బాపు మ్యూజియం
సాక్షి, అమరావతి: సంస్కృతి, వారసత్వ సంపద, వాటి విలువలు.. విద్య–విజ్ఞానాన్ని సందర్శకులకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పురావస్తు ప్రదర్శనశాల (మ్యూజియం)లను కొత్త సొబగులతో తీర్చిదిద్దుతోంది. పురావస్తు సంపదల సమగ్ర సమాచారాన్ని టెక్నాలజీ సాయంతో సరళమైన భాషలో సులభంగా అర్థం చేసుకునేలా వాటిని ముస్తాబు చేస్తోంది. ఇందులో భాగంగా..దేశంలోనే ఏకైక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన మ్యూజియంగా విజయవాడలోని బాపూ పురావస్తు ప్రదర్శనశాల కీర్తిగడించింది. జాతీయ మ్యూజియానికి సైతంలేని విశిష్టతను సొంతం చేసుకుంది. ఇప్పటికే ఆగుమెంట్ రియాల్టీ, డిజిటల్ వాల్ ప్యానల్, ఇంటరాక్టివ్ డిజిటల్ డిస్‌ప్లే, కియోస్క్‌లు ఇక్కడ అందుబాటులో ఉండగా.. వర్చువల్ రియాల్టీ, లేజర్ షో, ఇమ్మెర్సివ్ ప్రొజెక్షన్ థియేటర్, ప్రొజెక్షన్ మ్యాపింగ్, డిజిటల్ వాల్ బుక్ పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.
విభిన్నంగా ఆకర్షించేలా సాంకేతిక శోభ..
దేశంలోనే గొప్ప వారసత్వ నిలయంగా ఆంధ్రప్రదేశ్ విరాజిల్లుతోంది. లక్షల ఏళ్లనాటి పురావస్తు సంపద ఇక్కడి మ్యూజియాల్లో కనువిందు చేస్తోంది. ఈ అపురూప సంపదను సంప్రదాయ తరహా ప్రదర్శనతో పాటు సందర్శకులను విభిన్నంగా ఆకర్షించేలా మ్యూజియాల్లో సాంకేతికతను వినియోగించనున్నారు. రాష్ట్రంలోని మొత్తం 14 మ్యూజియాల్లో తొలిదశ కింద కడపలోని మైలవరం, అనంతపురం, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, గుంటూరు, పెనుకొండ భువనవిజయం జిల్లా మ్యూజియాలకు సాంకేతికతను అద్దనున్నారు. ఇప్పటికే ఏలూరు, అనంతపురంలో డిజిటల్ వాల్ ప్యానల్ పనులు జరుగుతున్నాయి. వీటితో పాటు రాష్ట్రంలో కొత్తగా అత్యాధునిక 3డీ పరిజ్ఞానంతో స్టేట్ మ్యూజియాన్ని ఏర్పాటుచేసేందుకు పురావస్తు శాఖ సన్నాహాలు చేస్తోంది.
దక్షిణ భారతదేశంలో తొలిసారిగా..
స్మారక, సందర్శనీయ స్థలాల అభివృద్ధిలో భాగంగా కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలోని కొండపల్లి కోటను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు పురావస్తు శాఖ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే బాపూ మ్యూజియం తరహా సాంకేతికతను వినియోగిస్తూనే దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా ప్రొజెక్షన్ మ్యాపింగ్ టెక్నాలజీని ఇక్కడ ప్రవేశపెట్టింది. సాయంత్రం వేళల్లో కోటగోడలపైనే క్రీస్తు పూర్వం నుంచి నేటివరకు రాష్ట్రంలో జరిగిన చారిత్రక పరిణామ క్రమాన్ని ప్రదర్శిస్తున్న తీరు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అహోబిలం ఆలయ గోపురంపై కూడా ఆధ్యాత్మిక తరహా ప్రొజెక్షన్ మ్యాపింగ్‌ను తీసుకురానున్నారు. దేశంలో తొలిసారిగా ఈ విధానం సోమనాథ్ ఆలయంలో ఉంది.
సాంకేతిక వినియోగం ఇలా..
ఆగుమెంట్ రియాల్టీ : ఈ పరిజ్ఞానం ద్వారా మ్యూజియంలోని విగ్రహాలు తమను తాము సందర్శకులతో పరిచయం చేసుకుంటాయి. ఇందుకోసం స్మార్ట్‌ఫోన్‌లో మ్యూజియం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని విగ్రహాన్ని స్కాన్‌చేస్తే దాని సమాచారం ఆడియో రూపంలో వినిపిస్తుంది. మ్యూజియంలోని చిత్రపటాలను, డిస్‌ప్లే బోర్డులను స్కాన్ చేయడం ద్వారా యానిమేషన్ విధానంలో వాటి సమాచారం ఫోన్‌లో చూడవచ్చు.
ఇంటరాక్టివ్ డిజిటల్ డిస్‌ప్లే (వాల్ ప్యానల్): 16 అడుగుల డిజిటల్ డిస్‌ప్లేపై మ్యూజియంలోని వస్తువులు ఒకేచోట కనిపిస్తాయి. సందర్శకులు తాకగానే వాటి వివరాలు డిస్‌ప్లే అవుతాయి.
ఇంటరాక్టివ్ డిజిటల్ డిస్‌ప్లే కేబినెట్: రాష్ట్రంలోని మ్యూజియాలు, స్మారక, సందర్శనీయ స్థలాల వివరాలను టచ్ అధారిత డిస్‌ప్లే ద్వారా సందర్శకులు తెలుసుకోవచ్చు.
ఇమ్మెర్సివ్ ప్రొజెక్షన్ థియేటర్: ఇది వర్చువల్ రియాలిటీని సరికొత్త స్థాయికి తీసుకెళ్తుంది. ఒక గదిలో సందర్శకులను కూర్చోబెట్టి 360 డిగ్రీల కోణంలో వీక్షకుడి చుట్టూ ఒక చిన్న ప్రపంచాన్ని సృష్టిస్తారు. ఉదా.. ఆదిమాన వుల జీవన విధానాన్ని ప్రదర్శిస్తుంటే వీక్షకుడికి ఆ ప్రపంచంలోకి వెళ్లిన అనుభూతిని కలిగిస్తారు.
ఇంటరాక్షన్ డిజిటల్ కియోస్క్: దీని ద్వారా సందర్శకులు, చిన్నారులు మ్యూజియాన్ని విడిచి వెళ్లే క్రమంలో వారి సంగ్రహణ శక్తిని పరీక్షించుకోవచ్చు. ఇందుకోసం కియోస్క్‌లోని ప్రశ్నలకు జవాబులివ్వాలి.
బాపూ మ్యూజియంలోని విక్టోరియా హాల్‌లో 1921లో గాంధీజీ ఆధ్వర్యంలో అఖిల భారత కాంగ్రెస్ మహాసభ జరిగింది. పింగళి వెంకయ్య తాను రూపొందించిన జాతీయ జెండాను ఈ సందర్భంగా గాంధీజీకి అందజేశారు. అలనాటి చారిత్రక ఘట్టాన్ని లేజర్ షో ద్వారా సందర్శకులకు పరిచయం చేయనున్నారు.
దశల వారీగా సాంకేతికత
బాపూ మ్యూజి యంలో ఉన్న సాంకేతికత దేశంలోని ఏ మ్యూజియంలో లేదు. ఇది రాష్ట్రానికి గర్వకారణం. సందర్శకులకు వారసత్వ విజ్ఞానం, చారిత్రక అంశాలను వివరించడంలో సాంకేతికత ఎంతగానో ఉపయోగపడుతోంది. యువ తను మ్యూజియాల వైపు నడిపించేందుకు వర్చు వల్, ఆగుమెంట్ రియాల్టీ, లేజర్ షో, ఇమ్మెర్సివ్ ప్రొజెక్షన్ షోలను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. రాష్ట్రంలోని మ్యూజియాల్లో దశల వారీగా సాంకేతికతను ప్రవేశపెడతాం.
– వాణీమోహన్, కమిషనర్, పురావస్తు శాఖ
Comments
Please login to add a commentAdd a comment