టీబీ వార్డుకు అవినీతి రోగం
-
పోస్టుల పేరుతో కాసుల వేట
-
బ్రోకర్ల బేరసారాలు
సాక్షి ప్రతిని«ధి, కాకినాడ :
క్షయ నియంత్రణ శాఖకు అవీనీతి రోగం పట్టుకుంది. అది అసలు రోగానికంటే మించిపోయింది. ‘ఆలు లేదు...చూలూ లేదు...సామెత చందంగా ఇంకా పోస్టులపై తుది నిర్ణయం తీసుకోకున్నా మార్కెట్‌లో మాత్రం వాటికి బేరం పెట్టేస్తున్నారు. టీబీ నియంత్రణకు కేంద్రప్రభుత్వం రివైజ్డ్ నేషనల్ టీబీ కంట్రోల్ ప్రోగ్రాం (ఆర్‌ఎ¯ŒSటీసీపీ)తో ద్విముఖ వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఒకటి డైరెక్ట్ అబ్జర్వేటింగ్ ట్రీట్‌మెంట్(డీఓటీ). రెండోది డీఓటీ ప్లస్. డీఓటీలో నేరుగా మందులు ఇచ్చే విధానం ఉండగా, డీఓటీ ప్లస్‌లో మల్టీడ్రగ్ రెసిస్టెన్సీ ద్వారా పలు మందులు ఇస్తున్నారు. గత విధానంలో ఉన్న 24 క్లస్టర్‌లు రద్దు అయిపోయాయి. వాటి స్థానే జిల్లాలో 24 సీనియర్ ట్రీట్‌మెంట్ సూపర్‌వైజర్‌లు, 12 సీనియర్ క్లినికల్ సూపర్‌వైజర్‌లు, 63 టీబీ పరీక్షల కోసం 63 డీఎంసీ సెంటర్‌లు (డిజిగ్నేటెడ్ మైక్రో సెంటర్‌లు) ఏర్పాటు చేశారు. వీటిలో 21 పోస్టుల నియామకానికి సంబంధించిన ఫైల్ జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ పరిశీలనలో ఉంది. రేపో, మాపో అనుమతి రావడం ఖాయమని తేలిపోవడంతో టీబీ విభాగంలో ఉన్న కొందరు బేరసారాలకు దిగారని తెలియవచ్చింది. ఉద్యోగుల నియామక ప్రక్రియ టీబీ సొసైటీ పరిధిలో జరుగుతోంది. ఎస్‌టీఎస్ పోస్టులు 11, డాట్ సూపర్‌వైజర్ పోస్టు ఒకటి, కాకినాడ ప్రధాన కార్యాలయంలో రెండు పోస్టులు ఉన్నాయి.
ఆరు నెలల క్రితం రేటు రూ. రెండు లక్షలు
ఆరు నెలల క్రితం జిల్లాలో మూడు పోస్టులు టీబీ సొసైటీ నిర్వాహకులే భర్తీ చేశారు. అప్పట్లో ఒక్కో పోస్టుకు రూ.రెండు లక్షలు చొప్పున ముడుపులు పుచ్చుకున్నారని విమర్శలు వచ్చాయి. అల్లవరం, జగ్గంపేట, అడ్డతీగలలో మూడుచోట్ల పోస్టింగ్ ఇచ్చారు. టీబీ సొసైటీ ప్రభుత్వ సంస్థ అనుకుని వచ్చేది ప్రభుత్వ ఉద్యోగమనే భావనతో రూ.రెండు లక్షలు వరకు ముట్టచెప్పారు. తీరా జిల్లా కలెక్టర్ టీబీ సొసైటీతో సంబంధం లేకుండా వికాస్ సంస్థ ద్వారా ఔట్‌సోరి్సంగ్ విధానంలో ఈ పోస్టులు భర్తీ చేశారు. ఇందులో ఒక ఎస్‌టీఎస్ పోస్టులో అల్లవరం మండలానికి చెందిన ఒక అభ్యర్థిని విలీన మండలాలకు బదిలీ చేశారు. మూడు నెలల అనంతరం తన ఆరోగ్యం బాగుండటం లేదని, ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతానికి బదిలీ చేయాలని కోరుతూ వస్తున్నాడు. కానీ సొసైటీ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో తాను ఇచ్చిన రూ.రెండు లక్షలు తిరిగి ఇచ్చేయాలని ఆ అభ్యర్థి క్షయనియంత్రణ శాఖ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం దక్కలేదు. పర్మినెంట్ పోస్టు అని నమ్మించి ఔట్‌సోరి్సంగ్‌లో నియమించి సొమ్ములు తీసుకుని ఈ రోజు ముఖం చాటేస్తున్నా పట్టువదలని విక్రమార్కుడిలా బాధితుడు జిల్లా అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నాడు. అయినా వారు కనికరించక పోగా, ఎవరికైతే సొమ్ములు ఇచ్చావో అతన్నే అడగమని బాధితుడిని తిప్పి పంపించేస్తున్నారు.
ఇప్పటి ధర రూ.రెండున్నర లక్షల పైమాటే!
ఆరు నెలలుగా ఆ ఉద్యోగికి సమాధానం చెప్పకుండా నాన్చుతుండగా ఇప్పుడు కొత్తగా 14 పోస్టులు మంజూరయ్యాయంటూ పలువురు బ్రోకర్లు బేరసారాలకు బయలుదేరారు. ఇందులో ఎస్‌టీఎస్ పోస్టులు 11, డాట్ సూపర్‌వైజర్ పోస్టు ఒకటి, కాకినాడ ప్రధాన కార్యాలయంలో రెండు పోస్టులు ఉన్నాయి. ఒక పోస్టుకు గతంలో రూ.లక్షన్నర నుంచి రూ.రెండు లక్షలు తీసుకోగా ఇప్పుడు రూ.రెండున్నర లక్షలకు తక్కువ అయితే పని కాదని ముఖంమీదే చెప్పేస్తున్నారని తెలియవచ్చింది. అయినా ఇది కూడా ఔట్‌సోరి్సంగ్ ఉద్యోగమే అయినప్పు డు అంత ఇచ్చుకోలేమంటున్నారు. ఇప్పుడు ఔట్‌సోరి్సంగ్‌లో తీసుకున్నా కొద్ది నెలలకు పర్మినెంట్ అవుతుందని నమ్మించి గొంతు కోసే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఎవరిపైన అయితే లైంగిక వేధింపులు, టెంపరరీ ఉద్యోగుల రెన్యువల్‌కు సొమ్ములు తీసుకుంటున్నారని ఆరోపణలు వచ్చాయో వారే ఇప్పుడు పోస్టుల భర్తీలో చక్రం తిప్పుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో జిల్లా యంత్రాంగం కట్టడి చేయాల్సి ఉంది.