రియల్టర్లకు అండగా నిలిచిన రాజ్యాంగేతరశక్తి
లే అవుట్ల విలువ పెరిగేందుకు రోడ్డు నిర్మాణం
రమణయ్యపేటలో పేదల ఇళ్ల స్థలాలకు ఎసరు
రాజ్యాంగేతరశక్తికి రూ.2 కోట్లకు పైగా ముడుపులు!
పేదల జాగాను కొల్లగొట్టి పెద్దోళ్లకు రాచబాట పరిచే కుతంత్రానికి కాకినాడ సమీపంలో తెరలేచింది. రెవెన్యూ ఆధీనంలోకి తీసుకున్న స్థలాన్ని అధికారం చేతుల్లో ఉంది కదా అని అధికార యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చి స్వార్థం కోసం నిరుపేదలను రోడ్డు పాల్జేయడానికి సైతం వెనుకాడ లేదు రాజ్యాంగేతరశక్తిగా వ్యవహరిస్తున్న ఓ టీడీపీ నేత. పేదల నీడ, గూడులకు కీడు తలపెట్టిన సదరునేత రియల్టర్లకు మేలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. అందు కోసం అతడికి భారీ మొత్తం ముట్టనుంది.
సాక్షి ప్రతినిధి, కాకినాడ : అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధిని అడ్డం పెట్టుకుని రాజ్యాంగేతరశక్తిగా చక్రం తిప్పుతున్న ఆ పార్టీ నేత అవినీతి బాగోతానికి కాకినాడ రమణయ్యపేట వేదికగా నిలిచింది. అక్కడి 236/1, 239/2, 252/6బి, 253 సర్వేనంబర్లలో 4.59 ఎకరాల భూమి నీటిపారుదలశాఖ పరిధిలో ఉండడంతో అప్పటి ఆర్డీవో జవహర్‌లాల్‌నెహ్రూ ఇరిగేషన్ అధికారులను ఒప్పించి రెవెన్యూకు బదలాయించేందుకు ప్రయత్నించారు. తరువాత వచ్చిన ఆర్డీవో అంబేద్కర్ గోదావరి కాలువ గట్టుగా ఉన్న ప్రాంతాన్ని రెవెన్యూ ఆధీనంలోకి తీసుకున్నారు.
ఆ భూముల్లో తమకు కేటాయించాలని పరిసరప్రాంతాల్లో నివాసం ఉంటున్న పేదలు 2014లో రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబుకు మొరబెట్టుకున్నారు. వారి ఇబ్బందులను స్వయంగా పరిశీలించిన కన్నబాబు, మానవతాదృ క్పథంతో స్పందించి 166 మంది పేదలకు పట్టాలు అందచేశారు. వారితో పాటు మూడు దశాబ్దాలుగా అదే ప్రాంతంలో పూరిపాకలు వేసుకుని నివాసం ఉంటున్న మరో 194 మందికి కూడా మరోవైపు పట్టాలు ఇచ్చారు. వీరంతా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి స్థలాలు చూపిస్తారని ఆశగా ఎదురుచూస్తున్నారు.
అంతకు ముందు నుంచే భూములు లబ్ధిదారులకు స్వాధీనం చేయాలని కన్నబాబు పదేపదే అధికారులకు చెబుతూ వచ్చారు. కానీ వారు సకాలంలో స్పందించిన దాఖలాలు లేవు. ఇంతలో సాధారణ ఎన్నికలు జరిగి టీడీపీకి చెందిన పిల్లి అనంతలక్ష్మి ఎమ్మెల్యే అయ్యారు. అప్పటి నుంచీ పట్టాలు పొందిన లబ్ధిదారులకు కష్టాలు మొదలయ్యాయి. ‘పట్టాలు ఇచ్చారు స్థలాలు చూపించం’డని చెప్పులరిగేలా అధికారుల చుట్టూ తిరిగినా స్పందన కనిపించ లేదు. ‘పై నుంచి చెప్పించండి. మా చేతుల్లో ఏమీ లే’దంటూ అధికారులు చేతులెత్తేస్తున్నారని లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు.
స్థలం చూపమంటే బూతు పురాణం..
అప్పటి నుంచీ ఆ నేత ఆ స్థలాన్ని పేదలకు ఇవ్వడం సాధ్యం కాదని, నగరాభివృద్ధికి సహకరించాలని, వేరే చోట స్థలాలు ఇస్తాం, పట్టాలు స్వాధీనం చేయమని’ లబ్ధిదారులపై అన్ని రకాలుగా ఒత్తిడి తెస్తున్నారు. ‘పట్టాలు ఇచ్చారు, స్థలం చూపించ’మంటే ఇవ్వకపోగా అసభ్యపదజాలంతో దూషిస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. అలాగని బయటకు వచ్చి తమ పేర్లు చెప్పేందుకు కూడా వారు భయపడిపోతున్నారంటే ఆ రాజ్యాంగేతరశక్తి ధాష్టీకం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా, కాకినాడ-పిఠాపురం రోడ్డు నుంచి రాజీవ్‌గాంధీ కళాశాల వరకు ఉన్న 20 కుటుంబాలను ఖాళీ చేయించి మరోవైపు స్థలాలు కేటాయించారు. మరో 20 కుటుంబాలను గాలికొదిలేశారు.
రోడ్డు వేస్తున్న పంచాయతీ
ఆ రాజ్యాంగేతరశక్తి ఆదేశాలతో పంచాయతీ లక్షలు వెచ్చించి 60 అడుగుల గ్రావెల్ రోడ్డు కూడా వేస్తోంది. సర్పవరం, తిమ్మాపురం, పనసపాడు ప్రాంతాల్లో లే అవుట్‌లు వేసిన రియల్టర్లు ఈ రోడ్డు ఎంతో ఉపయోగంగా ఉంటుందనే ముందుచూపుతోనే ఆ నేత అడిగినంతా ఇచ్చుకునేందుకు అంగీకరించారంటున్నారు. డంపింగ్ యార్డును బూచిగా చూపించి రియల్టర్లకు దోచిపెడుతున్నారని విజ్ఞులు ఆక్షేపిస్తున్నారు. నిజంగా డంపింగ్ యార్డుకు ఈ రోడ్డు దగ్గరవుతుందనుకుంటే పట్టాలు ఇచ్చిన సమయంలో ప్లాన్‌లో చూపించినట్టు ఈ స్థలాల్లో ఒకపక్క నుంచి 60 అడుగులు కాకుండా చిన్న రోడ్డు వేస్తే సరిపోయేదంటున్నారు.
ఈ క్రమంలో రియల్టర్లు ఆగమేఘాలపై విద్యుత్ స్తంభాలు వేసుకునే పనిలో ఉన్నారు. ఒప్పందం ప్రకారం రియల్టర్‌లు పూర్తిగా సొమ్ములు ఇవ్వకపోవడంతో ఆ రాజ్యాంగేతరశక్తి ప్రస్తుతం ఆ భూముల్లో ఉన్న మిగిలిన ఇళ్లను తొలగించకుండా ఆపేశారు. కాలువగట్టు రోడ్డును ఆనుకొని గైగోలుపాడు వెనుక భాగంలో అపార్టుమెంట్లు కట్టి సొమ్ము చేసుకునేందుకు ఒక రియల్టర్ ఈ రోడ్డును అధిక ధర ఇవ్వజూపి కొనుగోలు చేసుకున్నట్లు సమాచారం.
బూమ్‌తో పేదల భూమిపై కన్ను
కన్నబాబు హయాంలో పేదలకు ఇళ్ల స్థలాల కోసం పట్టాలు ఇచ్చిన పరిసర ప్రాంతాల్లో రియల్‌ఎస్టేట్ బూమ్‌తో భూముల ధరలు ఒక్కసారే అమాంతం పెరిగిపోయాయి. అక్కడ ప్రస్తుతం ఎకరం రూ.రెండుకోట్లు పైనే పలుకుతోంది. ఈ నేపథ్యంలో ఆ స్థలాలకు ఆనుకుని వందల ఎకరాలు రియల్టర్‌లు కొనుగోలుచేశారు. ఈ క్రమంలోనే పేదలకని కేటాయించిన భూములపై పెద్దల కన్నుపడింది. ఇందుకు ఒక భారీ స్కెచ్‌నే వేశారు. రియల్టర్లు వేసిన వందలాది ఎకరాల లే అవుట్ల విలువ రెట్టింపు కావాలంటే నిరుపేదలకు కేటాయించిన స్థలాల నుంచి రాజమార్గం కావాలి. ఇందుకు రియల్టర్‌లు ఆ నియోజకవర్గంలో రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్న అధికారపార్టీ ముఖ్యనేతను ఆశ్రయించారు. ప్రజాస్వామ్యాన్నీ, ప్రజాప్రాతినిధ్యాన్నీ పరిహాసప్రాయం చేసి, ‘అంతా తానే, అన్నీ తానే’ అన్నట్టు చక్రం తిప్పుతున్న ఆ నేతకు రూ.2 కోట్లకు పైనే ఇచ్చేలా ఒప్పందం కుదిరిందని సమాచారం. దాంతో ఆ స్థలాల్లో నుంచి రోడ్డు వేయించడానికి, అక్కడున్న పేదలకు మరో చోట స్థలాలు ఇవ్వడానికి ఆ నేత పూచీ పడ్డాడు.
పట్టా భూములు చూపకుంటే ఉద్యమం
రమణయ్యపేటలో 166 మంది పేదలకిచ్చిన పట్టాలకు సంబంధించి భూములను తక్షణం వారికి చూపించాలి.రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఈ స్థలాన్ని రోడ్డుగా ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది. దీనిపై ఆందోళనకు దిగుతాం.
- మేడిశెట్టి వెంకటరమణ, సీపీఎం సిటీ కార్యదర్శి
వారందరికీ వేరే చోట స్థలాలు ఇస్తాం..
ఆక్రమణలో ఉన్న లబ్ధిదారులకు మరో చోట స్థలాలు ఇవ్వడానికి చూస్తున్నాం. 2014లో ఇచ్చిన పట్టాల్లో అనర్హులున్నారని ప్రజాప్రతినిధులు చెప్పారు. ఎవరైనా అర్హులుంటే వారికి వేరే ప్రాంతంలో ఇళ్ల పట్టాలు ఇస్తాం. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఎవరికీ పట్టాలు రాయలేదు. రోడ్డు వేయడమనేది మా సమస్య కాదు. అర్హులకు పట్టాలు ఇవ్వడమే మా పని. ప్రస్తుతానికి ఎవరికీ అక్కడ పట్టాలు ఇవ్వలేదు.
- జె.సింహాద్రి, తహసీల్దార్, కాకినాడ రూరల్
బడుగుల జాగాపై.. బడాబాబుల పాగా
Published Fri, May 13 2016 1:54 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement