
సాక్షి, విశాఖపట్నం : విశాఖ దేవాదాయ శాఖలో విభేదాలు తెరపైకి వస్తున్నాయి. దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ పుష్ప వర్థన్‌పై అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఇసుక చల్లారు. పుష్ప వర్ధన్ మాన్సస్, సింహాచలం భూముల అక్రమాలపై లోతుగా విచారణ చేస్తున్నారు. గురువారం ఆయన తన ఛాంబర్‌లో కూర్చుని ఉండగా శాంతి చేతిలో ఇసుకతో గదిలోకి వచ్చారు. కోపంగా ఆయనపై ఇసుకను చల్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డవటంతో దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్..అసిస్టెంట్ కమిషనర్ల విభేదాలు వెలుగులోకి వచ్చాయి.
అయితే, తనను డిప్యూటీ కమిషనర్ మానసికంగా వేధిస్తున్నాడని, ఆ బాధ తట్టుకోలేక ఓ మహిళగా ఆయనపై ఇసుక చల్లి నిరసన తెలియజేశానని ఆమె తెలిపింది. కాగా, ఈ సంఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించనున్నారు. అసిస్టెంట్ కమిషనర్ శాంతిపై డిసిప్లీనరీ యాక్షన్స్ తీసుకోనున్నారు.