మహారాణిపేట (విశాఖ దక్షిణ)/సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ ఉప కమిషనర్ (డీసీ) ఈవీ పుష్పవర్ధన్‌పై సహాయ కమిషనర్ (ఏసీ) కె.శాంతి ఇసుకతో దాడి చేసిన వ్యవహారంపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్ ఆదేశాల మేరకు రాజమండ్రి దేవదాయ శాఖ ప్రాంతీయ కమిషనర్ (ఆర్‌జేసీ) సురేష్‌బాబు విచారణ జరిపారు. శుక్రవారం బురుజుపేట శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవాలయం కార్యనిర్వహణాధికారి కార్యాలయంలో ఆర్‌జేసీ విచారణ చేపట్టారు. డీసీ పుష్పవర్ధన్, ఏసీ శాంతిలతోపాటు ప్రత్యక్ష సాక్షులు దేవదాయ శాఖ పర్యవేక్షకులు బి.ప్రసాదరావు పట్నాయక్, రాజారావు, టర్నర్ సత్రం ఈవో అల్లు జగన్నాథరావులను విచారించారు. సీసీ ఫుటేజ్‌లను పరిశీలించారు. ఘటన జరిగినప్పుడున్న అధికారులు, సిబ్బంది నుంచి లిఖితపూర్వకంగా వివరణ తీసుకున్నారు.
వివరణ కోరిన మహిళా కమిషన్
విశాఖ దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఆరోపణలపై విచారణ నివేదిక అందజేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ అధికారులను కోరారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ఈ వివాదంపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని దేవదాయశాఖ కమిషనర్‌ను కోరారు. దేవదాయ శాఖ కార్యాలయాల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీ పని తీరుపై కూడా మహిళా కమిషన్ ఆరా తీసింది.
Comments
Please login to add a commentAdd a comment