పర్మినెంట్ చేయాలని డిమాండ్
మద్దతు తెలిపిన వైఎస్సార్ సీపీ
మహారాణిపేట, న్యూస్‌లైన్ : ప్రభుత్వ శాఖ లు, స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను యథావిధిగా కొనసాగించాలని ప్రభుత్వ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమాఖ్య కన్వీనర్ పి.మణి డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట సోమవారం నిర్వహించిన ధర్నాలో మాట్లాడారు. రాష్ట్రంలో 5.5లక్షల మంది కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్నట్టు తెలిపారు. వీరికి ఉద్యోగ భద్రత కల్పిం చాలని, వేతనాలు పెంచాలని కోరారు. ప్రసూతి సెలవులు, ఇంక్రిమెంట్లు, డీఏ తదితర సదుపాయాలు కల్పించాలన్నారు. సిటు నగర ప్రధాన కార్యదర్శి ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ ప్రభు త్వ సేవలలో కీలకపాత్ర పోషిస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని పర్మినెంట్ చేస్తామనే రాజకీయ పార్టీలకే మద్దతు తెలపాలన్నారు.
వీరి రెన్యువల్ కాల పరిమితిని ఏడాది నుంచి మూడు నెలలకు కుదించడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని వాపోయారు. పర్మినెంట్ కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ ఆందోళనలో పర్యాటక, ఈఎస్ ఐ, 108, యూహెచ్‌సీ, కాలుష్య నియంత్రణ మండలి, ఏపీఐఐసీ, హౌసింగ్, ఏయూ, అటవీశాఖ, ఐటీఐ, పాలిటెక్నిక్, ఐకేపీ, ఐసీడీఎస్, డ్వామా తదితర సంస్థల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు పాల్గొన్నారు. వీరి దీక్షలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త కోలా గురువులు సంఘీభావం తెలిపారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ధర్నా
Published Wed, Mar 26 2014 4:39 AM | Last Updated on Sat, Sep 2 2017 5:09 AM
Advertisement