సాక్షి, విజయవాడ: గత పదేళ్ల కిందట మూతబడ్డ చారిత్రక బాపూ మ్యూజియానికి ఇక పూర్వ వైభవం రానుంది. రూ.8 కోట్లతో అభివృద్ధి చేసిన బాపూ మ్యూజియాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ప్రారంభిస్తారని రాష్ట్ర పురావస్తు శాఖ కమిషనర్ వాణిమోహన్ తెలిపారు. బుధవారం విజయవాడ బందరు రోడ్డులోని బాపు మ్యూజియం ఆవరణలో డిప్యూటీ డైరెక్టర్ స్వామి నాయక్‌తో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. మ్యూజియంలో సందర్శకులు వీక్షించేందుకు 1500 పైగా పురాతన వస్తువులని అందుబాటులో ఉంచామన్నారు.
పురాతన వస్తువుల వివరాల తెలుసుకునేందుకు సందర్శకులకి అత్యాధుక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో ఉంచామన్నారు. నూతన టెక్నాలజీ ద్వారా వస్తువుల వివరాలు ఫోన్‌లోనే చూడవచ్చని తెలిపారు. జైన, బుద్ద, హిందూ విగ్రహాలు , రాజుల కాలంలో వాడిన కత్తులు, నాణాలు..ఇలా ఎన్నో ప్రత్యేకతలతో మ్యూజియం సిద్దమైందన్నారు. ఈ బాపు మ్యూజియంకి ఎంతో ప్రాధాన్యత ఉందని వివరించారు. మ్యూజియం పక్కనే ఉన్న విక్టోరియా స్మారక భవనం ఇండో యూరోపియన్ వాస్తు కళని ప్రతిబింబిస్తుందని కమిషనర్ వాణిమోహన్ తెలిపారు.
- 10 లక్షల ఏళ్ల చరిత్రకు సాక్షిగా నిలిచే అరుదైన 1,500 వస్తువులను బాపు మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచాం.
- ఆది మానవుడి నుంచి 19వ శతాబ్ధపు ఆధునిక మానవుడు వరకు ఉపయోగించిన వస్తువులు, కళాఖండాలు, వస్త్రాలు, వంట సామగ్రి భద్రపరిచాం.
- డిజిటల్ ప్లాట్‌ఫాంతో ఈ మ్యూజియాన్ని అనుసంధానం చేశాం. బాపూ మ్యూజియం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని.. చిత్రాలను స్కాన్ చేస్తే వాటి చరిత్రను మాటలు ద్వారా తెలుసుకోవచ్చు.
- ఈ భవనంలో 1921లో జాతీయ కాంగ్రెస్ సమావేశం నిర్వహించారు. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య.. మహాత్మాగాంధీకి జాతీయ పతాకాన్ని ఇక్కడే అందజేశారు. ఈ సమావేశానికి నెహ్రూ, పటేల్ తదితర ప్రముఖులంతా హాజరయ్యారు.
ఒక్కో గ్యాలరీలో ఒక్కో ప్రత్యేకత..
తొలి చారిత్రక యుగ గ్యాలరీ: ఇందులో 10 లక్షల సంవత్సరాల నుంచి క్రీ.శ 2వ శతాబ్ధం వరకు ఉన్న పురాతన వస్తువులను ప్రదర్శనకు పెట్టారు. వీటిలో ఆదిమ మానవుడు ఉపయోగించిన రాతి పని ముట్లు, 12 కాళ్ల మట్టి శవ పేటిక, మట్టి బొమ్మలు కుండ పెంకులు సున్నపు ప్రతిమలు, పూసలు, ఫలకాలు అత్యంత అరుదైనవి.
బుద్ధ జైన గ్యాలరీ: ఇందులో బౌద్ధ, జైన రాతి, కాంస్య ప్రతిమలను ప్రదర్శనకు పెట్టారు.
హిందూ శిల్ప కళా గ్యాలరీ: దీనిలో వివిధ హిందూ దేవతల రాతి, కాంస్య ప్రతిమలు ఉంచారు.
నాణెములు-శాసనముల గ్యాలరీ: క్రీ.శ 6వ శతాబ్ధం నుంచి క్రీ.శ 20వ శతాబ్ధం వరకు ఉన్న వివిధ రాజ వంశముల సీసపు, రాగి, ఇత్తడి, వెండి, బంగారు నాణెములను ప్రదర్శనకు పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment