vani mohan
-
ఆధునిక సదుపాయాలతోనే క్రీడా రంగం అభివృద్ధి
సాక్షి, అమరావతి: క్రీడా రంగంలో ఆధునిక మౌలిక సదుపాయాల కల్పన, ప్రోత్సాహంతోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర క్రీడా, యువజన సర్వీసుల శాఖ ముఖ్యకార్యదర్శి వాణి మోహన్ అన్నారు. గుజరాత్లో జరుగుతున్న 36వ జాతీయ క్రీడలను శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఎండీ ప్రభాకర్ రెడ్డితో కలిసి తిలకించారు. అహ్మదాబాద్, రాజ్‌కోట్, సూరత్ పట్టణాల్లో పర్యటించి క్రీడా మైదానాలు, గ్యాలరీల నిర్మాణం, మల్టీ పర్పస్ స్టేడియాలు, శిక్షణ కేంద్రాలను పరిశీలించారు. మహాత్మ మందిర్‌లో జూడో, బాక్సింగ్, ఐఐటీ గాంధీనగర్‌లో జరిగిన సాఫ్ట్ బాల్, సబర్మతి రివర్ ఫోర్ట్‌లో జరిగిన కానాయింగ్, సాప్ట్ టెన్నిస్, మల్లకంబ్ క్రీడలను వీక్షించి, క్రీడాకారులను ప్రోత్సహించారు. ఏపీ ప్రభుత్వం క్రీడా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని చెప్పారు. శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ.. త్వరలోనే ఏపీని అంతర్జాతీయ క్రీడా వేదికగా తీర్చిదిద్దుతామని తెలిపారు. శాప్ ఎండీ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో పాఠశాల నుంచి యూనివర్సిటీల వరకు స్పోర్ట్స్ క్లబ్‌లను ప్రోత్సహిస్తున్నామని వివరించారు. పలువురు జాతీయ పోటీల విజేతలకు మెడల్స్ బహూకరించారు. -
ఆలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ల రూపకల్పనకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి ఆలయానికి ఆ ఆలయ సంప్రదాయాలు పాటిస్తూ.. భక్తులకు సౌకర్యాలు, అభివృద్ధి పనులు చేపట్టేలా మాస్టర్ ప్లాన్ ఉంటుంది. వచ్చే 40 ఏళ్ల అవసరాలు, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ ప్లాన్‌కు రూపకల్పన చేయనున్నారు. తొలి దశలో దేవదాయ శాఖ పరిధిలోని 8 ప్రధాన ఆలయాలతో సహా 25 దేవాలయాలకు మాస్టర్‌ప్లాన్ రూపొందించనున్నారు. వీటిలో మహానంది, కసాపురం, అహోబిలం, యెక్కంటి వంటి ఆలయాలు ఉన్నాయి. ఇందుకు ఉత్తర భారత దేశంలో, తమిళనాడులో పలు పురాతన, ప్రఖ్యాత ఆలయాలకు ఇప్పటికే మాస్టర్ ప్లాన్లను రూపొందించిన రెండు ప్రముఖ అర్కిటెక్చర్ సంస్థలను దేవదాయ శాఖ ఎంప్యానల్ చేసింది. ఈ సంస్థల ప్రతినిధులతో వారం క్రితం దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్, కమిషనర్ హరిజవహర్‌లాల్‌లు వీడియో సమావేశం నిర్వహించి, ఆలయాల వారీగా మాస్టర్ ప్లాన్ల రూపకల్పనపై చర్చించారు. ఆలయాల్లోని సంప్రదాయాలు, ప్రస్తుతం ఉన్న ప్రధాన గర్భాలయాల రూపం మారకుండా మాస్టర్ ప్లాన్లు ఉంటాయని దేవదాయశాఖ అధికార వర్గాలు తెలిపాయి. ఆలయం ప్రాంగణంలో, చుట్టుప్రక్కల ఏ చిన్న అభివృద్ధి కార్యక్రమమైనా మాస్టర్ ప్లాన్ ప్రకారమే చేపడతారని చెప్పారు. సాయంత్రం వేళ ప్రాచీన సంప్రదాయ కళా ప్రదర్శనలు, ఇతర ఆరాధన కార్యక్రమాలకు వేదికల నిర్మాణం వంటి వాటికి ప్రాధన్యత ఉంటుందని తెలిపారు. ఇటీవలి కాలంలో కుటుంబ సమేతంగా కార్లలో ఆలయాలకు వస్తున్న భక్తుల సంఖ్య పెరుగుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఆలయం పరిసరాలను అవకాశం ఉన్న మేరకు విశాలమైన పార్కింగ్ ఏరియా, ఆహ్లదకరమైన పూల వనాలు వంటి వాటికి మాస్టర్ ప్లాన్‌లో చోటు కల్పిస్తామన్నారు. -
మరో విషాదం: ప్రముఖ రచయిత్రి కన్నుమూత..
సాక్షి, చెన్నై(తమిళనాడు): ప్రముఖ రచయిత్రి వాణీ మోహన్ (80) మరణించారు. ఇటీవల చలిజ్వరం బారిన పడిన ఆమె రక్తంలో చక్కెర శాతం పడిపోవడంతో చెన్నైలోని స్వగృహంలో ఆమె మృతి చెందారు. అమెరికాలో ఉన్న ఆమె కుమారుడు ఆదివారం చెన్నై చేరుకోనున్నారని, అంత్యక్రియలు సోమవారం నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. పదేళ్ల క్రితం కన్నుమూసిన ఆమె భర్త వఠ్యం మోహన్ రైల్వే ఉన్నతాధికారిగా ఉత్తరాది రాష్ట్రాల్లో విధులు నిర్వహించేవారు. ఈ కాలంలో అక్కడి తెలుగువారితోఅనేక కార్యక్రమాలను ఈమె నిర్వహించేవారు. ఆయా ప్రాంతాల ప్రత్యేకతలు, విశేషాలను భర్తతో కలిసి గ్రంథస్థం చేశా రు. చెన్నై వచ్చాక ప్రముఖ రచయిత్రి మాలతీ చందూర్ స్ఫూర్తితో రచయితగా ఎదిగిన వాణీ మోహన్ రాసిన అనేక కథలు, కవితలు పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఆకాశవాణి చెన్నై కేంద్రంలో దశాబ్దాలపాటు అనేక అంశాలపై ఆమె ప్రసంగించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవన సొసైటీ సభ్యురాలిగా ఆ భవనాన్ని నిర్మింపజేసిన వైఎస్ శాస్త్రి ఏర్పాటు చేసిన అనేక కార్య క్రమాలలో చురుగ్గా పాల్గొనేవారు. కాగా ఆమె మృతికి అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి కార్యదర్శి వై. రామకృష్ణ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. -
దసరా నవరాత్రి ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు
-
30 మందితో టీటీడీ పాలక మండలి
సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) 30 మంది సభ్యులతో కొత్త పాలక మండలిని ప్రభుత్వం బుధవారం నియమించింది. అధికారులతో కలిసి 28 మందిని పాలక మండలి సభ్యులుగా, మరో ఇద్దరిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీ మోహన్ రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు 8వ తేదీనే టీటీడీ పాలక మండలి చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డిని రెండోసారి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో కేవలం పాలక మండలి చైర్మను మాత్రమే ప్రకటించిన ప్రభుత్వం, తాజాగా కమిటీ సభ్యుల పేర్లను వెల్లడించింది. చైర్మన్ సహా సభ్యుల పదవీ కాలం దేవదాయ శాఖ చట్టంలోని సెక్షన్ 99ను అనుసరించి ఉంటుందని పేర్కొన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులైన ఇద్దరికి పాలక మండలిలో ఓటు హక్కు ఉండదన్నారు. కొత్త పాలక మండలి ఇలా.. 1. పొలకల అశోక్‌కుమార్, 2. మల్లాడి కృష్ణారావు 3.టంగుటూరు మారుతీ ప్రసాద్, 4. మన్నే జీవన్‌రెడ్డి, 5. డాక్టర్ బండి పార్థసారథిరెడ్డి, 6. జూపల్లి రామేశ్వరరావు, 7. ఎన్. శ్రీనివాసన్, 8. రాజేష్ శర్మ, 9. బోరా సౌరభ్, 10. మూరంశెట్టి రాములు, 11. కల్వకుర్తి విద్యాసాగర్, 12. ఏపీ నందకుమార్, 13. పచ్చిపాల సనత్‌కుమార్, 14. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, 15. డాక్టర్ కేతన్ దేశాయి, 16.బూదాటి లక్ష్మీనారాయణ, 17. మిలింద్ కేశవ్ నర్వేకర్, 18. ఎంఎన్ శశిధర్, 19 అల్లూరి మల్లేశ్వరి 20. డాక్టర్ ఎస్.శంకర్, 21. ఎస్ఆర్ విశ్వనాథ్‌రెడ్డి, 22. బుర్రా మధుసూదన్‌యాదవ్, 23. కిలివేటి సంజీవయ్య, 24. కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఎక్స్ అఫీషియో సభ్యులు 1. దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, 2. దేవదాయ శాఖ కమిషనర్, 3. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్, 4. టీటీడీ ఈవో ప్రత్యేక ఆహ్వానితులు 1. భూమన కరుణాకర్ రెడ్డి 2. సుధాకర్ (బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్) ప్రత్యేక ఆహ్వానితులుగా మరో 50 మంది ఏపీ టూరిజం పాలసీలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల ద్వారా భవిష్యత్‌లో తిరుమల ఆలయానికి భక్తుల రాక పెరిగే అవకాశం ఉన్న దృష్ట్యా, ఇంకొక 50 మందిని టీటీడీ ఆలయ ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. ఈ మేరకు దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీ మోహన్ మరో ఉత్తర్వు జారీ చేశారు. టీటీడీ పాలక మండలి సభ్యుల పదవీ కాలం కొనసాగినంత కాలం ఆలయ ప్రత్యేక ఆహ్వానితుల పదవీ ఉంటుందని.. పాలక మండలి సభ్యులకు వర్తించే ప్రొటోకాల్ వీరికీ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
మరో 180 ఆలయాల్లో ఆన్లైన్ సేవలు
పెనుగంచిప్రోలు: ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో సేవలు, పూజలు చేసుకునే అవకాశం భక్తులకు కల్పించామని దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ పి.వాణీమోహన్ పేర్కొన్నారు. శనివారం ఆమె కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు గ్రామంలోని శ్రీ లక్ష్మీతిరుపతమ్మ వారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గత మూడు నెలలుగా ప్రముఖ ఆలయాలన్నింటిలో ఆన్లైన్ సేవలు కొనసాగుతున్నాయని, మరో 180 దేవాలయాల్లో కొత్తగా ఆన్లైన్ సేవలు కల్పిస్తున్నట్లు చెప్పారు. అలాగే ప్రముఖ ఆలయాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించటంతో పాటు రిజిస్టర్లు, బంగారం, వెండి నిల్వలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రముఖంగా భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పించటంపై దృష్టి పెడుతున్నామన్నారు. అనంతరం ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఆలయ ఈవో మూర్తి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలతో ప్రిన్సిపల్ సెక్రటరీని సత్కరించారు. -
రూ.200 కోట్లతో శ్రీకాళహస్తీశ్వరాలయం అభివృద్ధి
శ్రీకాళహస్తి (చిత్తూరు జిల్లా): ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఆలయాల్లోనూ భక్తులకు మెరుగైన సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు దేవదాయ శాఖ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్ తెలిపారు. చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని ఆమె శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా వాణీమోహన్ విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఆలయాల్లో శ్రీకాళహస్తీశ్వరాలయం ప్రత్యేకమైందన్నారు. ఈ ఆలయాభివృద్ధి కోసం రూ.200 కోట్లతో కొత్త మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించి, త్వరిత గతిన అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పుణ్యక్షేత్రాల్లో పారిశుద్ధ్యంపైన ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నామన్నారు. విద్యుత్‌ను ఆదా చేసేందుకు సోలార్ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తామన్నారు. ఆలయంలో ఉన్న వెండి, బంగారు, నగదు నిల్వల రిజిస్టర్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి ఆలయ ఆస్తుల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. భక్తులకు పత్యక్ష సేవలతోపాటు ఆన్లైన్, పరోక్ష సేవల ద్వారానూ దగ్గరయ్యేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఒప్పంద ఉద్యోగుల్లో ఇద్దరు హుండీ లెక్కింపులో దొంగతనం చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని, వారిని ఉద్యోగాల నుంచి తొలగించి, క్రిమనిల్ కేసులు నమోదు చేయిస్తామని చెప్పారు. ఆలయ అనుబంధ స్కిట్ కళాశాల ఆలయానికి భారంగా మారిందన్నారు. అందులోని విద్యార్థులు నష్టపోకుండా వారిని వేరే కళాశాలల్లో చేర్పించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాబోయే నవరాత్రి, కార్తీక బ్రహ్మోత్సవాల కోసం శ్రీకాళహస్తీశ్వరాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా ఈవోకు సూచించినట్లు తెలిపారు. అన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో స్థల పురాణం, ఆలయ ప్రాశస్త్యం, దేవతా విగ్రహాల ప్రాశస్త్యాన్ని తెలియజేసే విధంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించామని వాణీమోహన్ పేర్కొన్నారు. -
వంశపారంపర్య అర్చకులకు విధి విధానాలు
సాక్షి, అమరావతి: ఆలయాల్లో పనిచేసే అర్చకుల కలలు నిజంచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. వంశపారంపర్య అర్చకుల గుర్తింపునకు విధివిధానాలను ఖరారుచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఎనిమిది రకాల అంశాలకు సంబంధించి ఏ ఒక్క అంశంలో ఆధారాలు చూపినా వారిని సంబంధిత ఆలయానికి వంశపారంపర్య అర్చకత్వానికి అర్హుడిగా గుర్తిస్తూ ఆలయ 43(10) రిజిస్టర్లో నమోదు చేయాలంటూ దేవదాయ శాఖ కమిషనర్ వాణీమోహన్ రెండ్రోజుల క్రితం రాష్ట్రంలోని అందరు రీజనల్ జాయింట్ కమిషనర్లు, జోనల్ డిప్యూటీ కమిషనర్లు, జిల్లా అసిస్టెంట్ కమిషనర్లకు ఆదేశాలు జారీచేశారు. సంబంధిత ఎనిమిది అంశాలను అ ఉత్తర్వులలో వివరించారు. అవి.. ► అర్చక ఇనాం భూములను అనుభవిస్తూ ప్రస్తుతం అర్చకత్వం చేస్తున్న వారు సంబంధిత ఆలయానికి వంశపారంపర్య అర్చకులుగా గుర్తించబడతారు. ► దరఖాస్తుదారుని తండ్రి లేదా తాతలు ఆలయంలో అర్చకత్వం నిర్వహిస్తే అతడిని ఆ ఆలయానికి వంశపారంపర్య అర్చకునిగా గుర్తిస్తారు. ► ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో అమలులో ఉన్న దేవదాయ చట్టం ప్రకారం ఆలయాల రిజిస్టర్ 25లో గానీ, 1966 నాటి ఆంధ్రప్రదేశ్ దేవదాయ చట్టం ప్రకారం ఆలయ రిజస్టర్ 38లో గానీ అర్చకులుగా నమోదై ఉన్న వారి వారసులను సంబంధిత ఆలయ వంశపారంపర్య అర్చకులుగా గుర్తిస్తారు. ► అర్చకులందరూ ఒక అవగాహనకు వచ్చి ఓ వ్యక్తిని సూచించినా అతడిని సంబంధిత ఆలయానికి వంశపారంపర్య అర్చకునిగా గుర్తిస్తారు. ► గతంలో కోర్టు ఆదేశాలున్న చోట.. అలాంటి వారిని సంబంధిత ఆలయ వంశపారంపర్య అర్చకునిగా అర్హుడవుతారు. ► ఎలాంటి వివాదాల్లేని చోట ప్రస్తుతం ఆలయ అర్చకుడే ఆ ఆలయ వంశపారంపర్య అర్చకుని హోదా పొందవచ్చు. ► ఏదైనా ఆలయంలో వంశపారంపర్య అర్చకునికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేనప్పుడు పేపరు నోటిఫికేషన్ ద్వారా అతని నియామకానికి చర్యలు చేపడతారు. ► వంశపారంపర్య అర్చకత్వానికి అర్హత ఉండి ఆలయ అర్చకునిగా పనిచేసిన వారు చనిపోయిన పరిస్థితుల్లో ఆ కుటుంబంలో నిబంధనల ప్రకారం అర్హులు లేనట్లయితే భర్తను కోల్పోయిన అర్చకుని భార్య సూచించిన వ్యక్తి ఆమె జీవితకాలం వంశపారంపర్య హోదా అర్చకునిగా పనిచేయవచ్చు. .. పై ఎనిమిది అంశాల ప్రాతిపదికన రూ.కోటి పైబడి ఆదాయం ఉన్న ఆలయాల్లో వంశపారంపర్య అర్చకత్వం గుర్తింపు ప్రక్రియను దేవదాయ శాఖ కమిషనర్ ఆధ్వర్యంలోనే చేపడతారు. రూ. కోటిలోపు ఆదాయం ఉండే 6(ఏ) కేటగిరి ఆలయాలలో ఈ గుర్తింపు ప్రక్రియ రీజనల్ జాయింట్ కమిషనర్ల అనుమతితో చేపడతారు. 6 (బీ) కేటగిరి ఆలయాల్లో జోనల్ డిప్యూటీ కమిషనర్లు, 6(సీ) కేటగిరి ఆలయాల్లో జిల్లా అసిస్టెంట్ కమిషనర్ల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియకు అనుమతిస్తారు. ఏపీ అర్చక సమాఖ్య హర్షం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన దేవదాయ సవరణ చట్టం ప్రకారం ఇప్పుడు ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వంశపారంపర్య అర్చకుల గుర్తింపునకు విధివిధానాలు ఖరారుతో పాటు అప్పటి చట్టం అమలుకు పూనుకున్నారంటూ ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య ప్రతినిధులు అగ్నిహోత్రం ఆత్రేయబాబు, పెద్దింటి రాంబాబు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా వారు సీఎం జగన్‌తో పాటు వెలంపల్లి, వాణీమోహన్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. అర్చక సమస్యలపై చొరవ అవసరం పెందుర్తి: అర్చకుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ సూచించారు. వంశపారంపర్య హక్కులను అమలు చేయాలన్నారు. రుషికేష్‌లోని శారదాపీఠం శాఖలో చాతుర్మాస దీక్షలో ఉన్న స్వామీజీని రాష్ట్ర దేవదాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి వాణీమోహన్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. స్వామీజీ, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకున్నారు. రాజశ్యామల అమ్మవారి పీఠ పూజలో పాల్గొన్నారు. స్వరూపానందేంద్ర మాట్లాడుతూ అర్చకుల డిమాండ్లపై చొరవ చూపాలని సూచించారు. జీర్ణావస్థకు చేరిన ఆలయాల పునర్నిర్మాణానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. -
ఆలయాల ఆస్తులపై నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల భూములు, ఇతర ఆస్తులను కాపాడడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించబోమని ఈవోలను దేవదాయ శాఖ హెచ్చరించింది. దేవుడి ఆస్తులను కాపాడటంలో ఉదాశీనత, జమా ఖర్చుల్లో అవకతవకలు లాంటి చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవని దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్ స్పష్టం చేశారు. భూములను ఆక్రమించుకోవడం, లీజు గడువు ముగిసినా ఖాళీ చేయకపోవడం లాంటి వాటిపై ఎప్పటికప్పుడు కేసులు నమోదు చేయని పక్షంలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు ఆమె అన్ని ఆలయాల ఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. ► భూములు, షాపుల లీజు గడువు ముగియడానికి మూడు నెలల ముందే బహిరంగ వేలం నిర్వహించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించరాదు. ఏడాది లీజు మొత్తాన్ని అడ్వాన్స్‌గా వసూలు చేయాలి. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా 75 శాతానికి మించి బిల్లులు చెల్లించరాదు. ► ఔట్సోర్సింగ్ సిబ్బందికి కనీస వేతనాలు చెల్లించేలా కాంట్రాక్టర్లతో ఒప్పందాలు చేసుకోవాలి. రూ.కోటికిపైగా విలువైన టెండర్లకు ఆరు నెలల వ్యవధికే ఒప్పందాలు చేసుకోవాలి. ► దేవాలయాల్లో అన్నదానం, ప్రసాదం పంపిణీకి ఒకే తరహా ‘దిట్టం’ విధానాన్ని అమలు చేస్తారు. అన్నదానం హాళ్లు, కిచెన్, సరుకుల గదుల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ► ఆలయాల్లో ఖర్చులకు నగదుగా కాకుండా చెక్కుల రూపంలోనే చెల్లింపులు చేయాలి. ► ఆలయాల క్యాష్ బుక్‌లో పెన్నుతో కాకుండా పెన్సిల్‌తో జమా ఖర్చులు రాయడం, రశీదులు చూపకపోవడం లాంటి వాటిని గుర్తిస్తే ఈవో అవినీతికి పాల్పడినట్టు పరిగణిస్తారు. -
దేవదాయశాఖ డీసీ, ఏసీల వ్యవహారంపై విచారణ
మహారాణిపేట (విశాఖ దక్షిణ)/సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ ఉప కమిషనర్ (డీసీ) ఈవీ పుష్పవర్ధన్‌పై సహాయ కమిషనర్ (ఏసీ) కె.శాంతి ఇసుకతో దాడి చేసిన వ్యవహారంపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్ ఆదేశాల మేరకు రాజమండ్రి దేవదాయ శాఖ ప్రాంతీయ కమిషనర్ (ఆర్జేసీ) సురేష్‌బాబు విచారణ జరిపారు. శుక్రవారం బురుజుపేట శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవాలయం కార్యనిర్వహణాధికారి కార్యాలయంలో ఆర్జేసీ విచారణ చేపట్టారు. డీసీ పుష్పవర్ధన్, ఏసీ శాంతిలతోపాటు ప్రత్యక్ష సాక్షులు దేవదాయ శాఖ పర్యవేక్షకులు బి.ప్రసాదరావు పట్నాయక్, రాజారావు, టర్నర్ సత్రం ఈవో అల్లు జగన్నాథరావులను విచారించారు. సీసీ ఫుటేజ్‌లను పరిశీలించారు. ఘటన జరిగినప్పుడున్న అధికారులు, సిబ్బంది నుంచి లిఖితపూర్వకంగా వివరణ తీసుకున్నారు. వివరణ కోరిన మహిళా కమిషన్ విశాఖ దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఆరోపణలపై విచారణ నివేదిక అందజేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అధికారులను కోరారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ఈ వివాదంపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని దేవదాయశాఖ కమిషనర్‌ను కోరారు. దేవదాయ శాఖ కార్యాలయాల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీ పని తీరుపై కూడా మహిళా కమిషన్ ఆరా తీసింది. -
బాపూ మ్యూజియానికి పూర్వ వైభవం
సాక్షి, విజయవాడ: గత పదేళ్ల కిందట మూతబడ్డ చారిత్రక బాపూ మ్యూజియానికి ఇక పూర్వ వైభవం రానుంది. రూ.8 కోట్లతో అభివృద్ధి చేసిన బాపూ మ్యూజియాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ప్రారంభిస్తారని రాష్ట్ర పురావస్తు శాఖ కమిషనర్ వాణిమోహన్ తెలిపారు. బుధవారం విజయవాడ బందరు రోడ్డులోని బాపు మ్యూజియం ఆవరణలో డిప్యూటీ డైరెక్టర్ స్వామి నాయక్‌తో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. మ్యూజియంలో సందర్శకులు వీక్షించేందుకు 1500 పైగా పురాతన వస్తువులని అందుబాటులో ఉంచామన్నారు. పురాతన వస్తువుల వివరాల తెలుసుకునేందుకు సందర్శకులకి అత్యాధుక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో ఉంచామన్నారు. నూతన టెక్నాలజీ ద్వారా వస్తువుల వివరాలు ఫోన్లోనే చూడవచ్చని తెలిపారు. జైన, బుద్ద, హిందూ విగ్రహాలు , రాజుల కాలంలో వాడిన కత్తులు, నాణాలు..ఇలా ఎన్నో ప్రత్యేకతలతో మ్యూజియం సిద్దమైందన్నారు. ఈ బాపు మ్యూజియంకి ఎంతో ప్రాధాన్యత ఉందని వివరించారు. మ్యూజియం పక్కనే ఉన్న విక్టోరియా స్మారక భవనం ఇండో యూరోపియన్ వాస్తు కళని ప్రతిబింబిస్తుందని కమిషనర్ వాణిమోహన్ తెలిపారు. 10 లక్షల ఏళ్ల చరిత్రకు సాక్షిగా నిలిచే అరుదైన 1,500 వస్తువులను బాపు మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచాం. ఆది మానవుడి నుంచి 19వ శతాబ్ధపు ఆధునిక మానవుడు వరకు ఉపయోగించిన వస్తువులు, కళాఖండాలు, వస్త్రాలు, వంట సామగ్రి భద్రపరిచాం. డిజిటల్ ప్లాట్‌ఫాంతో ఈ మ్యూజియాన్ని అనుసంధానం చేశాం. బాపూ మ్యూజియం యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని.. చిత్రాలను స్కాన్ చేస్తే వాటి చరిత్రను మాటలు ద్వారా తెలుసుకోవచ్చు. ఈ భవనంలో 1921లో జాతీయ కాంగ్రెస్ సమావేశం నిర్వహించారు. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య.. మహాత్మాగాంధీకి జాతీయ పతాకాన్ని ఇక్కడే అందజేశారు. ఈ సమావేశానికి నెహ్రూ, పటేల్ తదితర ప్రముఖులంతా హాజరయ్యారు. ఒక్కో గ్యాలరీలో ఒక్కో ప్రత్యేకత.. తొలి చారిత్రక యుగ గ్యాలరీ: ఇందులో 10 లక్షల సంవత్సరాల నుంచి క్రీ.శ 2వ శతాబ్ధం వరకు ఉన్న పురాతన వస్తువులను ప్రదర్శనకు పెట్టారు. వీటిలో ఆదిమ మానవుడు ఉపయోగించిన రాతి పని ముట్లు, 12 కాళ్ల మట్టి శవ పేటిక, మట్టి బొమ్మలు కుండ పెంకులు సున్నపు ప్రతిమలు, పూసలు, ఫలకాలు అత్యంత అరుదైనవి. బుద్ధ జైన గ్యాలరీ: ఇందులో బౌద్ధ, జైన రాతి, కాంస్య ప్రతిమలను ప్రదర్శనకు పెట్టారు. హిందూ శిల్ప కళా గ్యాలరీ: దీనిలో వివిధ హిందూ దేవతల రాతి, కాంస్య ప్రతిమలు ఉంచారు. నాణెములు-శాసనముల గ్యాలరీ: క్రీ.శ 6వ శతాబ్ధం నుంచి క్రీ.శ 20వ శతాబ్ధం వరకు ఉన్న వివిధ రాజ వంశముల సీసపు, రాగి, ఇత్తడి, వెండి, బంగారు నాణెములను ప్రదర్శనకు పెట్టారు. -
రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా వాణీమోహన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషన్ నూతన కార్యదర్శిగా వాణీ మోహన్ నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సహకార శాఖ కమిషనర్, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కో–ఆపరేటివ్ ఫెడరేషన్ ఎండీ వాణీ మోహన్‌కు ఈ బాధ్యతలను కూడా అదనంగా అప్పగించారు. -
ఫిబ్రవరి 9న టెట్
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్షను (టెట్) వచ్చే నెల 9న నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో నాలుగో టెట్ నిర్వహణకు అనుమతి ఇస్తూ శుక్రవారం మెమో (22120) జారీ చేసింది. రాష్ట్రంలో 1,975 కేంద్రాల్లో నిర్వహించనున్న టెట్‌కు 4,49,902 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు పాఠశాల విద్య డెరైక్టర్ వాణిమోహన్ తెలిపారు. 9వ తేదీన ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపరు-1, మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు పేపరు-2 పరీక్ష ఉంటుంది. హాల్ టికెట్ల జారీకి సంబంధించిన వివరాలను ఈ నెల 18న వెల్లడించనున్నారు. ప్రభుత్వం ఆమోదం తెలుపడంతో పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై విద్యా శాఖ దృష్టి సారించింది. డీఎస్సీ లేదు..! టెట్ నిర్వహణకు ఓకే చెప్పిన ప్రభుత్వం డీఎస్సీ నిర్వహణకు మాత్రం ఆమోదం తెలుపలేదు. ప్రస్తుతం టెట్ నిర్వహణ, ఫలితాల వెల్లడి తదితర ప్రక్రియకే ఫిబ్రవరి నెల దాటిపోనుంది. ఆ తర్వాత ఎన్నికల హడావుడి మొదలయ్యే పరిస్థితి నెలకొనడంతో డీఎస్సీ నిర్వహణకు ప్రభుత్వం ఓకే చెప్పలేదు. మరోవైపు ప్రస్తుతం ప్రకటించిన టెట్ నిర్వహణపై కూడా అసెంబ్లీలో తెలంగాణ బిల్లు.. ప్రస్తుత పరిణామాలు.. ఈనెల 23 తర్వాత నెలకొనే పరిస్థితుల ప్రభావం ఉంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో టెట్ పరీక్ష నిర్వహణకు తేదీలు ఖరారు చేసిన తర్వాత కూడా మూడుసార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. -
తీరనున్న సబ్జెక్టు టీచర్ల కొరత
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్ : జిల్లాలో సబ్జెక్టు టీచర్ల కొరత ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు ఇతర ఉన్నత పాఠశాలల్లో మిగులుగా ఉన్న సబ్జెక్టు టీచర్లను వర్క్ అడ్జస్ట్మెంట్ (పని సర్దుబాటు) కింద నియమించేందుకు వీలుకల్పిస్తూ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ జి.వాణీమోహన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సబ్జెక్టు టీచర్ల కొరత వల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని ప్రజాప్రతినిధులు, జిల్లా విద్యాశాఖాధికారులు, కలెక్టర్లు, విద్యాశాఖ కమిషనర్ దృష్టికి పలువురు తల్లిదండ్రులు తీసుకెళ్లారు. మెజారిటీ జిల్లాల్లో వివిధ కారణాల వల్ల ఈ ఏడాది చెలరేగిన అలజడులు, ఆందోళనలు విద్యాబోధనపై తీవ్ర ప్రభావం చూపాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడంతో పాటు పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు సబ్జెక్టు టీచర్ల కొరత ఉన్న పాఠశాలలకు మిగులు టీచర్లు ఉన్న పాఠశాలల నుంచి ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని నిర్ణయించారు. పని సర్దుబాటుపై ఇతర పాఠశాలల్లో పనిచేసేందుకు నియమించబడే ఉపాధ్యాయులు తమ మాతృ పాఠశాల నుంచే జీతాలు తీసుకుంటారు. వీరంతా సకాలంలో నిర్దేశిత విధానంలో సిలబస్ పూర్తిచేయాలి. విద్యార్థుల సంఖ్య ఆధారంగా, తరగతి, సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయుల కొరతను గుర్తించాలి. ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఏయే సబ్జెక్టులకు ఎంతమంది టీచర్లు అవసరమో గుర్తించి సంబంధిత ఉప విద్యాధికారులకు నివేదించాలి. ఉప విద్యాధికారులు సబ్జెక్టు టీచర్ల కొరత వివరాలను జిల్లా విద్యాశాఖాధికారికి నివేదించాలి. జిల్లా విద్యాశాఖాధికారి కలెక్టర్ అనుమతితో పని సర్దుబాటుపై ఉపాధ్యాయులను ఇతర పాఠశాలల్లో నియమించాలి. మిగులు ఉపాధ్యాయులను గుర్తించే విషయంలో ఆయా పాఠశాలల్లో బోధనకు ఇబ్బంది కలగకుండా కూడా చూడాలని డెరైక్టర్ ఆదేశించారు. సర్దుబాటుకు మార్గదర్శకాలు ఇవీ... = విద్యాహక్కు చట్టం 2009 నిర్దేశించిన ప్రకారం పాఠశాలల్లో ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి ఉండేలా చర్యలు తీసుకోవాలి. పాఠశాలలకు సబ్జెక్టు టీచర్ పోస్టులు మంజూరై ప్రస్తుతం ఖాళీగా ఉంటే వెంటనే ఆ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలి. పదోన్నతుల ద్వారా భర్తీ కాని సబ్జెక్టు టీచర్ పోస్టులను సర్దుబాటు ద్వారా భర్తీ చేయాలి. పాఠశాలల్లో రెండు కంటే ఎక్కువ పదో తరగతి సెక్షన్లు ఉంటే ఇద్దరు కంటే ఎక్కువ మంది సబ్జెక్టు టీచర్లు పనిచేస్తుంటే వారిలో ఒకరిని సర్దుబాటు చేయాలి. రెండు సెక్షన్లను కలిపివేసి ఒక సబ్జెక్టు టీచరును ఆ పాఠశాలలో కొనసాగించి రెండో టీచర్‌ను అవసరమున్న పాఠశాలకు సర్దుబాటు చేయాలి. పట్టణ ప్రాంతాల్లో, సక్సెస్‌స్కూళ్లలో మిగులు టీచర్లు ఉన్నట్లు ఇప్పటికే గుర్తించారు. ఆయా పాఠశాలల్లోని విద్యార్థులకు అవసరమైన వారి కంటే అదనంగా టీచర్లున్నారు. ఈ పాఠశాలల నుంచి అవసరమున్న పాఠశాలలకు టీచర్లను సర్దుబాటు చేయాలి. ఒక పాఠశాలలో ఒక సబ్జెక్టు టీచర్ కూడా లేకపోతే ఆ మండలంలోనే పొరుగున ఉన్న పాఠశాలలో ఇద్దరు సబ్జెక్టు టీచర్లుంటే వారిలో పదో తరగతి విద్యార్థులకు బోధిస్తున్న ఉపాధ్యాయుడిని అక్కడే ఉంచి రెండో ఉపాధ్యాయుడిని సర్దుబాటు చేయాలి. జిల్లాలో కొత్తగా ప్రారంభించిన ఆదర్శ పాఠశాలల్లో (మోడల్ స్కూళ్లు) కూడా ఖాళీగా ఉన్న సబ్జెక్టు టీచర్ పోస్టులను పని సర్దుబాటు చేసే విధానం ద్వారా భర్తీచేసి ఈ విద్యా సంవత్సరం పూర్తయ్యేవరకు కొనసాగించాలి. ఉపాధ్యాయుల పని సర్దుబాటుకు సంబంధించి జారీ చేసిన ఉత్తర్వులను కచ్చితంగా పాటించి ఈ నెల 20వ తేదీ నాటికి సబ్జెక్టు టీచర్ల కొరత తీర్చాలి. కసరత్తు జరుగుతోంది : డీఈఓ రాజేశ్వరరావు ఉపాధ్యాయుల పని సర్దుబాటు ఉత్తర్వులపై కసరత్తు జరుగుతోంది. ఈ నెల 19న ప్రధానోపాధ్యాయుల సమావేశంలో ఈ విషయం చర్చించి కలెక్టర్ అనుమతితో టీచర్లకు సర్దుబాటు ఉత్తర్వులు జారీ చేస్తాం.