
నక్కా కొండలరావు మృతదేహం, సర్కిల్‌లో తాడు గుర్తులు.. కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న ఎస్‌ఐ రామకృష్ణ
అల్లిపురం(విశాఖ దక్షిణ): టీవీలో చానల్ మార్చడంలో తండ్రి, కూతురు మధ్య జరిగిన గొడవ ఆ తండ్రి ప్రాణాల మీదకు తెచ్చింది. పిల్లలతో సర్దుకుపోవాల్సిన పెద్దాయన క్షణికావేశంలో కఠిన నిర్ణయం తీసుకుని కుటుంబాన్ని విషాదంలోకి నెట్టేశారు. మనస్తాపంతో తండ్రి బలవంతంగా ప్రాణాలు తీసుకున్న ఘటన మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. మహారాణిపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మహారాణిపేట పరిధి, కృష్ణానగర్‌లో నక్కా కొండలరావు(52) తన కుటుంబంతో నివసిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కూమార్తె సాయి ప్రశాంతితో కలిసి కొండలరావు టీవీ చూస్తున్నారు. ఆ సమయంలో తండ్రీ కుమార్తెకు మధ్య టీవీ చానల్ మార్పు విషయంలో స్వల్ప వాగ్వివాదం చోటు చేసుకుంది.
ఈ క్రమంలో కొండలరావు మనస్తాపంతో గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. అనంతరం ఎంత సేపటికీ బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు బలవంతంగా తలుపుల తీసి చూశారు. అప్పటికే ఆయన తాడుతో ఇంటిపై కప్పుకు వేలాడుతూ కనిపించాడు. దీంతో వారు మృతదేహాన్ని దించి గుట్టుగా అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి చేసి జ్ఞానాపురంలోని హిందూ శ్మశానవాటికకు తరలించారు. అక్కడి శ్మశానవాటిక సిబ్బంది మృతదేహం మెడ భాగంలో తాడు బిగుసుకున్న గుర్తులు గుర్తించారు. దీంతో వారు శ్మశానవాటిక ఇన్‌ఛార్జి ప్రసన్నకుమార్‌కు తెలియజేయటంతో ఆయన మహారాణిపేట పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో ఎస్‌ఐ రామకృష్ణ శ్మశాన వాటికకు వచ్చి కుటుంబ సభ్యులుతో మాట్లాడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment