సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్షను (టెట్) వచ్చే నెల 9న నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో నాలుగో టెట్ నిర్వహణకు అనుమతి ఇస్తూ శుక్రవారం మెమో (22120) జారీ చేసింది. రాష్ట్రంలో 1,975 కేంద్రాల్లో నిర్వహించనున్న టెట్‌కు 4,49,902 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు పాఠశాల విద్య డెరైక్టర్ వాణిమోహన్ తెలిపారు. 9వ తేదీన ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపరు-1, మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు పేపరు-2 పరీక్ష ఉంటుంది. హాల్ టికెట్ల జారీకి సంబంధించిన వివరాలను ఈ నెల 18న వెల్లడించనున్నారు. ప్రభుత్వం ఆమోదం తెలుపడంతో పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై విద్యా శాఖ దృష్టి సారించింది.
డీఎస్సీ లేదు..!
టెట్ నిర్వహణకు ఓకే చెప్పిన ప్రభుత్వం డీఎస్సీ నిర్వహణకు మాత్రం ఆమోదం తెలుపలేదు. ప్రస్తుతం టెట్ నిర్వహణ, ఫలితాల వెల్లడి తదితర ప్రక్రియకే ఫిబ్రవరి నెల దాటిపోనుంది. ఆ తర్వాత ఎన్నికల హడావుడి మొదలయ్యే పరిస్థితి నెలకొనడంతో డీఎస్సీ నిర్వహణకు ప్రభుత్వం ఓకే చెప్పలేదు. మరోవైపు ప్రస్తుతం ప్రకటించిన టెట్ నిర్వహణపై కూడా అసెంబ్లీలో తెలంగాణ బిల్లు.. ప్రస్తుత పరిణామాలు.. ఈనెల 23 తర్వాత నెలకొనే పరిస్థితుల ప్రభావం ఉంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో టెట్ పరీక్ష నిర్వహణకు తేదీలు ఖరారు చేసిన తర్వాత కూడా మూడుసార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే.
ఫిబ్రవరి 9న టెట్
Published Sat, Jan 18 2014 4:08 AM | Last Updated on Sat, Sep 2 2017 2:43 AM
Advertisement