన మరికొందరినీ ఎల్‌ఎల్‌పీగా చూపి భూములు కట్టబెట్టారని తెలిసింది. వీరిని ఐదేళ్లుగా ఎల్‌ఎల్‌పీగా చూపుతున్నా పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. వారి పేరిట లీజును కొనసాగిస్తూ 2014 జూన్ 3న ఉన్నతాధికారులు ఉత్తర్వులు ఎలా ఇచ్చారు, ఆ భూముల్లో సొంత భూముల్లో మాదిరి రెండు వ్యవసాయ బోర్లు ఎలా వేశారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
మూడేళ వ్యవధికి లీజుకు ఇచ్చే దేవాదాయ భూముల్లో లక్షల ఖర్చుతో బోర్లు వేయడమంటే శాశ్వతంగా ఆ భూములు తమ చేతుల్లో ఉంటాయన్న ధీమాయే కారణమంటున్నారు. రాజుబాబు, ఎం.సూరిబాబు, ఎన్.నాగేశ్వరరావు, వి.సూర్యచంద్రరావు, పి.సూర్యనారాయణ, సత్యనారాయణ, ప్రసాద్, అనంతలక్ష్మి, ఎం.శ్రీను, జి.సత్తిబాబు, ఎన్.పి.రాజు, బుల్లయ్య, కె.నాగచక్రరావు, సుబ్బారాయుడు తదితరులను ఎల్‌ఎల్‌పీగా చూపడాన్ని స్థానిక రైతులు ప్రశ్నిస్తున్నారు. వారిలో కొందరికి ఐదు నుంచి పదెకరాల సొంత భూములున్నాయంటున్నారు. వీటన్నింటిపైనా సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుని మొత్తం భూములకు వేలం నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.
విచారణకు ప్రత్యేక బృందం
శ్రీ సంస్థానం భూ బాగోతంపై ‘సాక్షి’ కథనానికి స్పందించిన దేవాదాయ శాఖ ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చందు హనుమంతురావు.. నిజాలు నిగ్గుతేల్చేం దుకు స్పెషల్ డిప్యూటీ కమిషనర్ వసంతరావుతో పాటు తహశీల్దార్ బి.శ్రీనునాయక్, డిప్యూటీ తహశీల్దార్ సి.హెచ్.జయశ్రీకుమార్, సర్వేయర్‌లు ఎం.రామచంద్రరావు, పీఎస్‌ఆర్ ఆచార్యులుతో ప్రత్యేకబృందాన్ని నియమించారు. ఈ వ్యవహారంపై హనుమంతురావు సోమవారం కాకినాడలో ఇతర అధికారులతో సమీక్షించారు. ఎప్పటి నుంచి భూములకు వేలం నిర్వహిస్తున్నారు, రెండేళ్ల క్రితం భూముల వేలం సందర్భంగా అనుసరించిన పద్ధతుపై ఆరా తీశారు. విచారణాధికారిగా నియమితులైన వసంతరావు విడిగా శ్రీ సంస్థానం సత్రం అధికారులను, సిబ్బందిని విచారించారు. 500 ఎకరాల వేలానికి సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.