Maharanipeta
-
దేవదాయశాఖ డీసీ, ఏసీల వ్యవహారంపై విచారణ
మహారాణిపేట (విశాఖ దక్షిణ)/సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ ఉప కమిషనర్ (డీసీ) ఈవీ పుష్పవర్ధన్‌పై సహాయ కమిషనర్ (ఏసీ) కె.శాంతి ఇసుకతో దాడి చేసిన వ్యవహారంపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్ ఆదేశాల మేరకు రాజమండ్రి దేవదాయ శాఖ ప్రాంతీయ కమిషనర్ (ఆర్జేసీ) సురేష్‌బాబు విచారణ జరిపారు. శుక్రవారం బురుజుపేట శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవాలయం కార్యనిర్వహణాధికారి కార్యాలయంలో ఆర్జేసీ విచారణ చేపట్టారు. డీసీ పుష్పవర్ధన్, ఏసీ శాంతిలతోపాటు ప్రత్యక్ష సాక్షులు దేవదాయ శాఖ పర్యవేక్షకులు బి.ప్రసాదరావు పట్నాయక్, రాజారావు, టర్నర్ సత్రం ఈవో అల్లు జగన్నాథరావులను విచారించారు. సీసీ ఫుటేజ్‌లను పరిశీలించారు. ఘటన జరిగినప్పుడున్న అధికారులు, సిబ్బంది నుంచి లిఖితపూర్వకంగా వివరణ తీసుకున్నారు. వివరణ కోరిన మహిళా కమిషన్ విశాఖ దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఆరోపణలపై విచారణ నివేదిక అందజేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అధికారులను కోరారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ఈ వివాదంపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని దేవదాయశాఖ కమిషనర్‌ను కోరారు. దేవదాయ శాఖ కార్యాలయాల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీ పని తీరుపై కూడా మహిళా కమిషన్ ఆరా తీసింది. -
క్షణికావేశంలో కఠిన నిర్ణయం!
అల్లిపురం(విశాఖ దక్షిణ): టీవీలో చానల్ మార్చడంలో తండ్రి, కూతురు మధ్య జరిగిన గొడవ ఆ తండ్రి ప్రాణాల మీదకు తెచ్చింది. పిల్లలతో సర్దుకుపోవాల్సిన పెద్దాయన క్షణికావేశంలో కఠిన నిర్ణయం తీసుకుని కుటుంబాన్ని విషాదంలోకి నెట్టేశారు. మనస్తాపంతో తండ్రి బలవంతంగా ప్రాణాలు తీసుకున్న ఘటన మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. మహారాణిపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మహారాణిపేట పరిధి, కృష్ణానగర్‌లో నక్కా కొండలరావు(52) తన కుటుంబంతో నివసిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కూమార్తె సాయి ప్రశాంతితో కలిసి కొండలరావు టీవీ చూస్తున్నారు. ఆ సమయంలో తండ్రీ కుమార్తెకు మధ్య టీవీ చానల్ మార్పు విషయంలో స్వల్ప వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో కొండలరావు మనస్తాపంతో గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. అనంతరం ఎంత సేపటికీ బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు బలవంతంగా తలుపుల తీసి చూశారు. అప్పటికే ఆయన తాడుతో ఇంటిపై కప్పుకు వేలాడుతూ కనిపించాడు. దీంతో వారు మృతదేహాన్ని దించి గుట్టుగా అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి చేసి జ్ఞానాపురంలోని హిందూ శ్మశానవాటికకు తరలించారు. అక్కడి శ్మశానవాటిక సిబ్బంది మృతదేహం మెడ భాగంలో తాడు బిగుసుకున్న గుర్తులు గుర్తించారు. దీంతో వారు శ్మశానవాటిక ఇన్‌ఛార్జి ప్రసన్నకుమార్‌కు తెలియజేయటంతో ఆయన మహారాణిపేట పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో ఎస్ఐ రామకృష్ణ శ్మశాన వాటికకు వచ్చి కుటుంబ సభ్యులుతో మాట్లాడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
