బాపు మ్యూజియం ప్రారంభ కార్యక్రమంలో సీఎం జగన్. చిత్రంలో మంత్రులు, అధికారులు తదితరులు
సాక్షి, అమరావతి: బాపు మ్యూజియంలో ఉన్న కళాఖండాల సేకరణ అద్భుతం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. విజయవాడలో 10 ఏళ్లుగా మూతపడి ఉన్న బాపు మ్యూజియాన్ని రూ.8 కోట్లతో అభివృద్ధి చేసిన సందర్భంగా గురువారం ఆయన ప్రారంభించారు. మ్యూజియం వద్ద భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య విగ్రహాన్ని సీఎం పునః ప్రతిష్టించారు. అనంతరం విక్టోరియా మహల్‌లోని మహాత్మాగాంధీ నిలువెత్తు చిత్రపటానికి నివాళులర్పించి, పింగళి వెంకయ్య గ్యాలరీలో జాతీయ నాయకుల విగ్రహాలను పరిశీలించారు. 1921లో పింగళి వెంకయ్య జాతీయ పతాకాన్ని మహాత్మా గాంధీకి సమర్పించినట్లు ఉన్న విగ్రహాకృతులను తిలకించారు. బాపు మ్యూజియం పరిశీలించిన అనంతరం ప్రముఖుల సందర్శన పుస్తకంలో 'Impressive Collection of Artifacts' (కళాఖండాల అద్భుతమైన సేకరణ) అని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా రాశారు. ఈ సందర్భంగా సీఎం ఇంకా ఏమన్నారంటే..
అరుదైన ప్రదర్శన
► మన చరిత్ర, సంస్కృతి, వారసత్వ ఘనతను సృజనాత్మకంగా భావి తరాలకు చాటి చెప్పేలా బాపు మ్యూజియం నిలుస్తుంది. మ్యూజియంలో ఆదిమ మానవ యుగం నుండి నేటి ఆధునిక యుగం వరకు 10 లక్షల ఏళ్ల చరిత్రకు సాక్షిగా నిలిచే అరుదైన 1,500 పురాతన వస్తువులకు సాంకేతికతను మేళవించి ప్రదర్శించడం అభినందనీయం.
► దేశంలోనే మొదటిసారిగా మ్యూజియాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ప్రదర్శిత వస్తువులు ఒక యాప్ ద్వారా తమ చరిత్రను తామే చెప్పుకునే విధంగా మ్యూజియాన్ని రూపుదిద్దడం భావితరాలకు ఎంతో విజ్ఞానాన్ని అందిస్తుంది.
► ప్రతి కళాకృతినీ ముఖ్యమంత్రి ఆసక్తిగా తిలకించారు. జ్యోతి ప్రజ్వలన చేశారు. తర్వాత మ్యూజియం గురించి సమగ్రంగా ప్రచురించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచిన ప్రాక్, తొలి చారిత్రక, బుద్ధ–జైన, హిందూ శిల్ప కళ, నాణెములు, టెక్స్‌టైల్, మధ్య యుగపు కళా దృక్పథాలు, ఆయుధాలు, కవచాల గ్యాలరీలను
తిలకించారు.
ప్రత్యేక ఆకర్షణగా డిజిటల్ స్క్రీన్
► డిజిటల్ వాల్ ప్యానల్ స్క్రీన్‌ను సీఎం స్వయంగా టచ్ చేసి విషయాలు తెలుసుకున్నారు. స్క్రీన్ టచ్ చేయడం ద్వారా 1,500 పురాతన వస్తువులను పెద్దగా చూసే వెసులుబాటు కల్పించడం ఆకర్షణగా నిలిచింది.
► ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన 10 బౌద్ధ స్థలాలను పుస్తక రూపంలో చూపే డిజిటల్ బుక్‌ను పరిశీలించారు. మ్యూజియాన్ని తీర్చిదిద్దిన తీరును పురావస్తు శాఖ కమిషనర్ వాణి మోహన్ ముఖ్యమంత్రికి వివరించారు.
► ఈ కార్యక్రమంలో మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, కొడాలి నాని, కె.కన్నబాబు, సీదిరి అప్పలరాజు, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ, పలువురు ఎమ్మెల్యేలు, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment