Bapu Museum
-
బాపు మ్యూజియం పురావస్తు ప్రదర్శనశాలల్లో సాంకేతిక సొబగులు
సాక్షి, అమరావతి: సంస్కృతి, వారసత్వ సంపద, వాటి విలువలు.. విద్య–విజ్ఞానాన్ని సందర్శకులకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పురావస్తు ప్రదర్శనశాల (మ్యూజియం)లను కొత్త సొబగులతో తీర్చిదిద్దుతోంది. పురావస్తు సంపదల సమగ్ర సమాచారాన్ని టెక్నాలజీ సాయంతో సరళమైన భాషలో సులభంగా అర్థం చేసుకునేలా వాటిని ముస్తాబు చేస్తోంది. ఇందులో భాగంగా..దేశంలోనే ఏకైక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన మ్యూజియంగా విజయవాడలోని బాపూ పురావస్తు ప్రదర్శనశాల కీర్తిగడించింది. జాతీయ మ్యూజియానికి సైతంలేని విశిష్టతను సొంతం చేసుకుంది. ఇప్పటికే ఆగుమెంట్ రియాల్టీ, డిజిటల్ వాల్ ప్యానల్, ఇంటరాక్టివ్ డిజిటల్ డిస్ప్లే, కియోస్క్‌లు ఇక్కడ అందుబాటులో ఉండగా.. వర్చువల్ రియాల్టీ, లేజర్ షో, ఇమ్మెర్సివ్ ప్రొజెక్షన్ థియేటర్, ప్రొజెక్షన్ మ్యాపింగ్, డిజిటల్ వాల్ బుక్ పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. విభిన్నంగా ఆకర్షించేలా సాంకేతిక శోభ.. దేశంలోనే గొప్ప వారసత్వ నిలయంగా ఆంధ్రప్రదేశ్ విరాజిల్లుతోంది. లక్షల ఏళ్లనాటి పురావస్తు సంపద ఇక్కడి మ్యూజియాల్లో కనువిందు చేస్తోంది. ఈ అపురూప సంపదను సంప్రదాయ తరహా ప్రదర్శనతో పాటు సందర్శకులను విభిన్నంగా ఆకర్షించేలా మ్యూజియాల్లో సాంకేతికతను వినియోగించనున్నారు. రాష్ట్రంలోని మొత్తం 14 మ్యూజియాల్లో తొలిదశ కింద కడపలోని మైలవరం, అనంతపురం, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, గుంటూరు, పెనుకొండ భువనవిజయం జిల్లా మ్యూజియాలకు సాంకేతికతను అద్దనున్నారు. ఇప్పటికే ఏలూరు, అనంతపురంలో డిజిటల్ వాల్ ప్యానల్ పనులు జరుగుతున్నాయి. వీటితో పాటు రాష్ట్రంలో కొత్తగా అత్యాధునిక 3డీ పరిజ్ఞానంతో స్టేట్ మ్యూజియాన్ని ఏర్పాటుచేసేందుకు పురావస్తు శాఖ సన్నాహాలు చేస్తోంది. దక్షిణ భారతదేశంలో తొలిసారిగా.. స్మారక, సందర్శనీయ స్థలాల అభివృద్ధిలో భాగంగా కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలోని కొండపల్లి కోటను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు పురావస్తు శాఖ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే బాపూ మ్యూజియం తరహా సాంకేతికతను వినియోగిస్తూనే దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా ప్రొజెక్షన్ మ్యాపింగ్ టెక్నాలజీని ఇక్కడ ప్రవేశపెట్టింది. సాయంత్రం వేళల్లో కోటగోడలపైనే క్రీస్తు పూర్వం నుంచి నేటివరకు రాష్ట్రంలో జరిగిన చారిత్రక పరిణామ క్రమాన్ని ప్రదర్శిస్తున్న తీరు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అహోబిలం ఆలయ గోపురంపై కూడా ఆధ్యాత్మిక తరహా ప్రొజెక్షన్ మ్యాపింగ్‌ను తీసుకురానున్నారు. దేశంలో తొలిసారిగా ఈ విధానం సోమనాథ్ ఆలయంలో ఉంది. సాంకేతిక వినియోగం ఇలా.. ఆగుమెంట్ రియాల్టీ : ఈ పరిజ్ఞానం ద్వారా మ్యూజియంలోని విగ్రహాలు తమను తాము సందర్శకులతో పరిచయం చేసుకుంటాయి. ఇందుకోసం స్మార్ట్‌ఫోన్‌లో మ్యూజియం యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని విగ్రహాన్ని స్కాన్‌చేస్తే దాని సమాచారం ఆడియో రూపంలో వినిపిస్తుంది. మ్యూజియంలోని చిత్రపటాలను, డిస్ప్లే బోర్డులను స్కాన్ చేయడం ద్వారా యానిమేషన్ విధానంలో వాటి సమాచారం ఫోన్లో చూడవచ్చు. ఇంటరాక్టివ్ డిజిటల్ డిస్ప్లే (వాల్ ప్యానల్): 16 అడుగుల డిజిటల్ డిస్ప్లేపై మ్యూజియంలోని వస్తువులు ఒకేచోట కనిపిస్తాయి. సందర్శకులు తాకగానే వాటి వివరాలు డిస్ప్లే అవుతాయి. ఇంటరాక్టివ్ డిజిటల్ డిస్ప్లే కేబినెట్: రాష్ట్రంలోని మ్యూజియాలు, స్మారక, సందర్శనీయ స్థలాల వివరాలను టచ్ అధారిత డిస్ప్లే ద్వారా సందర్శకులు తెలుసుకోవచ్చు. ఇమ్మెర్సివ్ ప్రొజెక్షన్ థియేటర్: ఇది వర్చువల్ రియాలిటీని సరికొత్త స్థాయికి తీసుకెళ్తుంది. ఒక గదిలో సందర్శకులను కూర్చోబెట్టి 360 డిగ్రీల కోణంలో వీక్షకుడి చుట్టూ ఒక చిన్న ప్రపంచాన్ని సృష్టిస్తారు. ఉదా.. ఆదిమాన వుల జీవన విధానాన్ని ప్రదర్శిస్తుంటే వీక్షకుడికి ఆ ప్రపంచంలోకి వెళ్లిన అనుభూతిని కలిగిస్తారు. ఇంటరాక్షన్ డిజిటల్ కియోస్క్: దీని ద్వారా సందర్శకులు, చిన్నారులు మ్యూజియాన్ని విడిచి వెళ్లే క్రమంలో వారి సంగ్రహణ శక్తిని పరీక్షించుకోవచ్చు. ఇందుకోసం కియోస్క్‌లోని ప్రశ్నలకు జవాబులివ్వాలి. బాపూ మ్యూజియంలోని విక్టోరియా హాల్లో 1921లో గాంధీజీ ఆధ్వర్యంలో అఖిల భారత కాంగ్రెస్ మహాసభ జరిగింది. పింగళి వెంకయ్య తాను రూపొందించిన జాతీయ జెండాను ఈ సందర్భంగా గాంధీజీకి అందజేశారు. అలనాటి చారిత్రక ఘట్టాన్ని లేజర్ షో ద్వారా సందర్శకులకు పరిచయం చేయనున్నారు. దశల వారీగా సాంకేతికత బాపూ మ్యూజి యంలో ఉన్న సాంకేతికత దేశంలోని ఏ మ్యూజియంలో లేదు. ఇది రాష్ట్రానికి గర్వకారణం. సందర్శకులకు వారసత్వ విజ్ఞానం, చారిత్రక అంశాలను వివరించడంలో సాంకేతికత ఎంతగానో ఉపయోగపడుతోంది. యువ తను మ్యూజియాల వైపు నడిపించేందుకు వర్చు వల్, ఆగుమెంట్ రియాల్టీ, లేజర్ షో, ఇమ్మెర్సివ్ ప్రొజెక్షన్ షోలను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. రాష్ట్రంలోని మ్యూజియాల్లో దశల వారీగా సాంకేతికతను ప్రవేశపెడతాం. – వాణీమోహన్, కమిషనర్, పురావస్తు శాఖ -
కళాఖండాల సేకరణ అద్భుతం
సాక్షి, అమరావతి: బాపు మ్యూజియంలో ఉన్న కళాఖండాల సేకరణ అద్భుతం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. విజయవాడలో 10 ఏళ్లుగా మూతపడి ఉన్న బాపు మ్యూజియాన్ని రూ.8 కోట్లతో అభివృద్ధి చేసిన సందర్భంగా గురువారం ఆయన ప్రారంభించారు. మ్యూజియం వద్ద భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య విగ్రహాన్ని సీఎం పునః ప్రతిష్టించారు. అనంతరం విక్టోరియా మహల్‌లోని మహాత్మాగాంధీ నిలువెత్తు చిత్రపటానికి నివాళులర్పించి, పింగళి వెంకయ్య గ్యాలరీలో జాతీయ నాయకుల విగ్రహాలను పరిశీలించారు. 1921లో పింగళి వెంకయ్య జాతీయ పతాకాన్ని మహాత్మా గాంధీకి సమర్పించినట్లు ఉన్న విగ్రహాకృతులను తిలకించారు. బాపు మ్యూజియం పరిశీలించిన అనంతరం ప్రముఖుల సందర్శన పుస్తకంలో 'Impressive Collection of Artifacts' (కళాఖండాల అద్భుతమైన సేకరణ) అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా రాశారు. ఈ సందర్భంగా సీఎం ఇంకా ఏమన్నారంటే.. అరుదైన ప్రదర్శన ► మన చరిత్ర, సంస్కృతి, వారసత్వ ఘనతను సృజనాత్మకంగా భావి తరాలకు చాటి చెప్పేలా బాపు మ్యూజియం నిలుస్తుంది. మ్యూజియంలో ఆదిమ మానవ యుగం నుండి నేటి ఆధునిక యుగం వరకు 10 లక్షల ఏళ్ల చరిత్రకు సాక్షిగా నిలిచే అరుదైన 1,500 పురాతన వస్తువులకు సాంకేతికతను మేళవించి ప్రదర్శించడం అభినందనీయం. ► దేశంలోనే మొదటిసారిగా మ్యూజియాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ప్రదర్శిత వస్తువులు ఒక యాప్ ద్వారా తమ చరిత్రను తామే చెప్పుకునే విధంగా మ్యూజియాన్ని రూపుదిద్దడం భావితరాలకు ఎంతో విజ్ఞానాన్ని అందిస్తుంది. ► ప్రతి కళాకృతినీ ముఖ్యమంత్రి ఆసక్తిగా తిలకించారు. జ్యోతి ప్రజ్వలన చేశారు. తర్వాత మ్యూజియం గురించి సమగ్రంగా ప్రచురించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచిన ప్రాక్, తొలి చారిత్రక, బుద్ధ–జైన, హిందూ శిల్ప కళ, నాణెములు, టెక్స్టైల్, మధ్య యుగపు కళా దృక్పథాలు, ఆయుధాలు, కవచాల గ్యాలరీలను తిలకించారు. ప్రత్యేక ఆకర్షణగా డిజిటల్ స్క్రీన్ ► డిజిటల్ వాల్ ప్యానల్ స్క్రీన్‌ను సీఎం స్వయంగా టచ్ చేసి విషయాలు తెలుసుకున్నారు. స్క్రీన్ టచ్ చేయడం ద్వారా 1,500 పురాతన వస్తువులను పెద్దగా చూసే వెసులుబాటు కల్పించడం ఆకర్షణగా నిలిచింది. ► ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన 10 బౌద్ధ స్థలాలను పుస్తక రూపంలో చూపే డిజిటల్ బుక్‌ను పరిశీలించారు. మ్యూజియాన్ని తీర్చిదిద్దిన తీరును పురావస్తు శాఖ కమిషనర్ వాణి మోహన్ ముఖ్యమంత్రికి వివరించారు. ► ఈ కార్యక్రమంలో మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, కొడాలి నాని, కె.కన్నబాబు, సీదిరి అప్పలరాజు, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ, పలువురు ఎమ్మెల్యేలు, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. -
విజయవాడలో బాపు మ్యూజియం పునఃప్రారంభం
-
బాపు మ్యూజియం పునఃప్రారంభం
సాక్షి, విజయవాడ: రూ.8 కోట్లతో అభివృద్ధి చేసిన బాపు మ్యూజియాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ప్రారంభించారు. ఆయనకు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు స్వాగతం పలికారు. మ్యూజియం వద్ద పింగళి వెంకయ్య విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. అనంతరం విక్డోరియా మహల్‌లోని బాపూజీ చిత్రపటానికి నివాళులర్పించిన సిఎం వైఎస్ జగన్.. జాతీయ నాయకుల విగ్రహాలను పరిశీలించారు. ఆది మానవ చరిత్రకు సాక్షిగా నిలిచే పురాతన వస్తువులు, శిల్పకళ సంపదతో పాటు ఆధునిక హంగులతో మ్యూజియాన్ని తీర్చిదిద్దారు. 10 లక్షల ఏళ్ల చరిత్రకు సాక్షిగా నిలిచే అరుదైన 1,500 వస్తువులను బాపు మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. ఆది మానవుడి నుంచి 19వ శతాబ్ధపు ఆధునిక మాన వుడు వరకు ఉపయోగించిన వస్తువులు, కళాఖండాలు, వస్త్రాలు, వంట సామగ్రి తదితరాలను భద్రపరిచారు. (చదవండి: బాపూ మ్యూజియానికి పూర్వ వైభవం) ఒక్కో గ్యాలరీలో ఒక్కో ప్రత్యేకత.. ♦తొలి చారిత్రక యుగ గ్యాలరీలో 10 లక్షల సంవత్సరా ల కిందటి నుంచి క్రీ.శ 2వ శతాబ్ధం వరకు ఉన్న పురాతన వస్తువులను ప్రదర్శనకు పెట్టారు. వీటిలో ఆది మానవులు ఉపయోగించిన రాతి పని ముట్లు, 12 కాళ్ల మట్టి శవపేటిక, మట్టి బొమ్మలు, కుండ పెంకులు, సున్నపు ప్రతిమలు, పూసలు, ఫలకాలు అత్యంత అరుదైనవి. ♦బుద్ధ జైన గ్యాలరీలో బౌద్ధ, జైన రాతి, కాంస్య ప్రతిమలను ప్రదర్శనకు పెట్టారు. ♦హిందూ శిల్ప కళా గ్యాలరీలో హిందూ దేవతల రాతి, కాంస్య ప్రతిమలు ఉంచారు. ♦నాణేలు–శాసనాల గ్యాలరీలో క్రీ.శ 6వ శతాబ్ధం నుంచి ఉపయోగించిన వివిధ రాజ వంశాల సీసపు, రాగి, ఇత్తడి, వెండి, బంగారు నాణేలను ప్రదర్శనకు పెట్టారు. ♦టెక్స్టైల్ గ్యాలరీ క్రీ.శ 18–19వ శతాబ్ధాలకు చెందినది. అసఫ్ జాహీల కాలం నాటి సంప్రదాయ వ్రస్తాలను పెట్టారు. ♦మధ్య యుగపు గ్యాలరీలో అజంతా, చుగ్తాయ్, డెక్కన్, రాజస్థానీ, ఆధునిక చిత్ర లేఖనాలు, అప్పటి రాజ వంశాలకు చెందిన వారు ఉపయోగించిన బిద్రి, పింగాణి పాత్రలుంచారు. ♦ఆయుధాలు, కవచాల గ్యాలరీలో బాణాలు, విల్లంబులు, బాకులు, కత్తులు, డాళ్లు, రక్షణ కవచాలు, తుపాకులు, పిస్టల్స్, రివాల్వర్లు, ఫిరంగులను ప్రదర్శనకు పెట్టారు. -
బాపూ మ్యూజియానికి పూర్వ వైభవం
సాక్షి, విజయవాడ: గత పదేళ్ల కిందట మూతబడ్డ చారిత్రక బాపూ మ్యూజియానికి ఇక పూర్వ వైభవం రానుంది. రూ.8 కోట్లతో అభివృద్ధి చేసిన బాపూ మ్యూజియాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ప్రారంభిస్తారని రాష్ట్ర పురావస్తు శాఖ కమిషనర్ వాణిమోహన్ తెలిపారు. బుధవారం విజయవాడ బందరు రోడ్డులోని బాపు మ్యూజియం ఆవరణలో డిప్యూటీ డైరెక్టర్ స్వామి నాయక్‌తో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. మ్యూజియంలో సందర్శకులు వీక్షించేందుకు 1500 పైగా పురాతన వస్తువులని అందుబాటులో ఉంచామన్నారు. పురాతన వస్తువుల వివరాల తెలుసుకునేందుకు సందర్శకులకి అత్యాధుక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో ఉంచామన్నారు. నూతన టెక్నాలజీ ద్వారా వస్తువుల వివరాలు ఫోన్లోనే చూడవచ్చని తెలిపారు. జైన, బుద్ద, హిందూ విగ్రహాలు , రాజుల కాలంలో వాడిన కత్తులు, నాణాలు..ఇలా ఎన్నో ప్రత్యేకతలతో మ్యూజియం సిద్దమైందన్నారు. ఈ బాపు మ్యూజియంకి ఎంతో ప్రాధాన్యత ఉందని వివరించారు. మ్యూజియం పక్కనే ఉన్న విక్టోరియా స్మారక భవనం ఇండో యూరోపియన్ వాస్తు కళని ప్రతిబింబిస్తుందని కమిషనర్ వాణిమోహన్ తెలిపారు. 10 లక్షల ఏళ్ల చరిత్రకు సాక్షిగా నిలిచే అరుదైన 1,500 వస్తువులను బాపు మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచాం. ఆది మానవుడి నుంచి 19వ శతాబ్ధపు ఆధునిక మానవుడు వరకు ఉపయోగించిన వస్తువులు, కళాఖండాలు, వస్త్రాలు, వంట సామగ్రి భద్రపరిచాం. డిజిటల్ ప్లాట్‌ఫాంతో ఈ మ్యూజియాన్ని అనుసంధానం చేశాం. బాపూ మ్యూజియం యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని.. చిత్రాలను స్కాన్ చేస్తే వాటి చరిత్రను మాటలు ద్వారా తెలుసుకోవచ్చు. ఈ భవనంలో 1921లో జాతీయ కాంగ్రెస్ సమావేశం నిర్వహించారు. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య.. మహాత్మాగాంధీకి జాతీయ పతాకాన్ని ఇక్కడే అందజేశారు. ఈ సమావేశానికి నెహ్రూ, పటేల్ తదితర ప్రముఖులంతా హాజరయ్యారు. ఒక్కో గ్యాలరీలో ఒక్కో ప్రత్యేకత.. తొలి చారిత్రక యుగ గ్యాలరీ: ఇందులో 10 లక్షల సంవత్సరాల నుంచి క్రీ.శ 2వ శతాబ్ధం వరకు ఉన్న పురాతన వస్తువులను ప్రదర్శనకు పెట్టారు. వీటిలో ఆదిమ మానవుడు ఉపయోగించిన రాతి పని ముట్లు, 12 కాళ్ల మట్టి శవ పేటిక, మట్టి బొమ్మలు కుండ పెంకులు సున్నపు ప్రతిమలు, పూసలు, ఫలకాలు అత్యంత అరుదైనవి. బుద్ధ జైన గ్యాలరీ: ఇందులో బౌద్ధ, జైన రాతి, కాంస్య ప్రతిమలను ప్రదర్శనకు పెట్టారు. హిందూ శిల్ప కళా గ్యాలరీ: దీనిలో వివిధ హిందూ దేవతల రాతి, కాంస్య ప్రతిమలు ఉంచారు. నాణెములు-శాసనముల గ్యాలరీ: క్రీ.శ 6వ శతాబ్ధం నుంచి క్రీ.శ 20వ శతాబ్ధం వరకు ఉన్న వివిధ రాజ వంశముల సీసపు, రాగి, ఇత్తడి, వెండి, బంగారు నాణెములను ప్రదర్శనకు పెట్టారు. -
లోకేష్ మాటలు వినటం మానకుంటే..
సాక్షి, విజయవాడ: ఫోన్ టాపింగ్ పేరుతో చంద్రబాబు కొత్త కుట్రకోణానికి తెరలేపారని అవంతి శ్రీనివాస్ విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ కొత్త పథకం పెట్టినప్పుడల్లా కొత్త ఆరోపణతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు పన్నాగం పన్నుతున్నారని మండిపడ్డారు. పథకాలకు వస్తున్న ఆదరణతో తమకు పుట్టగతులుండవన్న నిరాశతో చంద్రబాబు ఉన్నారని, అభద్రతాభావంతో మంచి పనులకు అడ్డుతగులుతూ అభాసుపాలవుతున్నారని ఎద్దేవా చేశారు. ‘జేబు మీడియాను అడ్డుపెట్టుకొని అసత్య ఆరోపణలతో ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్నారు. ఫోన్ టాపింగ్‌పై ఆధారాలు ఉంటే ఇవ్వమని డీజీపీ కోరినా ఎందుకు ఇవ్వలేదు? దుర్మార్గుడని తిట్టిన నోటితోనే ప్రధాని మోదీని ఇప్పుడు చంద్రబాబు పొగుడుతున్నారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకం చంద్రబాబు. అన్నిప్రాంతాలు ఓట్లేస్తేనే మూడుసార్లు ముఖ్యమంత్రి అయ్యానని చంద్రబాబు మర్చిపోయారు. ఒక ప్రాంతానికి, ఒక వర్గానికే పరిమితమయ్యి తన స్థాయిని తగ్గించుకున్నారు. సొంతంగా ఆలోచించినంతకాలం చంద్రబాబు రాజకీయం బాగుండేది. కొడుకు లోకేష్ ఆలోచనలతో పనిచేసి 23 సీట్లకు పార్టీ స్థాయిని దిగజార్చారు. లోకేష్ మాటలు వినటం మానకుంటే ఆ సంఖ్య మూడుకు పడిపోవటం ఖాయం’ అని అన్నారు. బాపు మ్యూజియంలో 11 కోట్లతో జరుగుతున్న పనులను బుధవారం మంత్రి అవంతి శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘బాపు మ్యూజియంలో శిలా సంపద చాలా ఉంది. అత్యంత అరుదుగా దొరికే ప్రాచీన వస్తువులను మనం ఇక్కడ చూడొచ్చు. పూర్వీకులు మనకిచ్చిన సంపద మన సంస్కృతి సంప్రదాయాలు. మన భవిష్యత్ తరాల వారికి ఈ ప్రాచీన సంపదను అందించాలి. మ్యూజియంను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నాం. త్వరలోనే ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి ఆయన చేతుల మీదుగా ప్రారంభిస్తాం. విజయవాడ వస్తే ప్రతిఒక్కరూ బాపు మ్యూజియంను సందర్శించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం’ అని తెలిపారు. చదవండి: మోడల్ హౌస్‌ను పరిశీలించిన సీఎం జగన్ -
చిత్రకళ.. భళా!