19, 20 తేదీల్లో ‘సాక్షి ప్రాపర్టీ షో’
మహారాణిపేట : స్థిరాస్తి రంగంలో పెట్టుబడి పెట్టేందుకు సరైన సమయం ఇది. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ రియల్ ఎస్టేట్ సంస్థలు, బ్యాంకులు, డెవలపర్లుతో ఈ నెల 19, 20 వ తేదీల్లో బీచ్‌రోడ్ వైఎంసీఏ దరి సన్ఫ్రా రిసాట్స్లో ‘‘సాక్షి ప్రాపర్టీ షో’’ నిర్వహించబోతోంది. మీ సొంతింటి స్వప్నం సాకారం అయ్యేందుకు వీలుగా అందుకవసరమైన సమాచారమంతటిని మీకందించి, ఓ వివేకవంతమై న నిర్ణయం తీసుకునేందుకు బాటలు వేసింది. ఈ ప్రాపర్టీ షో ద్వారా మీ సొంతింటి స్వప్న సాకారానికి ‘సాక్షి’ మా ర్గం సుగమం చేస్తోంది. ‘సాక్షి ప్రాపర్టీ షో’కి విచ్చేయండి.. పలు రకాల గృహాలు, ప్లాట్లు మీ బడ్జెట్‌కు లోబడే ఎంపిక చేసుకోండి...అంటూ నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు. ‘సాక్షి ప్రాపర్టీ షో’లో కొనుగోలు చేసిన వారికి డ్రాలో మొదటి బహుమతిగా ఎల్ఈడి టీవీ, రెండవ బహుమతిగా ఫ్రిజ్, మూడవ బహుమతిగా వాషింగ్మెషిన్లను గెలాక్సి ఎలక్ట్రానిక్ షోరూం వారి సౌజన్యంతో అందించనున్నారు. ఈ ప్రాపర్టీ షోలో కొనుగోలు చేసిన ప్రతి వారికి స్పాట్ గిఫ్ట్‌ను గాయత్రి హోం అప్లయన్స వారి సౌజన్యం తో అందించనున్నారు. ఈ షో సందర్శకులకు ఎం.వి.ఆర్.మాల్ సౌజన్యంతో ఏర్పాటు చేయనున్న ‘ఫిల్ అండ్ డ్రాప్ కాంటెస్ట్’ ద్వారా గంట గంటకు గిఫ్ట్ కూపన్లు అందించడం మరో ప్రత్యేక ఆకర్షణ. ‘సాక్షి ప్రాపర్టీ షో’లో రియల్ఎస్టేట్ సంస్థలు, డెవలపర్లు, బ్యాంకులు పాల్గొనుటకు స్టాల్ బుకింగ్స కోసం 9912222796, 9912220550 నంబర్లలో సంప్రదించాలని నిర్వాహకులు కోరారు. -
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ధర్నా
పర్మినెంట్ చేయాలని డిమాండ్ మద్దతు తెలిపిన వైఎస్సార్ సీపీ మహారాణిపేట, న్యూస్‌లైన్ : ప్రభుత్వ శాఖ లు, స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను యథావిధిగా కొనసాగించాలని ప్రభుత్వ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమాఖ్య కన్వీనర్ పి.మణి డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట సోమవారం నిర్వహించిన ధర్నాలో మాట్లాడారు. రాష్ట్రంలో 5.5లక్షల మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్నట్టు తెలిపారు. వీరికి ఉద్యోగ భద్రత కల్పిం చాలని, వేతనాలు పెంచాలని కోరారు. ప్రసూతి సెలవులు, ఇంక్రిమెంట్లు, డీఏ తదితర సదుపాయాలు కల్పించాలన్నారు. సిటు నగర ప్రధాన కార్యదర్శి ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ ప్రభు త్వ సేవలలో కీలకపాత్ర పోషిస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందిని పర్మినెంట్ చేస్తామనే రాజకీయ పార్టీలకే మద్దతు తెలపాలన్నారు. వీరి రెన్యువల్ కాల పరిమితిని ఏడాది నుంచి మూడు నెలలకు కుదించడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని వాపోయారు. పర్మినెంట్ కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ ఆందోళనలో పర్యాటక, ఈఎస్ ఐ, 108, యూహెచ్‌సీ, కాలుష్య నియంత్రణ మండలి, ఏపీఐఐసీ, హౌసింగ్, ఏయూ, అటవీశాఖ, ఐటీఐ, పాలిటెక్నిక్, ఐకేపీ, ఐసీడీఎస్, డ్వామా తదితర సంస్థల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు పాల్గొన్నారు. వీరి దీక్షలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త కోలా గురువులు సంఘీభావం తెలిపారు.